దక్ష: సెక్స్ సంబంధ గాయాలతో చనిపోయిన ఆడ చీతా

చీతాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో ఆడ చీతా మరణించింది. దీంతో గత మార్చి నుంచి ఈ నేషనల్ పార్క్‌లో మరణించిన చీతాల సంఖ్య మూడుకు చేరింది.

మంగళవారం ఉదయం ఆడ చీతా తీవ్రగాయాల పాలైనట్లు నేషనల్ పార్క్ అధికారులు గుర్తించారు.

పశువైద్యులు చికిత్స అందించినప్పటికీ, మధ్యాహ్నానికి అది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

రెండు మగ చీతాలతో సంభోగం సమయంలో అయిన గాయాల కారణంగా ఆ చీతా మరణించినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి.

చీతాలను భారత్‌లో తిరిగి మనుగడలోకి తెచ్చే ప్రాజెక్టులో భాగంగా ఈ మూడింటిని ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు.

మంగళవారం మరణించిన ఆడ చీతా పేరు దక్ష. అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను, దక్షను వేర్వేరు ఎన్‌క్లోజర్లలో ఉంచారు.

చీతాలు

ఫొటో సోర్స్, @NARENDRAMODI

మే 6న ఆడ చీతా వద్దకు మగ చీతాలు..

"భారత, దక్షిణాఫ్రికా వన్యప్రాణి అధికారులు, నిపుణులు ఏప్రిల్ 30న ఒక సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ దక్షను రెండు మగ చీతాలతో కలిసేలా చూడాలని నిర్ణయించారు. ఒక రోజు తరువాత వాటి ఎన్‌క్లోజర్‌ల మధ్య గేట్ తెరిచారు" అని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటన ప్రకారం మే 6న మగ చీతాలు ఆడ చీతా ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాయి.

"సంభోగం సమయంలో మగ చీతాలు ఆడ చీతాలతో మొరటుగా ప్రవర్తించడం సాధారణం. ఆ సమయంలో పర్యవేక్షక బృందం జోక్యం చేసుకోవడం అసాధ్యం" అని ఆ ప్రకటన తెలిపింది.

దేశంలో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించిన 70 సంవత్సరాల తర్వాత భారత్ చీతాలను తిరిగి తీసుకొచ్చింది.

దేశంలోకి చీతాలను తీసుకురావడం ఆసక్తి రేకెత్తించింది. వాటికి సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి.

పార్కులో నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, @NARENDRAMODI

అనారోగ్య కారణాలతో మరో రెండు..

గత నెలలో ఉదయ్ అనే మగ చీతా మరణించింది. మరణానికి కార్డియాక్ ఫెయిల్యూర్ కారణమని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన 12 చీతాలలో ఇది ఒకటి.

మార్చి 27న నమీబియా నుంచి తీసుకొచ్చిన జంతువుల మొదటి బ్యాచ్‌లోని ఒక ఆడ చీతా మూత్రపిండాల వ్యాధితో మరణించింది.

భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో (ఐదు మగ, మూడు ఆడ) అది ఒకటి. అనేక అంచనాలు, ఆసక్తి నడుమ ఈ చీతాలను భారతదేశానికి తీసుకొచ్చారు.

ఆ చీతాలను అడవిలోకి వదలడానికి ముందు కునో పార్కు వద్ద క్వారంటైన్ జోన్‌లో ఉంచారు.

వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. మార్చి 29న నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

భారతదేశంలో చీతాలకు ప్రాశస్త్యం ఉంది. అనేక జానపద కథలలో భాగంగా ఉన్నాయి.

అయితే, 1947 నుంచి వేట, తగ్గిపోతున్న నివాస ప్రాంతం, ఆహారం లేకపోవడం వల్ల అంతరించిపోయిన ఏకైక పెద్ద జంతువు చీతా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)