కొలంబియా అమెజాన్ అడవులు: 'విమానం కూలిపోతుంటే, అమ్మే మమ్మల్ని పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంది'

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఇఫా వాల్ష్ & వనెసా బుష్‌క్లటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొలంబియా అమెజాన్ అడవుల్లో విమానం కూలిపోయిన తరువాత 40 రోజులకు దొరికిన నలుగురు పిల్లల తల్లి, ఆ ప్రమాదం జరిగిన నాలుగు రోజులకు ప్రాణాలు విడిచారు.
మే 1న అమెజోనాస్ ప్రావిన్స్‌లోని అరరాకురా నుంచి శాన్ జోస్ డెల్ గువావియారేకు ప్రయాణిస్తున్న సెస్నా 206 విమానంలో మాగ్దలీనా ముకుటుయ్, ఆమె నలుగురు పిల్లలు ఎక్కారు. పిల్లల వయసు 13 ఏళ్లు, తొమ్మిదేళ్లు, నాలుగేళ్లు, ఏడాది వయసున్న చిన్నారి.
ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. పైలట్, కో-పైలట్, మాగ్దలీనా చనిపోయారు.
అడవుల్లో చిక్కుకున్న నలుగురు పిల్లలను 40 రోజుల తరువాత ఆర్మీ కాపాడగలిగింది. వీరి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నలుగురూ ప్రాణాలతో దొరికారు.
చనిపోయే ముందు మాగ్దలీనా, తన పిల్లలను అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకోమని చెప్పారు.
ఈ విషయాన్ని పిల్లల తండ్రి మాన్యుయెల్ రానోక్ మీడియాకు చెప్పారు. తన పెద్ద కూతురు లెస్లీ (13) ప్రమాదం నాటి విషయాలను వివరించి చెప్పిందని, వాళ్లమ్మే వాళ్లను అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలన్నారని తెలిపారు.
గత శుక్రవారం అడవిలో దొరికిన పిల్లలను విమానంలో తీసుకొచ్చి కొలంబియా రాజధాని బొగోటాలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు.
"లెస్లీ చెప్పిన విషయాలను బట్టి వాళ్లమ్మ ప్రమాదం జరిగిన తరువాత నాలుగు రోజుల వరకు ప్రాణాలతో ఉన్నారని తెలిసింది" అన్నారు రానోక్.

ఫొటో సోర్స్, Reuters
'నాకు ఆకలేస్తోంది.. బ్రెడ్ కావాలి'
"చనిపోయే ముందు ఆమె పిల్లలతో 'మీరిక్కడి నుంచి వెళ్లిపోండి. మీ నాన్న కనిపిస్తారు. నాలాగే ఆయన కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు' ఇలాంటి మాటలేవో చెప్పారు" అని రానోక్ తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు మెల్లమెల్లగా అన్ని విషయాలూ చెబుతున్నారు. వాళ్లు 40 రోజుల పాటు అడవిలో గడిపారు. అడవే వాళ్లను సంరక్షించిందని నిపుణులు భావిస్తున్నారు.
పిల్లలను వెతుక్కుంటూ వెళ్లిన సహాయ బృందంలో నికోలస్ ఆర్డోనెజ్ గోమ్స్ అడవిలో పిల్లలను చూసిన క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ, ఆ అనుభవాలను మీడియా ఛానల్ ఆర్‌టీవీసీతో పంచుకున్నారు.
"మమ్మల్ని చూడగానే పెద్ద పిల్ల లెస్లీ, చేతుల్లో చంటిపిల్లను పెట్టుకుని మా వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. 'నాకు ఆకలేస్తోంది' అని చెప్పింది."
"ఒక బాబు కింద పడుకుని ఉన్నాడు. లేచి నన్ను చూస్తూ 'మా అమ్మ చనిపోయింది' అన్నాడు. మేం వాళ్లను దగ్గర తీసుకుని, మీ కుటుంబమే మమ్మల్ని పంపించింది, మేం మీ ఫ్రెండ్స్ అని నచ్చజెప్పాం. వెంటనే ఆ బాబు 'నాకు తినడానికి బ్రెడ్, సాసేజ్ కావాలి ' అని అడిగాడు."

ఫొటో సోర్స్, Reuters
అడవిలో మనుగడ
పిల్లలు స్థానిక హుయిటోటో సమూహానికి చెందినవారు. అడవుల్లో దొరికే పళ్లు, గింజల గురించి వారికి తెలుసని, వాటిని తిని పిల్లలు ప్రాణాలు కాపాడుకోగలిగారని వాళ్ల తాత మీడియాతో చెప్పారు.
పెద్ద పిల్ల 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను కంటికి రెప్పలా కాచుకుంది.
పిల్లలను వెతకడానికి వెళ్లిన సహాయ బృందంలో సభ్యుడు, స్థానిక నివాసి హెన్రీ గెరెరో మరిన్ని విషయాలు చెప్పారు.
"పిల్లలు టార్పాలిన్‌తో ఒక చిన్న గుడారం కట్టుకున్నారు. కింద తువ్వాలు వేసుకున్నారు. వాళ్లు ఈ 40 రోజులు నదికి సమీపంలోనే గడిపారు. లెస్లీ దగ్గర ఒక చిన్న సోడా సీసా ఉంది. దాంతో, నీళ్లు పట్టి తెచ్చేది."
పిల్లలను కాపాడిన ఫోటోలను ఆదివారం విడుదల చేశారు. దట్టమైన అడవిలో అన్ని రోజులు గడిపిన పిల్లలు చాలా నీరసంగా కనిపించారు.
"వాళ్ల బుర్రలో ఒకటే ఆలోచన ఉంది.. తినాలి, తినాలి, తినాలి. అన్నం కావాలి, బ్రెడ్ కావాలి అని అడిగారు" అని గురెరో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వాళ్లు ఎందుకు విమానం ఎక్కారు?
పిల్లల తండ్రి రానోక్‌కు ఒక తిరుగుబాటుదారుల సమూహం నుంచి బెదిరింపులు రావడంతో ఆయన ఇంటి నుంచి పారిపోయారు. ఆయన్ను కలుసుకోవడానికి మాగ్దలీనా, తన పిల్లలతోపాటు విమానం ఎక్కారు.
దక్షిణ కొలంబియా ప్రాంతంలో దట్టమైన అమెజాన్ అడవులకు సమీపంలో ఇంజిన్ పాడవ్వడంతో విమానం కూలిపోయింది. ముందు భాగం నేలను తాకింది. విమాన శిథిలాలను కనుగొనడానికి రెండు వారాలు పట్టింది.
విమానం కూలిన చోట మాగ్దలీనా, పైలట్, కో పైలట్ల మృతదేహాలు ఆర్మీకి కనిపించాయి. పిల్లలు నలుగురూ అడవిలోకి వెళ్లినట్లు గమనించారు.
పిల్లలను కనిపెట్టడమే లక్ష్యంగా కొలంబియా ప్రభుత్వం అన్వేషణ సాగించింది. 100 మంది సైనికులు, స్థానిక ప్రజలు ఈ గాలింపులో పాల్గొన్నారు. వారికి పోలీసు జాగిలాలు సాయపడ్డాయి.
అడవిలో చాలా చోట్ల పిల్లల ఆనవాళ్లు కనిపించాయి. పాదముద్రలు, సగం కొరికిన పండ్లు మొదలైనవి. దాంతో, పిల్లలు బతికే ఉన్నారన్న నమ్మకం వచ్చింది.
హెలికాప్టర్లు పైనుంచి గాలించాయి. హుయిటోటో భాషలో పిల్లల్ల నానమ్మ మాటలను రికార్డ్ చేసి, వాటిని ప్లే చేస్తూ గాలించారు. అటూ ఇటూ తిరగకుండా ఒకచోటే ఉండాలని, అలా అయితేనే వారిని కనిపెట్టడం సులువు అవుతుందని రికార్డులో వాళ్ల నానమ్మ చెప్పారు.
అడవిలో హెలికాప్టర్ శబ్దం, సందేశం వినిపించాయని పిల్లలు చెప్పారు.
చివరికి శుక్రవారం ఒక బృందం వారిని గుర్తించింది. ఒక పిల్లవాడు ఏడుస్తుండడం వాళ్లకు వినిపించింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
"వాళ్లు కనిపించగానే, చాలా ఆనందం కలిగింది" అని గురెరో చెప్పారు.

ఫొటో సోర్స్, COLOMBIAN ARMY
"పిల్లలు చాలా బలహీనపడిపోయారు. ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. అడవిలో కొన్ని జబ్బులు అంటుకున్నాయి. కానీ, మొత్తంగా బానే ఉన్నారు. చికిత్స అందుతోంది" అని పిల్లల తాత ఫిడెన్సియో వాలెన్సియా చెప్పారు.
పిల్లలకు విమానంలో కసావా పిండి ఉన్న సంచి దొరికిందని, దాంతో వాళ్లకు కొన్ని వారాలు గడిచిందని ఫిడెన్సియో చెప్పారు.
ఆస్పత్రిలో కోలుకుంటున్న పిల్లలు బొమ్మలు వేశారు. వాటిని కొలంబియా మిలటరీ ట్వీట్ చేసింది. అడవి, చెట్లు, పోలీసు జాగిలం 'విల్సన్' బొమ్మ వేశారు.
విల్సన్ కూడా అడవిలో దారి తప్పిపోయింది. పిల్లల వద్దకు చేరింది. పిల్లలు ఆ కుక్కతో కొంతకాలం గడిపారు. కానీ, విల్సన్ ఆచూకీ దొరకలేదు.
విల్సన్‌ను కూడా వెతికి పట్టుకుంటామని కొలంబియా ఆర్మీ మాటిస్తూ, "మేం ఎవరినీ వదిలిపెట్టం" అంటూ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్‌లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














