బాపట్ల టెన్త్ విద్యార్థి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు, ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం...
హెచ్చరిక: ఇందులోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
"నాలుగు రోజులయ్యింది. ట్యూషన్ కోసం రోజూ ఉదయాన్నే 5 గంటలకి బయలుదేరుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా అలానే వెళ్ళాడు. అరగంట తర్వాత కబురు వచ్చింది. ఎవరో కొట్టారని చెప్పారు. అంతకుముందు కూడా ఓసారి దాడి జరిగింది. అలానే ఎవరో కొట్టి ఉంటారని అనుకున్నాం. కానీ ఇలా ప్రాణాలు తీస్తారని అనుకోలేదు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు పి.లక్ష్మి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు సమీపంలో జూన్ 16న జరిగిన సజీవ దహనం కేసులో మృతుడు అమర్నాథ్‌కు మేనత్త.
రాజవోలు హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఉప్పాల అమర్నాథ్ హత్యకు గురయిన తీరు కలకలం రేపింది. ఉదయాన్నే ఐదు గంటల సమయంలో దారి కాచి, దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం స్థానికులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.
తండ్రి చనిపోవడంతో అమ్మా, అక్క తో కలిసి తాతయ్య ఇంట్లో ఉంటున్నాడు అమర్నాథ్. ఉప్పాలా వారి పాలెం నుంచి సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవోలు హైస్కూల్ కి, అక్కడే ట్యూషన్ కి రోజూ వెళ్లి వచ్చేవాడు.
అమర్నాథ్ ప్రయాణించే మార్గం, సమయం అతని ప్రాణాల మీదకు తెచ్చిందని బంధువులు చెబుతున్నారు.

అమర్నాథ్ చివరి మాటలు
శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఇంటి దగ్గర బయలుదేరిన అమర్నాథ్ ని 10 నిమిషాల తర్వాత ఈ కేసులో అనుమానితుడిగా చెబుతున్న వెంకటేశ్వర్ రెడ్డి (23) మార్గం మధ్యలో అడ్డుకున్నారు.
సైకిల్ పై వెళుతుండగా అటకాయించి, సమీపంలో ఉన్న మొక్క జొన్న బస్తాల మాటుకి తీసుకెళ్లారు. అక్కడే అతడిపై దాడి చేసి, ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారని అమర్నాథ్ చెప్పిన మాటల వీడియో ఒకటి బయటకు వచ్చింది.
"సైకిల్ పై వస్తుండగా అడ్డుకున్నారు. రోడ్డు మీద నుంచి పక్కకి లెక్కెళ్ళారు. నోట్లో గుడ్డలు కుక్కారు. చేతులు వెనక్కి మడిచి కట్టేశారు. టార్పాలిన్‌లో చుట్టి పెట్రోల్ జల్లారు. వెంకీ (నిందితుడు) తో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్లు ఎవరో నాకు తెలీదు. నాకు ఏం జరిగిందో వాళ్లకి అదే జరగాలి. వదలొద్దు " అంటూ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా చెప్పిన మాటలే అమర్నాథ్ చివరి మాటలు అయ్యాయి.
ఘటనా స్థలం నుంచి గుంటూరు ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో మార్గం మధ్యలోనే ఆ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. గుంటూరు జీజీహెచ్ లోనే పోస్ట్ మార్టం నిర్వహించారు.
శనివారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి తరలిస్తుండగా చెరుకుపల్లి సెంటర్ లో అడ్డుకున్నారు. మృతదేహం రోడ్డు మీద పెట్టి బంధువులు, బీసి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అక్కని వేధిస్తుంటే అడ్డుగా నిలిచాడు అని...
అమర్నాథ్ మృతిపై చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎఫ్‌ఐఆర్ నంబర్ 119/2023గా కేసు నమోదయయింది. ఐపీసీలోని 302, 323, 34, 301, 504, 354 డీ సెక్షన్ల తో పాటుగా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి ఉప్పాల మాధవి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది.
"అమర్నాథ్ అక్క ఇంటర్ చదువుతోంది. ఆమెను వెంకీ అనే యువకుడు వేధిస్తున్నాడు. అతని మీద కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌కి చెప్పింది. కానీ ఇంట్లో చెబితే ఏమంటారో అని భయపడి చెప్పలేదు. ఫోన్లో మెసేజ్ చూసి తమ్ముడు అమర్నాథ్ దాన్ని గమనించాడు. టెన్త్ తర్వాత చదువు మానేసి ఆకతాయిగా తిరిగే వెంకటేశ్వర్ రెడ్డి భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఉండేవాడు. ఓసారి అమర్నాథ్ పై దాడి చేశాడు. అప్పట్లో అమర్నాథ్ తప్పించుకున్నాడు. వాళ్ల ఇంటికెళ్ళి మేమంతా గొడవ పెట్టాము. మళ్లీ మా అమ్మాయి జోలికి వస్తే కేసు పెడతామని హెచ్చరించాం. ఆ తర్వాత అంతా సర్దుకుందని భావిస్తే తీరా ఇంత దారుణానికి ఒడిగట్టాడు" అంటూ మృతుడి బంధువు పి.లక్ష్మి బీబీసీతో అన్నారు.
అమర్నాథ్ 15వ పుట్టిన రోజు జరుపుకుని పదిరోజులు కూడా కాలేదని ఆమె వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాం...
"పొద్దున్నే 5 దాటుతుంది. ఇంకా పడుకుని ఉన్నాను. ఏవో కేకలు వినిపిస్తే బయటకి వచ్చి చూశాను. ఆ అబ్బాయి ఒళ్లంతా కాలిపోయి ఉన్నాడు. ఎవరో గుర్తు పెట్టలేకపోయాను. ‘అన్నా రెడ్డియ్య మనవడిని’ అన్నాడు. ఇంట్లోంచి దుప్పటి తెచ్చి కప్పాము. నీళ్లు జల్లండి, ఒళ్లంతా మండిపోతోంది అన్నాడు. అలా చేయకూడదని చెప్పి, వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పేందుకు వెళ్లాం. వాళ్లు వచ్చేవరకూ మాట్లాడాడు. అంబులెన్స్ వచ్చే లోగా కారులో వేసి తీసుకెళ్లారు. దారిలో ఆంబులెన్స్ లోకి మార్చి ఆక్సిజన్ అందించారు. కానీ 90శాతం శరీరం కాలిపోవడంతో ప్రాణం పోయింది’’ అని రాజవోలుకి చెందిన దొంతుబోయిన రామ్మూర్తి రెడ్డి అనే ప్రత్యక్ష సాక్షి బీబీసీ కి చెప్పారు.
తాము వెళ్ళినప్పటికే అక్కడ గాయాలతో అమర్నాథ్ తప్ప ఎవరూ లేరని, మంటలు కొన్ని మొక్క జొన్న బస్తాలకి తాకడంతో నీళ్లు పోసి వాటిని ఆర్పామని గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్న మూర్తి రెడ్డి తెలిపారు.

దర్యాప్తు సాగుతోంది ..
అనుమానితుడు అగ్రకులానికి చెందిన వ్యక్తి కావడం, మృతుడు బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.
రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ హత్యోదంతం నిదర్శనమని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీ కులాలకి చెందిన వారికి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. చెరుకుపల్లి రహదారి పై బైఠాయించి ఆయన నిరసన తెలిపారు.
ఈ కేసులో ప్రాథమిక వివరాలు లభించాయని దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెబుతున్నారు
నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ బీబీసీతో అన్నారు. హత్యా నేరంతోపాటు పోక్సో చట్టాన్ని కూడా వర్తింపజేసి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని డీఎస్పీ అన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని రేపల్లె ఆర్డీఓ హామీ ఇచ్చారు.

ఉద్రిక్తత, పోలీస్ పికెట్..
హత్య జరిగిన రాజవోలు గ్రామ పంచాయతీకి శివారున మృతుడి గ్రామం ఉప్పాల వారి పాలెం ఉంటుంది. దాంతో రెండు చోట్లా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
అధికార వైఎస్సార్సీపీ కి చెందిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనకు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
రాష్ట్రంలో విద్యార్థులకు కూడా రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
అనుమానితుడు వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం చిన్న గుడిసెలో నివాసం ఉంటోంది. ఈ ఘటన తర్వాత వారు ఇళ్లు ఖాళీ చేశారు. వారి స్పందన కోసం బీబీసీ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
మరోవైపు సుమారు 4 గంటల పాటు మృతదేహంతో తల్లి, అక్క సహా బంధువులు, బీసి సంఘాలు ఆందోళన నిర్వహించిన తర్వాత అధికారుల హామీ తో నిరసన విరమించారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















