విద్యార్థుల ఆత్మహత్యలు: 'డిప్రెషన్‌లో చనిపోదామని పట్టాల మీద పడుకున్నా... ఎదురుగా వేగంగా రైలు కూడా వచ్చింది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఒకపక్క అమ్మనాన్నల అంచనాలు అందుకోలేకపోతున్నాను..
మరోపక్క నాకు కావాల్సిన ప్రేమ దొరకవడం లేదు..
నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేరనిపించింది.
నా గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రతి విషయానికి నియంత్రించాలని చూసేది.
అందరూ అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, నువ్వేంటి ఇలా ఉన్నావ్ అనేది.
ప్రతి విషయంలోనూ పోలికే.
ఇక తట్టుకోలేకపోయాను.. చనిపోదామనుకున్నా.
ఒకసారి హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ వద్దకు వెళ్లి రైల్వే ట్రాక్ పై పడుకున్నా.
ఎదురుగా ట్రైన్ వస్తున్న శబ్దం వస్తోంది.
హారన్ కొడుతున్నట్లు తెలుస్తోంది..
ఆ సమయంలో చనిపోవాలనే ఆలోచన కట్టిపడేస్తోంది..
కానీ, రైలు శబ్దం విని మనసు ఊరుకోలేదు.
చివరి నిమిషయంలో పట్టాలపై నుంచి లేచి వచ్చేశాను..’’
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం చేస్తున్న విద్యార్థి హేమంత్ స్వీయ అనుభవమిది.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబ సమస్యలు.. చదువులో ఒత్తిడి.. ప్రేమ వ్యవహారాలు.. కారణాలేవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
జాతీయ క్రైం రికార్డుల బ్యూరో లెక్కలు గమనిస్తే దేశంలో ప్రతి గంటకు ఒకరు లేదా ఇద్దరు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో మెజార్టీ చదువుకుంటున్న విద్యార్థులే ఉంటున్నారు.
వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై.. డిప్రెషన్‌లోకి వెళ్లిన కొందరు విద్యార్థులతో బీబీసీ మాట్లాడింది.
కుంగుబాటు కారణంగా ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థులూ దీనిలో ఉన్నారు.
అలాంటి విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయటపడి.. మళ్లీ చదువులపై ధ్యాస పెట్టేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ‘సహాయం కౌన్సిలింగ్ కేంద్రం’ క్రషి చేస్తోంది. ఆ విద్యార్థులు తిరిగి సాధారణ జీవితం ఎలా గడుపుతున్నారో చూద్దాం.
హేమంత్ స్వస్థలం హైదరాబాద్. ఐదో తరగతి వరకు తను బాగా చదివేవాడు. అయితే, ఆ తర్వాత అతడి ఆలోచనలు ప్రతికూలంగా మారాయి. అలా ఎందుకు మారాడో బీబీసీతో హేమంత్ మాట్లాడాడు.
‘‘చిన్నప్పుడు మొదటి ర్యాంక్ రాకపోతే అమ్మనాన్న బాగా కొట్టేవారు. దాని వల్ల చదువుపైనా, అమ్మ నాన్నపై చాలా కోపం వచ్చేది. ఒకసారి ఆరో తరగతిలో అనుకుంటా.. నాన్న పడుకుని ఉంటే చంపేద్దామని క్రికెట్ బ్యాట్ తీసుకుని వెళ్లా. కానీ, నాన్న చనిపోతే అమ్మ, చెల్లి ఏమైపోతారో అనే ఆలోచన వచ్చింది. అందుకే ఆగిపోయా.
ఇంట్లో అమ్మనాన్న కొడుతుండటంతో.. వాళ్లపై నమ్మకం పోయింది. స్నేహితులను నమ్మడం మొదలు పెట్టాను.
స్నేహితుల వద్ద కూడా నేను కోరుకున్న ప్రేమ దొరికేది కాదు’’ అని చెప్పాడు హేమంత్.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌కు చెందిన శ్రీజ యాంజాలది భిన్నమైన పరిస్థితి. ఆమె ఓయూలో ఎంఏ జర్నలిజం చదువుతున్నారు.
ఆమెకు చదువులో మొదటి ర్యాంకు వచ్చేది. కానీ, ఆ ర్యాంకు కాపాడుకునేందుకు ఆమె ఇంకా ఇంకా చదవేవారు.
‘‘ఏదైనా చదవకపోతే ఏమైపోతుందో.. తల్లిదండ్రులు ఏమనుకుంటారో.. తరగతి గదిలో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ఏమనుకుంటారో.. అసలే అమ్మానాన్నలు మంచి హోదాల్లో ఉన్నారు..’’
ఇలా తనలో తానే ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్‌లోకి ఆమె వెళ్లారు.
హేమంత్, శ్రీజ యాంజాల.. వీళ్లిద్దరే కాదు, శ్రీజ మైత్రి, మోతహరి.. ఇలా ఎందరో విద్యార్థులు వివిధ ఒత్తిళ్ల కారణంగా డిప్రెషన్‌లోకి వెళుతున్నారు.
ఒత్తిడి భరించలేని స్థితిలో ఆత్మహత్యాయత్నం, ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, CHEENA KAPOOR
జాతీయ క్రైం రికార్డుల బ్యూరో ప్రకారం నాలుగేళ్లలో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు 33 శాతం పెరిగాయి.
దేశ వ్యాప్తంగా 2017లో 9905 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
2020లో 12,526 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 2021కి వచ్చేసరికి ఇది 13,089 మందికి చేరుకుంది.
దీనికి కచ్చితమైన కారణాలు నివేదికలో చెప్పకపోయినా, ఒత్తిడి, డిప్రెషన్ ప్రధాన పాత్ర పోషిస్తోందనేది విశ్లేషకులు చెప్పే మాట.
దేశంలో 2021లో 18 ఏళ్లలోపు యువత 10,730 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. వారిలో 864 మంది పరీక్షలలో ఫెయిల్ అయినందుకు చనిపోయారు.
18 ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారు 56,529 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలలో 8 శాతం మంది విద్యార్థులే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, CHEENA KAPOOR
డిప్రెషన్‌కు కారణాలేమిటి..?
విద్యార్థులలో డిప్రెషన్‌కు వివిధ అంశాలు కారణమవుతున్నాయని చెప్పారు ఓయూలోని సహాయం కౌన్సిలింగ్ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సి.బీనా. దీనిపై ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘పది చోట్ల నుంచి పది రకాల విషయాలు వస్తున్నాయి. దాని వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు.
స్థిరత్వం లేకుండా ఉండిపోతున్నారు. ఎటు వెళ్లాలి.. ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు’’ అని బీనా చెప్పారు.
విద్యార్థుల్లో డిప్రెషన్ కు ప్రధాన కారణాలివీ…
- అస్థిరమైన ఆలోచనలు
- రిలేషన్ షిప్స్(ప్రేమ విఫలమవడం లేదా గొడవలు రావడం)
- సరిగా చదువుకోకపోవడం.
- పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం
- చదువుకుంటే ఉద్యోగం వస్తుందో రాదోనన్న ఆందోళన
- కుటుంబం నుంచి చదువుపై ఒత్తిడి
- భవిష్యత్తుపై మథన పడుతుండటం
- అనారోగ్యం

ఫొటో సోర్స్, CHEENA KAPOOR
పాఠశాల స్థాయి నుంచే మొదలు...
విద్యార్థుల్లో డిప్రెషన్ అనేది పాఠశాల స్థాయి నుంచే మొదలవుతోంది.
బీబీసీ కొందరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు తమలోని ఆలోచనల్లో మార్పు హైస్కూల్ స్థాయి నుంచే గమనించినట్లు చెప్పారు.
పదో తరగతిలో పరీక్షలప్పుడు తొలిసారిగా డిప్రెషన్ ఎదుర్కొన్నట్లు శ్రీజ యాంజల చెప్పారు.
‘‘ఆ వయసులో అది డిప్రెషన్ అని కూడా నాకు తెలియదు. నాలో నేనే నిరాశధోరణిలోకి వెళ్లి పోయే దాన్ని.
ఏ పనిచేస్తున్నా మనసులో ప్రశ్నలు, జవాబులు తప్ప వేరొక విషయంపై ధ్యాస ఉండేది కాదు’’ అని చెప్పారు శ్రీజ.
ఇదే విషయంపై హేమంత్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఐదో తరగతి వరకు బాగా చదివేవాడ్ని. ఆరో తరగతి నుంచి అమ్మానాన్నలపై కోపంతో కావాలని ఫెయిల్ అయ్యేవాణ్ని. మళ్లీ ఎనిమిదో తరగతి తర్వాత చదువుకుంటే మంచిదని చదువుకోవడానికి ప్రయత్నించా. కానీ మొద్దుబారిపోయా. ఎంత చదివిననా ఎక్కలేదు. నా మీద నేను సీరియస్ అయ్యి.. కోప్పడుతూ.. మార్కులు సరిగా రాకపోతే బెల్టు, రాడ్డులతో కొట్టుకోవడం, గోడకు తల కొట్టుకోవడం.. చేతులపై గీసుకోవడం.. ఇలా నాకు నేను గాయపరుచుకునే వాడ్ని’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డిప్రెషన్‌లో ఏం చేస్తారు..?
డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు విపరీతమైన ఆలోచనలు వచ్చేవని హేమంత్ చెప్పారు.
‘‘ రెండు, మూడుసార్లు ఇంట్లోంచి పారిపోయాను. ఒకట్రెండు రోజుల తర్వాత వెతికి తీసుకువచ్చారు. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్న టైం లో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను. తర్వాత నా వల్ల అవడం లేదని చెప్పి ఆమెను దూరం పెట్టాను. నా చదువు పాడై డిటెయిన్డ్ అయ్యాను. లైఫ్‌లో మొత్తం వెనక్కి పడిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో వాళ్లందరూ నాదే తప్పన్నారు. ఫ్రెండ్స్ నాదే తప్పన్నారు. అందరూ నాదే తప్పంటున్నారు ఇక ఎందుకు అనిపించింది’’ అని హేమంత్ చెప్పారు.
కౌన్సిలింగ్ ఎలా ఇస్తారంటే..
డిప్రెషన్ నుంచి బయట పడకపోతే ఆత్మహత్య స్థాయికి తీసుకెళుతుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
తమ వద్దకు వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు క్రషి చేస్తున్నట్లు సహాయం కేంద్రం కౌన్సిలర్ జి.ఏంజెలా చెప్పారు. కౌన్సిలింగ్ విధానంపై ఆమె బీబీసీతో మాట్లాడారు..
‘‘ఒక్కోసారి మొదటిసారి మాట్లాడితేనే విద్యార్థులలో మార్పు రాదు. ముందు వారిని కూర్చోబెట్టి ఓపికగా అన్ని విషయాలు వింటాము. మొదటి సెషన్‌లోనే అన్ని విషయాలు చెప్పకపోవచ్చు. అందుకే కొన్నిసార్లు విద్యార్థులకు ఎక్కువ సార్లు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన వస్తుంది. విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్లు చెప్పే విషయాల ఆధారంగా డిప్రెషన్‌లో ఉన్నారా లేదా తెలుస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు మొదటి సెషన్‌లోనే ఉన్నాయని గుర్తిస్తే.. వెంటనే కౌన్సిలింగ్ మొదలు పెడతాము. లేకపోతే ముందుగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము’’ అని ఏంజెలా చెప్పారు.
సహాయం కేంద్రం తరఫున అవసరమైన వారికి సైక్రియాట్రిక్ సాయం కూడా చేస్తుంటామని వివరించారు.

ఫొటో సోర్స్, iStock
డిప్రెషన్‌లో ఉంటే…
డిప్రెషన్‌లో ఉంటే కొన్ని అంశాలు గమనించవచ్చని కౌన్సిలర్ ఏంజెలా చెప్పారు.
ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం, సరిగా నిద్ర లేకపోవడం, సరిగా తినకపోవడం, చిన్న విషయాలకు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, మనసులో తెలియకుండా ఆందోళన చెందడం, చిన్న విషయాలకు భయపడుతుండటం వంటి లక్షణాలను గుర్తించవచ్చని చెప్పారు.
ఎలా బయటపడాలంటే..
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో డిప్రెషన్ నుంచి ఏ విధంగా బయటపడ్డాడో హేమంత్ వివరించారు.
‘‘సహాయం కేంద్రం నుంచి అందిన కౌన్సిలింగ్ రోజూ వారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నాను.
రోజూ పొద్దున్నే లేచి ధ్యానం చేయమని చెప్పారు. దాని తర్వాత ఏదో ఒక యాక్టివిటీ చేయమనే సరికి ఈత కొట్టడం మొదలు పెట్టాను. ఒక రోజులో ఏం చేయాలనే విషయాలతో జాబితా తయారు చేసుకున్నాను. నన్ను నేను ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక పని చేసేవాడ్ని. ఇది మొదలుపెట్టినప్పుడు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చేవి. అలా వచ్చిన ప్రతిసారీ అది పోవడానికి ఏదో చేసేవాడిని. స్నేహితులకు ఫోన్ చేయడం లేదా వ్యాయామం చేయడం చేసేవాడిని. నేను బయటపడటానికి చాలా రోజులు పట్టింది’’ అని హేమంత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఏమిటి సహాయ కేంద్రం?
ఒత్తిడి, డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకునే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటైంది.
2009లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా అవసరమైన వారికి మెడికల్ సాయం అందించేందుకు కృషి చేస్తుంది.
కేంద్రం ఏర్పాటుపై ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడారు.
‘‘2009లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విద్యార్థులు చదువుకు దూరమై తీవ్ర ఒత్తిడిలో ఉండేవారురు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ కొందరు ఆత్మహత్యలకు యత్నించారు. ఆ సమయంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేందుకు ఈ కేంద్రం కృషి చేసింది’’ అని చెప్పారు.
మరోవైపు, ఈ కేంద్రం సాయంతో ఇప్పటివరకు కొన్ని వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సహాయం కేంద్రం డైరెక్టర్ సి బీనా తెలిపారు.
ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలకు సహాయం కేంద్రం సేవలు విస్తరించినట్లు తెలిపారు.
మహాత్మగాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూలలోనూ కౌన్సిలింగ్ సేవలు ఇస్తున్నట్లు చెప్పారు.
సహాయం కేంద్రాన్ని సంప్రదించే సమాచారం…
చిరునామాః సహాయం, ఉస్మానియా విశ్వవిద్యాలయ సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్, మొదటి అంతస్తు, సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ఇమెయిల్ : [email protected]
కౌన్సిలర్ జి.ఏంజెల : 8978191578
డైరెక్టర్ సి.బీనా : 9849065971
ఇవి కూడా చదవండి:
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















