ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కరెంట్ బిల్లులో పెరుగుదల పట్ల కలవరపడుతున్నారు.
దాదాపు వినియోగదారులందరి బిల్లుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. దానికి విద్యుత్ వినియోగం పెరగడమే కారణమని ప్రభుత్వం అంటోంది. కానీ విద్యుత్ భారం పెరిగిందని జనం గగ్గోలు పెడుతున్నారు.
విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు ప్రభుత్వం చెబుతున్నట్టు వినియోగం పెరగడం ఒక్కటే కారణం కాదని బిల్లులను పరిశీలిస్తే అర్థమవుతుంది.
నేరుగా విద్యుత్ ఛార్జీల పెరుగుదల లేకపోయినప్పటికీ ట్రూ అప్ ఛార్జీలు, సర్ ఛార్జీలు అంటూ వివిధ రకాల భారాలు మోపినట్టు స్పష్టమవుతోంది.
పెరిగిన విద్యుత్ వినియోగం కారణంగా టారిఫ్ ప్రకారం స్లాబ్ మారిపోవడం వల్ల యూనిట్ ఛార్జీలు పెరిగాయి. అందుకు తోడుగా వివిధ పేర్లతో ప్రతీ యూనిట్‌కి సగటున 50 పైసలకు పైగా అదనపు వసూళ్లు కూడా తోడు కావడంతో ఈసారి విద్యుత్ బిల్లుల మోత కనిపిస్తోంది.
రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఈసారి జూన్ మధ్యకు వచ్చినప్పటికీ వేసవి తీవ్రత వెంటాడుతోంది. ఫలితంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. దాంతో అనేక చోట్ల పల్లెలు, పట్టణాలతో పాటుగా నగరాల్లో కూడా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఓవైపు బిల్లుల్లో మోతలు, మరోవైపు కరెంటు కోతలు కలిసి విద్యుత్ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

‘‘5 రెట్లు ఎక్కువగా బిల్లు’’
ఆగురు పద్మావతి ఓ సాధారణ గృహిణి. రాజమహేంద్రవరంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భర్త చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తారు.
ఆమె ఇంట్లో ఫ్రిజ్, ఏసీ, రెండు ట్యూబ్ లైట్లు, వాషింగ్ మిషన్ ఉన్నాయి. ప్రతీ నెలా సగటున రూ. 500 వరకూ బిల్లు వస్తుంది. వేసవిలో రెండు, మూడు వందలు ఎక్కువ వస్తుందని ఆమె బీబీసీకి తెలిపారు.
కానీ, ఈసారి మే నెలలో వాడిన విద్యుత్ బిల్లు జూన్ మొదటి వారంలో వచ్చింది. అది రూ. 2694గా ఉంది. అంటే గత ఏప్రిల్ నెల వాడకానికి మే నెలలో చెల్లించిన బిల్లు కన్నా దాదాపు 5 రెట్లు ఎక్కువ.
"ఈసారి మేం వాడిన విద్యుత్ యూనిట్ల ప్రకారం రూ. 700, ఇతర ఛార్జీలన్నీ కలిపి రూ. 900 వరకు బిల్లు వస్తుందని అనుకున్నాం. కానీ, తీరా అది రెండున్నర వేలు దాటి వచ్చింది. ఎందుకని కరెంటు వాళ్లని అడిగితే ఇతర ఛార్జీలు పెరగాయని చెప్పారు.
ఏసీ ఉన్నా పగలంతా వాడకం తక్కువే. రాత్రిళ్లు కూడా వేడిగా ఉండడంతో రెండు, మూడు గంటలు వేస్తాం. అయినా బిల్లు ఎక్కువే వచ్చింది.
నెల నెలా వాడే కరెంట్ మాత్రమే వాడినా బిల్లు అంత తేడా వస్తే ఎలా కట్టాలి. ఇంటి అద్దె కట్టుకోవాలో, కరెంటు బిల్లు చెల్లించాలో అర్థం కావడం లేదు" అంటూ పద్మావతి వాపోయారు.
వాడిన విద్యుత్ కన్నా బిల్లు చాలా ఎక్కువగా ఉందని, ఇంతటి భారం సామాన్యులకు కష్టంగా మారిందని ఆమె బీబీసీతో అన్నారు.
ట్రూఅప్ , సర్ ఛార్జీలే కారణం
ఏపీలో విద్యుత్ వినియోగదారులపై ఈసారి అదనంగా కరెంటు భారం పడటానికి ట్రూ అప్, సర్ ఛార్జీలే కారణమని కరెంట్ బిల్లులు చెబుతున్నాయి.
రీటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి డిస్కమ్‌ల ద్వారా జరిగిన లావాదేవీల్లో వచ్చిన నష్టాలకు గానూ ప్రజల నుంచి అదనపు వసూళ్లకు ఈ ట్రూ అప్ ఛార్జీలను తీసుకొచ్చారు.
విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాలో వచ్చే వ్యత్యాసాల వల్ల తమకు వచ్చే నష్టాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడాన్ని కంపెనీలు అలవాటుగా మార్చుకున్నాయి.
అందులో భాగంగా 2022-23కి గానూ ఏపీలో మూడు విద్యుత్ సరఫరా కంపెనీలు కలిపి 66,529 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ని వినియోగించగా, మరో 8,285 యూనిట్ల సరఫరా నష్టాలు చవిచూశాయి.
దాంతో మొత్తం 74,815 ఎంయూల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. సరఫరా నష్టాలు అత్యధికంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నట్టు ఏపీఈఆర్ఎసీ నివేదిక చెబుతోంది.

మొత్తం అవసరమైన రెవిన్యూ రూ. 45,398 కోట్లు కాగా, ఆదాయం మాత్రం రూ. 34,465 కోట్లుగా ఉంది. దాంతో ఆ గ్యాప్‌ను పూర్తి చేసేందుకుగానూ ప్రభుత్వాలు గతంలో నేరుగా విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు మొగ్గు చూపగా ఇటీవల అందుకు భిన్నంగా ట్రూ అప్ , సర్ ఛార్జీలు అంటూ వేస్తున్నాయి.
నష్టాల సర్దుబాటు పేరుతో ఇలాంటి వసూళ్లు జరుగుతున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునే పద్ధతులు పాటించకుండా చివరకు వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి ఈ విధానం తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
అనివార్యంగా సర్దుబాటు రుసుములు, సర్ చార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఇలా పేరు ఏదైనా వినియోగదారులపైనే ఆ భారం మోపుతున్నారనేది స్పష్టమవుతోంది. ఈ ఛార్జీలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.

నేరం ఒకరిదైతే, శిక్ష మరొకరికా
2014 నుంచి విద్యుత్ వినియోగంలో వచ్చిన నష్టాలకుగానూ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దాంతో అద్దె ఇంట్లో గతంలో నివసించిన వారు వాడిన విద్యుత్‌కి ఇప్పుడు అద్దెకు ఉంటున్న వారు ఆ ట్రూ అప్ భారం మోయాల్సి వస్తోంది. ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌కి కూడా భవిష్యత్తులో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఈ పరిణామాలు చెబుతున్నాయి.
విద్యుత్ సంస్థల నష్టాలకు ట్రాన్సిమిషన్ లాసెస్‌తో పాటుగా అధిక ధరకు విద్యుత్‌ని కొనుగోలు చేయాల్సి రావడం కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దాంతో నేరం విద్యుత్ సంస్థలదయితే, దాని భారాన్ని వినియోగదారులు మోయాలా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సహజంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు బొగ్గు కొరత వంటివి విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆటంకాలు అవుతాయి. అలాంటి సమయంలో కోతలు నియంత్రించడం కోసం ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనాల్సి వస్తోంది.
కొన్నిసార్లు యూనిట్ రూ. 20 కూడా దాటపోతోంది. విద్యుత్ రీటైల్ వినియోగదారులకు సగటు యూనిట్ ఛార్జ్ రూ. 5 వరకు ఉంటుంది. అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దశలో దాంతో మిగిలిన మొత్తం అంతిమంగా సంస్థకు నష్టాలుగా పేర్కొంటున్నారు. ఆ నష్టాలు పూడ్చడానికంటూ కొత్త మార్గాల్లో ఛార్జీలు వేస్తున్నారు.
"అధిక ధరకు మార్కెట్లో కొంటున్న విద్యుత్ విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అడ్డగోలుగా దందా నడుస్తోంది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాని భారం కూడా సామాన్యుల మీద మోపుతున్నారు.
పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడుతూ దాన్ని కూడా ప్రజలపై భారం వేస్తున్నట్టు కనిపిస్తోంది. ట్రాన్సి మిషన్ నష్టాలు కూడా 3 శాతంపైనే కొనసాగుతుండటం అత్యంత విచారకరం. విద్యుత్ చౌర్యం, అక్రమాలు నియంత్రించకుండా వాటి నష్టాలు కూడా సామాన్యుల బిల్లుల్లోనే వేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థీకృత వైఫల్యాలకు ప్రజలు ఎలా బాధ్యులవుతారు" అంటూ పట్టణ పౌరుల సంక్షేమ సంఘం నాయకుడు చిగురుపాటి బాబూరావు అన్నారు.

విద్యుత్ కోతలు కూడా ..
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఈసారి వేసవి తీవ్రత సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది.
సహజంగా జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుంది. మృగశిర కార్తెతో వాతావరణం మారిపోతుందని భావిస్తే ఈసారి అందుకు భిన్నంగా ఉంది.
జూన్ 13 నాడు కూడా దాదాపుగా సగం మండలాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో జూన్ రెండోవారంలో ఏటా ఉండే విద్యుత్ వినియోగం డిమాండ్ కన్నా ఈసారి మూడోవంతు అధికంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
దాంతో అనేక చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు సాగుతున్నాయి. పరిశ్రమలు, ఇతర అవసరాలకు తోడుగా గృహ వినియోగదారులను కూడా ఈ కరెంటు కోతలు వెంటాడుతున్నాయి. పల్లెలతో పాటుగా నగరాల్లోనూ ఇది కనిపిస్తోంది. జూన్ 12 రాత్రి, కాకినాడ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత కరెంటు పోయి మళ్లీ తెల్లవారుజామున 3 గంటల తర్వాత సరఫరా అయ్యిందంటే విద్యుత్ కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో గమనించవచ్చు. వివిధ కారణాలతో ఈ కరెంటు సరఫరాలో ఆటంకాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
ఇళ్లల్లో చిన్నారులు, వృద్ధులతో పాటుగా, ఆస్పత్రుల్లో రోగులను కూడా ఈ కరెంటు సరఫరా సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.

వినియోగం పెరిగింది
కరెంటు కోతలు, పెరిగిన ఛార్జీల విషయంలో విద్యుత్ శాఖ వాదన భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలు లేవని కేవలం సర్దుబాటు మాత్రమే జరుగుతోందని విద్యుత్ శాఖ అంటోంది.
గ్రిడ్ ఫ్రీక్వెన్సీని దృష్టిలో పెట్టుకుని నిర్ధిష్టస్థాయిలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏపీ విద్యుత్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
"అధిక లోడ్, అకాల వర్షాల కారణంగా కొన్ని చోట్ల స్వల్ప ఆటంకాలు సహజమే. గత ఏడాది మే నెలలో సగటు రోజువారీ విద్యుత్ వినియోగం 193.66 మిలియన్ యూనిట్లుగా ఉంటే ఈసారి అది 221.69 ఎంయూలకు పెరిగింది. గరిష్టంగా 251 మిలియన్ యూనిట్లు దాటిపోయింది. వాతావరణంలో అధిక వేడి కారణంగా విద్యుత్ వాడకం ఎలా పెరిగిందో ఈ లెక్కలే చెబుతున్నాయి. దానికి తగ్గట్టుగా మార్కెట్లో యూనిట్ రూ. 11 అయినా గానీ కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. పెరిగిన వాడకం వల్ల కొంత బిల్లుల్లో పెరుగుదల ఉంటుంది. ట్రూ అప్ వంటివి గతం నుంచి ఉన్నవే" అంటూ ఏపీ విద్యుత్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
విద్యుత్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, నిర్ధిష్టంగా అన్ని అంశాలు బిల్లులో ఉంటాయని చెబుతోంది. కానీ, గతంలో ట్రూ అప్ ఛార్జీలు విరమించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా, ప్రస్తుతం విద్యుత్ బిల్లుల్లో అదనంగా దానిని వేస్తూ ప్రజల నుంచి వసూలు చేస్తున్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















