ఆదిపురుష్ రివ్యూ: ఇది వాల్మీకి రామాయణమా లేక ఆధునిక రామాయణమా?

ఫొటో సోర్స్, Om Raut/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఆది కావ్యం రామాయణం. అందులో ఎన్నో పాత్రలు. ఇంకెన్నో సంఘటనలు. ఓ మనిషి ఎలా బతకాలి? ధర్మం అంటే ఏమిటి? ఇచ్చిన మాట విలువ ఎంత? ఆశ ఎంతటి మహోన్నతుడినైనా ఎలా కృంగదీస్తుంది? స్వామి భక్తి అంటే ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ కావ్యం సమాధానాలిస్తుంది.
వాల్మీకి రచించిన రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వెండి తెరపైకొచ్చాయి. అయితే, ఈ తరానికి రామాయణ ఇతిహాసాన్ని పరిచయం చేయడానికన్నట్టు 'ఆదిపురుష్' తెరకెక్కింది.
ప్రభాస్ కథానాయకుడు కావడం, భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడం ప్రేక్షకులను ఆకర్షించింది.
ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అనుసరించారా? కల్పనలకు తావిచ్చారా? చూద్దాం.

ఫొటో సోర్స్, Om Raut/Facebook
సీతాపహరణం
బాలకాండ, అయోధ్యకాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ... ఇలా రామాయణాన్ని ఏడు భాగాలుగా రాశారు.
వీటిలో ఏ భాగమైనా రసవత్తరంగానే ఉంటుంది. అన్ని చోట్లా రాముడి గొప్పదనమే కనిపిస్తుంది. సినిమాగా ఎక్కడి నుంచైనా కథను తీసుకోవచ్చు.
ఓం రౌత్ అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను మాత్రమే తీసుకొన్నారు. మిగిలిన భాగాలనూ స్పృశించాడు కానీ, వాటి ప్రాధాన్యం అంతగా కనిపించదు.
రావణుడు ఘోర తపస్సు చేసి, బ్రహ్మ నుంచి వరం పొందడం దగ్గర్నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆ తరవాత శూర్పణక పరాభవం, మాయా లేడిని పంపి, సీతని రావణుడు ఎత్తుకు రావడం.. ఇవన్నీ చకచక జరిగిపోతాయి.
రావణుడిపై యుద్ధం చేయడానికి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని వధించి, వానర సైన్యంతో రావణుడిపై యుద్ధం చేసి, సీతని కలవడంతో కథ పూర్తవుతుంది.

ఫొటో సోర్స్, Om Raut/Facebook
ఈ తరానికి నచ్చేలా...
మనం ఇప్పటివరకూ రామాయణంపై చాలా సినిమాలు చూశాం. రాముడి గొప్పదనం, ఏకపత్నీవ్రతం, సీత ప్రాతివత్యం, హనుమంతుడి భక్తి, రావణుడి అహం.. ఇవన్నీ కథలో భాగాలుగా కనిపిస్తాయి.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రాబల్యం ఇంతగా పేరుకుపోయిన రోజుల్లో, ఎవెంజర్స్ లాంటి హాలీవుడ్ సినిమాలను ఇష్టపడుతున్న ఈ జనరేషన్‌కు రామాయణాన్ని ఎలా చెప్పాలో.. అలానే చెప్పే ప్రయత్నం చేశాడు ఓం రౌత్.
వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకున్నానని ముందే చెప్పేసిన దర్శకుడు, కొన్ని ఘట్టాలను సందర్భానుసారంగా డ్రమటైజ్ చేశానని కూడా చెప్పి.. ప్రేక్షకులు లాజిక్కులు అడక్కుండా, ప్రశ్నలు సంధించకుండా తగిన జాగ్రత్తలే తీసుకున్నాడు.
ఇది వాల్మీకి రామాయణమే. కాకపోతే, విస్తరించిన విజువల్ ఎఫెక్ట్స్ జోడించిన వాల్మీకి రామాయణం అని అర్థం చేసుకోవాలి.
ఓం రౌత్ ముఖ్య ఉద్దేశం.. ఈతరానికి రామాయణాన్ని పరిచయం చేయడమే అయితే, ఎవెంజర్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, కింగ్ కాంగ్ లాంటి సినిమాల ప్రభావం 'ఆదిపురుష్'పై పడటంలో తప్పు లేదు.
ఎందుకంటే రామాయణాన్ని చాలామంది చాలా రకాలుగా విజువలైజ్ చేశారు. ఇది ఓం రౌత్ విజువలైజేషన్. అందుకే కొన్ని విషయాల్లో దర్శకుడు స్వేచ్ఛ తీసుకున్నాడు.
హాలీవుడ్ దర్శకులు, సూపర్ హీరోస్ కథలతో సినిమాలు తీసి, వేల కోట్లు రాబట్టుకుంటున్నారు.
హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొస్తున్నప్పుడు, సముద్రాన్ని అవలీలగా దాటేస్తున్నప్పుడు, లంకని మంటల్లో ముంచేస్తున్నప్పుడు హనుమంతుడు కంటే సూపర్ హీరో ఎవరుంటారు అనిపిస్తుంది. అందుకే, ఓం రౌత్ కూడా ఈ కథని ఓ సూపర్ హీరో కథలానే చెప్పాలనుకొన్నాడు.
వానర సైన్యాన్ని చూపించేటప్పుడు ఆ లిబర్టీ తీసుకున్నాడు. రావణ లంకను ఓ కేజీఎఫ్ సెట్ మాదిరి డిజైన్ చేయడం విమర్శల పాలవ్వచ్చు. కానీ, లంక ఇలానే ఉంటుంది, ఇలానే ఉండాలి అని ఎవరూ చెప్పలేదు.
ఇది తన ఊహ. కాకపోతే, ఆ ఊహ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే సరిపోతుంది. ఈ విషయంలో ఓం రౌత్ మంచి మార్కులే కొట్టేశాడు.

ఫొటో సోర్స్, Om Raut/Facebook
నాణేనికి అటూ ఇటూ..
దర్శకుడు ఎమోషన్ కంటే విజువల్స్ పై దృష్టి పెట్టాడు. అది సత్ఫలితాల్ని ఇచ్చింది. కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులు గుడ్లప్పగించి చూసేలా చేశాయి.
రాముడి ఎంట్రీ సమయంలో వచ్చిన ఫైట్, కమర్షియల్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌లా సాగింది. అయితే ఆ సీన్‌లో విజువల్స్ అంతగా పండలేదు.
రాముడిపై యుద్ధం చేస్తున్న సైన్యం ఎవరిదో దర్శకుడు చెప్పలేదు. దాంతో, ఎమోషన్ వర్కవుట్ అవ్వలేదు.
రావణుడు సీతని ఎత్తుకెళ్లే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. అక్కడ విజువల్స్ బాగా పండాయి.
లంకా దహనం ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా ఉండాల్సింది. చివర్లో యుద్ధం సుదీర్ఘంగా సాగింది. అందులో కొన్ని షాట్స్ లో సీజీలు తేలిపోతాయి. మిగిలినవి ఓకే. ఓవరాల్ గా విజువల్స్ పరంగా సంతృప్తికరమైన ఫలితాలనే అందుకుంది.
సీత గీత దాటడానికి రావణుడు వేసిన పన్నాగం, ఆడిన ఎమోషనల్ డ్రామా 'ఆదిపురుష్'లో కనిపిస్తాయి. సీత గీత ఎందుకు దాటింది అన్న సందేహం ఉన్న ప్రేక్షకులకు సమాధానం దొరికినట్టయింది.
సైన్యం లేని సుగ్రీవుడితో స్నేహం చేయడం కంటే, సైన్యం ఉన్న వాలితో చేయి కలపడం నయం కదా అని లక్ష్మణుడు రాముడిని అడుగుతాడు. ప్రేక్షకుల సందేహం కూడా అదే.
కానీ అప్పుడు రాముడు చెప్పే సమాధానం చాలా సంతృప్తికరంగా ఉండడమే కాకుండా, రాముడి ఉదాత్తతను చాటుతుంది. ఇలాంటి కొన్ని వివరాలపై దర్శకుడు బాగా దృష్టిపెట్టాడు.
అయితే కొన్ని చోట్ల చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పకుండా దాటేశాడు. దాంతో, లింకులు తెగినట్టు అనిపిస్తాయి.
ఆదిపురుష్ దాదాపుగా 3 గంటల సినిమా. ఇలా సంక్షిప్తంగా చెబితేనే ఇంత లెంగ్తీ సినిమా వచ్చింది. అన్నీ విడమరచి చెబితే మరో 3 గంటల సినిమా వచ్చేదేమో. అందుకే దర్శకుడు కొన్ని విషయాల్ని పట్టించుకోలేదు.
రామాయణం అందరికీ తెలిసిన కథే కదా, వాళ్లు అర్థం చేసుకొంటారులే.. అని వదిలేశాడు.
కొందరి వేష భాషలు, రూపం, తల కట్టు, వస్త్రధారణ ఇవన్నీ కాస్త మోడ్రన్‌గా కనిపిస్తాయి.
అంత శివభక్తుడైన రావణాసురుడు నుదుటన బొట్టు లేకుండా ఎందుకుంటాడు? అనే లాజిక్కులు వస్తాయి. కాకపోతే, అవన్నీ దర్శకుడు తీసుకొన్న లిబర్టీ అని సరిపెట్టుకోవాలి.

ఫొటో సోర్స్, Om Raut/Facebook
ప్రభాస్ అదృష్టం
`రాముడి పాత్ర పోషించడం ప్రభాస్ అదృష్టం` అని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పాడు. అది అక్షరాలా నిజం. ఓ మాస్ హీరోకి సాత్వికమైన పాత్ర అప్పగించడం, దాన్ని సమర్థవంతంగా పోషించడం ప్రభాస్ అదృష్టానికీ, ప్రతిభకూ నిదర్శనం.
ప్రభాస్ తనలోని ఎమోషన్స్ చాలా దాచుకొని, కొన్ని విషయాల్ని దాటుకొని ఈ పాత్ర పోషించాడనిపిస్తుంది.
నిజానికి రాముడి పాత్ర పోషించడం అంత సులభం కాదు. చాలా రిస్క్‌ని భుజాలపై వేసుకొన్నట్టే. హావభావాల చిత్రణలో ఏమాత్రం తేడా వచ్చినా దొరికిపోతారు.
ఆ రిస్క్ ఉన్నా సరే, ప్రభాస్ ధైర్యం చేశాడు. ఈ పాత్రకు చాలా తక్కువ సంభాషణలు ఇవ్వడం దర్శకుడు చేసిన మరో తెలివైన పని.
సీతగా కృతి సనన్ మెప్పిస్తుంది. ఆంజనేయుడు పాత్రకు పర్‌ఫెక్ట్ నటుడు దొరికాడు. కాకపోతే.. 'నిన్ను ఉతికేస్తా' అంటూ ఊర మాస్ సినిమాలోని డైలాగ్‌ని హనుమంతుడుతో చెప్పించడం బాగాలేదు.
ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైప్ అలీ ఖాన్ కనిపిస్తాడు అనగానే అందరిలోనూ అపనమ్మకం మొదలైపోయింది. సైఫ్ ఆహార్యం, తన ఎత్తు ఈ పాత్రకు ఎలా సరిపోతాయి? అనిపించింది.
కానీ,. ఆ అనుమానాలను సైఫ్ పటాపంచలు చేశాడు. తొలి సీన్ నుంచే సైఫ్ విజృంభణ కనిస్తుంది. పది తలలతో రావణుడిని చూసినప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. పరాక్రమం, అహం, భక్తి, మోహం.. ఇలా అన్ని పార్శ్వాలనూ సైఫ్ సమర్థవంతంగా చూపించాడు.

ఫొటో సోర్స్, Facebook
సాంకేతిక నైపుణ్యం
ఇలాంటి చిత్రాలకు నైపథ్య సంగీతం చాలా కీలకం. ఈ విభాగంలో సాంకేతిక నిపుణుల పనితనం కనిపించింది.
జై శ్రీరామ్ వినగానే నచ్చేస్తుంది. కానీ ఆ పాటని తెరపై సరైన చోట వాడుకోలేదు అనిపిస్తుంది.
ఒక్క సెట్ కూడా నిర్మించకుండా తీసిన సినిమా ఇది. అంతా మోషన్ పిక్చర్ టెక్నాలజీ వాడి తీసిందే. ఆ నైపుణ్యం తెరపై 'ఆహా' అనిపిస్తుంది.
భవిష్యత్తులో ఇతిహాస గాథలను తీసేవాళ్లు ఇంతకంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వాటికి నాంది.. ఆదిపురుష్ అవుతుంది.
రామాయణంలోని ఎమోషన్ కంటే, విజువల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాడు దర్శకుడు. ఈతరానికి నచ్చేలా ఈ కథని డిజైన్ చేశాడు.
రామాయణాన్ని ఔపాపన పట్టి, అవగతం చేసుకున్న వాళ్లకు ఓం రౌత్ గీత దాటాడేమో అనిపిస్తుంది.
కానీ రామాయణాన్ని తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని ఆశ పడే ఓ తరానికి ఈ చిత్రం ఓ మార్గంలా కనిపిస్తుంది. వాళ్లకు ఇతిహాసాలపై ఆసక్తిని కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















