ఎలాన్ మస్క్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ట్విటర్ అమ్మకం, బ్లూటిక్‌ల తొలగింపుపై ఆయన ఏమన్నారు?

తరచూ వార్తల్లో నిలిచే ట్విటర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా బీబీసీ ఉత్తర అమెరికా ఎడిటర్ జేమ్స్ క్లేటన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బీబీసీ అంటే తనకు గౌరవమని ఆయన చెప్పారు.
ట్విటర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఇంటర్వ్యూకు చివరి క్షణంలో మస్క్ అంగీకరించారు.
ట్విటర్‌లో లక్షల మంది యూజర్లు ఈ ఇంటర్వ్యూను ప్రత్యక్షంగా వీక్షించారు.
మస్క్ ట్విటర్, అమెరికా ఎన్నికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు.

బీబీసీకి ఇచ్చిన ట్యాగ్‌పై మస్క్ ఏమన్నారు?
ఇంటర్వ్యూకు ఎందుకు అంగీకరించారని అడిగినప్పుడు- "ప్రస్తుతం చాలా జరుగుతోంది. నిజానికి, నాకు బీబీసీ అంటే చాలా గౌరవం. ఈ ఇంటర్వ్యూ అనేది కొన్ని ప్రశ్నలు అడగడానికి, కొంత అభిప్రాయం తీసుకోవడానికి, విభిన్నమైన వాటిని చూడటానికి ఒక అవకాశం. బహుశా, తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం" అని మస్క్ బదులిచ్చారు.
ఇటీవల ట్విటర్ సంస్థ బీబీసీ ట్విటర్ ఖాతాను గవర్నమెంట్ ఫండెండ్ మీడియా సంస్థగా చూపించింది. దీనిపై బీబీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై ఇంటర్వ్యూలో మస్క్ స్పందించారు.
బీబీసీకి ఈ ట్యాగ్ నచ్చలేదని ఆయన చెప్పారు. బీబీసీ ప్రతినిధి స్పందిస్తూ- బీబీసీ ఈ ట్యాగ్‌ను పూర్తిగా తిరస్కరించిందని గుర్తుచేశారు.
ట్విటర్ ఉద్దేశం పారదర్శకంగా, నిజాయతీగా ఉండటమేనని, అయితే ట్యాగ్‌లను అప్‌డేట్ చేయవచ్చని మస్క్ తెలిపారు. ట్యాగ్‌లు ఇవ్వడంలో కచ్చితత్వం ఉండేలా నిరంతరం ప్రయత్నిస్తున్నామని, అలాగే కొనసాగిస్తామని చెప్పారు.

బీబీసీ 'అత్యల్ప పక్షపాత' మీడియా: మస్క్
బీబీసీకి ఇచ్చిన ట్యాగ్ గురించి మస్క్ స్పందిస్తూ- "పబ్లిక్ ఫండెడ్ అని పిలవడం మరింత ఖచ్చితమనుకుంటున్నా. దానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. మేం ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.
అమెరికాలోని ఎన్‌పీఆర్ రేడియో లేబుల్ "పబ్లిక్ ఫండెడ్"గా మారుతుందని మస్క్ ధృవీకరించారు.
అంతకుముందు బీబీసీ ట్విటర్ ఖాతాకు జోడించిన కొత్త ట్యాగ్ గురించి బీబీసీ ఈమెయిల్ పంపింది.
వీలైనంత త్వరగా దాన్ని మార్చాలని మస్క్‌ను బీబీసీ కోరింది.
బీబీసీ "అత్యల్ప పక్షపాత" మీడియా అని తాను నమ్ముతున్నానని మస్క్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. బీబీసీ నిధుల గురించి సరైన సమాచారం ఇవ్వడం కోసం ట్యాగ్‌లో మార్పులు చేస్తామని చెప్పారు.
ట్విటర్‌ను 'అత్యంత కచ్చితమైన' ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలని భావిస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే "ఏ వ్యవస్థ పూర్తిగా పరిపూర్ణంగా ఉండదు" అని అంగీకరించారు.

ట్విటర్ అనుభవం ఎలా ఉంది?
ట్విటర్‌లో మీ సమయం ఎలా గడుస్తోందని మస్క్‌ని అడిగితే, "బోరింగ్‌గా అయితే ఏం లేదు. ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది" అని బదులిచ్చారు.
కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, చాలా సార్లు ట్విటర్ కూడా ఆగిపోయిందని ఆయన అంగీకరించారు.
మస్క్ ట్విటర్‌లో అనేక రాజకీయ అభిప్రాయాలను పంచుకుంటారు.
చాలా మంది ఆయన్ను ట్రంప్‌కు మద్దతుదారు అని పిలుస్తారు.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను జో బైడెన్‌కు ఓటు వేసినట్లు మస్క్ తెలిపారు.
"దాదాపు దేశంలో సగం మంది డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. కానీ నేను వారిలో లేను" అన్నారు.

మీడియాకు బ్లూటిక్ ఇవ్వడంపై ఏమన్నారు?
న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థకు బ్లూ టిక్ తొలగించడంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ- ఈ విషయంలో తాను అందరినీ సమానంగా పరిగణిస్తానని చెప్పారు.
"ఇది చాలా తక్కువ మొత్తం. వారి సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ మేం అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాం" అని వ్యాఖ్యానించారు.
వార్త ఏది అని నిర్ణయించే కొంత మంది జర్నలిస్టులకు పెద్దపీట వేయడం ట్విటర్ కు ఇష్టం లేదని మస్క్ స్పష్టంచేశారు.
''మీడియాను కాదని ప్రజలే ఈ ఎంపిక చేసుకోవాలని ఆశిస్తున్నా’' అని ఆయన అన్నారు.
డబ్బు చెల్లించి బ్లూ టిక్‌లను కొనుగోలు చేయకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల తెలిపింది.
బ్లూ టిక్ కొనుగోలు చేయని వారి ప్రొఫైల్ నుంచి వచ్చే వారంలోపు బ్లూ టిక్ తొలగిస్తామని మస్క్ స్పష్టంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎంత మందిని తొలగించారు?
ఇప్పటి వరకు ట్విటర్ నుంచి ఎంత మందిని తొలగించారనే ప్రశ్నకు మస్క్ స్పందిస్తూ.. తాను కంపెనీని కొనుగోలు చేసినప్పుడు అందులో దాదాపు 8,000 మంది పనిచేస్తున్నారని, ఇప్పుడు కంపెనీలో కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
ఉద్యోగులను తొలగించడం సరదా కాదని, ఒక్కోసారి చాలా బాధ కలిగిస్తుందని మస్క్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తాను తొలగించిన వ్యక్తులందరితో వ్యక్తిగతంగా మాట్లాడలేదని ఆయన తెలిపారు.
"ఇంత మందితో మాట్లాడటం సాధ్యం కాదు" అని స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, REUTERS/MIKE BLAKE
'నేను ట్విటర్ సీఈవోను కాదు'
ఇపుడు తనకు 44 బిలియన్ డాలర్లు (గత ఏడాది మస్క్ ట్విటర్‌ని కొనుగోలు చేసిన మొత్తం) ఇచ్చినా ట్విటర్‌ను విక్రయించబోనని మస్క్ స్పష్టంచేశారు.
అయితే, ట్విటర్ కొన్న తర్వాత తనకు టెన్షన్ పెరిగిందని, అది తనకు వేడుకలాగా అయితే లేదని వ్యాఖ్యానించారు.
"గత కొన్ని నెలలుగా పరిస్థితి చాలా టెన్షన్‌గా గడిచింది. మేం కూడా చాలా తప్పులు చేశాం. కానీ అంతా కరెక్టుగానే ముగుస్తుంది. మేం సరైన దిశలో వెళ్తున్నామనే అనుకుంటున్నా" అని మస్క్ చెప్పారు.
ప్రకటనదారులు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు తిరిగి వస్తున్నారని ఆయన అన్నారు. అయితే, మస్క్ వాదనను బీబీసీ ధృవీకరించడం లేదు.
ఇంటర్వ్యూ సమయంలో ఒక వైపు బీబీసీ కరస్పాండెంట్ జేమ్స్ క్లేటన్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే మస్క్ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.
ఒకానొక సమయంలో ఆయన బీబీసీ రిపోర్టర్‌ను అడ్డగిస్తూ- "నేను ఇకపై ట్విటర్ సీఈవోను కాను" అని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ.. తన పెంపుడు కుక్క ఫ్లోకీ ట్విటర్ సీఈవో అంటూ స్పష్టంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ట్విటర్‌లో తప్పుదోవ పట్టించే పోస్ట్‌లపై ఏమన్నారు?
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన వ్యక్తిని మస్క్ సమర్థించారు.
ఎన్నికల సమయంలో డగ్లస్ మెక్కే అనే వ్యక్తి ఎస్ఎంఎస్ ద్వారా ఓటు వేయవచ్చని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి అలాంటి విధానం అమెరికా ఎన్నికల్లో సాధ్యం కాదు.
డగ్లస్ మెక్‌కే ట్రంప్‌కు మద్దతుదారని, ఆయన ట్వీట్‌ను చూసిన 4,900 మంది హిల్లరీ క్లింటన్‌కు ఆ విధానంలో ఓటు వేశారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
అలా చేయడం ద్వారా డగ్లస్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించారని న్యాయవాదులు వాదించారు.
అసత్యం ప్రచారం చేసిన డగ్లస్‌కు గత నెలలో పదేళ్ల జైలు శిక్ష పడింది.
డగ్లస్‌కు వేసిన శిక్ష కొంచెం ఎక్కువని భావిస్తున్నానని మస్క్ తెలిపారు.
టిక్‌టాక్ నిషేధంపై ఏమన్నారు?
ఇటీవల భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్ టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించింది.
ఈ విషయంపై మస్క్ స్పందిస్తూ సాధారణంగా నిషేధానికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు.
అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ టిక్‌టాక్ అని, అయితే తానెప్పుడూ దాన్ని ఉపయోగించలేదన్నారు.
"నేను ప్రోడక్టులను నిషేధించడానికి మద్దతివ్వను. టిక్‌టాక్ వివాదం.. ట్విటర్‌కు మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్విటర్‌లో సమయం గడుపుతారు. కానీ నేను ఆ నిషేధాన్ని సమర్థించను" అని మస్క్ స్పష్టం చేశారు.
ఎలాంజెట్ అకౌంట్ నిషేధం గురించి..?
ఎలాంజెట్ అనే ట్విటర్ ఖాతాను నిషేధించాలనే నిర్ణయం ఒక వ్యక్తికి మద్దతుగా తీసుకున్న నిర్ణయం కాదా అని మస్క్‌ను బీబీసీ ప్రతినిధి ప్రశ్నించారు.
మస్క్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం, ప్రైవేట్ జెట్ రావడం, వెళ్లడం వంటి వార్తలను ఎలాంజెట్ తన ఖాతాలో ట్వీట్ చేసేవారు.
జాక్ స్వీనీ ఈ ఖాతాను పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఫ్లైట్ సమాచారం ట్రాక్ చేయడానికి, మస్క్ ప్రైవేట్ విమానం ఎప్పుడు, ఎక్కడ టేకాఫ్, ల్యాండ్ అయ్యిందో పోస్ట్ చేయడానికి ఉపయోగించారు.
2022 డిసెంబర్‌లో ఈ ఖాతాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మస్క్ ప్రకటించారు.
రియల్ టైమ్ సమాచారాన్నిషేర్ చేస్తూ ప్రజలకు ప్రమాదం కలిగించే ఖాతాలను మూసివేస్తానని కూడా స్పష్టంచేశారు.
ఎలాంజెట్ అకౌంట్ గురించి మస్క్ మాట్లాడుతూ ఈ ఖాతాలో వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారంతో కలిపి, తప్పుడు ఉద్ధేశంతో షేర్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చాట్‌జీపీటీని అభినందిస్తున్నా కానీ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందిన చాట్‌జీపీటీని మస్క్ ప్రశంసించారు.
ఏఐకి సంబంధించిన పని చాలా రోజులుగా కొనసాగుతోందని, అయితే దీనికి చాట్‌జీపీటీ అందించగలిగే 'సింపుల్ ఇంటర్‌ఫేస్' అవసరమని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు ముప్పుగా మారకుండా రెగ్యులేటర్ తయారు చేయాలని మస్క్ చాలా కాలంగా చెబుతున్నారు.
గత నెలలో ప్రపంచంలోని పలువురు ప్రముఖులు కృత్రిమ మేథస్సు వ్యవస్థల తయారీని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు.
దీని వల్ల మానవాళి ప్రమాదంలో పడుతుందని వారంతా అభిప్రాయం వ్యక్తంచేశారు.
మస్క్‌తో పాటు బహిరంగ లేఖపై సంతకం చేసినవారిలో ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్, టూరింగ్ ప్రైజ్ విజేత యోషువా బెంగియో, రిపుల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ ఉన్నారు.
ఫేక్, తప్పుదోవ పట్టించే వార్తల వల్ల ఏది నిజం, ఏది అబద్ధం అనేది గుర్తించడం కష్టంగా మారిందని మస్క్ అంగీకరించారు.
కొత్త టెక్నాలజీ వస్తోందని, ఇప్పుడు ఏది సరైనదో తెలుసుకోవడం మరింత కష్టమని అభిప్రాయపడ్డారు.
''ట్విటర్‌లో మేం దీని గురించి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తాం'' అని మస్క్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















