యుక్రెయిన్ యుద్ధం: 'రష్యా అణ్వాయుధాలను బెలారస్‌‌లో మోహరించాం' - ధ్రువీకరించిన పుతిన్

Vladimir Putin

ఫొటో సోర్స్, Reuters

తమ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌కు చేర్చి అక్కడ సిద్ధంగా ఉంచినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.

రష్యా ప్రాదేశిక భద్రతకు కానీ, రాజ్య భద్రతకు కానీ ముప్పు కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే వాటిని ప్రయోగించనున్నట్లు పుతిన్ చెప్పారు.

కాగా, యుక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగించే సూచనలేవీ లేవని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

పుతిన్ వ్యాఖ్యల అనంతరం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, ‘‘రష్యా అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్న సూచనలేవీ కనిపించలేదు’’ అన్నారు.

రష్యాకు బెలారస్ కీలకమైన మిత్ర దేశం. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించేటప్పుడు అందుకు బెలారస్ లాంచ్ ప్యాడ్‌గా పనిచేసింది.

కాగా, న్యూక్లియర్ వార్‌హెడ్‌లను పూర్తిస్థాయిలో బెలారస్‌కు చేర్చే పని ఈ వేసవి చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ అన్నారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడిన అనంతరం ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పుతిన్.. ‘‘ఈ అణ్వాయుధ తరలింపు అనేది నియంత్రణ కోసమే కాకుండా మమ్మల్ని వ్యూహాత్మకంగా ఓడించే ఆలోచనలో ఉన్న ఎవరికైనా మేమేంటో గుర్తు చేయడానికి’’ అని చెప్పారు.

అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘‘మేం మొత్తం ప్రపంచాన్ని ఎందుకు బెదిరించాలి? నేను ఇప్పటికే చెప్పాను, రష్యా జాతీయహోదాకు, భద్రతకు తీవ్రమైన ముప్పు వచ్చే సందర్భంలో మాత్రమే అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు.

tactical nuclear weapon

ఫొటో సోర్స్, Getty Images

టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే..

టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి చిన్న అణు వార్‌హెడ్‌లు. యుద్ధరంగంలో పరిమిత దాడుల కోసం ఉపయోగించేలా ఉంటాయి ఇవి. రేడియో ధార్మిక ప్రభావం విస్తరించకుండా నిర్దిష్ట ప్రాంతంలోని శత్రు లక్ష్యాలపై దాడులు చేసేలా వీటిని రూపొందిస్తారు.

బాగా చిన్నగా ఉండే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సుమారు వెయ్యి టన్నుల బరువు ఉంటాయి. వీటిలో పెద్దవి లక్ష టన్నుల బరువు వరకు ఉంటాయి. 1945లో హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణు బాంబు బరువు 15 వేల టన్నులు.

కాగా, పుతిన్ సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఆఫ్రికా నుంచి వస్తున్న ఒక శాంతి దూతల బృందాన్ని కలవనున్నారు. యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి యత్నాల కోసం ఈ బృందం ఇప్పటికే కీయెవ్‌లో యుక్రెయిన్ నేతలను కలిసింది.

ఈ బృందం కీయెవ్‌లో ఉన్నప్పుడు కూడా ఆ నగరంపై రష్యా క్షిపణి దాడులు చేసింది.

కీయెవ్‌లో ఆఫ్రికా నేతలు

ఫొటో సోర్స్, Reuters

రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించి శాంతి చర్చలు జరపాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా పిలుపునిచ్చారు.

ఆఫ్రికా ప్రతినిధి బృందంలో ఉన్న ఆయన.. ‘యుక్రెయిన్ ప్రజలు ఎలాంటి అనుభవం ఎదుర్కొంటున్నారో వారి నుంచి వినడానికి ఇక్కడికి వచ్చాం’ అని ఆయన కీయెవ్‌లో చెప్పారు.

అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ మాట్లాడుతూ, "అంతర్జాతీయ సమాజం రష్యా విషయంలో దౌత్యపరమైన ప్రకటనలు చేయడానికి బదులు ఆ దేశం తమపై దాడి చేయడాన్ని ఖండించి ఆ దేశంతో దౌత్య సంబంధాలు స్తంభింపజేయాలి" అని అన్నారు.

యుక్రెయిన్ భూభాగాలను ఇంకా ఆక్రమిస్తున్న రష్యాతో యుక్రెయిన్ చర్చలు జరపబోదని జెలియెన్‌స్కీ చెప్పారు.

Cyril Ramaphosa

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ తాను చేస్తున్న ప్రతిదాడిలో విజయం సాధించే అవకాశమే లేదని పుతిన్ నిత్యం తాను చెప్పే మాటనే మళ్లీ చెప్తున్నారు.

యుక్రెయిన్ మిలటరీ దగ్గర సొంత ఆయుధ సామగ్రి అయిపోయిందని, పాశ్చాత్య దేశాలు సాయంగా ఇచ్చే ఆయుధ సామగ్రితో మాత్రమే యుద్ధం కొనసాగించబోతోందని పుతిన్ అన్నారు.

‘‘ఎక్కువ కాలం అలా పోరాడలేరు’ అని చెప్పిన పుతిన్.. యుక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే ఎఫ్16 యుద్ధ విమానాలు కూడా తగలబడిపోతాయని అన్నారు.

అయితే, యుక్రెయిన్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలను తోసిపుచ్చింది. తూర్పు, దక్షిణ యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యుక్రెయిన్ చెప్పింది.

తమ దేశానికి దక్షిణాన అన్ని వైపులా తమ బలగాలు 2 కిలోమీటర్ల మేర ముందుకు చొచ్చుకు వెళ్లినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ ఉప మంత్రి హన్నా మల్యార్ శుక్రవారం ప్రకటించారు. అయితే, యుద్ధ క్షేత్రం విషయంలో ఆయా దేశాలు చెప్పే విషయాలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)