రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం

ఫొటో సోర్స్, Reuters
భారత్‌లో రైతు ఉద్యమం (2020-21) జరిగిన సమయంలో ట్విటర్‌ను మూసివేయాలంటూ భారత ప్రభుత్వం తనను బెదిరించిందని ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సీ ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న చాలా మంది భారతీయ జర్నలిస్టుల ఖాతాలను మూసివేయాలని చెప్పినట్టు జాక్ డోర్సీ ఆరోపించారు.
జాక్ డోర్సీ ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
జాక్ డోర్సీ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, ఆయన హయాంలో ట్విటర్ ఎన్నోసార్లు భారత చట్టాన్ని ఉల్లంఘించిందని చంద్రశేఖర్ అన్నారు.
జాక్ డోర్సీ ఏమన్నారు?
యూట్యూబ్ ఛానల్ 'బ్రేకింగ్ పాయింట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ డోర్సీ ఈ విషయాలు చెప్పారు.
శక్తిమంతమైన వ్యక్తుల నుంచి వచ్చే డిమాండ్ల గురించి డోర్సీని ప్రశ్నించగా, ఆయన భారత ప్రభుత్వం తనను బెదిరించిందని చెప్పారు.
ప్రశ్నోత్తరాలు ఇలా సాగాయి.
ప్రశ్న: ప్రపంచం నలుమూలల నుంచి శక్తిమంతమైన వ్యక్తులు మీ వద్దకు వచ్చి అనేక డిమాండ్లు చేస్తారు. మీరు కొన్ని విలువలను, సిద్ధాంతాలను పాటించే వ్యక్తిగా ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు?
జవాబు: భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, రైతు ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టుల గురించి మా వద్దకు చాలా డిమాండ్లు వచ్చాయి. ఒక రకంగా బెదిరించారు. ట్విటర్‌కు భారత్‌లో పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మూసివేస్తామని, మా ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తామని చెప్పారు. వాళ్ల మాట వినకపోతే మా ఆఫీస్ మూసివేస్తామని బెదిరించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేంద్ర ప్రభుత్వ స్పందన
జాక్ డోర్సీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు.
"జాక్ డోర్సీ చెబుతున్నది పచ్చి అబద్ధం. బహుశా, ట్విటర్ చరిత్రలో అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆ కాలాన్ని కప్పిపెట్టే యత్నం చేస్తున్నట్టున్నారు. డోర్సీ, ఆయన బృందం ఆధ్వర్యంలో ట్విటర్ భారత చట్టాన్ని పదే పదే ఉల్లంఘించింది. వాస్తవానికి, 2020 నుంచి 2022 వరకు వాళ్లు చట్టాన్ని సరిగ్గా పాటించలేదు. 2022 జూన్ నుంచి మాత్రమే చట్టానికి కట్టుబడి పనిచేశారు. కానీ, ఎవరూ జైలుకు వెళ్లలేదు. ట్విటర్‌ను మూసివేయలేదు. డోర్సీ నేతృత్వంలో ట్విటర్‌కు భారతదేశ చట్టాలను, సార్వభౌత్వాన్ని అంగీకరించడంలోనే సమస్య ఉంది" అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం - ట్విటర్ మధ్య యుద్ధం
ఏప్రిల్‌లో విడుదల చేసిన ట్విటర్ ట్రాన్స్‌పరెన్సీ నివేదిక ప్రకారం, ట్విటర్ నుంచి కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేసే దేశాల్లో భారతదేశం ముందుంది.
ట్విటర్ తాజా నివేదిక ప్రకారం, 2022 జనవరి 1 నుంచి 2022 జూన్ 30 మధ్య ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ట్విటర్‌లో కంటెంట్‌ను తీసివేయాలని డిమాండ్ చేస్తూ 53 వేల లీగల్ నోటీసులు ఆ సంస్థకు అందాయి.
ట్విటర్ ప్రకారం, ఈ డిమాండ్లు చేస్తున్న దేశాల్లో భారత్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ముందు వరుసలో ఉన్నాయి.
2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. దానిపై, రైతులు ఆగ్రహంతో నిరసనలు వ్యక్తంచేశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ సుదీర్ఘ ఉద్యమం చేశారు. చివరకు ప్రభుత్వం మూడు చట్టాలను ఉపసంహరించుకుంది.
రైతు ఉద్యమం సమయంలో దిల్లీ మూడు సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 2020 ఆగస్టులో ప్రారంభమైన నిరసనలు నవంబర్‌కు ఊపందుకున్నాయి.
2021 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వ డిమాండ్‌పై రైతు ఉద్యమానికి సంబంధించిన పలు ఖాతాలను ట్విటర్ నిషేధించింది.
"చట్టానికి లోబడి భారతదేశంలో మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడమైనది" అని ఒక సందేశాన్ని జోడించింది.
ఇలా నిలిపివేసిన వాటిలో రైతు ఉద్యమం అధికారిక ఖాతా సహా ఈ ఉద్యమానికి మద్దతిచ్చిన పలు ఖాతాలు ఉన్నాయి.
ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.
అప్పటి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 2021 ఫిబ్రవరిలో "ట్విటర్ ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తోందని" ఆరోపించారు.
రాజ్యసభలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, "క్యాపిటల్ హిల్ ఘటన తరువాత ట్విటర్ తీసుకున్న చర్యలు సమర్థనీయం. కానీ, ఎర్రకోట వద్ద హింసపై ట్విటర్ వైఖరి భిన్నంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అన్నారు.
2021 జూన్‌లో రవిశంకర్ ఖాతా కూడా రెండు గంటల పాటు బ్లాక్ అయింది.
దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ట్విటర్ ఏకపక్ష నిర్ణయాలపై నేను చేసిన విమర్శలు ఆ సంస్థకు నొప్పి కలిగించినట్టున్నాయి. ట్విటర్ ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ ఎందుకు పాటించదో ఇప్పుడు అర్థమైంది. అలా చేస్తే, ఒక వ్యక్తిగత ఖాతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ చేయడం కుదరదు. ఇది వాళ్ల అజెండాకు సరిపోదు. దీన్నిబట్టి, ట్విటర్ భావప్రకటనా స్వేచ్ఛకు విలువ ఇవ్వదని తేలిపోయింది. తమ అజెండాను అమలు చేయడమే వారి లక్ష్యం" అంటూ విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
2021 గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ఎర్రకోట వైపుకు ట్రాక్టర్ పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలో ఎర్రకోట వద్ద హింస చోటుచేసుకుంది. ఆ తరువాత, సుమారు 1,100 ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది.
ఆ ఖాతాలు ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందినవని, వాటి ద్వారా రైతుల ఉద్యమం, ఎర్రకోట వద్ద హింసపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అందుకే వాటిని బ్లాక్ చేయాలని కోరినట్టు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ సూచనలను అనుసరించి ట్విటర్ కొన్ని ఖాతాలను బ్లాక్ చేసింది. తరువాత వాటిని పునరుద్ధరించింది.
మీడియా వ్యక్తులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకుల ఖాతాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెబుతూ ట్విటర్ ఒక ప్రకటన విడుదలచేసింది.
ఆ సమయంలోనే, "భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతిస్తూనే, భారత చట్టాన్ని కూడా గౌరవించే మార్గాన్ని కనుగొంటాం" అని ట్విటర్ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రభుత్వంపై విమర్శలు
జాక్ డోర్సీ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కోట్ చేస్తూ పలువురు ప్రభుత్వాన్ని విమర్శించారు.
"రైతు ఉద్యమం సమయంలో బీజేపీ ప్రభుత్వం బెదిరించిందని ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపించారు. భారత్‌లో ట్విటర్‌ను నిలిపివేయాలని, ట్విటర్ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని బెదిరించారంటున్నారు. కేంద్ర మంత్రి ఈ ఆరోపణలను తిరస్కరించారు. కొందరికి అబద్ధం చెప్పడానికి కారణాలు అక్కర్లేదు. మిగతావారికి అబద్ధం చెప్పడానికి ఎన్ని కారణాలైనా ఉంటాయి" అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
జర్నలిస్ట్ రాణా అయూబ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా జాక్ డోర్సీ మాటలను ట్విటర్‌లో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














