మణిపుర్‌లో హింసను మోదీ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్‌లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో వందమందికి పైగా సామాన్య ప్రజలు మరణించారు, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇళ్లు తగలబడ్డాయి, దుకాణాలు కాలి బూడిదయ్యాయి, ప్రార్ధనా స్థలాలు ధ్వంసమయ్యాయి.
హోంమంత్రి అమిత్ షా మణిపుర్‌లో పర్యటించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మెయితెయ్, కుకీ వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించే బాధ్యతను అప్పగించారు. అయితే హింస మాత్రం ఆగలేదు.
బుధవారం తెల్లవారుజామున ఒక గ్రామంలో జరిగిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు.
గురువారం రాత్రి ఇంఫాల్‌లో కొంగ్బాలోని కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి దుండగులు నిప్పుపెట్టారు.
కేంద్రం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలే అయినా ఇప్పటికీ హింస కొనసాగుతోంది.
నెలరోజులకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయలేకపోవడానికి కారణం ఏమిటి?
ప్రధాని నరేంద్రమోదీ, మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ విఫలమయ్యారా?

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?
మణిపుర్ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీలతో చర్చించారు. 15 రోజుల్లో శాంతిని పునరుద్ధరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ, పరిస్థితి మరింత దిగజారిపోయింది.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆరోపిస్తున్నారు.
“ప్రజల రక్షణను ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వం ఏమీ చేయనందున తమను తామే రక్షించుకోవాల్సి వస్తుందని కుకి, మెయితెయ్ ప్రజలు భావిస్తున్నారు. హింసను ఎదుర్కోవటానికి ప్రజలు హింసనే ఆశ్రయించడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.'' అని నంబోల్ సనోయి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నింగోంబామ్ శ్రీమ బీబీసీతో అన్నారు.
రెండు వర్గాల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నప్పటికీ, కుకీ, మెయితెయ్ వర్గాలు రాష్ట్రంలో శాంతియుతంగా జీవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇరువర్గాల మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయే పరిస్థితి నెలకొంది.
మణిపుర్‌లోని కుకీ-ఆధిపత్య ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఏ మెయితెయ్ కూడా ధైర్యం చేయడం లేదు. మరోవైపు మెయితెయ్ ప్రజల ప్రాంతానికి వెళ్లే సాహసం ఏ కుకీ చేయడం లేదు.
ఇక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల భద్రతకు ఏర్పాట్లు చేయనంత వరకు ఈ హింసాకాండ ముగిసేలా కనిపించడం లేదని శ్రీమ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌నెస్‌ను ప్రదర్శించడం లేదని మానవ హక్కుల కార్యకర్త కె. ఓనీల్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
హోంమంత్రి అమిత్ షా మణిపుర్ పర్యటన కూడా కేవలం ఆహార సరఫరాకు మాత్రమే పరిమితమైందని, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యల గురించి మాట్లాడలేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మణిపుర్ గవర్నర్ అనుసూయా ఉయికే అధ్యక్షతన 51 మందితో ఏర్పాటు చేసిన శాంతి కమిటీపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
కుకీ తెగకు చెందిన అత్యున్నత సంస్థ 'కుకీ ఇంపి' శాంతి కమిటీ ఏర్పాటును తిరస్కరించింది. అదే సమయంలో మెయితెయ్ సంఘానికి నాయకత్వం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ కూడా ఈ శాంతి కమిటీలో చేరబోమని ప్రకటించింది.
“పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో వారి ఇష్టానుసారం వ్యవహరించే సభ్యులను నియమించారు. ఈ కమిటీలో రాష్ట్రం, ఈ ప్రాంత పరిస్థితులపై నిపుణులైన ఒక్కరు కూడా లేరు. రాష్ట్రాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తులు కమిటీలో ఉండాల్సింది. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమవుతున్నాయి'' అని ఓనీల్ అంటున్నారు.

ఫొటో సోర్స్, ANI
బీజేపీ ఏం చెబుతోంది?
రాష్ట్రంలోని మెయితెయ్ కమ్యూనిటీ, కుకీ తెగల మధ్య జాతి విభజనను తగ్గించే బాధ్యత హిమంత బిశ్వ శర్మకు అప్పగించారు. కానీ ఈ నిర్ణయాన్ని మణిపుర్‌లోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాల వాణికి ప్రతినిధి కాదని కేంద్ర నాయకత్వం అర్థం చేసుకోవాలని మెయితెయ్ వర్గానికి చెందిన కొందరు సూచిస్తున్నారు.
"హిమంత బిశ్వ శర్మ ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడి సమస్యలు వారికి అర్థం కావడం లేదు. ఆయనను ఎవరూ నమ్మరు.'' అని ఓనీల్ తెలిపారు.
అయితే హిమంత శాంతి కమిటీతో మాట్లాడినట్లు శ్రీమ చెప్పారు.
మరోవైపు హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద నాయకుడని ఈ ప్రాంత సమస్యలు ఆయనకు అర్థమవుతాయని బీజేపీ చెబుతోంది.
"కొందరు హిమంత గురించి చెడుగా మాట్లాడవచ్చు, కానీ ఆయన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమికి కన్వీనర్, ఆ ప్రాంత నాయకులు ఆయన మాట వింటారు." అని బీబీసీ ప్రతినిధి దిలీప్ కుమార్ శర్మతో మణిపుర్ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కె. ఇబోమ్చా చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ కారణంగా సామాన్య ప్రజలు భద్రత, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. మందులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల బియ్యం కిలో రూ. 200 కి చేరింది.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని నరేంద్రమోదీ మౌనం..
నెల రోజులుగా హింసాకాండ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై బహిరంగంగా స్పందించలేదు.
కుకీ తెగకు చెందిన విద్యార్థి సంఘం 'కుకీ ఛత్ర సంఘటన' ప్రధానమంత్రి మౌనంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
"ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంపై ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో మెయితెయ్, కుకీ ప్రజలు బాధపడుతున్నారు." అని కె ఓనీల్ అన్నారు.
''అవును.. ప్రధాని నరేంద్రమోదీ మౌనంతో నిరాశే కనిపిస్తోంది. కానీ, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం ఎక్కువుంది. సీఎం ఎన్.బీరెన్ సింగ్‌పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రధానికి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు'' అని శ్రీమ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
హింస ఎలా మొదలైంది?
మెయితెయ్ కమ్యూనిటీకి తెగ హోదా (ట్రైబ్ స్టేటస్) డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న రాష్ట్రంలోని కుకీలతో సహా ఇతర గిరిజన సంఘాలు ర్యాలీని చేపట్టాయి. అది హింసాత్మకంగా మారింది.
గిరిజన, మెయితెయ్ సంఘాలు ఒకదానిపై మరొకటి దాడులకు దిగాయి. మెయితెయ్-ఆధిపత్య ప్రాంతాలలో నివసిస్తున్న కుకీ కమ్యూనిటీ ఇళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. వారిపై దాడి చేశారు.
ఈ దాడుల తర్వాత మెయితెయ్-ఆధిపత్య ప్రాంతాల్లో నివసించే కుకీలు, కుకీ-ఆధిపత్య ప్రాంతాల్లో నివసిస్తున్న మెయితెయ్ లు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
కొండ ప్రాంతాలకు చెందిన కుకీ తీవ్రవాదులు మెయితెయ్ ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్నారని, పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మణిపుర్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని ఇటీవల మణిపుర్ నుంచి తిరిగి వచ్చిన బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ చెప్పారు.
“రాజధాని ఇంఫాల్‌లో చాలా ఉద్రిక్తతగా ఉంది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు కారులోంచి దిగవద్దని మాకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. హింసాకాండ స్థాయిని చూస్తుంటే కుకీ, మెయితెయ్ వర్గాల మధ్య పరస్పర శత్రుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే బయటి నుంచి వచ్చిన తీవ్రవాదులు కూడా హింసకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు కూడా ఉండొచ్చు.'' అని నితిన్ అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, ANI
కుకీ, మెయితెయ్ వర్గాల్లో ఆధిపత్యం ఎవరిది?
మణిపుర్‌లో ప్రధానంగా మూడు వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. మెయితెయ్‌తో పాటు గిరిజన గ్రూపులై కుకి, నాగా ప్రజలు ఉంటారు.
ఇంఫాల్ లోయలో మెయితెయ్ ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. మెయితెయ్ కమ్యూనిటీలో ఎక్కువ మంది హిందువులు. నాగ, కుకీ కమ్యూనిటీ ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతానికి చెందినవారు.
జనాభాలో మెయితెయ్ ప్రజలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్లు మణిపుర్‌లోని 10 శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 90 శాతం ప్రాంతంలో నాగాలు, కుకీలు, ఇతర తెగలు వాళ్లు ఉంటున్నారు.
మెయితెయ్ జనాభా అధికంగా ఉండటమే కాకుండా, వారికి రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉందని మణిపుర్‌లోని ప్రస్తుత గిరిజన సమూహాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చదవడం, రాయడంతోపాటు ఇతర విషయాల్లో కూడా వారు ముందున్నారు.
మణిపుర్‌లోని మొత్తం 60 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు మెయితెయ్ వర్గానికి చెందిన వారు.
మిగిలిన 20 మంది నాగా, కుకి తెగల నుంచి గెలిచారు. ఇప్పటివరకు ఉన్న 12 మంది ముఖ్యమంత్రులలో ఇద్దరు మాత్రమే ఈ తెగలకు చెందినవారు ఉన్నారు.
రాష్ట్రంలో మెయితెయ్ ప్రజల ఆధిపత్యం ఉందని ఇక్కడి గిరిజన సంఘాలు భావిస్తున్నాయి.
మెయితెయ్‌లు కూడా తెగ హోదాను పొందినట్లయితే, మిగతావారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
మెయితెయ్‌లు కొండ ప్రాంతాలలో కూడా భూమిని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో తమను మరింత అణగదొక్కుతారని భావిస్తున్నారు ఇతర వర్గాల ప్రజలు.

ఫొటో సోర్స్, ANI
ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన హామీ ఏంటి?
త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్ ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ కూటమి అధికారంలో ఉంది.
ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈశాన్య భారతం ఎదుర్కొంటున్న వివక్షను తొలగిస్తామని చెబుతూ వస్తున్నారు. ఒకప్పుడు హింసకు, అశాంతికి పేరుగాంచిన ఈశాన్య రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధిని చూస్తోందని పేర్కొంటున్నారు.
కానీ మణిపుర్‌తో పాటు అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరంలలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.
2021 ఆగస్టులో అస్సాం-మిజోరం సరిహద్దులో జరిగిన హింసలో ఐదుగురు అస్సాం పోలీసు సిబ్బంది మరణించారు. 2021 అక్టోబర్-నవంబర్ సమయంలో త్రిపురలో హిందూ-ముస్లిం హింస చెలరేగింది.
2022 నవంబర్‌లో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. ఇందులో ఆరుగురు మరణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే ఈశాన్య ప్రాంతంలో సంపూర్ణ శాంతిని నెలకొల్పడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందా? అని కె ఓ నీల్ ని అడగగా.. “ఈశాన్య ప్రాంతంలో నివసిస్తున్న వివిధ కులాలు, గిరిజన సమూహాల మనోభావాలను బీజేపీ అర్థం చేసుకోదు. వారి హిందుత్వ ఎజెండా ఇక్కడ పనిచేయదు'' అని అన్నారు.
గుజరాత్, యూపీ మోడల్ మాదిరి ఇక్కడ నడపాలనుకుంటున్నారని, అది ఇక్కడ పని చేయదన్నారు. ఈశాన్య హిందూ సమాజం మిగిలిన హిందీ మాట్లాడే రాష్ట్రాల హిందూ సమాజం మాదిరి ఆలోచించదని ఓనీల్ చెబుతున్నారు.
ఇటీవల బడ్జెట్ సెషన్‌లో మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష 'వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ'కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు.
రాష్ట్రంలో ప్రధానంగా ఖాసీ, గారో, జైంతియా, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారని, చాలా మందికి హిందీ రాదని ఆ పార్టీ ఆరోపించింది.
ఈ సంఘటనను ఉదాహరణగా చెబుతూ "ఈశాన్య ప్రాంత ప్రజల ఇష్టాన్ని గౌరవించకుండా మీ ఎజెండాను అమలుపరుస్తుంటే , మీరు ఇక్కడి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు" అని కె ఓనీల్ ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- బాపట్ల టెన్త్ విద్యార్థి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు,
- క్రానియోఫారింగియోమా: ఈ జబ్బు వస్తే 23 ఏళ్ల వ్యక్తి కూడా 13 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు, ఎందుకిలా జరుగుతుంది?
- పసిపిల్లలు ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... ఏమిటీ దారుణం?
- ‘నేను అత్యాచారం వల్ల పుట్టాను.. కానీ, ఆ ప్రభావం నాపై పడనివ్వను'
- ‘మెదడు లేని బిడ్డ కడుపులో ఉందని తెలిసినా అబార్షన్‌కు ఒప్పుకోలేదు'... కూతురికి జరిగిన అన్యాయంపై ఓ తల్లి పోరాటం.
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














