చెరిల్: 53 ఏళ్ల కిందటి చిన్నారి మిస్సింగ్ కేసును రీ-ఓపెన్ చేయాలంటూ కోర్టుకెక్కిన కుటుంబం

చెరిల్

ఫొటో సోర్స్, GRIMMER FAMILY

ఫొటో క్యాప్షన్, బీచ్ వద్ద చెరిల్ గ్రిమ్మెర్
    • రచయిత, టామ్ హౌస్డెన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్ట్రేలియాలో తమ పాప మిస్‌ అయిన 53 ఏళ్ల తర్వాత కేసును మళ్లీ విచారించాలంటూ బ్రిటన్ కుటుంబం న్యూసౌత్ వేల్స్ అటార్నీ జనరల్‌ను కోరుతూ లేఖ రాసింది.

1970లో మూడేళ్ల చెరిల్ గ్రిమ్మెర్ ఆస్ట్రేలియాలో వొలుంగాంగ్ సమీపంలోని బీచ్ వద్ద అదృశ్యమయింది.

పోలీసులు విస్తృతంగా గాలించినప్పటికీ చెరిల్ ఆచూకీ లభించలేదు. అయితే 2011 నాటి విచారణ సందర్భంగా, చెరిల్ చనిపోయిందని నిర్ధరించారు.

మరోవైపు 1971లో పాపను అపహరించి హత్య చేసినట్లు అంగీకరించిన వ్యక్తిపై కేసును 2019లో కొట్టివేశారు. నేరం జరిగిన సమయానికి ఆ వ్యక్తి మైనరని పోలీసులు విచారణలో చెప్పారని, అయితే, మైనర్లను ప్రశ్నించే మార్గదర్శకాలను విచారణలో పాటించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

దీంతో అతని నేరాంగీకారాన్ని పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

చట్టపరమైన కారణాల వల్ల ఆ వ్యక్తి పేరు బహిరంగంగా చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన అనుమానితుడిగానే మిగిలిపోయారు.

2019లో ఈ కేసు విచారణ ముగింపును ఆస్ట్రేలియాలో అత్యంత పెద్ద రహస్యానికి ముగింపు అని అప్పటి అటార్నీ జనరల్ మార్క్ స్పీక్‌మాన్ అభివర్ణించారు.

అయితే "మా కుటుంబం అనుభవించిన బాధను, మరే కుటుంబం అనుభవించకూడదు అనుకుంటున్నాను. నాకు చాలా బాధగా, కోపంగా ఉంది" అని చెరిల్ సోదరుడు రికీ అప్పట్లో బీబీసీతో అన్నారు. ఇపుడు ఈ కేసు పునర్విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నారు.

బీచ్ ప్రాంతం

ఫొటో సోర్స్, BBC/ANDY ALCROFT

ఫొటో క్యాప్షన్, చెరిల్ చివరిసారిగా కనిపించిన బీచ్ పరిసర ప్రాంతం

సమాచారం ఇస్తే రూ.5.6 కోట్లు

యువకుడి నేరాంగీకారం కోర్టు తిరస్కరించడంతో ఆస్ట్రేలియన్ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 2020లో న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం కేసులో సమాచారం కోసం రివార్డ్‌ను రూ.5.6 కోట్లకు పెంచింది.

ఇప్పుడు గ్రిమ్మెర్ కుటుంబం స్పీక్‌మాన్ తర్వాత వచ్చిన అటార్నీ జనరల్ మైఖేల్ డేలీకి ఒక లేఖ రాసింది. న్యాయమూర్తి తీర్పును పునఃపరిశీలించాలని కుటుంబ సభ్యులు ఇందులో కోరారు. దీనిపై స్పందన కోసం డేలీ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.

2019లో జస్టిస్ రాబర్ట్ అలన్ హుల్మే ఈ కేసును కొట్టివేస్తూ ..1971నాటి పోలీసు ఇంటర్వ్యూలో టీనేజ్ నిందితుడికి సంరక్షకుడు లేదా న్యాయవాది లేరని తేలిందని తెలిపారు.

ఆ యువకుడికి తెలివైన వాడిలా కనిపించలేదని, సరైన పెంపకం లేకపోవడం కారణంగా 17 ఏళ్ల వయసువారి కంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాడని వివరించారు.

పాపను వెతుకుతున్న దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అదృశ్యమైన సమయంలో పాపను వెతుకుతున్న దృశ్యం

'పాపను టవల్‌లో చుట్టుకుని తీసుకెళ్లాడు'

కోర్టు తీర్పు బాధితురాలిని పరిగణనలోకి తీసుకోలేదని, తీర్పులో చెరిల్ గురించి లేకపోవడం కుటుంబాన్ని బాధించేదిగా ఉందని గ్రిమ్మెర్ కుటుంబం అంటోంది.

"ఇది మానవ హక్కుల సాధన ప్రక్రియలోని ఆస్ట్రేలియా వైఖరికి వ్యతిరకంగా ఉందనుకుంటున్నా" అని చెరిల్ బంధువు మైఖేల్ గ్రిమ్మెర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన కూడా ఆ లేఖలో సంతకం చేశారు.

అంతేకాకుండా నేరాంగీకారంలోని వివరాలు "2016-17 పునర్విచారణ సమయంలో ధృవీకరణ అయ్యాయి" అని కుటుంబ సభ్యులు లేఖలో చెప్పారు.

పునర్విచారణ కోరడానికి న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టుకు దరఖాస్తును అనుమతించాలని కోరింది.

ఇతర సాక్షులు ముందుకు వచ్చేలా చేయడానికి మునుపటి 'అనుమానితుడి పేరు ప్రచురించకుండా' ఉన్న మీడియా ఆంక్షలను ఎత్తివేయాలని లేఖలో డేలీని కోరారు.

గ్రిమ్మెర్ కుటుంబం బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినపుడు చెరిల్ అదృశ్యమైంది.

ఆమె చివరిసారిగా బీచ్ సమీపంలో షవర్ వద్ద కనిపించింది. అక్కడ మధ్యాహ్నం ఆమె తన తల్లి, ఇద్దరు అన్నలతో ఆడుకుంది. అనంతరం కనిపించలేదు.

టవల్‌‌తో చుట్టిన చిన్నారిని బీచ్ కారుపార్కింగ్ వైపు ఒక గుర్తుతెలియని వ్యక్తి పట్టుకుని వెళుతున్నట్లు ఆ సమయంలో సాక్షులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)