ఉత్తరాఖండ్ వరదలు: ‘నా భార్య నా కళ్ల ముందే నదిలో కొట్టుకుపోయింది...’

ఫొటో సోర్స్, Beniwal family
2013 జూన్ 16న ఉత్తరాఖండ్‌లోని కుంభవృష్టి వానలు విధ్వంసం సృష్టించాయి. వీటి వల్ల ముంచెత్తిన వరదలు, విరిగిపడ్డ కొండ చరియలు కొన్ని గ్రామాలు, పట్టణాలను అతలాకుతలం చేశాయి. ఈ వరదల్లో వేల మంది కొట్టుకుపోయారు. చాలా మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ విపత్తుకు నేటికి పదేళ్లు.
ఆనాడు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో కేదార్‌నాథ్ కూడా ఒకటి. ఆ వరదలు తన కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేశాయో రామ్ కరణ్ బెనివాల్ గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
2013 జూన్ 19న నేను, నా భార్య, మరో ఐదుగురు (నా ఇద్దరు సోదరులు, వారి భార్యలు, మరో బంధువు) మా స్వస్థలమైన రాజస్థాన్ జోధ్‌పుర్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరాం. పరీక్షలు, ఉద్యోగాలతో తీరకలేకపోవడంతో పిల్లలు మాతో రాలేదు.
నా భార్య ఛోటా దేవి, నేను చార్ ధామ్‌లోని మూడు ప్రాంతాలను ఇదివరకే చూశాం. కేదార్‌నాథ్ మాత్రమే మిగిలింది.
జూన్ 16న మేం పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్నాం. అక్కడ దేవుడిని దర్శించుకున్న తర్వాత, మేం రాంబాడాకు బయలుదేరాం. దేవుడిని దర్శించుకున్న తర్వాత యాత్రికులు ఇక్కడే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు.
మేం రాంబాడాకు వెళ్లే మార్గంలోనే వర్షం భారీగా పడింది. సాయంత్రం 5 గంటలకు మేం అక్కడకు చేరుకున్నాం. రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం.

ఆ రోజు రాత్రి అలకనందా నదీ తీరంలో మేం కూర్చున్నాం. దేవుడి నామాన్ని జపిస్తూ భజనలు చేస్తున్నాం. అయితే, ఒక్కసారిగా నది వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించింది.
పర్వతం దొర్లుకుంటూ వస్తున్నట్లుగా అనిపించింది. అంతా చీకట్లు కమ్ముకున్నాయి. అసలు ఏం జరిగిందో మాకు స్పష్టంగా కనిపించలేదు. అంతలోనే పెద్దపెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత నది ఉగ్ర రూపంతో ముంచెత్తింది. ఆ ప్రవాహంలోకి చాలా మంది ప్రజలు కొట్టుకుపోయారు.
నా కళ్ల ముందే నా భార్య, మరదళ్లు కొట్టుకుపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మా అన్నయ్యను కూడా వరద తనలోకి లాగేసుకుంది. మిగతా కుటుంబ సభ్యులు ఏమయ్యారో కూడా తెలియదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక బండరాయి వెనుక నిలబడ్డాను. అదే పై నుంచి వచ్చే రాళ్లు, పోటెత్తే వరద నుంచి నన్ను కాపాడింది.
పెద్ద చెట్లతోనున్న పర్వత ప్రాంతాల నుంచి కొండ చరియలు నా కళ్ల ముందే విరిగిపడ్డాయి. అయితే, కాస్త దృఢంగా ఉండే ఒక కొండవైపు నేను పరుగులు పెట్టాను. అక్కడున్న ఒక చెట్టును గట్టిగా పట్టుకున్నాను. ఒక పెద్ద కొండ కూడా మొత్తంగా నీటిలో మట్టిలా కలిసిపోవడాన్ని నా కళ్లతో నేను చూశాను.

అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. నా కళ్లతో చూసేవన్నీ కాసేపు నమ్మకలేకపోయాను. గడ్డకట్టే చలి ఒకవైపు, వర్షాలు మరోవైపు గజగజ వణికించాయి. నాతోపాటు అక్కడ చాలా మంది చెట్లను గట్టిగా పట్టుకున్నారు. అందరి ముఖాల్లోనూ విచారం, బాధ కనిపించాయి. చెట్టును అలా గట్టిగా పట్టుకున్నప్పుడే నా భుజానికి పెద్ద గాయమైంది. ఇప్పటికీ నాకు ఆ భుజం నొప్పి వస్తుంటుంది.
నా మరుసటి నాలుగు రోజులు నేను చెట్టుపైనే కూర్చున్నాను. ఆ నాలుగు రోజుల్లో వరదల విధ్వంసం కొనసాగింది. అయితే, కొంతమంది నాలానే చెట్టుపై అలా కూర్చొని ఆకలి, చలి, శరీరంలో నీటి స్థాయిలు పడిపోవడంతో మరణించారు. మొబైల్ టవర్లు కూడా కళ్ల ముందే కొట్టుకుపోయాయి.
అసలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా అనిపించింది. నేను కూడా ఇక బతికి బట్టకట్టనేమో అనిపించింది. కానీ, దేవుడు ఎలానో నాకు సాయం చేశాడు.

ఫొటో సోర్స్, Beniwal family
జూన్ 20న ఒక హెలికాప్టర్ మా వైపుగా వచ్చింది. అయితే, ఒకసారికి ఐదుగురు మాత్రమే దానిలో పట్టేవారు. ఎలాగోలా నెమ్మదిగా ఆ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు సమీపంలోని గుప్తకాశీకి చేరుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి దేహ్రాదూన్‌కు తీసుకెళ్లారు. అక్కడే నన్ను ఆసుపత్రిలో చేర్పించారు.
ఆహారం, నీరు లేకుండా రోజులపాటు వర్షంలో తడవడంతో నేను చాలా నీరసంగా అయిపోయాను. నా చర్మం చాలా దెబ్బతింది. చాలాచోట్ల పొరలుపొరలుగా చర్మం ఊడిపోయింది. ఎలాగోలా నేను మా అమ్మాయికి ఫోన్ చేశాను. వెంటనే ఆమె ఫోన్ ఎత్తింది. వెళ్లినవారిలో నేను మాత్రమే బతికానని ఆమెకు చెప్పాను. ఆ మరుసటి రోజు నన్ను తీసుకెళ్లేందుకు మా బావ, మేనల్లుడు దేహ్రాదూన్‌కు వచ్చారు.

ఫొటో సోర్స్, Beniwal family
తల్లి లోటును ఎవరూ భర్తీ చేయలేరు. అయితే, అదృష్టవశాత్తు కనీసం నేనైనా నా పిల్లల కోసం మిగిలాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యుల మృతదేహాలు మాకు దొరకలేదు.
మొదట్లో మా పిల్లలు వారి తల్లి ఎక్కడో బతికే ఉంటుందని అనుకున్నారు. ఏదో ఒకరోజు ఆమె తిరిగి వస్తుందని ఆశతో ఉండేవారు. కానీ, పరిస్థితులు నెమ్మదిగా వారికి అర్థమయ్యాయి.
ఇప్పటికి ఆ విధ్వంసానికి పదేళ్లు గడిచాయి. నాడు ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, ధ్వంసమైన ఆస్తుల గురించి తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. గౌరీకుండ్‌లోని పార్కింగ్ ప్రాంతంలో దాదాపు 5,000 కార్లు ఆగివుండటం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ కార్లలో మాది కూడా ఉంది. దానిలో మా వస్తువులు కూడా ఉన్నాయి. అయితే, అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి.
అదొక ప్రకృతి విపత్తు. దేవుడి ఆజ్ఞ అది. నిజానికి జీవితం ఒక రైలు యాత్ర లాంటిది. మన గమ్యం వచ్చినప్పుడు మనం దిగిపోవాలి. నా భార్య గమ్యస్థానం కేదార్‌నాథ్.
నేడు ధ్యానం, దైవ నామ స్మరణతో నా రోజు గడుస్తోంది. మళ్లీ కేదార్‌నాథ్‌కు వెళ్తారా? అని మీరు అడిగితే, కచ్చితగా వెళ్తానని చెబుతాను. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. వీలైతే పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్తాను.
ఇవి కూడా చదవండి:
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















