ఇరాన్: హిజాబ్ ధరించని మహిళలను పట్టుకునేందుకు 'స్మార్ట్' ప్రోగ్రామ్

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఫెరానాక్ అమిది
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఇరాన్ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో డ్రెస్ కోడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రయత్నిస్తోంది.
ఇదే సమయంలో, అక్కడ మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పించుకునేందుకు తమ సొంత మార్గాలను వెతుకుతున్నారు.
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు హిజాబ్ కేంద్ర బిందువుగా మారింది.
హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు ‘స్మార్ట్’ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెస్తున్నట్లు ఇరాన్ నేషనల్ పోలీసు చీఫ్ అహ్మద్ రెజా రదాన్ ఏప్రిల్‌లోనే ప్రకటించారు.
ఈ ప్రోగ్రామ్ కింద, కెమెరాల సాయంతో హిజాబ్ ధరించని మహిళలను గుర్తిస్తున్నారు.
హిజాబ్ నిబంధన ప్రకారం ఇరాన్‌లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ జుట్టును కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వదులుగా ఉండే వస్త్రాలను మాత్రమే ధరించాలి.
ఒకవేళ హిజాబ్ నిబంధనను పాటించకపోతే, జరిమానాలు, కఠిన శిక్షలు విధించే ప్రొవిజన్ ఉంది.
హిజాబ్ నిబంధనను అతిక్రమిస్తూ రెండో సారి పట్టుబడితే, వారిని కోర్టుకి పంపిస్తామని ఆ దేశ పోలీసు చీఫ్ మహిళలను హెచ్చరించారు.
అలాగే, తమ జుట్టును కవర్ చేసుకోకుండా మహిళలు కార్లలో ప్రయాణిస్తుంటే, వారి కార్లను సైతం జప్తు చేయనున్నారు. వ్యాపార ప్రదేశాలను కూడా మూసివేయనున్నారు.
ఇన్ని కఠిన చర్యలను ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అక్కడి మహిళలు మాత్రం ఈ నిబంధనలను అనుసరించడం లేదు.
ఈ ప్రకటన తర్వాత, సోషల్ మీడియాలో మహిళలు తమ నిరసన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.
పబ్లిక్ ప్రదేశాల్లో హిజాబ్ పెట్టకోకుండా దిగిన ఫోటోలను, వీడియోలను మహిళలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, HANDOUT
‘టెక్నాలజీ అంత కచ్చితమైంది కాదు’
కారులో ప్రయాణిస్తూ హిజాబ్ ధరించని ఇరాన్ మహిళలకు ఎన్నో ఏళ్లుగా వార్నింగ్ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.
ట్రాఫిక్ కంట్రోల్ కెమెరాలు గుర్తించిన తర్వాత ఈ మెసేజ్‌లను పంపుతున్నారు.
అయితే మొట్టమొదటిసారి కార్లను జప్తు చేస్తామని లేదా జరిమానాలను విధిస్తామని ఇరాన్ అధికారులు మహిళలకు హెచ్చరికలు జారీ చేశారు.
‘‘గత నెలలో నా స్నేహితులతో కలిసి నేను కారులో దమ్ఘన్ వెళ్లాను. ఈ ప్రయాణం తర్వాత నా కారు నెంబర్‌తో ఒక మెసేజ్ వచ్చింది. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తోన్న మాలో చాలా మంది హిజాబ్ ధరించలేదు’’ అని ఒక మహిళ బీబీసీకి చెప్పారు.
ఇరాన్‌లోని ఇతర మహిళలకు కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నట్లు చెబుతున్నారు.
తర్వాత కారు ప్రయాణంలో హిజాబ్ ధరించకుండా మిమ్మల్ని గుర్తిస్తే, కారును జప్తు చేస్తామని ఈ హెచ్చరిక మెసేజ్‌లలో ఉంటుంది.
ఈ ఆరోపణలను సవాలు చేసేలా ప్రభుత్వ వెబ్‌సైట్‌కి చెందిన లింక్ కూడా ఈ మెసేజ్‌లలో ఉంటుంది.

ఫొటో సోర్స్, HANDOUT
తనకు కూడా ఈ రకమైన మెసేజ్ వచ్చినట్లు ఒక వ్యక్తి చెప్పారు. కానీ, తాను ప్రయాణిస్తోన్న సమయంలో కారులో ఎవరూ మహిళలు లేరని తెలిపారు.
‘‘కారులో కేవలం నేను మాత్రమే ఉన్నాను. వారి కెమెరాలు అంత కచ్చితమైనవి కావు. టెక్నాలజీ కచ్చితమైంది కాదు’’ అని అన్నారు.
ఈ పరిస్థితిలో తన గుర్తింపును బయటికి వెల్లడించడానికి నిరాకరించిన ఆ వ్యక్తి, తన ఫోటోను బీబీసీకి పంపారు.
దీనిపై ఒక వ్యక్తి వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ‘‘ఇదేనా మీ స్మార్ట్ టెక్నాలజీ’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
ఏప్రిల్‌లో ఈ ప్రకటన తర్వాత, పోలీసుల నుంచి తమకు మెసేజ్‌లు వస్తున్నట్లు ప్రజలు కూడా చెబుతున్నారు.
‘‘డియర్ సిటిజన్, హిజాబ్ నిబంధనలను అనుసరించడం, గౌరవించడం చట్టం ద్వారా తప్పనిసరి చేస్తున్నాం’’ అని ఆ మెసేజ్‌లో చెప్పారు.
ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం తీసుకుంటోన్న ఈ కొత్త చర్యలు చట్టవిరుద్ధమైనవని కొందరు న్యాయవాదులు అంటున్నారు.
హిజాబ్ ధరించనందుకు కారును జప్తు చేసేందుకు చట్టపరంగా ఎలాంటి హక్కు లేదని న్యాయవాది మోహసేన్ బోర్హానీ చెప్పారు.
దీనిపై న్యాయవ్యవస్థ స్పందిస్తూ.. పబ్లిక్ ప్రదేశాల్లో హిజాబ్ తీసివేయడం నేరమని పునరుద్ఘాటించింది.

ఫొటో సోర్స్, TWITTER
‘మేమింకా మర్చిపోలేదు’
హిజాబ్ ధరించకపోతే ఒకవైపు శిక్షలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, ఆ దేశంలో మహిళలు మాత్రం హిజాబ్ ధరించాలనే నిబంధనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నారు.
‘‘గత కొన్ని నెలలుగా చాలా మంది యువతులు మరణించారు. మళ్లీ మేం అదే పరిస్థితిలోకి వెళ్లాలనుకోవడం లేదు’ సెమ్నాన్ నగరానికి చెందిన ఒక యువతి చెప్పారు.
పబ్లిక్ ప్రాంతంలో తన తలను సరిగ్గా కప్పుకోలేదన్న కారణంతో 22 ఏళ్ల మహసా అమినీ అనే అమ్మాయి, పోయిన ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె పోలీసుల కస్టడీలో మరణించారు.
మహసా అమినీ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి.
ఈ ఆందోళనలను చెదరగొట్టేందుకు, ఆపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నించింది.
మహిళలు, జీవితం, స్వేచ్ఛ అనే నినాదాలతో వారి నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ నిరసనల్లో భాగంగా చాలా మంది మహిళలు తమ హిజాబ్‌ను తీసేసి, మంటల్లో కాల్చి వేస్తున్నారు.
చాలా మంది మహిళలు తమ జుట్టును పబ్లిక్ ప్రదేశాల్లోనే కత్తిరించుకుంటున్నారు.
మహసా అమినీ చనిపోయి తొమ్మిది నెలలు అవుతున్నా, ఇంకా ఆ దేశంలో మహిళలు హిజాబ్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
మహిళల వ్యక్తిగత, ప్రజా జీవితాన్ని నియంత్రించే వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
‘‘ఇది ఇస్లామిక్ నిరంకుశత్వం. దీని మూలస్తంభాల్లో ఒకటి మహిళలను నియంత్రించడం, వారిపై అధికారం చెల్లాయించడం. ఇలాంటి పరిస్థితిలో హిజాబ్‌కి వ్యతిరేకంగా పోరాడటం ఈ వ్యవస్థ మూలాన్ని దెబ్బకొడుతోంది’’ అని తెహ్రాన్‌కి చెందిన ఒక మహిళ బీబీసీతో చెప్పారు.
‘‘మహిళలు, జీవితం, స్వేచ్ఛ అనే ఉద్యమం ఇంకా బతికే ఉందని మేం చూపించాలనుకుంటున్నాం. మహసా అమినీ మరణాన్ని మేమింకా మర్చిపోలేదు’’ అని తెహ్రాన్‌కి చెందిన మరో మహిళ అన్నారు.

ఫొటో సోర్స్, HANDOUT
‘‘మహిళలు లొంగిపోరు’’
ఈ నిరసనల సమయంలో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటికి వచ్చిన ఒక మహిళా కార్యకర్త బీబీసీతో మాట్లాడారు.
‘‘గత కొన్ని నెలలుగా నేను చూస్తున్నదేమిటంటే, మహిళలు లొంగిపోరు. ఈ బెదిరింపులకు మహిళలు భయపడరు. వీరి ధైర్యాన్ని ఎవరూ కూడా దెబ్బకొట్టలేరు’’ అని చెప్పారు.
ఈ సమయంలో ప్రభుత్వం తాను క్లిష్టపరిస్థితిలో పడినట్లు భావిస్తుందని చెప్పారు.
‘‘అందుకే ప్రభుత్వం ఈ నిరసనల్లో పోలీసులను ముందుకు తీసుకొచ్చింది. కానీ, మహిళలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మాత్రం పోలీసుల పరిధిని, పోలీసుల బలాన్ని ప్రభుత్వం పెంచలేదు’’ అని తెలిపారు.
ఇరాన్‌లో అధికారానికి మద్దతు తెలిపే కొందరు కూడా ఈ కొత్త పాలసీని వ్యతిరేకిస్తున్నారు.
హిజాబ్ కేసులో పోలీసులను భాగం చేయడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఘర్షణలు మాత్రమే పెరుగుతాయని ఇస్లామిక్ రివాల్యూషన్ గార్డు కార్ప్స్(ఐఆర్‌జీసీ) కమాండర్‌కు చెందిన మాజీ ఉన్నతాధికారి హుస్సేన్ అలాయీ చెప్పారు.
‘నైతిక పోలీసులు ఎలాంటి ఆందోళనలను సృష్టించారో మనం చూశాం. హిజాబ్ ధరించని మహిళల సంఖ్య పెరిగింది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- సూడాన్ అంతర్యుద్ధం: రాజధానిలో రోడ్లపై శవాలను పీక్కుతింటున్న కుక్కలు
- హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ రహస్య సైనిక స్థావరంలో 20 నెలలుగా ‘నరకం’ అనుభవిస్తున్న తమిళులు
- అరటి పండు తింటే 5 లాభాలు
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














