ఉత్తర కొరియాలో ఆకలి చావులు, తిండి లేక కొండల్లోకి వెళ్ళి ఆత్మహత్యలు

ఉత్తర కొరియా
    • రచయిత, జీన్ మెకెంజీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర కొరియాలో ఆహారం చాలా తక్కువగా ఉంటోదని, తమ పొరుగువారు ఆకలితో చనిపోతున్నారని అక్కడి ప్రజలు బీబీసీతో చెప్పారు.

1990ల తర్వాత మళ్లీ ఇప్పుడు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఉత్తర కొరియా ప్రజలతో మాట్లాడిన నిపుణులు చెబుతున్నారు.

2020లో సరిహద్దులను ఉత్తర కొరియా ప్రభుత్వం మూసివేసింది. దీంతో దేశానికి వచ్చే అత్యవసర వస్తువుల సరఫరాలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రజలపై విధించిన ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయని ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వారు చెప్పారు.

అయితే, ప్రజా ప్రయోజనాలపైనే తాము ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు బీబీసీతో ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు.

ఉత్తర కొరియాలోని ముగ్గురు సాధారణ ప్రజలతో రహస్యంగా బీబీసీ మాట్లాడింది. దీని కోసం ‘‘డైలీ ఎన్‌కే’’ అనే సంస్థ సాయాన్ని మేం తీసుకున్నాం. దేశంలో డైలీ ఎన్‌కేకు మంచి నెట్‌వర్క్ ఉంది.

సరిహద్దులను మూసివేసిన తర్వాత ఆకలితో తాము చనిపోతామోనని లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉరి తీస్తారేమోననే భయం తమలో ఎక్కువైందని ఇక్కడి ప్రజలు వెల్లడించారు. ఉత్తర కొరియా ప్రజలే నేరుగా తమ ఇబ్బందులు, సమస్యలు ఇలా చెప్పడం చాలా అరుదు.

దేశంలో ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయో ఇక్కడి ప్రజల ఇంటర్వ్యూలు చెబుతున్నాయని ‘లిబర్టీ ఇన్ నార్త్ కొరియా’ (ఎల్ఐఎన్‌కే) సంస్థకు చెందిన సోకీల్ పార్క్ చెప్పారు. ఉత్తర కొరియా నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చేసేవారికి ఈ సంస్థ సాయం చేస్తోంది.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, NK NEWS

దేశ రాజధాని ‘ప్యోంగ్యాంగ్’లో జీవిస్తున్న ఓ మహిళ.. ఆకలితో మరణించిన ముగ్గురు సభ్యుల కుటుంబం తనకు తెలుసని చెప్పారు. ‘‘మంచి నీరు ఇచ్చేందుకు నేను వారి తలుపుకొట్టాను. కానీ, ఎవరూ రాలేదు’’ అని జీ యోన్ చెప్పారు. అధికారులు ఆ ఇంటిలోకి వెళ్లినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయని ఆమె తెలిపారు. గోప్యతను కాపాడేందుకు ‘జీ యోన్’తోపాటు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతరుల పేర్లను మార్చాం.

చైనాకు సరిహద్దుల్లో జీవించే నిర్మాణ రంగ కూలీ ‘చాన్ హో’తో కూడా మేం మాట్లాడాం. అక్కడ ఆహార పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇప్పటికే తమ గ్రామంలో ఐదుగురు ప్రజలు ఆకలితో చనిపోయారని ఆయన తెలిపారు.

‘‘మొదట్లో కోవిడ్-19తో చనిపోతామోనని భయం వేసింది. ఆ తర్వాత ఆకలితో చనిపోతామోననే భయం మొదలైంది’’ అని ఆయన అన్నారు.

దేశంలోని 2.6 కోట్ల మంది ప్రజలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉత్తర కొరియాకు ఎప్పుడూ లేదు. జనవరి 2020లో దేశ సరిహద్దులను ఉత్తర కొరియా మూసివేసింది. చైనా నుంచి ఆహార ధాన్యాల దిగుమతులను కూడా నిలిపివేసింది. మరోవైపు పంటల ఉత్పత్తికి అవసరమయ్యే ఎరువులు, యంత్రాల దిగుమతులను కూడా ఆపివేసింది.

సరిహద్దులను కంచెలతో పక్కాగా మూసివేశారు. ఎవరైనా ఆ కంచెలను దాటి వెళ్లాలని చూస్తే, షూట్ చేయాలని భద్రతా బలగాలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆహారం లేదా ఇతర వస్తువులను అక్రమంగా తీసుకొచ్చి దొంగ మార్కెట్లలో విక్రయించడం చాలా కష్టంగా మారింది.

దేశంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన వ్యాపారి మ్యోంగ్ సుక్ కూడా బీబీసీతో మాట్లాడారు. దేశంలోని మార్కెట్లలో నాలుగింట మూడొంతుల ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవని ఆమె చెప్పారు. కానీ, నేడు మార్కెట్‌లోని దుకాణాలు ఖాళీ అయిపోయాయని వివరించారు.

సరిహద్దుకు అవతల నుంచి అక్రమంగా తీసుకొచ్చే వస్తువులను ఇతరుల్లానే విక్రయిస్తూ ఆమె ఉపాధి పొందుతున్నారు. ‘‘ఇదివరకు మా కుటుంబానికి ఇంట్లో సరిపడా ఆహారం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇటీవల ఆహారం ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వండని కొందరు మా ఇంటికి వచ్చారు’’ అని ఆమె అన్నారు.

ప్యోంగ్యాంగ్‌లో జీవిస్తున్న జీ యోన్ మాట్లాడుతూ, ‘‘కొందరు ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు చనిపోవడానికి కొండల్లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే ఇక్కడ బతకడం వారికి అసాధ్యంగా అనిపించింది’’ అని చెప్పారు.

ఉత్తర కొరియా

తన పిల్లలకు ఆహారం పెట్టడం కూడా కష్టం అవుతోందని జీ యోన్ చెప్పారు. ఒకసారి రెండు రోజులు తనకేమీ తినడానికి దొరకలేదని, నిద్రలోనే ఆకలితో చచ్చిపోతానని భయం వేసిందని ఆమె అన్నారు.

1990ల చివరిలో ఉత్తర కొరియాలో విధ్వంసకర కరవు ప్రభావం చూపింది. దీంతో దాదాపు 30 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుతం మళ్లీ ఇక్కడ ఆకలితో చాలా మంది చనిపోతున్నారనే వార్తలను తాజా ఇంటర్వ్యూలు ధ్రువీకరిస్తున్నాయి.

‘‘మధ్యతరగతి ప్రజలు కూడా తమ ఇంటికి పొరుగున ఉండేవారు చనిపోవడాన్ని చూస్తున్నామని చెబుతుంటే, చాలా ఆందోళనకరంగా అనిపిస్తోంది’’ అని ఉత్తర కొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్ చెప్పారు. ‘‘భారీ స్థాయిలో అక్కడ ఆకలి చావులు సంభవిస్తున్నాని లేదా సమాజం కుప్పకూలుతోందని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ, పరిస్థితులు మాత్రం బాగాలేవని స్పష్టంగా తెలుస్తోంది’’ అని పీటర్ అన్నారు.

మరోవైపు ఈ వాదనతో ఉత్తర కొరియాలోని మానవ హక్కుల ఉల్లంఘనలపై వార్తలను ప్రచురించే ఎన్‌కేడీబీ డైరెక్టర్ హన్నా సాంగ్ కూడా ఏకీభవించారు. ‘‘గత 10-15 ఏళ్లుగా మనకు ఇక్కడ ఆకలి చావుల వార్తలు అంతగా వినిపించలేదు. మళ్లీ ఇప్పుడు పాత కరవు విజృంభిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి’’ అని హన్నా అన్నారు.

పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయనే చెప్పేలా ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా సంకేతాలు ఇచ్చారు. ఒక సందర్భంలో ఇక్కడ ‘‘ఆహార సంక్షోభం’’ తలెత్తిందని, వ్యవసాయ దిగుబడిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయినప్పటికీ అణ్వస్త్రాల తయారీ కార్యక్రమానికి నిధులు కేటాయించడంపైనే ఆయన ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. 2022లో రికార్డు స్థాయిలో ఇక్కడ 63 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించారు. ఈ పరీక్షల మొత్తం విలువ 500 మిలియన్ డాలర్లు(రూ. 4,108 కోట్లు)కుపైనే ఉంటుంది. ఇక్కడి ఆహార ధాన్యాల కొరతను తీర్చేందుకు అవసరమైన మొత్తం కంటే ఇది ఎక్కువ.

ఉత్తర కొరియా

మరోవైపు గత మూడేళ్లుగా శిక్షలను మరింత కఠినతరం చేయడం, కొత్త చట్టాలకు తీసుకురావడం లాంటి చర్యలతో ప్రజల జీవితాలపై ప్రభుత్వ నియంత్రణ మరింత ఎక్కువైందని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నవారు కూడా చెప్పారు.

కరోనావైరస్ మహమ్మారికి ముందు యాలూ నదిని ప్రమాదకరంగా దాటి చైనాలోకి ఏటా వెయ్యి కంటే ఎక్కువ మందే వెళ్లిపోయేవారని దక్షిణ కొరియా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు అలా పారిపోవడం కూడా చాలా కష్టమైందని మ్యోంగ్ సుక్ చెప్పారు. ‘‘మీరు కనీసం ఆ నదివైపుగా వెళ్లినా కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. కాబట్టి నది దాటి వెళ్లడం చాలా కష్టం అవుతోంది’’ అని అన్నారు.

నిర్మాణ రంగ కార్మికుడు చాన్ హో మాట్లాడుతూ.. కొంతమందికి రహస్యంగా ఉరిశిక్ష విధించడాన్ని తన స్నేహితుడి కుమారుడు చూసినట్లు చెప్పారు. ‘‘రోజురోజుకీ ఇక్కడ జీవించడం కష్టం అవుతోంది. ఒక్క తప్పుచేసినా ఉరి తీస్తారు. చావు కోసం ఎదురుచూస్తూ ఇక్కడ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

ఈ వార్తలపై స్పందించాలని ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని మేం కోరాం. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఇక్కడి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ప్రయత్నిస్తుంది’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు.

‘‘ప్రజలను సంరక్షించడమే మా తొలి ప్రాధాన్యం. మీరు చెబుతున్న వివరాలు సరైనవి కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి నుంచి తప్పుడు సమాచారాన్ని మీరు సేకరించారు’’ అని లండన్‌లోని ఉత్తర కొరియా దౌత్య కార్యాలయ ప్రతినిధులు చెప్పారు.

కానీ, ప్రజలపై మూడు వైపుల నుంచి తీవ్రమైన ప్రభావం పడుతోందని ప్రస్తుత పరిస్థితులు చూస్తే స్పష్టం అవుతోందని ఎల్‌ఐఎన్‌కేకు చెందిన సోకీల్ పార్క్ అన్నారు. ‘‘ఇక్కడ ఆహార సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు స్వేచ్ఛ నానాటికీ హరించుకుపోతోంది. మరోవైపు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవడం అసాధ్యంగా మారుతోంది’’ అని సోకీల్ అన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజలను ఉత్తర కొరియా అణచివేస్తోందని ఆయన చెప్పారు.

జీ యోన్ మాట్లాడుతూ.. ‘‘నిఘా, అణచివేత ఏ స్థాయిలో ఉందంటే, ప్రజల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోతోంది. డిసెంబరు 2020లో తీసుకొచ్చిన కొత్త చట్టం కింద నన్ను కూడా ప్రశ్నించడానికి తీసుకెళ్లారు. విదేశీ సినిమాలు, టీవీ షోలు, పాటలు వినడాన్ని ఈ కొత్త చట్టం నిషేధిస్తుంది. ముఖ్యంగా దేశంలోని విదేశీ కంటెంట్‌ను షేర్ చేస్తున్నట్లు రుజువైతే మరణ శిక్ష విధించేలా దీనిలో నిబంధనలు ఉన్నాయి’’ అని ఆమె చెప్పారు.

విదేశీ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు తీసుకొస్తున్న కొత్త చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూస్తుంటే షాక్‌గా అనిపిస్తోందని ఉత్తర కొరియా దౌత్తవేత్తగా పనిచేసి ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన రూ హ్యూన్ వూ చెప్పారు. ‘‘ఒకవేళ ప్రజలు తాము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో అర్థం చేసుకుంటే, తిరుగుబాటు రావొచ్చని కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై విపరీత నమ్మకమున్న వ్యక్తుల్లోనూ ప్రస్తుతం అనుమానాలు, సందేహాలు వస్తున్నాని ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు.

‘‘కోవిడ్-19కు ముందు కిమ్‌పై కొంతమంది ప్రజలు చాలా నమ్మకంతో ఉండేవారు. కానీ, ఇప్పుడు అందరిలోనూ అసహనం కనిపిస్తోంది’’ అని మ్యోంగ్ సుక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)