సాక్షి మలిక్: 'ప్రధాని మోదీ మౌనం మమ్మల్ని బాధిస్తోంది'

వీడియో క్యాప్షన్, సాక్షి మలిక్: 'ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి'
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి, రోహ్‌తక్

‘‘మేం పతకాలు గెలుచుకున్నప్పుడు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించి, అభినందించారు. కానీ, ఈ విషయంపై ఆయన మౌనంగా ఉండటం మాత్రం మమ్మల్ని బాధిస్తోంది’’

రోహ్‌తక్‌లోని తన రెజ్లింగ్ ప్రాక్టీస్ సెంటర్‌ ‘అఖారా’ ఆవరణలో నేను సాక్షి మలిక్‌ను కలుసుకున్నప్పుడు, నా అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు.

ఐదు నెలల నిరసనల ఉద్యమం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అని సాక్షి మలిక్‌ను అడిగినప్పుడు, ‘‘ఎంతో సున్నితమైన ఈ విషయం గురించి ఆయన మాతో ఏమీ మాట్లాడలేదు. మేం ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని, ఆయనతో కలిసి భోజనం చేశాం. ఆయన మమ్మల్ని ‘బేటీ’ అని సంభోదించారు. మా సమస్యలపై దృష్టి పెట్టాలని నేను ప్రధానిని కోరుతున్నాను.’’ అని అన్నారు.

‘‘ప్రధానమంత్రి తప్పనిసరిగా దీనిలో జోక్యం చేసుకోవాలి. పోలీసుల విచారణ పూర్తిగా నిష్పాక్షపాతంగా జరగాలని చెప్పాలి. విచారణ ఎట్టి పరిస్థితుల్లో పక్కదోవ పట్టకూడదని ఆదేశించాలి. ఏదైతే విచారణ జరుగుతుందో, అది పారదర్శకంగా జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని సాక్షి మలిక్ చెప్పారు.

ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ విషయంపై ప్రధానమంత్రి మౌనంగా ఉండటం మిమ్మల్ని బాధిస్తోందా? లేదా అది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? అని సాక్షి మలిక్‌ను అడిగినప్పుడు, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆందోళన కాస్త తగ్గి, ఆయన మౌనం మమ్మల్ని బాధిస్తోందని సమాధానమిచ్చారు.

‘‘మేం 40 రోజులు రోడ్డుపైనే ఉన్నాం. గతంలో నిరసనలు తెలిపినప్పుడు కూడా ఏమీ స్పందించలేదు. మేము నిరసన తెలుపుతున్నామని తెలిసినా ఆయన స్పందించలేదు. కాబట్టి, అది మమ్మల్ని చాలా బాధించింది. మా పట్ల ఎంతో ఆప్యాయత చూపించి, ప్రశంసించి, తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించిన వ్యక్తి ఈ సమస్య గురించి మాట్లాడట్లేదు’’ అని మలిక్ చెప్పారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తూ గత ఐదు నెలల క్రితమే రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియాలు తమ నిరసనలు ప్రారంభించారు.

రెజ్లర్లు చేస్తోన్న ఈ లైంగిక వేధింపు ఆరోపణలను చాలా సార్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు తాను ఆగుతానని చెప్పారు.

క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌

ఫొటో సోర్స్, ANI

ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది?

రెజ్లర్లు జనవరిలో దిల్లీలో నిరసనకు కూర్చున్న తర్వాత, కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈ ఆరోపణలను విచారించేందుకు ‘పర్యవేక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అలాగే, ఫెడరేషన్ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పజెప్పారు.

పర్యవేక్షణ కమిటీ విచారణ పూర్తయిన తర్వాత కూడా ఈ కమిటీ ఏం చెప్పిందో ప్రజల ముందుకు రాలేదు.

కానీ, ఫెడరేషన్‌ను నిర్వహించే బాధ్యతను ఇద్దరు సభ్యుల ‘అడ్ హాక్ కమిటీ’కి అప్పజెప్పారు.

లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తోన్న సాక్షి మలిక్‌తో సహా మిగిలిన మహిళా రెజ్లర్లందరూ కూడా ‘పర్యవేక్షణ కమిటీ’ నిర్వహించిన విచారణ తీరుపై పలు అనుమానాలను, సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కానీ, కనీసం ఈ సమయంలో కూడా ప్రధానమంత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, హోం మంత్రి, క్రీడా శాఖ మంత్రి మాత్రం రెజ్లర్లను కలిశారు.

‘‘బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వస్తోన్న ఆరోపణల విచారణను పూర్తి చేయడం గురించి మేం చర్చించాం. జూన్ 15 వరకు ఛార్జ్ షీటు దాఖలు చేస్తాం. రెజ్లింగ్ ఫెడరేషన్‌కి జూన్ 30 నాటికల్లా ఎన్నికలు నిర్వహిస్తాం.

ఈ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి చెందిన కుటుంబ సభ్యులు పోటీ చేయకుండా చూస్తాం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయనున్నాం’’ అని రెజ్లర్లతో జరిగిన సమావేశం అనంతరం క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

ఈ సమావేశం తర్వాత రెజ్లర్లు తమ నిరసనలను జూన్ 15 వరకు వాయిదా వేసేందుకు అంగీకరించారు.

దీని అర్థం తమ నిరసనలు ముగిసినట్లు కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షి మలిక్ చెప్పారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్ట్‌పై ప్రభుత్వం నుంచి రెజ్లర్లకు ఎలాంటి హామీ రాలేదు.

‘‘జూన్ 15 కల్లా ఛార్జ్‌ షీటు దాఖలు చేస్తామని క్రీడా శాఖ మంత్రి మాకు చెప్పారు. ఈ ఛార్జ్‌ షీటు ఎంత బలంగా ఉంటే, దాన్ని బట్టి ఆయనపై తీసుకునే చర్యలు ఉంటాయన్నారు’’ అని సాక్షి మలిక్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్

మైనర్ బాలిక స్టేట్‌మెంట్‌లో మార్పు, అరెస్ట్‌కు డిమాండ్

ఛార్జ్‌షీటు దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పిన డెడ్‌లైన్ జూన్ 15కు కొన్ని రోజుల ముందు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన పార్లమెంటరీ నియోజక వర్గం కైసర్‌గంజ్‌లోని గోందా జిల్లాలో ర్యాలీ నిర్వహించారు.

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన తనపై వస్తోన్న లైంగిక వేధింపు ఆరోపణల గురించి మాట్లాడలేదు.

కానీ, తన ప్రసంగంలో ఉర్దూ కవిత్వంలోని ఒక పద్యాన్ని కోట్ చేస్తూ తనను తాను సమర్థించుకున్నారు.

‘‘నా ప్రేమకు ఇది దొరికింది, నన్ను ద్రోహిగా పిలుస్తున్నారు. దీన్ని అగౌరవంగా తీసుకోవాలా? లేదా కీర్తిగా భావించాలా? అనేది ఆశ్చర్యంగా ఉంది’’ అని ఈ ప్రసంగంలో చెప్పారు.

ఇదే సమయంలో, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా పోక్సో చట్టంలో ‘తీవ్రమైన లైంగిక వేధింపు’ సెక్షన్ల కింద పోలీసు కంప్లైంట్‌ ఇచ్చిన మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను సవరించినట్లు రిపోర్ట్‌లు వచ్చాయి.

మైనర్ బాలికతో తాను కాంటాక్ట్‌లో లేనని సాక్షి మలిక్ చెప్పారు. ఒత్తిడితో ఆమె ఈ కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటారని అన్నారు.

‘‘ఒకవేళ పోక్సో వర్తించకపోతే, ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన చాలా ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవచ్చు. నైతిక విలువల ఆధారంగా విచారణ చేస్తే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కచ్చితంగా అరెస్ట్ అవుతారు. కానీ, ప్రతి ఒక్కరిటీ చట్టం ఒకే విధంగా వర్తిస్తుందని నేను అనుకోవడం లేదు’’ అని సాక్షి మలిక్ చెప్పారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఫొటో సోర్స్, BRIJ BHUSHAN SHARAN SINGH/FACEBOOK

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో లైంగిక వేధింపులు

రెజ్లింగ్ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్‌కి 12 ఏళ్లుగా అధ్యక్షుడిగా చేస్తుండటంతో, ఈ ఫెడరేషన్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించే వారిని దిల్లీ పోలీసుల వద్ద నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్‌లలో రెజ్లర్లు పేర్కొన్నారు.

సెక్సువల్ అడ్వాన్స్‌లను తాము తిరస్కరిస్తే, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియలను లేదా నిబంధనలను దుర్వినియోగం చేస్తూ తమల్ని అన్యాయంగా వేధించే వారని రెజ్లర్లు ఫిర్యాదు చేశారు.

తమ కెరీర్ ప్రారంభంలోనే ఈ లైంగిక వేధింపు సంఘటనలు చోటు చేసుకునేవని, అందుకే తాము ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయామని చాలా మంది ఫిర్యాదుదారులు చెప్పారు.

లైంగిక వేధింపు ఘటనలు జరిగిన తర్వాత కూడా వెంటనే తాము ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఇదేనని రెజ్లర్లు చెప్పారు.

గత ఏడాది జరిగిన వరల్డ్ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ విషయం వెలుగులోకి రావడంతో, తాము 2023 జనవరిలో తమ స్వరాన్ని గట్టిగా వినిపించడం ప్రారంభించామని సాక్షి మలిక్ తెలిపారు.

‘‘2022లో జరిగిన వరల్డ్ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ సమయంలో కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఒకరు లేదా ఇద్దరు మహిళా రెజ్లర్లు మాకు చెప్పారు. దీంతో మేమందరం కూర్చుని, దీనిపై ఏదైనా చేయాలని అనుకున్నాం’’ అని సాక్షి మలిక్ బీబీసీతో చెప్పారు.

అప్పుడు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియా కూడా హోం మంత్రిని కలిశారని సాక్షి మలిక్ చెప్పారు. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, తాము జంతర్ మంతర్ వద్ద నిరసనలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు.

‘‘నేరుగా మేం నిరసనలు ప్రారంభించాలని అనుకోలేదు. చర్చల ద్వారా తొలుత మేం ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాం. కానీ, చివరికి ఎఫ్ఐఆర్ దాకా వెళ్లాల్సి వచ్చింది’’ అని సాక్షి మలిక్ చెప్పారు.

అప్పటి నుంచి తాము ముగ్గురం కాంటాక్ట్‌లో ఉంటున్నామని, దీనిపై తదుపరి ఏం చేయాలో కలిసి నిర్ణయిస్తున్నామన్నారు.

మే 28న జరిగిన నిరసనలలో రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వారిపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు.

ప్రభుత్వంతో జరిగిన చర్చలో ఈ ఎఫ్ఐఆర్‌లను విత్‌డ్రా చేయాలన్నది కూడా ఒకటని రిపోర్ట్‌లు వచ్చాయి.

అయితే, ఆ ఎఫ్ఐఆర్‌లను విత్‌డ్రా చేస్తున్నట్లు తమకెలాంటి సమాచారం లేదని సాక్షి మలిక్ చెప్పారు.

ప్రస్తుతం రెజ్లర్లు తమ తదుపరి వ్యూహం కోసం జూన్ 15 వరకు వేచిచూడనున్నారు.

రెజ్లర్ల నిరసన

ఫొటో సోర్స్, ANI

రెజ్లర్ల నిరసనలపై ఇప్పటి వరకు ఏం జరిగింది?

  • తొలిసారి ఈ ఏడాది జనవరి 18న రెజ్లర్లు లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు.
  • ప్రముఖ భారతీయ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ వేధింపు ఘటనలపై తమ స్వరాన్ని గట్టిగా వినిపించారు.
  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
  • మహిళా రెజ్లర్ల నేషనల్ క్యాంపులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ చెబుతూ వినేశ్ ఫోగాట్ కన్నీరు పెట్టుకున్నారు.
  • ఏ అథ్లెట్ కూడా లైంగిక వేధింపులకు గురి కాలేదని, ఒకవేళ రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరిశిక్షకు కూడా సిద్ధమని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు.
  • రెజ్లర్లను కలిసిన క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, జనవరి 23న ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఏప్రిల్ 21న దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఫిర్యాదు దాఖలు చేశారు. కానీ, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.
  • ఏప్రిల్ 23న రెండోసారి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు.
  • ఏప్రిల్ 25న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ వినేశ్ ఫోగాట్, ఇతర మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
  • బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు దిల్లీ పోలీసులు దాఖలు చేశారు. దానిలో ఒకటి పోక్సో చట్టం.
  • బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన లైంగిక వేధింపుల ప్రకటనను మైనర్ మహిళా రెజ్లర్ తండ్రి మార్చారు.
  • ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షాను ముగ్గురు మహిళా రెజ్లర్లు కలిశారు.
  • క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో సమావేశం నిర్వహించారు.
వీడియో క్యాప్షన్, బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సాక్షి మల్లిక్

ఇవి కూడా చదవండి: