ICC వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్: ఫైనల్స్ దాకా వచ్చి భారత్ ఎందుకు చతికిలపడుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురేశ్ మేనన్
- హోదా, స్పోర్ట్స్ రచయిత, బీబీసీ కోసం
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్‌లో నాలుగేళ్లల్లో రెండుసార్లు రెండో స్థానంలో నిలవడం చిన్న విషయమేం కాదు. కానీ, రెండుసార్లు ఫైనల్‌లో ఓడిపోవడం భారత్‌కు మచ్చ తెచ్చిపెట్టే విషయమే.
2023 ఫైనల్స్‌లో తొలిరోజు టాస్ గెలుచుకుని బౌలింగ్ ఎంచుకున్నప్పుడే భారత్ ఓడిపొయిందనుకోవాలి. టాస్ గెలిస్తే ఆస్ట్రేలియా కూడా అదే ఎంచుకుని ఉండవచ్చు. కానీ, ఆసీస్ జట్టులో మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అందుకే, భారత్ బౌలింగ్ ఎంచుకుందా? ఆ ఫాస్ట్ బౌలర్లను బ్యాట్‌తో ఎదుర్కోలేకే మొదటి బ్యాటింగ్ వాళ్లకు ఇచ్చేసిందా? బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా రక్షణలో పడిందా?
కానీ, క్రికెట్‌లో ఒక సామెత ఉంది.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి. ఒకవేళ ఆలోచించాల్సి వస్తే, కాసేపు ఆలోచించి మళ్లీ బ్యాటింగే ఎంచుకోవాలి. డబ్ల్యూజీ గ్రేస్ నుంచి బిషన్ సింగ్ బేడీ దాకా ఇదే పద్దతిని అనుసరించారు.
మరొక మంత్రం కూడా ఉంది.. నీకున్న ఉత్తమ బౌలర్లను ప్రవేశపెట్టు. 1960లలో టైగర్ పటౌడి నుంచి 1980లలో క్లైవ్ లాయిడ్ వరకు జట్టు కెప్టెన్లు ఇదే మంత్రాన్ని పాటించారు.
వెస్ట్ ఇండీస్ జట్టులో బెస్ట్ బౌలర్లందరూ ఫాస్ట్ బౌలర్లే అయినప్పుడు, లాయిడ్ వాళ్లల్లో నలుగురిని ఎదుర్కొన్నాడు. భారత జట్టు బలం స్పిన్ అయినప్పుడు, స్పిన్నర్లనే బరిలోకి దించారు. ఇది కొంత పక్కదారి పట్టించవచ్చు కానీ, లాయిడ్ జట్టులో ఒక స్పిన్నర్‌ను, పటౌడి జట్టులో ఒక మీడియం పేసర్‌ను తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుకే, ఒక కాలంలో భారత్ వికెట్ కీపర్ కూడా తొలుత బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
మొన్న ఓవల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు మీడియం పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను గానీ, మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్‌ను గానీ ఎంపిక చేసి ఉంటే బాగుండేది. 474 టెస్ట్ వికెట్లు తీసి కూడా మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లే పని మాత్రమే అప్పగిస్తే, అశ్విన్‌కు అది చాలా నిరాశ మిగల్చవచ్చు.
అశ్విన్‌ను తీసుకున్నా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 150కే ఆల్ అవుట్ అయి ఉండవచ్చు. అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీసి ఉండకపోవచ్చు. కానీ, అతడిని టీంలో తీసుకుంటే వ్యూహమైనా పటిష్టంగా ఉందనిపించేది.

ఫొటో సోర్స్, AFP
భారత్ రెండో స్థానం చాలనుకుంటోందా?
కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మల సారథ్యం మందకొడిగా ఉంటుందని, భారత్‌కు కొంత దూకుడు తత్వం కావాలని ఎవరైనా భావిస్తే 2021ని గుర్తుతెచ్చుకోవచ్చు. అప్పట్లో యుద్ధానికి కాలుదువ్వే రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ ద్వయం ఉండేది. కానీ, ఫలితం అదే. భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
2021లో న్యూజిలాండ్‌తో ఆడే జట్టును సరిగ్గా ఎంచుకోలేదు. ఈ ఏడాది ఆ తప్పును దిద్దుకుంటారనుకున్నాం. అలా జరగలేదు. రెండుసార్లు తప్పు చేస్తే ఒప్పయిపోదు.
మౌలికమైన అంశాల విషయంలోనే భారత్ పప్పులో కాలేసింది. మొదటి రోజు నుంచి పరువు దక్కించుకునే ప్రయత్నమే చేసింది.
ఫైనల్ కోసం ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ ఆటగాళ్లను రిజర్వ్ చేసుకుంది. కోహ్లీకి మొదటి ఇన్నిగ్స్‌లో మిచెల్ స్టార్క్ చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్కాట్ బోలాండ్ ఆయాసం తెప్పించాడు.
భారత జట్టులో ఒక ఊపే లేదు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్మిత్ మొదటిరోజు 95 చేసి నాటవుట్‌గా నిలిచాడు. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించినప్పుడు, మొహమ్మద్ సిరాజ్ రెండు హాఫ్ వాలీస్ వేసి సునాయాసంగా స్మిత్‌కు 100 అందించాడు.
భారత జట్టు ఓటమికి అన్ని రకాల కారణాలనూ ముందుకు తెస్తారు.. ఐపీల్ ఆడి అలిసిపోయారంటారు, డ్యూక్ క్రికెట్ బాల్ వల్ల, ఓవల్‌లో టెస్ట్ త్వరగా ఆరంభైందని, వికెట్ ఒక్కోసారి ఒక్కోలా బౌన్స్ అయిందని, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారని పలు కారణాలు చెబుతారు. కానీ, వీటిలో చాలా అంశాలు ఆస్ట్రేలియాకూ వర్తిస్తాయి. కానీ, ఆ జట్టు గెలిచిందే.
ఈ మధ్య, కొన్ని బంతులకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అవుటయితుంటే, తరువాత వచ్చినవాళ్లు పేలవంగా ఆడి పెవిలియన్ దారి పడితే, అప్పుడు మొదలవుతుంది అసలు లెక్క.. నెంబర్ 8 ఆటగాడు ఎన్ని 50లు చేశాడు, ఎన్నిసార్లు నిలదొక్కుకున్నాడు లాంటి లెక్కలన్నీ బయటకి తీస్తారు.
చేతేశ్వర్ పుజారా బాల్‌ను సరిగ్గా అంచనా వేయకుండా మొదటి ఇన్నింగ్‌లో అంత త్వరగా బౌల్డ్ అయిపోతాడని, రెండో ఇన్నింగ్స్‌లో అప్పర్ కట్ ఆడి క్యాచ్ ఇస్తాడని ఎవరైనా ఊహిస్తారా? పైగా, ఐపీఎల్ ఆడని ఒకే ఒక్క ఆటగాడు అతను. విడ్డూరంగా, ఈ సీరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన అజింక్యా రహానే (89, 46)కు సెంట్రల్ కాంట్రాక్ట్ లేదు.

ఫొటో సోర్స్, AFP
చివరి దాకా వచ్చి...
ఎందుకు భారత జట్టు ఐసీసీ టోర్నమెంటుల్లో చివరి దాకా వచ్చి చతికిలబడుతోంది?
ఒక టైటిల్ కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి రావడం మింగుడుపడని విషయమే. భారత్ జట్టు చివరిగా 2013లో ఇంగ్లండ్‌లో టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
పోలికలు వెతకడం ప్రమాదకరం అవుతుంది. వైట్ బాల్, రెడ్ బాల్, స్వదేశంలో జరిగే పోటీలు, విదేశాల్లో జరిగే టోర్నమెంటులు, వేర్వేరు కోచ్‌లు, కెప్టెన్లు, వేర్వేరు కాలాల్లో మ్యాచ్‌లు జరగడం.. ఇలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే, భారత జట్టు బలహీనం అన్న మాటవస్తుంది. కానీ, అది నిజం కాదు. భారత జట్టు పరిస్థితుల బట్టి తడబడే జట్టు కాదు.
వాళ్లు ఇంగ్లండ్‌లో, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికాలలో టోర్నమెంటులు గెలిచారు. స్వదేశంలో మాత్రమే పులులు కాదు, విదేశాల్లో కూడా పంజా విసరగలరు.
గత 30 ఏళ్లల్లో విదేశీ మైదానాలలో ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్‌ల కంటే గెలిచిన మ్యాచ్‌ల సంఖ్యే ఎక్కువ. గెలిచినవి 124, ఓడినవి 80. రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్‌లో ఓడిపోవడం వల్ల ఈ రికార్డ్ చెరిగిపోదు.
ఇవి కూడా చదవండి:
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
- కొలంబియా అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు... అడవే వారిని కాపాడిందా?
- భారత్‌లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














