బీబీసీ పంజాబీ ట్విటర్ అకౌంట్ కొద్ది గంటల పాటు బ్లాక్... ఆ తరువాత రీస్టోర్

ఫొటో సోర్స్, Twitter
బీబీసీ న్యూస్ పంజాబ్ ట్విటర్ ఖాతాను కొద్ది గంటలపాటు నిలిపి వేశారు. ఆ తరువాత మళ్లీ రీస్టోర్ చేశారు.
‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని ట్విటర్ అకౌంట్లను నిలిపివేశారు.
నిలిచిపోయిన వాటిలో కొందరు జర్నలిస్ట్‌ల ఖాతాలు కూడా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ట్విటర్ అకౌంట్లను నిలిపివేసినట్లు ట్విటర్ తెలిపింది. దీనిపై బీబీసీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఈమెయిల్ పంపిన కొద్ది సేపటికే బీబీసీ పంజాబీ అకౌంట్‌ను పునరుద్ధరించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరులను పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, TWITTER
ట్విటర్ అకౌంట్లపై తీవ్ర చర్య
చండీఘడ్‌కి చెందిన పంజాబ్‌కు అనుకూలమైన డిజిటల్ మీడియా సంస్థలో పనిచేసే గగన్‌దీప్ సింగ్ ట్విటర్ అకౌంట్ మార్చి 19న బ్లాక్ అయింది.
ఈ విషయంపై గగన్‌దీప్ సింగ్ బీబీసీ జర్నలిస్ట్ హర్ష్‌దీప్ కౌర్‌తో మాట్లాడారు. ‘‘నా ట్విటర్ అకౌంట్‌ను మార్చి 19న నిలిపివేశారు. ట్విటర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మార్చి 18న నేను ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేశాను. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరులు కారులో పారిపోతున్న దృశ్యాలున్నాయి. ఈ వీడియో మార్చి 18 నాటిది’’ అని గగన్‌దీప్ సింగ్ తెలిపారు.
గగన్‌దీప్ సింగ్ మాదిరే సందీప్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. ఈయన పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.
‘‘మార్చి 20న ట్విటర్ అకౌంట్లు బ్లాక్ అయిన మరో ఇద్దరు జర్నలిస్ట్‌ల స్క్రీన్‌షాట్లను నేను ట్వీట్ చేశాను. సాయంత్రం ఒకరు కాల్ చేసి, నా ట్విటర్ అకౌంట్ నిలిపివేసినట్లు తెలిపారు’’ అని సందీప్ సింగ్ బీబీసీ జర్నలిస్ట్ అవతార్ సింగ్‌కి తెలిపారు.
‘‘పంజాబ్‌లో అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరులపై కేసు ప్రారంభమైన రోజు నుంచి మేము సమాచారం షేర్ చేస్తున్నాం. టీవీలో వచ్చిన సమాచారాన్నే మేము ప్రజలతో పంచుకుంటున్నాం. అంతేతప్ప, దానిలో దాచాల్సిన సమాచారమేమీ లేదు’’ అని సందీప్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER
బీబీసీ పంజాబీ అకౌంట్ ఎందుకు ఆగి పోయింది?
భారత్‌లొ బీబీసీ న్యూస్ పంజాబీ అకౌంట్‌ను కూడా కొద్ది గంటల పాటు ట్విటర్ నిలిపివేసింది.
‘‘పారదర్శకత ప్రయోజనాల దృష్ట్యా, మీ ట్విటర్ అకౌంట్ @bbcnewspunjabi విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి లీగల్ రిమూవల్ డిమాండ్ వచ్చినట్లు మీకు సమాచారమందిస్తున్నాం. భారత సమాచార సాంకేతిక చట్టం- 2000 నిబంధనలను మీ కంటెంట్ ఉల్లంఘించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది’’ అని అంతకు ముందు బీబీసీకి ట్విటర్ ఈమెయిల్ పంపింది.
బీబీసీ న్యూస్ పంజాబ్ షేర్ చేసిన రెండు కథనాలు భారత సమాచార సాంకేతిక చట్టం-2000 నిబంధనలు ఉల్లంఘించినట్లు పరిగణనలోకి తీసుకుంటున్నామని ట్విటర్ అందులో పేర్కొంది.
భారత అధికారులతో తాము ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని, మీ అకౌంట్ విషయంలో ఏమైనా మార్పులుంటే, తాము తెలియజేస్తామని తెలిపింది.
‘‘ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే ట్వీట్లు, కంటెంట్ విషయంలో చాలా దేశాల్లో పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఏదైనా కంటెంట్ లేదా అకౌంట్ విషయంలో అధికారిక విభాగం నుంచి ఏదైనా ఫిర్యాదును తాము పొందితే, అకౌంట్‌ను నిలిపివేస్తాం’’ అని ట్విటర్ హెల్ప్ సెంటర్ తెలిపింది.

ఫొటో సోర్స్, twitter
‘‘మేం కోరలేదు’’
ట్విటర్ ఖాతాను నిలిపివేయడం మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను బీబీసీ పంజాబీ సంప్రదించింది.
అయితే @bbcnewspunjabi ఖాతాను నిలిపివేయమని తాము ట్విటర్‌ను కోరలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. అలాగే బీబీసీ పంజాబీ ఖాతా నిలిచిపోవడం మీద స్పష్టత కోరుతూ ట్విటర్‌కు మెయిల్ పంపినట్లు వెల్లడించింది.
ఖాతాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నేరుగా కూడా ట్విటర్‌ను సంపద్రించొచ్చని, అయినప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే Grievance Appellate Committee (gac.gov.in) వెబ్‌సైట్‌ను సంపద్రించాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
- గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?
- గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?
- కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














