ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

అమిత్ షా

ఫొటో సోర్స్, AmitShah/Twitter

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘జగన్ పాలనలో నాలుగేళ్లు అవినీతి మాత్రమే ఉంది..’’

‘‘కేంద్రంలోని బీజేపీ ఆంధ్రకు ఇచ్చిన నిధులన్నీ వైఎస్సార్సీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్తున్నాయి..’’

‘‘జగన్ పాలనలో విశాఖ డ్రగ్స్‌కి కేంద్రంగా మారింది..’’

‘‘జగన్ పాలనలో విశాఖ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది..’’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఆదివారం విశాఖపట్నం వచ్చిన అమిత్ షా, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏవో రాజకీయ పార్టీలు రొటీన్‌గా చేసే విమర్శలు కావు అవి..

నిన్నటి వరకూ ఏపీ సీఎం జగన్‌తో స్నేహంగా ఉన్న దిల్లీ బీజేపీ పెద్దలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారా? ఒక్కసారిగా అమిత్ షా ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? తెరవెనుక ఏం జరిగింది? దిల్లీలో చంద్రబాబు - అమిత్ షా భేటీయే అందుకు కారణమా? వచ్చే ఎన్నికల్లో కొత్త పొత్తులకు ఇది సంకేతమా? ఇప్పుడివే ప్రశ్నలు ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, APCMO/Twitter

బీజేపీ మాట జవదాటని జగన్

2019 ఎన్నికల ముందు నుంచీ బీజేపీ కేంద్ర నాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు వైఎస్ జగన్. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న మాటను అధికారంలోకి రాగానే స్వరం తగ్గించారు. మొక్కుబడిగా అడగడం తప్ప గట్టిగా ప్రయత్నాలు చేయలేదు. ఇదేకాదు, వేరే ఏ అంశంలోనూ ఆయన కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కనిపించవు.

అది కేంద్రాన్ని నిధులు అడిగే విషయంలోనైనా, లేక పాలసీల అమలు విషయంలోనైనా జగన్ అదే పంథా కొనసాగించారు. ఎక్కడా కేంద్రం మాటను ధిక్కరించలేదు.

ఏ రంగంలోనైనా, భారత ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నా, దానితో జగన్ విభేదించిన సందర్భాలు లేవు. ఆఖరికి తన ఇమేజ్‌కి ఇబ్బంది కలిగించే వ్యవసాయ విద్యుత్‌కి కరెంటు మీటర్ల బిగింపు వంటి విషయంలోనూ ఆయన బీజేపీ మాట జవదాటలేదు.

అప్పట్లో కేంద్రం తెచ్చిన రైతు బిల్లులు, ఇతరత్రా కొన్ని విధానాలపై బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా అప్పుడప్పుడూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ, వైఎస్సార్సీపీ మాత్రం తన విధేయత చాటుకోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. ఎన్డీయేలో అధికారికంగా చేరడం మినహా, అంతకుమించిన స్నేహబంధాన్నే కొనసాగించారు ఏపీ ముఖ్యమంత్రి.

అందుకే అటు బీజేపీ అధినాయకత్వం కూడా ఎప్పుడూ జగన్‌ను ఇంత ఘాటుగా విమర్శించింది లేదు. ఏపీకి చెందిన రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు వైఎస్సార్పీపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు కూడా చేసినప్పటికీ, మోదీ – షా మాత్రం ఎప్పుడూ జగన్‌ను ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు.

కానీ, నాలుగేళ్ల తరువాత మొదటిసారి జగన్‌పై అమిత్ షా మాటల దాడికి దిగడంతో, దాని వెనుక వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది.

అమిత్ షా వ్యాఖ్యలపై ఇంత చర్చ జరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇటీవల దిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ కాగా, రెండోది టీడీపీ-జనసేనతో కలపి వచ్చేలా బీజేపీని ఒప్పిస్తానని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు.

విశాఖలో అమిత్ షా సభ

ఫొటో సోర్స్, AmitShah/Twitter

ఫొటో క్యాప్షన్, విశాఖలో అమిత్ షా సభ

అమిత్ షాతో బాబు భేటీ

2019 ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం, బీజేపీ పొత్తు తెగతెంపులైంది. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం జరిగిన ఆందోళనల్లో టీడీపీ నేతలు తిరుపతిలో అమిత్ షాను అవమానించారంటూ బీజేపీ తరచూ గుర్తుచేస్తూ వచ్చింది.

అప్పటి నుంచి.. ఇప్పటి వరకూ బీజేపీ విషయంలో తెలుగుదేశం ఎంత మెతకగా ఉన్నప్పటికీ, టీడీపీ విషయంలో బీజేపీ మాత్రం అలా లేదు.

పార్లమెంటులో కీలక బిల్లుల విషయంలోనూ, రాష్ట్రపతి ఎన్నికల వంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇస్తూ మనసులో మాట పరోక్షంగా బయటపెడుతూ వచ్చింది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఏ కూటమి సమావేశాల్లోనూ, ఆ ఎజెండాతో తిరిగే ఏ నాయకుడి వెంటా తెలుగుదేశం కనిపించలేదు.

బీజేపీపై వన్‌సైడ్ లవ్ చూపిస్తోన్న టీడీపీ ప్రయత్నం ఫలించింది. దాదాపు ఐదేళ్ల విరామం తరువాత చంద్రబాబు, అమిత్ షా కలిశారు. అయితే, ఆ కలయిక దేని గురించి? ఏం మాట్లాడారు? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి.

తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశం కలసి వెళ్లడానికే ఈ చర్చలు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇది జరిగి పది రోజులు కూడా కాకముందే రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, ఏపీ సీఎం జగన్‌పై విరుచుకుపడడం అనేక ఊహాగానాలకు తావిచ్చినట్టైంది.

ఈ పరిణామాలు బీజేపీ - తెలుగుదేశం దగ్గరవడాన్ని సూచిస్తున్నాయని కొందరు విశ్లేషకులు చెబుతుంటే, ఇది కూడా వ్యూహమే కానీ, వైఎస్సార్సీపీ - బీజేపీ నిజంగా దూరం కాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

‘‘ఇదంతా ఒక నాటకంగానే కనిపిస్తోంది. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం ఆయన ఇలా మాట్లాడి ఉండొచ్చు. ఎన్డీయేలో ఉన్న పార్టీలను విమర్శించలేరు. ఎన్డీఏలో లేని పార్టీలనైనా తీవ్రంగా విమర్శిస్తే తప్ప స్థానిక కార్యకర్తల్లో సంతృప్తి కలగదు. అలాగని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని తిట్టలేరు కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీని తిట్టి వెళ్లిపోయారు'' అని సీనియర్ పాత్రికేయులు దారా గోపి అన్నారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, ChandrababuNaidu/Twitter

రాజ్యసభ సీట్లే కీలకమా..

''ఇది కేవలం కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ఉద్దేశం తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటున్నట్టుగా, చంద్రబాబుతో సమావేశం తరువాత మారిన వ్యూహమనో, అందులో భాగంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే క్రమంలో మొదటి విడతగా ఈ ఘాటైన విమర్శ చేశారనో అనుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.’’ అని ఆయన అన్నారు.

బీజేపీ జగన్‌కు దూరం జరిగి చంద్రబాబుకు దగ్గరయ్యే అవకాశాలు చాలా తక్కువని, దానికి కారణం లోక్‌సభ ఎన్నికలు కాదని, రాజ్యసభలో జగన్‌కు ఉన్న బలమనీ ఆయన అంటున్నారు.

‘‘నిజానికి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోకపోయినా జగన్ గెలిచిన సీట్లన్నీ వారివే. లోక్ సభ సీట్లు బీజేపీ ఎలాగైనా తెచ్చుకుంటుంది. కానీ, వారికి రాజ్యసభ చాలా కీలకం. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్సార్పీపీకి 9 సీట్లున్నాయి. వచ్చే ఏడాది అవి 11 అవుతాయి. సమీప భవిష్యత్తులో టీడీపీ రాజ్యసభలో అన్ని స్థానాలు తెచ్చుకోలేదు.

బీజేపీకి రాజ్యసభలో జగన్ అవసరం చాలా ఉంది. జగన్ ఎన్డీయే భాగస్వామి కాకపోవచ్చు కానీ, నమ్మదగని స్నేహితుడు. కాబట్టి రాజ్యసభలో అంత బలం ఉన్న విశ్వసనీయ మిత్రుణ్ణి బీజేపీ వదులుకుంటుందని నేను అనుకోను.’’ అన్నారు గోపి.

బీజేపీకి జగన్ దూరం అయినట్టు కనిపించడం లేదన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సీహెచ్‌వీఎం కృష్ణారావు.

‘‘జగన్ బీజేపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోరు. ఆయనకు బలమైన ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. రాయలసీమతో పాటు కోస్తాలోని పట్టణ ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు కీలకం. అదీకాక కన్వర్టెడ్ ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు ఉంది. అయితే, జగన్ బీజేపీకి అనుకూలంగా ఉంటారు. పార్లమెంట్‌లో అవసరమైనప్పుడల్లా మద్దతిస్తారు. రాజకీయంగా బీజేపీని ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయరు. అంతేతప్ప, పొత్తు పెట్టుకుని ఆ ఓట్లను పోగొట్టుకోరు'' అని ఆయన అన్నారు.

ఇటీవల కేవలం వారం రోజుల తేడాలో దాదాపు 22 వేల కోట్లు కేంద్రం ఏపీకి ఇచ్చిందని, ఓ పక్క డబ్బులిస్తూ, మరో పక్క అవినీతి అని విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, AmitShah/Twitter

''టీడీపీతో కలిసినా ఆశ్చర్యమేమీ లేదు''

కేంద్ర పథకాలకు డబ్బు ఇచ్చేది వారేనని, నిజంగా అవకతవకలు, అవినీతి ఉంటే దర్యాప్తు చేసి చర్య తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు కూడా వాళ్లేనని ఆయన అన్నారు.

''లోకల్ వాళ్లు ఏదో చెప్పారని అమిత్ షా కూడా ఏదో మాట్లాడేశారు’’ అని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

‘‘జగన్ అయినా, చంద్రబాబు అయినా అమిత్ షాతో ఏం మాట్లాడుకుంటారన్న రహస్యం ఎప్పుడూ బయటకు రాదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంపై అమిత్ షా మాటల ప్రభావం ఏమాత్రం ఉండదు. అలాగని తెలుగుదేశంతో కలవరని కాదు. బీజేపీ వాళ్లు తెలుగుదేశంతో ఇప్పటి వరకూ నాలుగుసార్లు కలిశారు. నాలుగుసార్లు విడిపోయారు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు’’ అని అన్నారాయన.

‘‘జనసేన, టీడీపీతో పాటు బీజేపీ కలిస్తే జగన్‌ను సులభంగా గద్దె దించొచ్చన్న వ్యూహంలో భాగంగానే అమిత్ షా ఇలా మాట్లాడారనే వాదనలను సమర్థించలేం. ఎందుకంటే మరోవైపు అదే కేంద్రం జగన్‌కు నిధులిచ్చి ఆదుకుంటోంది'' అని కృష్ణారావు చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విషయాల్లో ఆంధ్రులకు బీజేపీపై బాగా కోపం ఉందని, బీజేపీ నాయకులు ఆంధ్రలో పర్యటించడం శ్రమ, ధనం వృథా చేసుకోవడమేనన్నారు.

అయితే, ఇది బీజేపీ - తెలుగుదేశం మధ్య సంబంధాలకు ఒక ఉదాహరణగా కూడా చూస్తున్నారు మరికొందరు.

‘‘2024లో వారికి ఇక్కడ సొంతంగా కొన్ని సీట్లు కావాలి అంటే ఎవరో ఒకరితో పొత్తు ఉండాలి. జగన్‌తో పొత్తుకు బీజేపీ ప్రయత్నించింది కానీ (అధికారికంగా) పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకోలేదు. దీంతో ఈ సంబంధం తెగిపోయింది. కొత్త సంబంధం వెతుకుతున్నామని స్వయంగా అమిత్ షా చెప్పేసినట్టైంది.'' అని విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.

ఒక రకంగా అమిత్ షా నిన్న సెండాఫ్ గిఫ్ట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నానని, ఇదే దానికి సంకేతమని చెప్పారు.

‘‘జగన్‌ను కేంద్రం, అందులోనూ కేంద్ర హోం శాఖ జగన్‌ను కాపాడుతూ వస్తోందని బీజేపీ సర్కిళ్లలో ఒక అసంతృప్తి ఉంది. బీజేపీ జగన్‌కు మద్దతుగా ఉండడం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఎదగడం లేదు, దాని వల్ల తమ పార్టీకి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో ఉంది. ఇప్పుడు ఆ అపవాదు నుంచి బయట పడడం కోసమే ఆయన ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒకరకంగా ఇది తెలుగుదేశానికి దగ్గర జరగడం కావొచ్చు'' అని సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు చెప్పారు.

టీడీపీకి సంకేతాలు పంపించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్నారు.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/APCM

మరేం ఫర్వాలేదంటోన్న జగన్

వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ఏపీలో బలంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్పీపీ గెలిచినా, లేదా తెలుగుదేశం గెలిచినా బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

‘‘వచ్చే ఎన్నికల్లో మోదీకి ఆంధ్ర నుంచి 20 సీట్లు ఇవ్వండి అని అమిత్ షా’’ అడిగారు. కానీ, ఇప్పుడున్న 25 మంది ఎంపీలూ బీజేపీ కోరితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు.

2024 తరువాత కూడా బీజేపీకి అవసరమైతే వైఎస్సార్సీపీ, తెలుగుదేశం లోక్ సభలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు వెనుకాడవని మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మౌనంగా ఉండకుండా ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటుందా? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్సార్పీపీ ఆచితూచి స్పందిస్తోంది. సోమవారం పల్నాడు జిల్లాలో జరిగిన విద్యా కానుక సభలో ప్రసంగించిన జగన్, తనకు బీజేపీ అండ లేకపోయినా ఫర్వాలేదని వ్యాఖ్యానించారు.

‘‘మీ జగనన్నకు దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. మీ జగనన్న పైనున్న దేవుడిని, కింద మీ చల్లని ఆశీస్సులను నమ్ముకున్నాడు’’ అన్నారు జగన్.

‘‘బీజేపీ అగ్ర నాయకత్వం టీడీపీ ట్రాప్ లో పడింది’’ అని అన్నారు వైఎస్సార్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి. ‘‘చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారు’’ అని ఆయన అన్నారు.

అంతకుముందు రోజు జేపీ నడ్డాపై దూకుడుగా మాట్లాడిన వైఎస్పార్సీపీ నాయకులు కూడా అమిత్ షా విషయంలో మాత్రం ఆ దూకుడు చూపించలేదు.

ఇవి కూడా చదవండి: