శవాల నుంచి అవయవాలను తీసి ఆన్‌లైన్‌లో అమ్ముకున్న మార్చురీ మాజీ అధికారి, కేసు నమోదు

ఫొటో సోర్స్, Thinkstock
- రచయిత, చెల్సియా బెయిలీ
- హోదా, బీబీసీ న్యూస్
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో భద్రపరిచిన మానవ అవయవాలు అమ్ముకుంటున్నట్లు పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.
ఈ ఘటనకు సంబంధించి హార్వర్డ్ మార్చురీ మాజీ మేనేజర్ సెడ్రిక్ లాడ్జ్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
హార్వర్డ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్‌కు విరాళంగా ఇచ్చిన మృతదేహాల నుంచి సెడ్రిక్ లాడ్జ్ "తల, మెదడు, చర్మం, ఎముకలు" తీసుకొని వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
సెడ్రిక్ ఆయన భార్య డెనిస్‌లు పెన్సిల్వేనియా, మసాచుసెట్స్‌లోని కొనుగోలుదారులకు ఈ శరీర భాగాలను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2018 నుంచి 2021 వరకు ఈ కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో "అనాటమికల్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్" మేనేజర్‌గా లాడ్జ్ పని చేశారు. వైద్య పరిశోధన కోసం విరాళంగా ఇచ్చిన శవాలను అమ్మడానికి ఆయన తన పదవిని ఉపయోగించుకున్నారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
దానం చేసిన మృతదేహాలను హార్వర్డ్ విద్యార్థులు వైద్య విధానాలను అధ్యయనం చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగిస్తారు. శవాన్ని ఉపయోగించాక, దహనం చేస్తారు. అవశేషాలు వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చేస్తారు. లేదా విశ్వవిద్యాలయ వైద్య స్మశాన వాటికలో వాటిని ఖననం చేస్తారు.
అయితే లాడ్జ్, ఆయన భార్య కలిసి ఆ మృతదేహాల శరీర భాగాలను కోసి, అమ్మి, రవాణా చేసినట్లు నేరారోపణలు ఉన్నాయి.
"హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని శవాగారం( మార్చురి )లోకి సెడ్రిక్ లాడ్జ్ పలువురిని అనుమతించారు. వారు ఏం కొనుగోలు చేయాలో ఎంచుకోవడానికి శవాలను పరిశీలించేవారు" అని అమెరికా అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'హెడ్ నంబర్ 7' విలువ రూ.81 వేలు
మసాచుసెట్స్‌లోని సేలంకు చెందిన కత్రినా మక్లీన్, పెన్సిల్వేనియాలోని వెస్ట్ లాన్‌కు చెందిన జాషువా టేలర్ ఈ శరీర భాగాలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు నమోదు చేసిన ఛార్జింగ్ స్టేట్‌మెంట్ ప్రకారం 2020 అక్టోబర్‌లో కత్రినా మక్లీన్ రూ.49 వేలకు ముఖాలను కొనుగోలు చేశారు. ఆమె దాన్ని లెదర్‌గా మార్చాలని భావించారు.
కత్రినా మక్లీన్, క్యాట్స్ క్రీపీ క్రియేషన్స్ అనే స్టోర్ యజమాని.
ఆమె సోషల్ మీడియా బిజినెస్ అకౌంట్లను చూస్తే, బొమ్మలను రక్తసిక్తంగా, భయపెట్టేవిగా మార్చడంలో ఆమె నిపుణురాలని అర్థమవుతోంది.
కాగా, ఆమె ఉత్పత్తుల్లో శవ భాగాలను ఉపయోగించారా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే, ఆమె దుకాణంలో మానవ అవశేషాలను నిల్వ చేసి విక్రయించినట్లు పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లో ఉంది.
ఇక టేలర్ నాలుగేళ్ల కాలంలో కొనుగోలు చేసిన శరీర భాగాల కోసం లాడ్జ్‌కి 39 సార్లు చెల్లింపులు చేశారు.
మొత్తం రూ.30 లక్షల కంటే ఎక్కువే చెల్లించినట్లు, ఒక కొనుగోలుకు రూ.81 వేలు పేపాల్‌లో చెల్లిస్తూ "హెడ్ నంబర్ 7" అని రాసినట్లు నేరారోపణలో ఉంది.
"కొన్ని నేరాలను అర్థం చేసుకోవడం కూడా కష్టం" అని అమెరికా అటార్నీ గెరార్డ్ ఎం. కరమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
"దొంగతనాలు, మానవుల అక్రమ రవాణా చూస్తుంటే మనం మనుషులం అనే విషయం కూడా మరిచిపోతున్నామా అనే భావన కలిగిస్తుంది." అన్నారు.
' ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం': హార్వర్డ్
సెడ్రిక్, డెనిస్ లాడ్జ్ ఇద్దరినీ బుధవారం న్యూ హాంప్‌షైర్ ఫెడరల్ కోర్ట్‌హౌస్ లో ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే బయటికొస్తుండగా వాళ్లు విలేఖరులతో మాట్లాడటానికి నిరాకరించారు.
నలుగురు నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువుల అంతర్రాష్ట్ర రవాణా తదితర అభియోగాలు మోపారు. నేరం రుజువైతే, వారందరికీ 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
"మా క్యాంపస్‌లో ఆందోళన కలిగించేది జరుగుతుందని తెలుసుకుని భయపడిపోయాను" అని హార్వర్డ్ యూనివర్శిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ డీన్ జార్జ్ క్యూ డేలీ అన్నారు.
సెడ్రిక్ లాడ్జ్ ఉద్యోగం మే 6నే ముగిసిందని డేలీ ధృవీకరించారు.
"దాతల కుటుంబాలు, వారి ప్రియమైనవారికి ఈ వార్త వల్ల కలిగే బాధకు మేం చింతిస్తున్నాం. ఈ సమయంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటామని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రతిజ్ఞ చేస్తోంది" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- అమృత్సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?
- చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?
- సౌదీతో చైనా ఒప్పందాలు చేసుకుంటే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది?
- మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














