‘మీరు నా కంట్లోనే కాల్చారు, నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది..’

ఫొటో సోర్స్, GHAZAL RANJKESH
ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఒక యువతి గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అంతలా బాధిస్తోంది ఆ విషయం. తన కుడి కన్నుకి బ్యాండేజ్‌ను కట్టగా, తన ఎడమ కన్ను పూర్తిగా మూసుకుపోయింది.
గతేడాది సెప్టెంబర్‌లో ఇరాన్‌లోని మషాద్ నగరంలో జరిగిన నిరసనల్లో పీహెచ్‌డీ విద్యార్థి ఎలాహి తవోకోలియాన్ కూడా పాల్గొన్నారు.
ఆ నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ సెక్యూరిటీ గార్డులు జరిపిన కాల్పుల్లో ఎలాహి తీవ్రంగా గాయపడ్డారు.
భద్రతా దళాల కాల్పుల్లో ఎలాహి కుడి కన్నుకు బుల్లెట్ తగిలింది. ఆమె చూపు పోయింది.
ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌లో.. ‘‘మీరు నా కంటిపై కాల్చారు. కానీ, నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. నా చూపును తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఈ సంఘటన నేడు ప్రతి ఒక్కరి కళ్లను తెరిపించింది’’ అని ఆమె పేర్కొన్నారు.
భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయనే ఆశతో తాను బతుకుతున్నానని, కానీ రోజురోజుకి తాము చీకటిలో కూరుకుపోతున్నామని అన్నారు.
తన కంటి చూపును కోల్పోయిన తర్వాత ఎలాహి ఇరాన్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. కంట్లో ఉన్న బుల్లెట్‌ను తొలగించే ఆపరేషన్ కోసం ఆమె ఇటలీ వెళ్లారు.
ఆస్పత్రి బెడ్‌పై నుంచే ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్ తర్వాత బీబీసీ పర్షియన్‌తో మాట్లాడిన ఎలాహి, ఈ విషయంపై తాను అంతర్జాతీయ కోర్టులో పోరాడనున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఎలాహి లాగా ఎంతో మందిపై కాల్పులు
గతేడాది సెప్టెంబర్‌లో పోలీసుల కస్టడీలో కుర్దిష్ మహిళ మహసా అమీని చనిపోయారు.
హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.
మహసా అమీని మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
నేటికి కూడా ఈ ఆందోళనలు ఆగలేదు.
నిరసనకారులు కఠినమైన హిజాబ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. దీంతో హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు తాజాగా ఇరాన్ పోలీసులు పబ్లిక్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చుతున్నట్లు ప్రకటించారు.
మానవ హక్కుల కార్యకర్తలు, న్యూస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న వారిలో 20 వేల మంది అరెస్ట్ కాగా.. 500 మంది చనిపోయారు.
చాలా మంది యువతపై బుల్లెట్లతో కాల్పులు జరగ్గా.. కొందరు చూపు కోల్పోయారు. మరికొందరు తీవ్రగాయాల పాలయ్యారు.
అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ పోలీసు చీఫ్ బ్రిగేడియర్ జనరల్ హసాన్ కర్మి కొట్టిపారేస్తున్నారు.
పోలీసులకు వ్యతిరేకంగా వస్తోన్న ఈ ఆరోపణలన్ని తప్పుడువని పేర్కొంటున్నారు.
దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్సాస్ పట్టణానికి చెందిన న్యాయ విద్యార్థి గాజల్ రాంజకేశ్ పోలీసుల కాల్పుల్లో మరణించారు.
21 ఏళ్ల గాజల్ తొలిసారి ఈ వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
ఆస్పత్రి నుంచే ఈ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఆమె కుడి కన్ను నుంచి రక్తం కారుతోంది. కానీ, తాను నవ్వుతూ విక్టరీ సంకేతాన్ని చూపించారు.

ఫొటో సోర్స్, ELAHE TAVOKOLIAN
‘గొంతెత్తి అరిచే నినాదాల కంటే మా కళ్లే ఎక్కువ చెబుతున్నాయి’
ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. యువతను ఇరాన్ అధికారులు ఎలా టార్గెట్ చేశారో విదేశాల్లో నివసిస్తోన్న ప్రజలు తెలుసుకున్నారు.
ఈ వీడియోను అప్‌లోడ్ చేస్తూ.. ‘నన్ను కాలుస్తూ నువ్వెందుకు నవ్వావు?’ అని ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు తానొక్కతే కాదని గాజల్ తెలుసుకున్నారు. ఈ సంఘటన నుంచి కోలుకునేందుకు గాజల్ ఆన్‌లైన్‌లో సాయం తీసుకున్నారు.
‘‘గొంతెత్తి అరిచే నినాదాల కంటే మా కళ్లే ఎక్కువ చెబుతున్నాయి’ అంటూ గాజల్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు.
తాజాగా మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. అది ఫొటోషూట్ కోసం తీసుకున్న ఫొటోలాగా అనిపిస్తుంది. కానీ, దగ్గరగా పరిశీలిస్తే దానిలో ఉన్న రెండు అంశాలు ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ఫొటోతో పాటు గాజల్ ఒక క్యాప్షన్ కూడా జత చేశారు. ‘‘ఈ బాధ భరించలేనిది. కానీ, దీంతో కలిసి బతకడం నేర్చుకుంటున్నాను. నేను బతకాలి. ఎందుకంటే నా కథ ఇంకా అయిపోలేదు. మేమింగా గెలవలేదు. గెలుపుకు దగ్గర్లో ఉన్నాం అంతే’’ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఆమె దెబ్బతిన్న కంటి స్థానంలో కృత్రిమ కంటిని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క కంటితో తాను స్వేచ్ఛను చూడబోతున్నానని చెప్పారు.
స్వేచ్ఛ కోసం ఒక కంటిని కోల్పోయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు.

ఫొటో సోర్స్, MOHAMMAD FARZI
ఎంత మంది గాయాలు పాలయ్యారు?
ఇరాన్‌లో ఈ నిరసనల్లో పాల్గొనే వారు ఎంత మంది గాయాలు పాలయ్యారో స్పష్టమైన గణాంకాలు లేవు.
చికిత్స పొందేటప్పుడు అరెస్ట్ చేస్తారనే భయంతో చాలా మంది వైద్యసాయం కూడా తీసుకోవడం లేదు.
న్యూయార్క్ టైమ్స్ అంచనాల ప్రకారం, గతేడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో గాయాల పాలైన 500 మందికి తెహ్రాన్‌లోని మూడు ఆస్పత్రిల్లో చికిత్స అందించినట్లు తెలిసింది.
మొహమ్మద్ ఫర్జి అనే 32 ఏళ్ల యువకుడు కూడా ఎడమ కన్ను కోల్పోయారు.
‘‘నన్ను కాల్చినందుకు నేను బాధపడటం లేదు. స్వేచ్ఛ కోసం కంటిని కోల్పోయా. దానికి నేను గర్వంగా ఫీలవుతున్నా’’ అని ఫర్జి తెలిపారు.
ప్రమాదముందని తెలిసినా కూడా అతను ఆస్పత్రిలో చికిత్స పొందారు. తన వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో కంటి చికిత్స పూర్తిగా తీసుకోలేకపోయారు.
ఈ సమయంలో ఆర్థికంగా, మానసికంగా, వైద్యపరంగా అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.
చికిత్స కోసం రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, MOHAMMAD FARZI
నిరసనల్లో ఒక కన్ను కోల్పోయిన వారందరూ సమాజం కోసం నిలబడుతున్నారని డాక్టర్ మోహమ్మద్ జఫర్ అన్నారు.
వీరున్నంత కాలం ఇరాన్‌లో ఏం జరిగిందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తారని పేర్కొన్నారు.
మొహమ్మద్ ఫర్జి తనతో పాటు చూపును కోల్పోయిన వారిని కలిశారు.
900 కి.మీలు ప్రయాణించి ఎలాహిని కలుసుకున్నారు. కోసర్ ఆఫ్తేఖారిని కూడా కలిశారు.
సోషల్ మీడియాలో ఈ విషయాలను పంచుకున్నారు.
‘‘మాకు ఈ బాధ తెలుసు. మేము సాయం చేసుకోలేం. కానీ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోగలం’’ అని చెప్పారు.
ఆపరేషన్ తర్వాత ఎలహి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఫర్జికి, ఆఫ్తేఖారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
‘‘ఈ గాయాల నుంచే మేం వికసిస్తామని ఆశిస్తున్నాం’’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏంటి, ఆ డబ్బును ఏం చేస్తారు?
- ఈస్టర్: శిలువ వేయడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ...
- రంజాన్: పెరుగు, యాలకులు, పుదీనా తింటే రోజంతా దాహం వేయదా?














