జపాన్: రేప్ నిర్వచనాన్ని మార్చి, సెక్స్‌కు సమ్మతి వయసును ఎందుకు పెంచాల్సి వచ్చింది?

జపాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లైంగిక హింసకు వ్యతిరేకంగా జపాన్‌లో 2019 నుంచి ప్రారంభమైన ఫ్లవర్ డెమో కార్యక్రమం
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ న్యూస్

లైంగిక నేరాల చట్టాలలో సమూల మార్పుల తీసుకొస్తూ.. అత్యాచారాన్ని పునర్ నిర్వచించడంతో పాటు సెక్స్ సమ్మతి వయసును పెంచుతూ జపాన్ సరికొత్త చట్టాలను ఆమోదించింది.

ప్రస్తుత జపాన్ చట్టాల ప్రకారం రేప్ అంటే "బలవంతంగా లైంగిక దాడి" చేయడం. కానీ, ఇప్పుడు "సమ్మతి లేని లైంగిక సంపర్కం" అని పునర్నిర్వచించింది.

ఇతర దేశాలతో సమానంగా జపాన్ తన చట్ట నిర్వచనాన్ని మార్చింది.

అలాగే అంతకుముందు 13 ఏళ్లుగా ఉన్న సెక్స్ సమ్మతి వయసును, ప్రస్తుతం 16 ఏళ్లకు పెంచింది.

అంతకుముందు చట్టాలు, మహిళలు బలవంతంగా సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చిన వారికి అండగా నిలబడటం లేదని విమర్శలు వచ్చాయి.

అలాంటి దాడులపై రిపోర్ట్ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయని అన్నారు.

ఈ కొత్త చట్టాలను జపాన్ పార్లమెంట్ డైట్ ఎగువ సభ శుక్రవారం ఆమోదించింది.

రేప్‌ను పునర్నిర్వచించే కొత్త చట్టంలో బాధితులు "అసమ్మతిని వ్యక్తపరచడానికి ఇబ్బందిపడే " ఎనిమిది సందర్భాలను పేర్కొన్నారు.

  • మద్యం లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్నప్పుడు
  • హింస, బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు
  • భయపడడం లేదా అచేతనంగా మారిపోయి ప్రతిఘటించలేనప్పుడు
  • ఎదుటి వ్యక్తి తన "అధికారాన్ని" ఉపయోగించినప్పుడు, అంటే ఎదురుతిరిగితే నష్టం కలుగుతుందని బాధితులు భావించి మౌనంగా ఉన్న స్థితి

....ఇలాంటి ఎనిమిది సందర్భాలను ప్రస్తావించారు.

అత్యాచారం

1907లో ఈ చట్టాన్ని రూపొందించిన తర్వాత తొలిసారి సెక్స్ సమ్మతి వయసును జపాన్ మార్చింది.

అంతకుముందు సెక్స్ సమ్మతి తెలిపేందుకు అత్యంత తక్కువ వయసు కలిగి ఉన్న అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా జపాన్ ఉంది.

13 నుంచి 15 ఏళ్ల వయసులోని మైనర్ బాలికతో, ఆమె కంటే ఐదు లేదా అంతకంటే కాస్త ఎక్కువ వయసున్న వారు సెక్స్‌లో పాల్గొంటేనే వారిపై చర్యలు తీసుకోనున్నారు.

అలాగే, తమపై అత్యాచారం జరిగినట్లు బాధితులు ముందుకు వచ్చి రిపోర్టు చేసేందుకు అదనపు సమయాన్ని కల్పించింది.

అత్యాచారాన్ని రిపోర్ట్ చేసే సమయాన్ని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

లైంగిక చర్యలను రహస్యంగా చిత్రీకరించడం, అనుమతి లేకుండా మహిళల వస్త్రాలు మార్చుకోవడాన్ని, దుస్తులు విప్పడాన్ని ఫొటో తీయడం(ఫొటో వోయూరిజం)ను కూడా నిషేధించింది.

జపాన్

ఫొటో సోర్స్, NURPHOTO

ఫొటో క్యాప్షన్, 2019లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు

2019లో లైంగిక వేధింపుల కేసులలో దాడికి పాల్పడిన వ్యక్తులు నిర్దోషులుగా విడుదల కావడంతో ప్రజాగ్రహం వ్యక్తమైంది.

లైంగిక హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫ్లవర్ డెమో కార్యక్రమం పెద్ద ఎత్తున ఎగిసింది.

2019 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 11వ రోజు జపాన్‌లోని ఈ ఉద్యమ కార్యకర్తలు సమావేశమై, లైంగిక వేధింపు బాధితులకు సంఘీభావం తెలపడంతో పాటు, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టపరమైన సవరణలు ఈ సమస్యలో కేవలం కొంత వరకు మాత్రమే పరిష్కరించగలవని కొందరు కార్యకర్తలు బీబీసీకి తెలిపారు.

‘‘తరతరాలుగా సెక్స్‌ విషయంలో, దాని సమ్మతి విషయంలో ఉన్న తప్పుడు ఆలోచనల ధోరణిని తప్పనిసరిగా మార్చాలి’’ అని టోక్యోకు చెందిన హ్యుమన్ రైట్స్ నౌ వైస్ ప్రెసిడెంట్ కజుకో ఇటో అన్నారు.

రోడ్లపైకి వచ్చిన నిరసనలు వ్యక్తం చేసే లైంగిక వేధింపు బాధితులకు కూడా ఆ దేశంలో బెదిరింపులు, వారిపై ఆన్‌లైన్‌లో అసభ్యకర వ్యాఖ్యలు వస్తున్నాయి.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం చేసిన ఈ చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ, తమపై జరుగుతున్న దాడులను రిపోర్ట్ చేసే సాధికారత మహిళలకు ఉండాలని కార్యకర్తలు చెప్పారు.

జపాన్‌లో భయం, అవమానభార కారణంతో లైంగిక వేధింపుల గురించి ముందుకు వచ్చి రిపోర్ట్ చేసేందుకు బాధితులు ఇష్టపడటం లేదు.

ప్రభుత్వం జరిపిన 2021 సర్వేలో కేవలం 6 శాతం మంది మహిళలు, పురుషులు మాత్రమే ఈ వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

వేధింపులకు గురైన సగం మంది మహిళలు అవమానభారంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారని వెల్లడైంది.

సమాజంలో ఈ చట్టాన్ని మిళితం చేసేందుకు దేశవ్యాప్తంగా దీనిపై అవగాహనను కల్పించడం తప్పనిసరి ఇటో అన్నారు.

ఇలా చేస్తేనే సమాజంలో లైంగిక హింసను అరికట్టగలమని, అలాగే శిక్షార్హమైన నేర సంస్కృతికి ముగింపు పలకగలమని చెప్పారు.

లైంగిక వేధింపు బాధితులకు ఆర్థికంగా, మానసికంగా మరింత సాయం చేయాలని న్యాయవాది, హక్కుల కార్యకర్త సాకురా కామిటాని బీబీసీతో అన్నారు.

నేరాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ఇలాంటి దాడులకు పాల్పడే వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు.

జపాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షియోరి ఇటో 2019లో తనపై జరిగిన రేప్ కేసులో పోరాడి గెలిచారు

జపాన్‌లో సెక్సువల్ సమ్మతిపై పోరాటం

రేప్ అంటే "బలవంతంగా లైంగిక దాడి" చేయడం కాకుండా, "సమ్మతి లేని లైంగిక సంపర్కం" అని పునర్ నిర్వచిస్తూ చట్టాల్లో అతిపెద్ద, అత్యంత కీలకమైన మార్పులు చేసింది జపాన్.

సెక్స్‌కు సమ్మతి అవసరం అనే పాయింట్‌ను చట్టపరిధిలోకి తీసుకురావడమే దీని ఉద్దేశం. జపాన్ సమాజంలో దీనిపై అంతగా అవగాహన లేదు. సమ్మతి ఉండాలన్న పట్టింపు లేదు.

జపాన్‌లో రేప్‌కు ఉన్న సంకుచిత నిర్వచనాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు మరింత సంకుచితంగా మార్చి, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలను తగ్గించారని, బాధితులు ఫిర్యాదు చేయడానికే వెనుకాడే పరిస్థితి కల్పించారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

2014లో టోక్యోలో ఒక వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని గోడకు అణచిపెట్టి, ఆమె ప్రతిఘటిస్తున్నా ఆమెతో సెక్స్ చేశాడు. కానీ, అతడికి కోర్టులో శిక్ష పడలేదు.

అతడి చర్యలు "అడ్డుకోలేనంత కష్టమైనవి కాదని”, అందుకే అది రేప్ కాదని కోర్టు తీర్పు చెప్పింది.

జపాన్‌లో సమ్మతి వయసు 13 ఏళ్లు, ఆ బాలిక వయసు 15 ఏళ్లు కావడంతో ఆమెను యువతిగా కోర్టు పరిగణించింది.

ప్రపంచంలోని పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలతో పోల్చుకుంటే ఈ వయసు చాలా తక్కువ.

"విచారణ ప్రక్రియలు, తీర్పులు మారిపోతూ ఉంటాయి. కొందరు సమ్మతికి విరుద్ధంగా ప్రవర్తించారని తేలినప్పటికీ దాడి లేదా బెదిరింపుల కిందకు రాకపోవడం వల్ల చట్టం నుంచి తప్పించుకుంటారు" అని 'స్ప్రింగ్' సంస్థ ప్రతినిధి యూ తడోకోరో చెప్పారు.

చట్టంలో సవరణలు కేవలం ఈ సమస్యను పరిష్కరించడం ఒక భాగం మాత్రమేనని కార్యకర్తలన్నారు.

కోర్టు రూమ్‌కి వెలుపల దీనిలో మార్పులు రావాలన్నారు.

వీడియో క్యాప్షన్, లైంగిక దాడి చట్టాల్లో మార్పు చేసే యోచనలో ప్రభుత్వం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)