రెజ్లర్లకు, ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరిందా, చర్చల్లో ఏం నిర్ణయించారు?

క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్లు చర్చలు జరిపారు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వెధింపులకు పాల్పడ్డారని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, జూన్ 7, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ రెజ్లర్లతో సమావేశమయ్యారు. వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.

అనంతరం, అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కేసుపై దర్యాప్తు జూన్ 15 నాటికి పూర్తవుతుందని తెలిపారు.

"దర్యాప్తు పూర్తయిన తరువాత చార్జిషీట్ దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించాం. మేం ఇది చేస్తాం" అని ఆయన చెప్పారు.

భారత రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

రెజ్లర్లను చర్చకు ఆహ్వానించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించింది. బుధవారం రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రైతు నాయకుడు రాకేశ్ టికైత్ చర్చల కోసం క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు.

సుమారు ఆరు గంటల పాటు ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి.అనంతరం, సమావేశం సానుకూలంగా సాగిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

"జూన్ 15లోగా చార్జిషీటు దాఖలు చేయాలని ఆటగాళ్లు కోరారు. అప్పటి వరకు తాము ఎలాంటి నిరసన ప్రదర్శనలూ చేయమని చెప్పారు. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకున్నాం. ఓపెన్ మైండ్‌తో అన్ని విషయాలపై సీరియస్‌గా చర్చించాం" అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిరసనల్లో బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్, సంగీత ఫోగాట్

రెజ్లర్ల డిమాండ్లు ఏంటి?

క్రీడా మంత్రితో సమావేశంలో రెజ్లర్లు చేసిన డిమాండ్లు ఇవీ..

  • జూన్ 15లోగా బ్రిజ్ భూషణ్‌పై విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి.
  • భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జూన్ 30 లోగా పూర్తి కావాలి.
  • ఇంటర్నల్ కంప్లైంట్ (అంతర్గత ఫిర్యాదు) కమిటీని రెజ్లింగ్ సమాఖ్య ఏర్పాటుచేయాలి.
  • ఆ కమిటీకి ఒక మహిళ నేతృత్వం వహించాలి.
  • సమాఖ్య ఎన్నికలు జరిగే వరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీలో ఇద్దరు కోచ్‌లను నియమించాలి.
  • ఎన్నికల అనంతరం రెజ్లింగ్ సమాఖ్య సక్రమంగా నడవాలంటే క్రీడాకారుల అభిప్రాయాలు పరిగణించాలి.
  • బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లేదా ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎన్నిక కాకూడదు.
  • మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించాలి. అఖాడాలు, కోచ్‌లు, ఆటగాళ్లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి.

రెజ్లర్ల ఆరోపణల ఆధారంగా దిల్లీ పోలీసులు ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తిరస్కరిస్తూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)