జపాన్: సైన్యంలో చేరిన తర్వాత ఆమె కలలు ఎలా చెదిరిపోయాయి, ఆ రోజు ఏం జరిగింది?

జపాన్

ఫొటో సోర్స్, RINA GONOI

హెచ్చరిక: ఈ కథనంలో మనసును కలచివేసే విషయాలు ఉండవచ్చు.

జపాన్‌కి చెందిన రినా గొనొయికి రెండు కలలున్నాయి. అందులో ఒకటి సైన్యంలో చేరడం, రెండోది జూడో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌లో పోటీపడడం.

ఆమె తన నాలుగేళ్ల వయసు నుంచే జూడో ఆడడం మొదలుపెట్టారు. ఆమె సోదరుడే ఆమెకు ట్రైనర్. పదకొండేళ్ల వయసులో ఆమె తొలిసారి సైనికులను చూశారు.

2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీ విపత్తు సమయంలో గొనొయి, ఆమె కుటుంబాన్ని సురక్షిత కేంద్రానికి తరలించేందుకు జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్)కి చెందిన సైనికులు సాయం చేశారు.

23 ఏళ్ల గొనొయి మియాగిలోని హిగాషి మత్సుషిమా ప్రాంతానికి చెందిన వారు. అప్పటి భూకంపంలో ఈ ప్రాంతం బాగా దెబ్బతింది.

అప్పటి సహాయక చర్యల్లో మహిళా సైనికులు కూడా పాల్గొన్నారు. ''వాళ్లు మాకు ఆహారం, సూప్‌లు ఇచ్చారు. బాధితుల కోసం అక్కడ వంట గది నడిపారు.'' అని గొనొయి చెప్పారు.

''మేము స్నానం చేసేందుకు వేడి నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్లు ఎంత మంచి పనిచేస్తున్నారో అనిపించింది. అప్పుడే ఈ సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని నాకు కూడా అనిపించింది.'' అని ఆమె అన్నారు.

తన రెండు కలలను నిజం చేసుకునే క్రమంలో ఆమె జపాన్ ఆర్మీ 'గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్' (జీఎస్‌డీఎఫ్)లో చేరారు.

శిక్షణ పూర్తి చేసుకుని యూనిట్‌లో చేరిన తర్వాత ఆమె కన్న కలలు చెదిరిపోయాయి. అక్కడ లైంగిక వేధింపులు నిత్యకృత్యమయ్యాయి.

''నా వక్షోజాలను పట్టుకునేవారు. బుగ్గలపై ముద్దుపెట్టేవారు. వెనక నుంచి ఎక్కడ పడితే అక్కడ పట్టుకునేవారు. నా ముందే సహోద్యోగులు, ఉన్నతాధికారులు ఇబ్బందికరమైన చేష్టలు చేసేవారు. అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగేది.''

'బ్లో జాబ్' చేయమని కూడా అడిగేవారని ఆమె చెప్పారు.

ఆమె శరీరం గురించి కూడా సహోద్యోగులు కామెంట్స్ చేసేవారు. ''నీ వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి. నువ్వు పొడుగ్గా ఉన్నావు'' అని మాట్లాడేవారని గొనొయి చెప్పారు.

2021 ఆగస్టులో ఆమె జీవితంలో దారుణ ఘటన ఎదురైంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

జపాన్

'నేను ఎలా బతకాలి'

పర్వతాల్లో శిక్షణ కార్యక్రమంలో ఉన్నప్పుడు ముగ్గురు పురుష సహోద్యోగులు ఆమెను ఒక టెంటులోకి పిలిచారు. అప్పటికే వారు మద్యం తాగుతున్నారు.

''ఒక మనిషిని గట్టిగా పట్టుకుని, కింద పడేయడమెలా అనే మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ గురించి చెప్పారు. అలా చేయమన్నారు. ఆ తర్వాత నన్ను మంచం మీద పడేసి గట్టిగా పట్టుకున్నారు''

ఆ ముగ్గురూ కలిసి బలవంతంగా తన కాళ్లు వెడల్పు చేశారని, ఒకరి తర్వాత మరొకరు పదే పదే తనపై లైంగిక దాడి చేశారని గొనొయి చెప్పారు.

దాదాపు డజను మంది సహోద్యోగులు చుట్టూ ఉన్నా కనీసం ఒక్కరు కూడా ఆ చర్యలను ఆపేందుకు ప్రయత్నించలేదని ఆమె చెప్పారు. పైగా నవ్వుతున్నారని ఆమె అన్నారు.

''దీంతో నేను తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. నా శరీరం, ఆత్మ కళంకితమయ్యాయి. నేను ఎలా బతకాలి?'' అని ఆమె వాపోయారు.

ఈ ఘటనపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, సరైన ఆధారాలు చూపలేకపోవడంతో ఆమె ఫిర్యాదును కొట్టిపారేశారు.

ఆ తర్వాత, లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన ఆ ముగ్గురు సైనికులపై జీఎస్‌డీఎఫ్ పోలీస్ యూనిట్ విచారణ జరిపింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది.

దీంతో, సైన్యంలో ఉద్యోగం మానేసి ఇక ఇంటికి తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని గొనొయి భావించింది.

''నేను శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాను'' అని చెప్పారు.

తనపై జరిగిన ఈ దారుణం ప్రజలందరికీ తెలిసేలా ఉద్యమించాలని గొనొయి నిర్ణయానికి వచ్చారు. అయితే అందుకు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒప్పుకోలేదు.

జపాన్ లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక హింసకు గురైన బాధితుల్లో అవమాన భారంతో మౌనంగా ఉండిపోయే వారే ఎక్కువ. ఒకవేళ ధైర్యం చేసి గళం విప్పినా ఎదురుదెబ్బలు తప్పవనే భయం.

జపాన్

ఫొటో సోర్స్, RINA GONOI

అదంత సులువు కాదు..

జపాన్‌లో లైంగిక దాడి ఘటనల్లో దాదాపు 70 శాతం కేసులు బయటికి రావని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళం విప్పాలని గొనొయి అనుకున్నారు. అయితే, అది అంత సులభం కాదని ఆమెకు తెలుసు. అందులోనూ జపాన్ ఆర్మీ సంస్థకు వ్యతిరేకంగా ఆమె పోరాడాలనుకుంటోంది.

తనకు జరిగిన దారుణ అనుభవాన్ని ఆమె యూట్యూబ్ ద్వారా అందరితో పంచుకున్నారు. మీడియాలో ఆమె కథ చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత చాలా మంది తమకు ఎదురైన లైంగిక హింస గురించి చెప్పారని, ఆర్మీలో ఉన్నవారు కూడా చెప్పారని గొనొయి తెలిపారు. తనపై జరిగిన లైంగిక దాడి ఘటనపై విచారణ జరపాలని రక్షణ మంత్రిత్వ శాఖను డిమాండ్ చేస్తూ ఆమె లక్ష మంది సంతకాలను సేకరించారు.

కానీ, ఆమెకు ఎదురుదెబ్బలు తప్పలేదు.

నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. నిజానికి నువ్వు మగాడివి అయ్యుంటావు? లాంటి కామెంట్లు వచ్చాయని, మరికొందరు వెడల్పుగా ఉండే తన చెవుల గురించి హేళన చేసేవారని గొనొయి చెప్పారు. జూడో ఆడడం వల్ల నా చెవులు అలా ఉన్నాయని ఆమె అన్నారు.

''నేను పిటిషన్ వేసేందుకు సంతకాలు సేకరిస్తున్న సమయంలో ఒక ఈ మెయిల్ వచ్చింది. ఈ విషయంలో ఇంకా ముందుకెళ్తే నిన్ను చంపేస్తాం'' అని బెదిరించారని ఆమె చెప్పారు.

చట్టాల్లో డొల్లతనం

ఒక ప్రముఖ రిపోర్టర్ తనపై అత్యాచారం చేశాడని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జపనీస్ జర్నలిస్ట్ షియోరి ఇటో కేసు వేసి గెలవడం 2019లో సంచలనంగా మారింది.

అదే ఏడాది పూలతో నిరసన తెలిపే కార్యక్రమం కూడా మొదలైంది. లైంగిక హింసకు గురైన బాధితులు బహిరంగ ప్రదేశాల్లో పూలు ప్రదర్శిస్తూ సామూహిక నిరసనలకు దిగారు. 2019 ఏప్రిల్ నుంచి ప్రతి నెలలో 11వ రోజున ఈ నిరసనలు కొనసాగాయి.

లైంగిక నేరాల్లో నిందితులను అన్యాయంగా వదిలిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, జపాన్ చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరిగాయి.

అదే ఏడాది నాలుగు లైంగిక నేరాల కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం జపాన్ చట్టాల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. వాటిలో 19 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన కేసు కూడా ఉంది.

ఆమెకు ఇష్టం లేకుండా, తండ్రి బలవంతంగా సెక్స్ చేశాడని కోర్టు భావించింది. అయితే, రేప్ చేసే సమయంలో అతన్ని అడ్డుకోవడంలో ఆమె అసమర్థతను, అతను తనకు అనుకూలంగా వాడుకున్నాడని భావిస్తున్నట్లు పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

ఇలాంటి పరిస్థితిపై ''చాలా మంది మహిళలు కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ, మాట్లాడేందుకు సరైన వేదిక లేదు. నేను కూడా చాలా కోపంగా ఉన్నాను. అందుకే పూలతో నిరసన తెలపడం ప్రారంభించాను'' అని మినోరి కిటహారా బీబీసీకి తెలిపారు.

''జపనీస్‌లో లైంగిక హింస క్షమించరానిది. కానీ, సమ్మతే ప్రధానం అని ఇంగ్లీష్‌లో చెబుతున్నారు'' అని వారిలో ఒకరు చెప్పారు.

ఈ పూల నిరసనలు లైంగిక నేరాలపై సమాజంలో నెలకొన్న నిశ్శబ్దానికి వ్యతిరేకంగా, ధిక్కరణకు చిహ్నంగా మారాయి.

జపాన్

ఒక మహిళ ముఖానికి మాస్క్ వేసుకుని, మైక్ పట్టుకుని మాట్లాడుతూ, టీనేజర్‌గా ఉన్నప్పుడు తండ్రి తనను ఎలా లైంగిక వేధింపులకు గురిచేశాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు జరిగిన దారుణాన్ని విని అక్కడున్న మహిళలు, పురుషులు అందరి కళ్లలో నీళ్లొచ్చాయి. కిటహారా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

లైంగిక నేరాల చట్టంలో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును జపాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదించింది. అందులో శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచింది.

ఈ కొత్త చట్టం ప్రకారం, లైంగిక హింస కేసుల్లో తన సమ్మతి లేదని రుజువు చేయడమే కాకుండా, దాడి చేయడం, బెదిరింపులు, లేదా లైంగిక దాడిని ప్రతిఘటించడం సాధ్యం కాలేదని నిరూపించాల్సిన బాధ్యత కూడా బాధితురాలిపై ఉంది.

''ఈ చట్టం వివక్షాపూరితంగా ఉందని భావిస్తున్నా. ఇతర దేశాలతో పోలిస్తే, ఈ చట్టం ఇప్పటికీ బాధితులకు వ్యతిరేకంగా ఉంది. వాటిని బయటికి చెప్పుకోలేని మహిళల గురించి ఆలోచిస్తే, ఈ చట్టం కూడా బాధితులపై జరిగే నేరం లాంటిదే.'' అని కిటహారా అన్నారు.

''సమ్మతి తెలిపే వయసు 16కి పెరగబోతోందని నాకు తెలుసు. కానీ ఇన్నాళ్లూ 13 ఉండడమే పెద్ద సమస్య'' అని ఆమె అన్నారు.

జపాన్ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్న వృద్ధులు ఇలాంటి చట్టాలు చేసి ఉంటారని, మహిళలు ఏం కోరుకుంటున్నారో వారికి తెలియడం లేదని కిటహారా అభిప్రాయపడ్డారు.

జపాన్

'నేను చాలా కోల్పోయాను'

రినా గొనొయి కేసు చర్చనీయాంశంగా మారడంతో ఆర్మీ అంతర్గత విచారణ జరిపింది. గత డిసెంబరులో ఐదుగురు సైనికులను సర్వీసు నుంచి తొలగించారు. యూనిట్ కమాండర్‌ను ఆరు నెలలు సస్పెండ్ చేశారు. రక్షణ శాఖ చేపట్టిన విచారణలో అలాంటి వేధింపులకు సంబంధించిన కేసులు 100కి పైగా ఉన్నట్లు గుర్తించారని అధికారులు తెలిపారు.

జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గొనొయికి క్షమాపణలు కూడా చెప్పింది.

తనలా మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నాని గొనొయి చెప్పారు. ఈ కేసుపై నిర్లక్ష్యం వహించినందుకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందేనని ఆమె అన్నారు.

''ఎస్‌డీఎఫ్‌లో ప్రతి ఒక్కరికీ రక్షణ ఉండాలని కోరుకుంటున్నా'' అని ఆమె అన్నారు.

తనను మానసికంగా క్షోభకు గురిచేసినందుకు 5.5 మిలియన్ యెన్ (32 లక్షల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని ఐదుగురిపై గొనొయి సివిల్ దావా వేశారు. అలాగే, వాటిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు ప్రభుత్వం మరో 2 మిలియన్ యెన్ (11.8 లక్షల రూపాయలు) చెల్లించాలని ఆమె కేసు వేశారు.

ఈ దావా వేసినప్పటి నుంచి బహిరంగ ప్రదేశాల్లోనే ఆమెపై దాడులు జరిగాయి. అలా ఎందుకు జరిగిందని ఆమెను అడిగినప్పుడు ఆమె కాస్త సంకోచించారు. అది చెప్పడం అంత సులువు కాదని ఆమె అన్నారు.

''నేను ఎస్‌డీఎఫ్‌ని చాలా ప్రేమిస్తున్నాను. విపత్తు సమయంలో వాళ్లు మాకు చాలా సాయం చేశారు. నేను చివరగా చేయాలనుకుంటున్నది ఇదే'' అని గొనొయి చెప్పారు.

''అది తప్పు అని నేను భావిస్తున్నా. అప్పటి సంఘటనలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. నేను చాలా కోల్పోయాను''అని ఆమె అన్నారు.

గొనొయిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే కేసులో జపాన్ జీఎస్‌డీఎఫ్‌కి చెందిన ముగ్గురు మాజీ సైనికులపై ఈ ఏడాది మార్చిలో ఫుకుషిమాలో అభియోగాలు నమోదయ్యాయి.

''కష్టం వృథా కాలేదు. నేరం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు'' అని గొనొయి ట్వీట్ చేశారు.

ట్రావెలింగ్ చేయాలని అనుకుంటున్నానని, తన జీవితాన్ని తనకు నచ్చినట్లు కొనసాగించాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు.

''నేను సరదాగా ఉండే వ్యక్తిని. చుట్టూ ఉన్నవారిని నవ్వుతూ ఉండేలా చేస్తాను. నవ్వుతూ ఉండడం నాకు ఇష్టం. నేను ఆశావాహ దృక్పథంతో, నా జీవితాన్ని ఆనందంగా గడుపాలనుకుంటున్నా. నేను నాలా బతకాలనుకుంటున్నా. నేను నాలాగే ఉండాలనుకుంటున్నా.'' అని గొనొయి చెప్పారు.

ఇవి కూడా చదవండి: