ఆమె అఫ్గానిస్తాన్‌లో సక్సెస్‌ఫుల్ లేడీ పోలీసాఫీసర్, ఇరాన్ క్రిమినల్ గ్యాంగ్‌లకు ఎలా చిక్కారు?

ఫొటో సోర్స్, AFP
తాలిబన్ పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోతున్న అఫ్గాన్ పౌరులు క్రిమినల్ గ్యాంగ్‌లకి చిక్కి నరకం అనుభవిస్తున్నట్లు బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.
ఇరాన్ - తుర్కియే బోర్డర్‌లో పొంచి ఉన్న క్రిమినల్ గ్యాంగ్‌లు ఆశ్రయం కోసం యూరప్ పారిపోతున్న అఫ్గాన్లను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. వారిని బందీలుగా చూపిస్తూ వారి కుటుంబాలను డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి.
మెడకు తాళాలు వేసి, సంకెళ్లతో బంధీలుగా ఉన్న అఫ్గాన్ వాసులు తమను వదిలేయాలని వేడుకుంటున్నట్లు వీడియోలు బయటికొచ్చాయి.
''మమ్మల్ని నిన్న కిడ్నాప్ చేశారు. వదిలేసేందుకు ఒక్కొక్కరికి 4 వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా కొడుతూనే ఉన్నారు'' అని ఒకరు చెప్పారు. ఆయన ముఖంపై మట్టి, పెదవి నుంచి రక్తం కారుతోంది.
పురుషులు నగ్నంగా ఉన్నట్లు మరో వీడియోలో కనిపించింది. మంచులో నెమ్మదిగా పాకుతుండగా వెనక నుంచి ఎవరో కొరడాతో కొడుతున్నట్లుగా అందులో ఉంది.
''నాకు కుటుంబం ఉంది. భార్యాబిడ్డలున్నారు. కొంచెం దయచూపించండి.'' అంటూ ఒకాయన వేడుకున్నారు. అయినా, ఆ క్రిమినల్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తికి కత్తి చూపిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారు.
యూరప్‌కి వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గాన్ వాసులపై క్రిమినల్ గ్యాంగుల అకృత్యాలకు ఈ వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అఫ్గాన్ నుంచి యూరప్ దేశాలకు వెళ్లాలంటే ఇరాన్, తుర్కియే బోర్డర్‌లను దాటి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే మార్గంలో చాలా మంది యూరప్ దేశాలకు వలస వెళ్లేవారు. నేను కూడా 12 ఏళ్ల కిందట ఇదే మార్గంలో ఇరాన్ నుంచి యూకే చేరుకున్నాను. నాకు ఇక్కడ ఆశ్రయం దొరికింది. కానీ, ఇప్పుడు ఆ దారి చాలా ప్రమాదకరంగా మారింది.
భద్రతా దళాలకు దొరక్కుండా ఇరాన్ మీదుగా తుర్కియే చేరుకునేందుకు కొండ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో కనీసం చెట్టు నీడ కూడా దొరకదు.
2021లో తాలిబన్లు అధికారం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వేల మంది అఫ్గాన్లు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడం క్రిమినల్ గ్యాంగులకు అవకాశంగా మారింది.
ఇరాన్‌లోని ఈ క్రిమినల్ గ్యాంగ్‌లు స్మగ్లర్లతో కలిసి తుర్కియే వైపు వెళ్తున్న అఫ్గాన్లను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. సురక్షితంగా వెళ్లేందుకు వాళ్లు ముందే డబ్బులు చెల్లించినప్పటికీ ఈ గ్యాంగులు వదలడం లేదు. బాధితులను హింసించి దోపిడీ చేస్తున్నాయి.

'బిడ్డను కోల్పోయాను'
ఇరాన్ తుర్కియే బోర్డర్ సమీపంలో సుమారు 10 ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు బీబీసీ బృందానికి తెలిసింది. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, రోజుకి అలాంటివి రెండు, మూడు వీడియోలు వస్తున్నాయని గత మూడేళ్లుగా ఈ దారుణాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న యాక్టివిస్ట్ ఒకరు బీబీసీకి చెప్పారు.
తుర్కియే వాణిజ్య రాజధాని ఇస్తాంబుల్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో మేము అమీనాని కలిశాం.
ఆమె అఫ్గానిస్తాన్‌లో ఒక సక్సెస్‌ఫుల్ పోలీసాఫీసర్. తాలిబన్లు అధికారం చేజిక్కించుకుంటున్నారని తెలియడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అంతకు ముందు ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి.
ఇరాన్ బోర్డర్ దాటే సమయంలో ఆమెను, ఆమె కుటుంబాన్ని ఓ గ్యాంగ్ బంధించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను అమీనా వివరించారు.
''నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే అప్పుడు గర్భంతో ఉన్నాను. వైద్యసాయం అందే అవకాశం లేదు. ఇక్కడ అనేక అత్యాచార ఘటనల గురించి విన్నాను''
అమీనా, ఇతర కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ గ్యాంగ్ ఒక వీడియో పంపించారని ఆమె తండ్రి హాజీ చెప్పారు. ఒక అఫ్గాన్ వ్యక్తిని చిత్రహింసలు పెడుతున్న వీడియోను తనకు పంపినట్లు ఆయన బీబీసీకి చెప్పారు.
''అదీ నా పరిస్థితి. డబ్బులు ఇవ్వకపోతే నా కూతుళ్లు, అల్లుడిని చంపేస్తామన్నారు. అఫ్గాన్లను చిత్రహింసలు పెడుతున్న వీడియోలు పంపించి నన్ను బెదిరించారు.'' ఆయన చెప్పారు.
కిడ్నాపర్లు అడిగిన డబ్బులు చెల్లించేందుకు అఫ్గానిస్తాన్‌లోని తన ఇంటిని హాజి అమ్మేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తుర్కియే చేరుకున్నారు.
కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఎనిమిది రోజులు అమీనా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆమె తన బిడ్డను కోల్పోయారు.
ఆ దారిలో ఈ క్రిమినల్ గ్యాంగ్స్ కాకుండా చాలా మంది ఎదుర్కొనే మరో అడ్డంకి ఇరుదేశాల మధ్య ఉన్న గోడ.
తుర్కియే, ఇరాన్ సరిహద్దుల మధ్య మూడు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గోడపై ఇనుప కంచె, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, వాచ్‌టవర్లు నిఘా ఏర్పాటు చేసి ఉంటుంది.
బోర్డర్ దాటి దేశంలోకి వస్తున్న వసలదారులను అడ్డుకునేందుకు తుర్కియే 2017లో ఈ గోడ నిర్మాణం చేపట్టింది. అయినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

'ఫోన్‌లో అరుపులు వినిపించాయి'
తుర్కియే అధికారులు రాత్రివేళలో తమను వెనక్కి పంపడంతో ఇరాన్ వైపు భూభాగంలో ఉన్న క్రిమినల్ గ్యాంగుల చేతికి చిక్కినట్లు అమీనా, ఇంకా మరికొంతమంది చెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వద్ద కూడా ఈ ఆరోపణలు నమోదయ్యాయి.
ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధమని, ఇది దోపిడీ ముఠాలకు సాయం చేసినట్టేనని మానవ హక్కుల కోసం పోరాడుతున్న తుర్కియేకు చెందిన న్యాయవాది మహముత్ కగన్ చెప్పారు.
ఇలా నిబంధనలు ఉల్లంఘించి వారిని వెనక్కి పంపేయడంతో క్రిమినల్ గ్యాంగ్‌లు ఎలాంటి దారుణాలకైనా వెనకాడని పరిస్థితి తయారవుతుందని ఆయన అన్నారు.
ఈ గోడ నిర్మాణానికి ముందు ఇరుదేశాల సరిహద్దుల వద్ద కొందరు స్మగ్లింగ్‌కు పాల్పడేవారు. గోడ నిర్మాణంతో స్మగ్లింగ్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వారిలో కొందరు వలసదారులను అక్రమంగా బోర్డర్ దాటించడం, లేదా వారిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు.
వలసదారుల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిన తుర్కియేలోని వాన్ నగరంలో అప్గాన్‌కు చెందిన అహ్మద్‌ను కలిశాం. వాన్ నగరం ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. అక్కడి స్మగ్లర్లతో తన అనుభవాలను ఆయన వివరించారు.
పోయిన సంవత్సరం అహ్మద్ సోదరుడిని ఇరాన్ సరిహద్దులో క్రిమినల్ గ్యాంగ్‌లు కిడ్నాప్ చేశాయి. ఆయన సోదరుడిని వదిలేందుకు డబ్బులు ఇవ్వాలని ఓ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అహ్మద్ అప్పడు అప్గాన్‌లోనే ఉన్నారు.
''నేను డబ్బులు లేవని చెప్పడంతో అతను నా సోదరుడిని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు నాకు ఫోన్‌లో వినిపించాయి.'' అని అహ్మద్ చెప్పారు.
కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించేందుకు అహ్మద్ తన కుటుంబ ఆస్తులను అమ్మేశారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఆరు నెలల తర్వాత అహ్మద్ కూడా అదే ప్రయాణం చేశారు.
అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో సయ్యద్‌ను బీబీసీ కలిసింది. అఫ్టాన్ నుంచి తుర్కియే వెళ్లేందుకు ఆయన ఆరుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
తుర్కియేలో ప్రవేశించేందుకు నకిలీ పత్రాలు సిద్ధం చేస్తామని చెప్పి, అక్కడి గ్యాంగ్‌లకు తనను అమ్మేశారని ఆయన చెప్పారు. వాళ్లు చిత్రహింసలకు గురిచేశారని, 10 వేల డాలర్లు (సుమారు 8.2 లక్షల రూపాయలు) డిమాండ్ చేశారని సయ్యద్ తెలిపారు.
''చాలా భయమేసింది. వాళ్లు నన్నేమైనా చేయగలరు. కళ్లు పీకేయగలరు. నా కిడ్నీలు అమ్ముకోగలరు, నా గుండెను బయటికి తీయగలరు'' అని ఆయన అన్నారు.
తనపై అత్యాచారం చేసి, ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాలని వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని, అలాంటి వీడియోలు వస్తే పరువు పోతుందని భయపడ్డానని సయ్యద్ చెప్పారు.
ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్‌ల ఆగడాలను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇరాన్ ప్రభుత్వాన్ని సంప్రదించాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అఫ్గాన్ నుంచి తుర్కియే చేరిన అమీనా వంటి వారు భవిష్యత్తుపై ఆశావాద దృక్పథంతో ఉన్నారు.
''నేను ఆశ కోల్పోను. మళ్లీ తల్లి అవుతానని నాకు నమ్మకముంది. ఇలాంటి సమయంలో నేను దృఢంగా ఉండాలి'' అని అమీనా అన్నారు.
(గోప్యత దృష్ట్యా వారి పేర్లు మార్చాం)
ఇవి కూడా చదవండి:
- అమెరికా జైలు నుంచి విడుదలైన ‘క్వీన్ ఆఫ్ క్యూబా’ - ఎవరీ గూఢచారి? అమెరికాకు ఎలా నష్టం చేశారు
- కొలంబియా అమెజాన్ అడవులు: 'విమానం కూలిపోతుంటే, అమ్మే మమ్మల్ని పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంది'
- అఫ్గానిస్తాన్: 'సూపర్ కార్' తయారుచేసిన అఫ్గాన్ టెకీ, తాలిబాన్ పాలనలో ఇదెలా సాధ్యమైంది?
- అరికొంబన్: బియ్యమంటే పడి చచ్చే ఒక ఏనుగు కన్నీటి కథ
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా?










