తేజస్వినీ రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?

తేజస్విని తల్లి రమాదేవీ
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మంచి భవిష్యత్తు ఉంటుంది.. మంచిగా జరుగుతుందని లండన్ పంపించాం. ఇలా అవుతుందని అనుకోలేదు. నా బిడ్డను మంచిగా పంపించమనండి. చాలా రోజులు అక్కడే అట్టి పెట్టవద్దు’’ అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు కొంతం రమాదేవి.

ఇటీవల లండన్‌లో హత్యకు గురైన కొంతం తేజస్విని రెడ్డి తల్లే రమాదేవి.

తమ బిడ్డ ఎలా చనిపోయిందో తెలియదు.. ఏం జరిగిందో సమాచారం లేదు.. చనిపోయిన కుమార్తె మృతదేహం ఎప్పుడు వస్తుందో తెలియదు..ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించక రమాదేవి కన్నీరు మున్నీరవుతున్నారు.

లండన్‌లోని వెంబ్లీ ప్రాంతంలో తెలుగమ్మాయి కొంతం తేజస్విని రెడ్డి జూన్ 13న ఉదయం హత్యకు గురయ్యారు.

వంటగదిలో ఉన్న సమయంలో ఆమెను బ్రెజిల్‌కు చెందిన 2౩ ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేసి చంపినట్లుగా పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో జనగాంకు చెందిన అఖిల అనే యువతి గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు.

హత్యకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు లండన్‌లోని బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్‌ అక్కడి పోలీసులతో మాట్లాడారు.

ఘటనపై విచారణ జరుగుతున్నట్లు లండన్ మెట్ పోలీసులు బీబీసీకి సమాచారం అందించారు. ఈ-మెయిల్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘తేజస్విని హత్య ఘటనలో కెవిన్ అంటోనియో లౌరెన్సో డి మోరైస్ అనే 23 ఏళ్ల వ్యక్తిని జూన్ 15న అరెస్టు చేశాం. అతన్ని కోర్టులో హాజరు పరిచాం.

హత్య ఘటనకు సంబంధించి జూన్ 13వ తేదీన ఉదయం 9.59 గంటలకు మాకు సమాచారం అందింది. నీల్డ్ క్రెసెంట్ రెసిడెన్షియల్ ప్రాంతంలో కత్తితో దాడి జరిగినట్లు తెలిసింది.

వెంటనే లండన్ అంబులెన్స్ సర్వీస్‌తో కలిసి వెళ్లి చూడగా తేజస్విని కొంతం, మరో 28 ఏళ్ల యువతి కత్తిపోటు గాయాలతో ఉన్నారు. వైద్యులు పరీక్షించే సరికే తేజస్విని చనిపోయారు.

మరో యువతిని ఆసుపత్రికి తరలించాం. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. దీనిపై తేజస్విని కుటుంబానికి సమాచారం అందించాం. ఘటనతో సంబంధం ఉందని అనుమానించి మరో ఇద్దర్ని అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టాం’’ అని లండన్ మెట్ పోలీసులు బీబీసీకి చెప్పారు.

ఈ హత్య ఎందుకు జరిగిందనే విషయంపై స్పష్టత రాలేదు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తేజస్విని రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తేజస్విని రెడ్డి

ఇంటి వద్ద విషాదఛాయలు

తేజస్విని రెడ్డి కుటుంబం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఉంటోంది. బీబీసీ ప్రతినిధి వారి ఇంటికి వెళ్లారు.

అక్కడ విషాద వాతావరణం ఉంది. తేజస్విని తల్లి రమాదేవి, బంధువులు తీవ్రంగా ఏడుస్తూ కనిపించారు. కుమార్తె మరణవార్తను రమాదేవి జీర్ణించుకోలేకపోతున్నారు.

పలువురు బంధువులు, చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి కుటుంబీకులను ఓదారుస్తున్నారు.

తేజస్విని రెడ్డి తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన బయల్దేరి వచ్చారు.

తేజస్విని
ఫొటో క్యాప్షన్, తేజస్విని కుటుంబ సభ్యులు

విదేశాల్లో చదువుకోవాలనే పట్టుదల..

కొంతం తేజస్విని రెడ్డి దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఉద్యోగం చేశారు.

‘‘అక్కకు ముందు నుంచి విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండేది. డిగ్రీ అయ్యాక ఏడాది బ్రేక్ వచ్చినా, మళ్లీ పట్టుదలతో చదువు కొనసాగించాలనుకుంది’’ అని తేజస్విని రెడ్డి తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

‘‘ముందు అమెరికా వెళ్లాలని అనుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా అమెరికా వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. అందుకే బ్రిటన్ వెళ్లి చదుకోవాలనుకుంది’’ అని తేజస్విని రెడ్డికి వరుసకు తమ్ముడైన విజయ్ బీబీసీతో అన్నారు.

2020 సెప్టెంబరులో తేజస్విని లండన్ వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

అక్కడ యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్ నుంచి డాటా సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఈ ఏడాది జనవరిలోనే కోర్సు పూర్తి చేసుకున్నారు.

అక్కడ ఓ ఫుడ్ కోర్టులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే చదువుకున్నారు.

అపార్ట్ మెంట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, లండన్‌లో తేజస్విని నివసిస్తున్న అపార్ట్ మెంట్

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఘటన వివరాలను లండన్ లోనే ఉంటున్న శివరామిరెడ్డి అనే బంధువు కుటుంబీలకు వివరించాడు.

‘‘వంటగదిలో ఉండగా తేజస్వినిపై బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న తేజస్విని.. తనతోపాటు గదిలో ఉంటున్న అఖిలను పిలిచింది. ఆమె అరుపులు విని అఖిల వెళ్లే సరికి తేజస్విని కింద పడిపోయిందట.

బ్రెజిల్ యువకుడిని అఖిల ప్రతిఘటించడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతోంది’’ అని శివరాంరెడ్డి సమాచారం అందించారు.

దీనిపై విజయ్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మూడు నెలల వరకు మాతోపాటు ఉంటూ చదువుకుంది. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తుండేది. కోర్సు పూర్తయ్యాక జనగాం ప్రాంతానికి చెందిన అఖిల అనే స్నేహితురాలితో కలిసి వెంబ్లీ అనే ప్రాంతానికి మారింది.

అపార్టుమెంట్లో కామన్ కిచెన్ ఉంటుంది. షేరింగ్ గదులు ఉంటాయి. అఖిల, తేజస్విని ఒక గదిలో ఉంటున్నారు. బ్రెజిల్‌కు చెందిన యువకుడు, అతని స్నేహితురాలు మరో గదిలో ఉంటున్నారు. వారు పది రోజుల కిందటే లండన్ వచ్చినట్లు తెలిసింది. వారం కిందట గదికి వచ్చారు. అతను చదువుకోవడానికి వచ్చినట్లు చెబుతున్నారు గానీ, మిగిలిన వివరాలేవీ తెలియదు’’ అని విజయ్ బీబీసీతో అన్నారు.

తేజస్విని తండ్రి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లు అమ్మి పంపించా

తేజస్విని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రికల్ పని చేస్తుంటారు. తల్లి రమాదేవి గ్రహిణి.

కొడుకు, కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని శ్రీనివాస్ రెడ్డి భావించారు.

‘‘మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్విని చదువుకుంటానంటే లండన్ పంపించా. చదువు కోసం హయత్ నగర్ వద్ద ఉన్న ఇల్లు అమ్మేశాను’’ అని తేజస్విని తండ్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

కిందటి ఏడాది వినాయకచవితి రోజున ఇండియా వచ్చి, మళ్లీ దసరా రోజున తిరిగి వెళ్లిందని చెప్పారు.

పెళ్లి సంబంధాలు చూడండి అని చెప్పి..

తేజస్విని కోర్సు జనవరిలోనే పూర్తి కాగా, మే నెలలోనే ఇండియాకు రావాల్సి ఉంది.

‘‘మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని ఇంట్లో అనుకున్నారు. అదే విషయం తేజస్వినికి చెబితే సరేనంది. తను వచ్చేలోపు పెళ్లి సంబంధం చూసి ఉంచాలనుకున్నారు. అందుకే ఒకేసారి వద్దామన్న ఉద్దేశంతో మే నెలలో రావాల్సి ఉండగా ప్రయాణం వాయిదా వేసుకుంది. త్వరలోనే రావాల్సి ఉంది. ఈలోపే దారుణం జరిగింది’’ అని తేజస్విని చిన్నాన్న రామిరెడ్డి బీబీసీకి చెప్పారు.

తేజస్విని రెడ్డి

ఫొటో సోర్స్, UGC

చివరి సారిగా అప్పుడే మాట్లాడింది..

తనకు ప్రాణహాని ఉన్నట్లు తమతో ఎప్పుడూ చెప్పలేదని తేజస్విని తల్లి రమాదేవి బీబీసీకి చెప్పారు. తమ అమ్మాయి చాలా ధైర్యవంతురాలని, ఎవరితోనూ గొడవలు పెట్టుకోదని చెప్పారు.

డబ్బుల కోసం బెదిరించారనే సంఘటనలు విన్నప్పుడు, దాని గురించి అడిగితే.. డబ్బులు ఇస్తే వదిలేస్తారు అని చెప్పేది. చివరిసారిగా తనతో మాట్లాడిన విషయాలను బీబీసీకి చెప్పారు.

‘‘మంగళవారం ఉదయం మామూలుగానే ఫోన్ చేసి మాట్లాడింది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే.. బాగున్నామని చెప్పాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి అంటే.. లండన్ లోనూ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. సరే మమ్మీ నేనే డ్యూటీకి పోతా.. అని ఫోన్ పెట్టేసింది. అవే చివరి మాటలు’’ అని రమాదేవి చెప్పారు.

‘‘మేం ఇద్దరం పిల్లలం మంచిగా ఉంటున్నాం. మంచి ‌ఏరియాలో ఉంటున్నాం’’ అని చెప్పేదన్నారు.

మృతదేహాన్ని వీలైనంత త్వరగా పంపించాలని రమాదేవి బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరోవైపు తేజస్విని మృతదేహం తరలించడంతోపాటు కుటుంబాన్ని ఆదుకునేందుకు లండన్‌లోని ఆమె బంధువులు, స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు.

తేజస్విని మృతదేహం తరలింపునకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడతామని చెప్పినట్లు కుటుంబీకులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, తేజస్వినీ రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు మాట్లాడినప్పుడు తల్లితో ఏం చెప్పింది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)