NIRF ర్యాంకింగ్స్: తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలు ఎందుకు పడిపోతున్నాయి?

ఫొటో సోర్స్, OsmaniaUniversity
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దాదాపు 106 ఏళ్ల చరిత్ర ఉంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది.
దశాబ్దాల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాలు తెలుగు నేలపై ఉన్నాయి. గతమెంతో ఘనం.. వర్తమానం అధ్వానం అన్నట్లుగా తయారైంది ఈ యూనివర్సిటీల పరిస్థితి.
కొన్ని సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే విషయంలో తెలుగు యూనివర్సిటీలు చతికిలపడుతున్నాయి.
గత వారం కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఆర్ఎఫ్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ర్యాంకులను ప్రకటించింది.
దేశంలోని విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు విద్యా సంస్థలు - ఐఐటి హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - మినహా మిగిలినవేవీ టాప్-20లో లేవు. ఐఐటి హైదరాబాద్ 14వ ర్యాంకులో ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 20వ ర్యాంకులో నిలిచింది. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలు. అంటే, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒక్కటి కూడా టాప్-20లో లేదు.
తెలంగాణలో ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ సహా 11 రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, జేఎన్టీయూ, ఆదికవి నన్నయ్య, సింహపురి సహా 25 విశ్వవిద్యాయాలున్నాయి.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో రెండు రాష్ట్రాల్లోని వర్సిటీలు వెనుకపడ్డాయి.

ఫొటో సోర్స్, AndhraUniversity
ర్యాంకులు ఎందుకు అంత ముఖ్యం?
దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకులు ఇచ్చే విధానాన్ని కేంద్ర విద్యాశాఖ 2015లో ప్రవేశపెట్టింది.
ఇందుకుగాను నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను తీసుకువచ్చింది. తొలిసారిగా 2016 నుంచి దేశంలోని విద్యాసంస్థలకు ర్యాంకులు ఇవ్వడం ప్రారంభించింది.
ఇందులో మంచి ర్యాంకులు సాధిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు నిధులు, ప్రాజెక్టులు సాధించే వీలు కలుగుతుంది.
ఇందుకు యూజీసీ నుంచి ప్రాధాన్యం దక్కుతుంది.


ఫొటో సోర్స్, Getty Images
5,543 విద్యాసంస్థల నుంచి పోటీ
ఎన్ఐఆర్ఎఫ్‌లో ఏ యూనివర్సిటీకైనా మంచి ర్యాంకు రావాలంటే ఐదు అంశాలు కీలకం.
- మొదటిది.. బోధన, అభ్యాసన, వనరులు
- రెండోది.. పరిశోధన, వ్రత్తి పరమైన సాధన
- మూడోది.. పట్టభద్రుల సంఖ్య
- నాలుగోది.. అవుట్ రీచ్, సుస్థిరత
- ఐదోది.. అవగాహన
ఈ ఐదు అంశాల ప్రాతిపదికన ర్యాంకులు దక్కుతాయి.
2023 సంవత్సరానికి 5543 విద్యాసంస్థల నుంచి కేంద్ర విద్యాశాఖకు దరఖాస్తులు అందాయి.
వీటికి కేంద్ర విద్యాశాఖ విభాగాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఇంత వెనుకబాటు
తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు ర్యాంకుల్లో వెనుకబాటుకు కీలకమైన అంశాల్లో లోపమే కారణంగా కనిపిస్తోందని విద్యావేత్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా ప్రొఫెసర్ల పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రభావం అన్ని అంశాలపైనా పడుతోంది.
బోధన, అభ్యాసన, వనరులు, పరిశోధన.. ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
ప్రొఫెసర్ల పోస్టుల ఖాళీల కారణంగా బోధన దెబ్బతింటోంది. అభ్యాసన తగ్గిపోతోంది. పరిశోధనలు ముందుకు సాగడం లేదు.
అన్ని అంశాలు కలిపి యూనివర్సిటీ పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయని ఉన్నత విద్యా రంగ నిపుణుడు, ఓయూ మాజీ ఉపకులపతి ప్రొ.తిరుపతిరావు బీబీసీతో అన్నారు. ఈ విషయంపై బీబీసీతో ఆయన మాట్లాడారు.
‘‘యూనివర్సిటీలకు బోధన సిబ్బంది వెన్నెముక లాంటివారు. కానీ, చాలా కాలంగా రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది. కష్టపడి పోటీతత్వంతో పనిచేసే బోధన సిబ్బంది ఉంటే యూనివర్సిటీల పనితీరు మెరుగుపడుతుంది. వర్సిటీ నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంటే.. వర్సిటీకి మంచి పేరు వస్తుంది" అని ప్రొఫెసర్ తిరుపతిరావు అన్నారు.
అంతేకాకుండా, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విలువలతో కూడిన పరిశోధన జరగాలని. ఇందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని ఆయన చెప్పారు.
"ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. వర్సిటీలకు ఇచ్చే నిధులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా అన్ని స్థాయిల్లో జవాబుదారీ తనం తీసుకురావాలి’’ అనిE/v అన్నారు.
వర్సిటీల పరిస్థితిపై ప్రత్యేకంగా కమిటీ వేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటేనే మళ్లీ పూర్వస్థితికి చేరుకునే వీలుంటుందని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖాళీలతోనే అసలు సమస్య
రెండు రాష్ట్రాల్లో చాలావరకు వర్సిటీలు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఆచార్యులతో నెట్టుకొస్తున్నాయి.
తెలంగాణలోని ఉన్నత విద్యలో 5,083 ఖాళీలు ఉన్నట్లు నిరుడు ప్రభుత్వం గుర్తించింది.
ఇందులో 1892 ఖాళీలు బోధన సిబ్బందివి ఉన్నాయి. ఏడాదిగా ఉద్యోగ విరమణ చేసిన వారితో కలుపుకొంటే ఖాళీల సంఖ్య 1950కు చేరుకుని ఉంటుందని ఉన్నత విద్యా మండలిలోని అధికారి ఒకరు చెప్పారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్సిటీల్లో కలిపి 3864 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2741 ఖాళీలు ఉన్నాయి.
రెండు రాష్ట్రాల్లో పోస్టుల భర్తీ దాదాపు రెండు దశాబ్దాలుగా జరగడం లేదు.
దీనివల్ల రిటైర్ కావడం లేదా చనిపోవడం జరిగితే.. ఆ స్థానాల్లో కొత్తగా భర్తీ ప్రక్రయలు చేపట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో 2వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏడాదిన్నర కిందట ప్రభుత్వం ప్రకటించింది.
దీనికి సంబంధించి ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలోని యూనివర్సిటీలలో పోస్టులు భర్తీకి నిరుడు ఏప్రిల్‌లో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయింది. దీనికి సంబంధించిన బిల్లు గవర్నర్ వద్దకు పంపించింది ప్రభుత్వం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ బిల్లును తిప్పిపంపారు.
ఆ తర్వాత భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘గత 15 నుంచి 20 ఏళ్లుగా ఖాళీలు నింపలేదు. గడిచిన మూడేళ్లలో ఎస్వీ, ఆంధ్రా యూనివర్సిటీల్లోనే 180 మంది రిటైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రొఫెసర్ల ఖాళీలు నింపేందుకు సిద్ధంగా ఉంది. 2018లో నోటిఫకేషన్ వచ్చింది. దీనిపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. సమస్యను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీలు సాధించిన స్కోర్ ఎక్కడా తగ్గడం లేదు. 2017, 2018లో సాధించిన స్కోర్లే కొనసాగుతున్నాయి. ఐఐటీ, ఐఐఐటీలు ఎన్ఐఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. సెంట్రల్ నిధులతో నడిచే విద్యాసంస్థలు కావడంతో ఎక్కువ స్కోర్ సాధిస్తున్నాయి’’ అని హేమ చంద్రారెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యార్థులేమంటున్నారు..
యూనివర్సిటీలను బాగు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
యూనివర్సిటీల పరిస్థితిపై ఏబీవీపీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చింతకాయల ఝాన్సీ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ నగరంలో ఉన్న అలాంటి వర్సిటీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందుగా యూనివర్సిటీలకు అవరమైన నిధులు కేటాయించాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలి. అప్పుడే పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది’’ అని చెప్పారు.
క్యూఎస్ ర్యాంకులలోనూ వెనుకబాటే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రముఖ సంస్థలు ప్రకటించే ర్యాంకుల విషయంలోనూ మన విశ్వవిద్యాలయాలు సత్తా చాటలేకపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా భావించే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ అదే పరిస్థితి.
అకడమిక్ రిపుటేషన్, ఎంప్లాయర్ రిపుటేషన్, ఆచార్యులు-విద్యార్థుల నిష్పత్తి, సైటేషన్స్, అంతర్జాతీయ విద్యార్థుల రాక, పరిశోధన, క్యాంపస్ నియామకాలు వంటి అంశాల ఆధారంగా క్యూఎస్ సంస్థ ఏటా వార్షిక ర్యాంకులు విడుదల చేస్తుంటుంది.
2023 సంవత్సరానికి ఐఐటీ-హైదరాబాద్‌కు 581-590 రేంజ్ ర్యాంకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 751-800 మధ్య ర్యాంకులు లభించాయి.
ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1201-1400 రేంజ్ ర్యాంకు లభించింది. 2022 సంవత్సరంలో 1000-1050 రేంజ్ ర్యాంకు లభించగా.. ఈసారి మరింత పడిపోయింది.
ఇలా అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ర్యాంకుల పరంగానూ వర్సిటీల పరిస్థితి దిగజారుతోంది.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















