జోసెలిన్ చియా: ఈ స్టాండప్ కమెడియన్‌‌ కోసం ఇంటర్ పోల్ ఎందుకు వెతుకుతోంది?

జోసెలిన్ చియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మలేసియాకు చెందిన ఎంహెచ్ 370 విమానం అదృశ్యం పై ఒక అమెరికా స్టాండప్ కమెడియన్ చేసిన జోక్ వివాదం సృష్టిస్తోంది.

అంతేకాకుండా సదరు కమెడియన్ ను గుర్తించాలంటూ ఇంటర్ పోల్‌‌ను మలేసియా ప్రభుత్వం కోరనున్నట్లు తెలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా, ఫ్లైట్ మిస్సింగ్ గురించి వేసిన జోక్‌పై మలేసియా అధికారుల ప్రతిస్పందన అతిగా ఉందని ఆ కమెడియన్ జోసెలిన్ చియా అంటున్నారు.

"బాధితులను, విషాదాన్ని ఎగతాళి చేయడం లేదు, కానీ విషాదంలో హాస్యాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నా'' అని జోసెలిన్ చియా బీబీసీతో తెలిపారు.

ఆన్‌లైన్ కంటెంట్‌పై దర్యాప్తు చేస్తున్నందున, చియాను గుర్తించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కోరనున్నట్లు మలేసియా పోలీసులు చెప్పారు.

అయితే, ఇంటర్‌పోల్‌ జోక్యం హాస్యాస్పదమని సింగపూర్‌లో పెరిగిన చియా అంటున్నారు.

మరోవైపు మలేసియా పోలీసుల అభ్యర్థనపై చర్యలుంటాయా? అని బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఇంటర్‌పోల్ స్పందించలేదు.

2014లో అదృశ్యమైన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ప్రస్తావిస్తూ మలేసియా జెట్‌లు "ఎగరలేవు" అని చియా చమత్కరించారు.

'ఎంహెచ్ 370 విమానం అదృశ్యం' మలేసియాలో చాలా సున్నితమైన అంశం.

"నేను ఇలా వందల సార్లు చేశా. సింగపూర్‌లోనూ చేశాను. ఇది ప్రతిసారి ప్రేక్షకులను అలరించేది. అలాంటి జోక్‌లు వర్కవుట్ కాకపోతే మళ్లీ మళ్లీ ఉపయోగించను ” అని చియా చెప్పారు.

పరిహాసమాడటం, సరదాగా మాట్లాడటం న్యూయార్క్‌లోని కామెడీ క్లబ్ కల్చర్‌లో భాగమని, ఇప్పుడు అక్కడే ఉన్నానని చియా అన్నారు.

గతంలో సెప్టెంబర్ 11 దాడులను అమెరికా కామిక్స్ తమ జోక్‌లకు వాడుకున్నాయని ఆమె గుర్తుచేస్తున్నారు.

"అమెరికన్లు హద్దులు దాటిన హాస్యాన్ని కూడా మెచ్చుకోగలరు. అదే ఆసియాలో స్టాండప్ కామెడీ ప్రారంభ రోజుల్లో ఉన్న మాదిరే ఉంది. మీరు ఆసియాలో ఇలాంటి కామెడీని చూడలేరు" అని చియా అంటున్నారు.

విమానం

ఫొటో సోర్స్, Getty Images

వీడియోపై సింగపూర్ స్పందనేంటి?

2014 మార్చిలో బోయింగ్ 777కి చెందిన ఫ్లైట్ ఎంహెచ్370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తుండగా అదృశ్యమైంది.

హిందూ మహాసముద్రంలో నాలుగేళ్ల పాటు జరిపిన శోధనలో కొన్ని శిథిలాలు లభించాయి. కానీ, విమానం పూర్తి భాగం కనిపించలేదు. ఆ విమానంలో ఉన్న 239 మంది చనిపోయారని భావిస్తున్నారు.

సింగపూర్, మలేసియా మధ్య దీర్ఘకాలంగా వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఎంహెచ్370 గురించి చియా ప్రస్తావించారు. 1965లో విడిపోయే వరకు ఈ రెండు ఒకే దేశంలో భాగంగా ఉన్నాయి.

"మలేసియన్ ఎయిర్‌లైన్స్ మిస్ కావడం ఫన్నీ కాదు కదా? కొన్ని జోకులు ల్యాండ్ అవ్వవు. ఈ జోక్ సింగపూర్‌లో హత్యకు గురవుతుంది" అని ఏప్రిల్ 7న మాన్‌హట్టన్ కామెడీ సెల్లార్‌లో జరిగిన ప్రదర్శనలో చియా వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించిన 90 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో మలేసియాలో దుమారం రేపింది. ద్వేషపూరిత ప్రసంగ మార్గదర్శకాలను ఉల్లంఘించిందంటూ టిక్‌టాక్ ఈ వీడియోను తొలగించింది.

చియా జోక్ "భయంకరమైనది" అని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అన్నారు.

విమాన శకలం

ఫొటో సోర్స్, Reuters

ప్రేక్షకులు ఏమంటున్నారు?

చియా జోక్‌పై తోటి హాస్యనటులు, కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు ఆమెను విమర్శించారు. మరికొందరు ఆమె వ్యాఖ్యలు వ్యంగ్యంగా, ఆమోదయోగ్యంగానే ఉన్నాయని మద్దతు తెలిపారు.

పారిపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడం, వారు నేరానికి పాల్పడిన దేశానికి తిరిగి అప్పగించడం ఇంటర్‌పోల్ ప్రధాన విధి.

"ఈ అభ్యర్థనను స్వీకరించిన ఇంటర్‌పోల్ అధికారి ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఈ అభ్యర్థన గురించి ఇంటర్‌పోల్ ఏదైనా చేసి, విషయం పెద్దదైతే, అది నన్ను ఎంతగా పాపులర్ చేస్తుందో ఊహించగలరా?" అని చియా అంటున్నారు.

2022 జూలైలో జాతి, మతపరమైన సున్నితత్వాన్ని స్పృశించే వీడియోలను పోస్ట్ చేసినందుకు హాస్యనటుడు రిజల్ వాన్ గీజెల్‌ను మలేసియా అరెస్టు చేసింది.

గత నెలలో చైనా స్టాండప్ కామిక్ లీ హవోషిని అక్కడి ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నారు. లీ కామెడీ గ్రూప్ 'చైనా సైన్యం'పై జోక్ చేసి అవమానించిందని జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)