ఆమె చనిపోయారనుకున్నారు.. శవపేటికలో పెట్టాక ఊపిరి ఆడుతూ కనిపించింది

ఫొటో సోర్స్, PHILIPPE LISSAC/GODONG
- రచయిత, లారా గోజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆమె చనిపోయారనుకున్నారు. శవపేటికలో ఉంచారు. తీరా చూస్తే ఆమెకు ఊపిరి ఆడుతోంది.
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో 76 ఏళ్ల బెల్లా మోంటోయాకు గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.
గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహాన్ని శవపేటికలో ఉంచారు. ఐదు గంటల తరువాత, శ్మశానానికి తీసుకెళ్లే ముందు ఆమెకు బట్టలు మారుద్దామని చూస్తే, ప్రాణం ఉంది. ఊపిరి ఆడుతోంది.
వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఈక్వెడార్ ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది.
ఆమెకు కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ వచ్చిందని, గుండె పనిచేయడం ఆగిపోయి, శ్వాస ఆగిపోయిందని, బతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయిందని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
ఆమె కుమారుడు గిల్బర్ రోడోల్ఫో బల్బెరాన్ మోంటోయా మాట్లాడుతూ, వాళ్లమ్మను ఉదయం సుమారు 9.00 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, మధ్యాహ్నం ఆమె చనిపోయినట్టు డాక్టర్ చెప్పారని తెలిపినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
తరువాత బెల్లా మోంటోయాను శవపేటికలో ఉంచారు. కొన్ని గంటల తరువాత కుటుంబ సభ్యులకు ఆమెకు ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపించింది.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోలో ఆమె తెరచి ఉంచిన శవపేటికలో పడుకుని ఉన్నారు. ఆమె భారంగా ఊపిరి తీసుకుంటుంటే చుట్టూ జనం మూగి చూస్తున్నారు.
వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి, వెంటనే అంబులెన్సులో ఆస్పత్రిని తరలించారు.
ఆమె చనిపోయినట్లు ప్రకటించిన ఆస్పత్రిలోనే ఆమెను ఐసీయూలో ఉంచారు.
"జరిగిందేమిటో ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా అర్థమవుతోంది. మా అమ్మ కోలుకుంటే చాలు. ఆమె హాయిగా జీవించాలి, నా పక్కనే ఉండాలి" అని బల్బెరాన్ మోంటోయా ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్‌లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














