క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్... కీమో థెరపీకి బదులుగా సరికొత్త టాబ్లెట్

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆండ్రీ బీర్నాత్
    • హోదా, బీబీసీ న్యూస్, బ్రెజిల్

అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ఏఎస్‌సీవో) వార్షిక సమావేశం కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలకు సంబంధించి శుభవార్తలను చెప్పింది.

ఊపిరితిత్తులు, మెదడు, మలద్వారంపై ఏర్పడే ట్యూమర్లతో పాటు రక్షణ వ్యవస్థలోని కణాలను ప్రభావితం చేసే ఒక రకపు క్యాన్సర్ అయిన హాడ్కిన్స్ లింఫోమా ట్యూమర్లపై వ్యతిరేక పోరాటంలో డాక్లర్లు పురోగతిని సాధించారు.

సమావేశంలో వైద్యులు వెల్లడించిన నాలుగు ప్రధాన అధ్యయనాలను ఇక్కడ చూద్దాం.

1. ఊపిరితిత్తుల క్యాన్సర్: జీవితకాలాన్ని పొడిగించే థెరపీ

ఒసిమెర్టినిబ్ అనే ఔషధం, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితిని తొలగించే శస్త్రచికిత్సను చేయించుకున్న రోగుల జీవితకాలాన్ని పొడిగించగలదని యేల్ క్యాన్సర్ సెంటర్ (యూఎస్‌ఏ) పరిశోధకులు చెప్పారు. ఒక నిర్దిష్ట రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల్లో మూడేళ్ల పాటు ఈ ఔషధాన్ని వాడారు.

ఊపిరితిత్తుల వ్యాధుల్లో సాధారణమైన నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రోగులకు ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చని అంకాలజిస్ట్ విలియమ్ నసీబ్ విలియం జూనియర్ చెప్పారు. ఆంకోక్లినిక్స్ గ్రూప్‌కు చెందిన థొరాసిస్ ట్యూమర్ స్పెషాలిటీ నాయకుడు ఆయన. ఈ రోగుల్లో ఈజీఎఫ్‌ఆర్ అనే జన్యువు పరివర్తన చెందుతుందని ఆయన వివరించారు.

ప్రారంభ దశలోనే ఈ ట్యూమర్‌ నిర్ధారణ జరిగినప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల్లో ఈ ట్యూమర్ ప్రభావిత కణజాలాన్ని తొలగిస్తారు. కానీ, ఇలా చేసిన ప్రతీసారి అక్కడ ఒక ప్రశ్న పుట్టుకొస్తుంది. అదేంటంటే, శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో అసలు క్యాన్సర్ కణాలు ఉన్నాయా?

క్యాన్సర్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ తర్వాత కూడా కాలక్రమేణా ఈ మైక్రోస్కోపిక్ ట్యూమర్ యూనిట్లు పెరుగుతాయి. వ్యాధి మళ్లీ తిరగబెడుతుంది. శస్త్రచికిత్స తర్వాత వచ్చే ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఒకటి.

ఈ పరిస్థితిని నివారించడానికి, ఆంకాలజిస్టులు శస్త్రచికిత్సకు అనుబంధంగా ఉండే చికిత్సలను సూచిస్తారు. ఈ అనుబంధ చికిత్సలు సర్జరీ చేసిన తర్వాత కూడా అలాగే అట్టిపెట్టుకొని ఉన్న క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయత్నిస్తాయి.

గతంలో ఇందుకోసం కీమోథెరపీని ఉపయోగించేవారు. ఇప్పుడు గైడెడ్ క్షిపణుల్లా లక్ష్యంపై దాడి చేసే ఒసిమెర్టినిబ్ వంటి థెరపీలు వచ్చాయి. ఈ థెరపీలు నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడి చేస్తాయి.

అయితే, ఈ ఆధునిక చికిత్సలను ఉపయోగించడానికి ఒక పరీక్ష అవసరం. ఈ పరీక్ష క్యాన్సర్ జన్యుప్రొఫైల్‌ను, దానిలో సంభవించే పరివర్తనలను (మ్యుటేషన్లు) విశ్లేషిస్తుంది.

ఉదాహరణకు, ఒసిమెర్టినిబ్ అనే చికిత్స కేవలం పరివర్తన చెందిన ఈజీఎఫ్‌ఆర్ జన్యువు ఉన్న రోగులకే పనిచేస్తుంది. ఈజీఎఫ్‌ఆర్ పరివర్తన జన్యవు కలిగివారు నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ బాధితుల్లో 15-20 శాతం ఉంటారు.

ఈ ఔషధం ఫలితాలను సైంటిఫిక్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ జర్నల్స్ ప్రకారం, ఈజీఎఫ్‌ఆర్ జన్యుపరివర్తన కలిగి ఒసిమెర్టినిబ్ చికిత్స తీసుకున్న 85 శాతం రోగులు అయిదేళ్ల వరకు మనుగడ సాగించారు.

మైక్రోస్కోపిక్ కణాల పెరుగుదలను ఈ ఔషధం నివారిస్తుంది లేదా వాటిని పూర్తిగా తొలగిస్తుంది. తద్వారా రోగుల మనుగడ సమయాన్ని పొడిగిస్తుంది అనే భావనను ఇది బలపరుస్తుందని విలియం అన్నారు.

క్యాన్సర్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

2. కీమోథెరపీ లేకుండా గ్లియోమా

మెదడులో న్యూరాన్లు మాత్రమే లేవు. న్యూరాన్లకు మద్దతుగా గ్లియాల్ కణాలు కూడా ఉంటాయి. మన జ్ఞాపకశక్తికి, తార్కికశక్తికి మెదడు బాధ్యత వహిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు, రక్షణకు గ్లియాల్ కణాలు చాలా ముఖ్యం.

గ్లియాల్ కణాలు పరివర్తన చెందిన క్యాన్సర్ కణాలుగా మారవచ్చు. దీన్ని ‘గ్లియోమా’గా పిలుస్తారు.

లో-గ్రేడ్ గ్లియోమా సాధారణంగా నెమ్మదిగా, తక్కువ దూకుడుగా ఉంటుంది. ఈ రకమైన గ్లియోమా క్యాన్సర్ వస్తే రోగులు వ్యాధి నిర్ధారణ తర్వాత కూడా సంవత్సరాలు, దశాబ్దాల పాటు జీవిస్తారు.

‘’20 ఏళ్ల వయస్సులో వారికి కూడా ఈ రకమైన క్యాన్సర్ రావొచ్చు. ఇది యువతరాన్ని ప్రభావితం చేస్తుంది’’ అని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ఎస్‌బీఓసీ)కి చెందిన కేంద్ర నాడీ వ్యవస్థ ట్యూమర్ల కమిటీ ఫిజీషియన్ క్లారిస్సా బాల్డోట్టో అన్నారు.

మెదడు సున్నితమైనది. అందులో పెరిగే ట్యూమర్‌లను తొలగించడానికి సమర్థమైన, సురక్షితమైన థెరపీలను అభివృద్ధి చేయడం చాలా కష్టం.

అయితే, సర్వీయర్ లేబోరేటరీ అభివృద్ధి చేసిన వొరాసిడెనిబ్ అనే టార్గెటెడ్ థెరపీ ఈ దృక్పథాన్ని మార్చేసింది.

ఈ ఔషధం మెదడులో క్యాన్సర్ పురోగతిని తగ్గిస్తుందని, మరణాలను 61 శాతం నివారిస్తుందని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ (యూఎస్‌ఏ) పరిశోధకులు వెల్లడిచారు.

ఈ కొత్త రకమైన చికిత్సతో మరో ప్రయోజనం కూడా ఉంది. మెదడులోని క్యాన్సర్ కణాల విస్తరణను నియంత్రించడానికి కీమో, రేడియోథెరపీ వంటి బాధాకరమైన పద్ధతుల వైపు వెళ్లడాన్ని వాయిదా వేస్తుంది.

లో-గ్రేడ్ గ్లియోమా విషయంలో కీమో, రేడియోథెరపీలను నివారించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రకమైన క్యాన్సర్‌కు ప్రధాన బాధితులు యువతరం. కాబట్టి వారు ఈ థెరపీల దుష్ప్రభావాలను చాలాకాలం పాటు భరించాల్సి వస్తుంది.

ఈ కొత్త చికిత్స ఆకట్టుకునేలా ఉందని బాల్డోట్టో అన్నారు.

‘‘ఈ ఔషధాన్ని రోజుకు ఒకసారి టాబ్లెట్ రూపంలో తీసుకున్నా బాగా పనిచేసిందని, దుష్ప్రభావాలు కలిగే రేటు చాలా తక్కువగా ఉన్నట్లు క్లినికల్ ట్రయల్స్ చూపించాయి’’ అని ఆయన తెలిపారు.

నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రోగుల్లాగే గ్లియోమా రోగులు కూడా ట్యూమర్ పరివర్తనలను అంచనా వేయడానికి ఒక పరీక్షను చేయించుకోవాలి.

ఐడీహెచ్1, ఐడీహెచ్‌2 జన్యువుల్లో మార్పు వచ్చినప్పుడు వొరాసిడెనిబ్ పనిచేస్తుంది.

క్యాన్సర్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

3. మలద్వార క్యాన్సర్: నయం చేయడానికి మరో మార్గం

మొత్తం కొలొరెక్టల్ క్యాన్సర్లలో మలద్వారంలో ఉద్భవించే ట్యూమర్లు మూడు భాగాలు ఉంటాయి.

అధిక మనుగడ రేటును సాధించే, చికిత్స తీసుకున్న అయిదేళ్ల అనంతరం కూడా వ్యాధిని నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న రెండు వేర్వేరు చికిత్స విధానాలను మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ (యూఎస్‌ఏ) శాస్త్రవేత్తలు చూపించారు.

అధ్యయనంలో భాగంగా ట్యూమర్ ఉన్న కొంతమంది వాలంటీర్లకు కీమోథెరపీ, రేడియోథెరపీ సెషన్లను నిర్వహించారు.

మరికొంతమంది వాలంటీర్లకు కేవలం కీమోథెరపీ మాత్రమే చేశారు.

ఇరు వర్గాల ఫలితాలను పోల్చి చూడగా చాలా సారూప్యమైన ఫలితాలు కనిపించాయి. రెండు గ్రూపుల్లోని దాదాపు 80 శాతం మంది సజీవంగా ఉండటంతో పాటు ఐదేళ్లలో వ్యాధి నుంచి విముక్తి పొందారు.

‘‘ఇటీవలి సంవత్సరాల్లో ఈ వ్యాధి చికిత్సలో మేం గొప్ప పురోగతిని సాధించాం’’ అని సావో పాలోలోని ఆక్‌మార్గో క్యాన్సర్ సెంటర్‌కు చెందిన ఆంకాలజిస్ట్ విర్జిలియో సౌజా ఇ సిల్వా చెప్పారు.

రేడియోథెరపీని పూర్తిగా వదిలేయాలని కాదు గానీ, కొంతమందికి కీమోథెరపీ ఒక్కటే సరిపోతుందని ఆయన అన్నారు. రేడియోథెరపీ వల్ల ప్రయోజనం పొందే వారు కూడా ఉంటారని ఆయన చెప్పారు.

క్యాన్సర్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

4. హాడ్కిన్ లింఫోమా: చికిత్స విధానంలో మార్పు

ఈ రకమైన క్యాన్సర్, రక్షణ వ్యవస్థలోని కొన్ని కణాలను ప్రభావితం చేస్తుంది.

ఈ వ్యాధికి కీమోథెరపీ సెషన్లను, టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన బ్రెంటుక్సిమాబ్ వెడొటిన్ అనే డ్రగ్‌ వాడకాన్ని ప్రామాణిక చికిత్సగా పరిగణిస్తారు.

అయితే, ఈ ప్రామాణిక చికిత్సకు మరో ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాలని నిపుణులు నిర్ణయం తీసుకున్నారు.

బ్రెంటుక్సిమాబ్ వెడొటిన్ మందును నివొలుమాబ్ అనే డ్రగ్‌తో భర్తీ చేయగలమా లేదా అనే విషయాన్ని వారు పరీక్షించారు. నివొలుమాబ్ అనేది ఒక రకమైన ఇమ్యూనోథెరపి.

ఇది క్యాన్సర్ కణాలను గుర్తించడానికి, వాటిపై దాడి చేయడానికి రోగి శరీరంలోని నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది.

కొత్త చికిత్స పద్ధతి అయిన నివొలుమాబ్, కీమోథెరపీకి హాజరైన రోగుల్లో 94 శాతం మంది 12 నెలల వరకు జీవించి ఉన్నట్లు, పాత పద్ధతి అయిన బ్రెంటుక్సిమాబ్ వెడొటిన్, కీమోథెరపీ తీసుకున్నవారిలో 86 శాతం మంది జీవించి ఉన్నట్లు అధ్యయన డేటా సూచించింది.

వీడియో క్యాప్షన్, వారం రోజుల్లో, ఐదు సెషన్స్‌లోనే కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చంటున్న పరిశోధకులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)