ర్యాష్ డ్రైవింగ్‌తో బారికేడ్లను దాటుకుంటూ అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నారో చెప్పిన పోలీసులు

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్, ఆయన సన్నిహితులను పట్టుకునేందుకు మార్చి 18 నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ, ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఇప్పటికే అమృత్‌పాల్ అనుచరులు 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, అమృత్‌పాల్ ఎక్కడున్నారన్నది మాత్రం కనుగొనలేకపోయారు.

అమృత్‌పాల్ సింగ్ పోలీసు కస్టడీలో ఉన్నారని ఆరోపిస్తూ ‘వారిస్ పంజాబ్ దే’ న్యాయవాది కోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చాలని పోలీసులకు ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు.

ఈ పిటిషన్‌పై మార్చి 27న కోర్టులో విచారణ జరగనుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, తాము ఇప్పటి వరకు అమృత్‌పాల్ సింగ్ ఎక్కడున్నారో కనుగొనలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఆయన పోలీసులకు కనపడకుండా పారిపోయేందుకు వివిధ రకాల వాహనాలను వాడారని, చివరికి బైకుపై పారిపోయినట్లు చెబుతున్నారు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, మార్చి 18న సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైనప్పుడు, అమృత్‌సర్‌లోని ఖిల్చియాన్ గ్రామంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ బారికేడ్లను దాటుకుని అమృత్‌పాల్ సింగ్, ఆయన సన్నిహితులకు చెందిన నాలుగు వాహనాలు వెళ్లాయి.

బారికేడ్లను దాటుకుని వెళ్లిన వాహనాల్లో ఒక మెర్సిడెస్ బెంజ్, రెండు ఫోర్డ్ ఎండీవర్స్, ఒక క్రెటా కారు ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కార్లను ఆపేందుకు ప్రయత్నించారని, కానీ, వారు బారికేడ్లను ధ్వంసం చేసి పారిపోయారని చెప్పారు.

తప్పించుకుని వెళ్తున్న ఈ వాహనాలను పట్టుకోవాలని పరిసరాల్లో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను పోలీసులు అలర్ట్ చేశారు.

అమృత్‌పాల్ సింగ్ ఎవరు?

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని జల్లుపుర్ ఖేరాకు చెందిన అమృత్‌పాల్ సింగ్ 2012లో దుబాయికి వెళ్లారు. అక్కడ వారి కుటుంబం ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తోంది.

అమృత్‌పాల్ సింగ్ బాల్యం గురించి పెద్దగా తెలియడం లేదు.

పంజాబ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసినట్లు తన లింక్డిన్ ప్రొఫెల్‌లో అమృత్‌పాల్ సింగ్ రాసుకున్నారు. ఒక కార్గొ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పని చేసినట్లు ప్రొఫైల్ ఆధారంగా తెలుస్తోంది.

సిక్కుల ఐక్యత, సిక్కులకు ప్రత్యేక దేశం వంటి వాటి మీద మాట్లాడుతూ తొలుత సోషల్ మీడియాలో అమృత్‌పాల్ సింగ్ పాపులర్ అయ్యారు.

2022 ఆగస్టులో సింగ్ దుబాయి నుంచి భారత్‌కు వచ్చారు. గతంతో పోలిస్తే తన ఆహార్యాన్ని మార్చివేశారు. తలపాగా ధరించడం, గడ్డం పెంచడం వంటి వాటితో ఒక ఆధ్యాత్మిక సిక్కు మాదిరిగా ఆయన కనిపిస్తున్నారు.

భారత్‌కు వచ్చిన నెల తరువాత దీప్ సిద్ధు ప్రారంభించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అమృత్‌పాల్ సింగ్‌ను సారథిగా నియమించారు.

2021లో దిల్లీలో జరిగిన రైతుల నిరసన ప్రదర్శనలో భాగంగా హింసకు పాల్పడ్డారంటూ దీప్ సిద్ధును అరెస్టు చేశారు. ఆయన నటుడు కూడా. 2022లో జరిగిన కారు ప్రమాదంలో దీప్ చనిపోయారు.

జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలే స్వస్థలమైన రోడ్ గ్రామంలో అమృత్‌పాల్ సింగ్‌కు సారథ్యం అప్పగించే వేడుక జరిగింది. వేల మంది దానికి హాజరయ్యారు.

అమృత్‌పాల్ సింగ్ ఎన్నో వివాదాస్పదమైన ప్రసంగాలు చేసేవారు.

అమృత్‌పాల్ సింగ్ లైఫ్ ప్రమాదంలో ఉందని ఆయన తండ్రి తస్రీమ్ సింగ్ ఆరోపిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

‘ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పారిపోయారు’

చాక్లెట్ రంగులో ఉన్న ఇసుజు కారులో అమృత్‌పాల్‌ సింగ్‌ను చూసినట్లు జలంధర్(రూరల్) ఎస్పీ స్వర్నదీప్ సింగ్ చెప్పారు.

జలంధర్‌లోని మెహతాపూర్‌ ప్రాంతంలో ఉన్న సలీమా గ్రామంలో ప్రభుత్వ స్కూల్ వద్ద ఆయన్ను చూసినట్లు పేర్కొన్నారు.

ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఆయన వెళ్లారని అన్నారు. అమృత్‌పాల్ సింగ్ పారిపోయిన తర్వాత, ఈ వాహనాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నరు.

ఆ వాహనం నుంచి ఒక వాకీ టాకీని, 315 బోర్ రైఫిల్, 57 లైవ్ కాట్రిడ్జ్‌లను రికవరీ చేసుకున్నారు.

ఐజీ(హెడ్‌క్వార్టర్స్) సుఖ్‌చైన్ గిల్ చెబుతోన్న వివరాల ప్రకారం, మారుతీ బ్రెజా కారును కూడా అమృత్‌పాల్ సింగ్ వాడారు. ఈ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెహతాపూర్‌లో రద్దీ మార్కెట్ నుంచి అమృత్‌పాల్ పారిపోయారని చెప్పారు.

అమృత్‌పాల్‌ సింగ్‌

ఫొటో సోర్స్, ANI

గురుద్వారాలో దుస్తులు మార్చుకున్న అమృత్‌పాల్

15 నుంచి 16 కి.మీల దూరంలో ఉన్న నంగల్ అభియాన్ గురుద్వారాను చేరుకున్న తర్వాత ఆయన తన దుస్తులు మార్చుకున్నారు.

అక్కడే పనిచేస్తున్న సిబ్బంది సాయం తీసుకున్నారు.

ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా మోగాకు ఆయన వెళ్లిపోయారు.

‘‘ఉదయం నుంచి పోలీసులు ఇక్కడే ఉన్నారు. కానీ, అమృత్‌పాల్ సింగ్ ఇక్కడికి వచ్చి వెళ్లిపోయాక మాకు తెలిసింది. దుస్తులు మార్చుకున్న తర్వాత, బైకుపై ఆయన పారిపోయారు.’’ అని నంగల్ అభియాన్‌కి చెందిన నివాసి భుపేంద్ర సింగ్ తెలిపారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం ఉంది?

సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న కొన్ని సీసీటీవీ ఫుటేజీల్లో బ్రెజా వెహికిల్ నుంచి కొందరు వ్యక్తులు దిగి, బైకుపై కూర్చుని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ వీడియోలను బీబీసీ వెరిఫై చేయలేదు.

ఈ ఫుటేజీలో కనిపిస్తోన్న వ్యక్తి అమృత్‌పాల్ సింగేనని కొన్ని ఛానల్స్ చెబుతున్నాయి. బుల్లెట్ బైకుపై మరో ఇద్దర్ని కూడా వీడియోలో చూడొచ్చు.

మన్‌ప్రీత్, గుర్దీప సింగ్, హర్‌ప్రీత్ సింగ్, గుర్భాజ్ సింగ్‌లు అమృత్‌పాల్ సింగ్ పారిపోయేందుకు సహకరించారని పోలీసు అధికారి సుఖ్‌చైన్ గిల్ చెప్పారు. వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)