సముద్రం మీద ఏకంగా ఓ నగరాన్నే నిర్మిస్తున్న సౌదీ అరేబియా.. తాబేలు రూపంలో కనిపించే ఈ సూపర్ షిప్ ఏంటి?

వీడియో క్యాప్షన్, అత్యంత ఖరీదైన, అతి పెద్దదైన నౌక నిర్మాణానికి ముందుకొచ్చిన సౌదీ అరేబియా
సముద్రం మీద ఏకంగా ఓ నగరాన్నే నిర్మిస్తున్న సౌదీ అరేబియా.. తాబేలు రూపంలో కనిపించే ఈ సూపర్ షిప్ ఏంటి?

ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా.. చేతిలో డబ్బుంటే ఏం చెయ్యవచ్చో అవన్నీ చేసి చూపిస్తోంది సౌదీ అరేబియా. అనితరసాధ్యం అనే స్థాయిలో అనేక ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్న ఈ దేశం.. ఇప్పుడు... సముద్రం మీద ఏకంగా ఓ నగరాన్నే నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఇటాలియన్ డిజైన్ హౌస్ పియర్‌పావ్‌లో లజ్జారిని డిజైన్ చేసిన టెరా సూపర్ యాచ్ నిర్మాణం.. అంతా అనుకున్నట్లు జరిగితే మరో పదేళ్ల తర్వాత ప్రారంభం కావచ్చు. తాబేలు రూపంలో కనిపించే ఈ సూపర్ షిప్ విశేషాలేంటి 

పాన్‌జియా... అంటే భూమి ఖండాలుగా విడిపోవడానికి ముందు... 33 కోట్ల సంవత్సరాల క్రితం అస్తిత్వంలో ఉన్న అఖండం. ఇప్పుడా పేరు మీదుగా ప్రపంచంలోనే అతి పెద్ద నౌకను డిజైన్ చేసింది ఇటలీకి చెందిన లజ్జారిని డిజైన్ స్టూడియోస్. నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నౌక. దీన్ని నౌక అని పిలవడం కంటే.. నీటిపై తేలియాడుతూ, తిరిగే అల్ట్రామాడ్రన్ స్మార్ట్ సిటీగా చెప్పొచ్చు. నీటి మీద అత్యంత ఖరీదైన, అతి పెద్దదైన తొలి నిర్మాణం ఇదే అవుతుంది. ఈ సూపర్ యాచ్ నిర్మాణానికి 8 బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని అంచనా.

 దీని ప్రత్యేకతలేంటి?

ఎక్స్‌ట్రీమ్... ఈ పదానికి సరితూగే నిర్మాణాల విషయంలో పోటీ పడుతున్నాయి దుబాయ్, సౌదీ అరేబియా. దుబాయ్ బుర్జ్ ఖలీఫా నిర్మించిన తర్వాత... సౌదీ ప్రపంచంలోనే పొడవైన ఆకాశ హర్మ్యాల నగరాన్ని నిర్మిస్తోంది. లజ్జారిని డిజైన్ చేసిన పాన్‌జియోస్ నౌకను నిర్మించేందుకు ఈ చమురు సంపన్న దేశం ముందుకొచ్చిందని అరేబియా బిజినెస్ పత్రిక రిపోర్ట్ చేసింది. పాన్‌జియోస్‌లో ప్రతి ఒక్కటీ విశేషమే. 1800 అడుగుల పొడవు, 2వేల అడగుల వెడల్పు.. కూర్మావతారం. ఇందులో హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, పార్కులు ఉంటాయి. నౌక పై బాగంలో విమానాలను ల్యాండ్ చెయ్యవచ్చు. నౌక మధ్య బాగంలో ఈ భారీ నౌకతో ఇతర నౌకల్ని అనుసంధానించే పోర్టు ఉంటుంది. ఇందులో 60వేల మంది నివసించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో ఇళ్లు ఉంటాయి. నౌక రెక్కల్లో19 ప్రైవేటు విల్లాలు, 64 అపార్ట్‌మెంట్లు ఉంటాయని లజ్జారిని చెబుతోంది.

 రెక్కలు కదపని తాబేలు..

తక్కువ బరువు, భారీ శక్తి సాంద్రతతో పని చేసే 9 HTS ఇంజిన్లు, అందులో ప్రతీ దానిలోనూ పూర్తిగా విద్యుత్‌తో నడిచే 16,800 హార్స్ పవర్ ఉన్న మోటార్లు ఉంటాయి. ఇవే ఈ నౌకను నడిపిస్తాయి. వీటికి అవసరమైన విద్యుత్‌ను నౌకలోనే ఉత్పత్తి చేస్తారు. గంటకు 5 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. నౌక ప్రయాణించేటప్పుడు దీనికున్న పొడవాటి రెక్కలు.. సముద్రంలో అలల నుంచి వచ్చే తరంగాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. నౌక పై భాగంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది పూర్తిగా పర్యావరణ హితమైన ఇంధన వనరులతో నడుస్తుందన్నమాట.

ప్రత్యేకతలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూజ్‌లైనర్లతో పోలిస్తే .. దీని డిజైన్ పూర్తిగా భిన్నం.. నౌక లోపలి వైపున మధ్య బాగంలో.. 30 మీటర్ల పొడవు అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశం చుట్టూ 9అరల్లో అనేక బ్లాకుల్ని నిర్మిస్తారు. లోపలకు అడుగు పెట్టగానే కొంత దూరం వెళ్లిన తర్వాత విశాలమైన పైకప్పు ఉంటుంది. దాని తర్వాత ఇళ్లు, విల్లాలు, ఇతర బ్లాకులు ఉంటాయి. నౌకను పై నుంచి మూసివేసేలా ఒక పైకప్పు కూడా ఉంటుంది. దాని మీద విమానాలను ల్యాండ్ చెయ్యవచ్చు. నౌక లోపల 30వేల క్లస్టర్ కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటిని నీటిలో వేసినా మునిగిపోకుండా ఉండే టెక్నాలజీతో నిర్మించారు.

 నిర్మాణం ఎలా?

ప్రస్తుతానికి ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. కంప్యూటర్ యానిమేషన్‌లో ఉన్న పాన్‌జియోస్.. అంతా అనుకున్నట్లు జరిగితే, వాస్తవ రూపం దాల్చడానికి ఇంకో 20 ఏళ్లు పట్టవచ్చు. ఈ ప్రాజెక్టుని 2033లో ప్రారంభించేందుకు సౌదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్డా నుంచి 81 మైళ్ల దూరంలో ఉన్న కింగ్ అబ్దుల్లా పోర్టులోనే ఈ నౌకను నిర్మించాలని నిర్ణయించారు. ఈ పోర్టులో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నేలను తవ్వి అందులో సముద్రం నీరు నింపి.. అక్కడ నౌకను నిర్మించి సముద్రంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు లజ్జారిని చెబుతోంది.

నిధులు ఎలా?

ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో ప్రపంచంలో ఈ భారీ నౌక నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తోంది. ఈ నౌక నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో భారీ మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. నిధుల కోసం నౌకలోని ఆస్తులను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎంట్రీ నుంచి.. ఏదైనా సరే అమ్మకానికి రెడీ అంటోంది లజ్జారిని. ప్రస్తుతం వర్చువల్ రూపంలో కొనుగోలు చేస్తే.... నిర్మాణం పూర్తైన తర్వాత వారికి వాస్తవ రూపంలో ఆస్తిని అప్పగిస్తామని సంస్థ ప్రకటించింది.

 లజ్జారిని డిజైన్ స్టూడియోస్

గతాన్ని మర్చిపోకండి.. భవిష్యత్ గురించి ఆలోచించండి.. లజ్జారిని ట్యాగ్ లైన్ ఇది. రోమ్ కేంద్రంగా 1982లో ఏర్పడ్డ సంస్థ భవిష్యత్ నిర్మాణాల డిజైన్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ సంస్థ. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఫ్లోటింగ్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఆకాశంలో, నీటి మీద ప్రయాణించేలా గతేడాది ఎయిర్ యాచ్ పేరుతో ఒక డిజైన్ విడుదల చేసింది. ప్రస్తుతం దీని నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దశాబ్దం చివరిలోగా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సూపర్ యాచ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)