ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్‌పై నేపాల్‌లో వివాదం ఏంటి?

ఆదిపురుష్

ఫొటో సోర్స్, COMMUNIQUÉ FILM PR

    • రచయిత, ఘని అన్సారీ
    • హోదా, బీబీసీ న్యూస్ నేపాలీ

‘ఆదిపురుష్’ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్ మీద నేపాల్‌లో వివాదం తలెత్తింది.

ఈ చిత్రంలో సీతను భారత పుత్రికగా అభివర్ణించారు. దీనిపై నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా అభ్యంతరం వ్యక్తం చేశారు.

చిత్ర నిర్మాతలు సినిమా నుంచి ఆ డైలాగ్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్ర నిర్మాతలకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. అంతే కాకుండా, ఇతర హిందీ చిత్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు సినిమాలోని అభ్యంతరకర సంభాషణలను నేపాల్ సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేసిందని చిత్ర వర్గాలు బీబీసీకి తెలిపాయి.

సీత నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించారని నేపాల్ వాదిస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్‌పై నేపాల్‌లో వివాదం నెలకొంది.

ఆదిపురుష్‌లోని సీతను భారత పుత్రికగా అభివర్ణించే డైలాగ్‌ను తొలగించేంత వరకు ఖాఠ్మండూ మెట్రోపాలిటన్ సిటీలో ఏ ఇతర హిందీ సినిమాను కూడా అనుమతించబోమని బాలేంద్ర షా హెచ్చరించారు.

ఆదిపురుష్

ఫొటో సోర్స్, COMMUNIQUÉ FILM PR

నేపాల్ సెన్సార్ బోర్డు ఏం చెప్పింది?

ఈ డైలాగ్‌పై నేపాల్ సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.

''బుధవారమే సినిమా చూశాం. డైలాగ్స్ కట్ చేసిన తర్వాతే ప్రదర్శనలకు అనుమతిస్తామని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాం'' అని బీబీసీతో నేపాల్ సెన్సార్ బోర్డు సభ్యుడు రిషిరాజ్ ఆచార్య తెలిపారు.

ఈ డైలాగ్ సినిమాలో బీప్ చేశారని కొందరు అంటుండగా నేపాల్‌లో ఈ పదాలను సినిమా నుంచి తొలగించినట్లు ఆచార్య చెప్పారు.

“కనీసం సినిమా కాపీల నుంచి ఆ తప్పు డైలాగ్‌ని తొలగించాలి. నేపాల్‌ కాపీలో మేం దానిని తీసేశాం" అని ఆయన అన్నారు.

నేపాల్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ తప్పులతో సినిమాను ప్రదర్శించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డ్ తెలిపింది.

"జానకి భారత పుత్రిక అనే డైలాగ్‌పై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం'' అని బోర్డు ప్రెసిడెంట్ భువన్ కేసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేపాల్ స్వాతంత్య్రం, వారసత్వం, సరిహద్దులు మొదలైన సమస్యలపై లోపభూయిష్ట సన్నివేశాలు లేదా సంభాషణలను ప్రదర్శించే ప్రపంచంలోని ఏ చిత్రానికైనా ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డులు ఆమోదముద్ర వేయడం సరికాదని చెప్పారు.

ఈ నేపథ్యంలో సినిమాలోని వివాదాస్పద డైలాగ్‌ను తొలగించాలని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను బోర్డు కోరింది.

ఆదిపురుష్

ఫొటో సోర్స్, OM RAUT/FACEBOOK

'సినిమా ఆడించవద్దని సూచించాం'

మేయర్ హెచ్చరిక తర్వాత సోషల్ మీడియాలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయని నేపాల్ ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ దుంగనా చెప్పారు.

"భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం కాఠ్‌మాండూలో సినిమాను ప్రదర్శించరాదని సూచించాం" అని బీబీసీ నేపాలీ సర్వీస్‌తో భాస్కర్ అన్నారు.

అయితే, కాఠ్‌మాండూ లోయతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రదర్శనలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగాయని ఆయన పేర్కొన్నారు.

“వివాదాస్పద డైలాగ్‌ను తొలగించిన తర్వాత చర్చ అవసరం లేదు. సెన్సార్ బోర్డు ఇప్పటికే షోకు అనుమతి ఇచ్చింది’’ అని భాస్కర్ తెలిపారు.

గతంలో అక్షయ్‌కుమార్ చిత్రం 'చాందినీ చౌక్ టు చైనా'లో బుద్ధుడి గురించిన వివాదాస్పద డైలాగ్‌ను నేపాల్‌లో తొలగించి ప్రదర్శించారని ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)