బిపర్జోయ్ తుపాను: భారత్, పాకిస్తాన్‌లో వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫొటో సోర్స్, ANI
అతి తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌లో అరేబియా సముద్రం తీర ప్రాంతాల నుంచి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ వద్ద తీరం దాటనుంది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్, కరాచీ పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో భారత్‌లో ఏడుగురు చనిపోయారు.
తీరప్రాంత జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.
తుపాను నేపథ్యంలో రైలు సర్వీసులను నిలిపివేశామని, కండ్లా, ముంద్రా పోర్టుల్లోనూ కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, సందర్శకులు బీచ్‌లకు రావొద్దని సూచించారు.





