హైదరాబాద్: స్కూళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్లలోని ఫోటోలతో అశ్లీల 'మార్ఫింగ్' దందా

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో స్కూలు పిల్లలు, టీచర్లు, తల్లితండ్రుల ఫొటోలు మార్ఫింగ్ చేస్తోన్న ఒక యువతిని పోలీసులు సెప్టెంబర్ 25న అరెస్టు చేశారు.
పాతబస్తీకి చెందిన నేహా ఫాతిమా 2019లో బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. తరువాత ఫేస్‌బుక్‌లో ఉన్న ప్లే స్కూల్స్ వివరాలు సేకరించారు. ఫేస్‌బుక్ వేదికగా మార్ఫింగ్ ఫొటోల వ్యవహారం మొదలు పెట్టారు.
సాధారణంగా తమ స్కూల్ ఈవెంట్ల ఫొటోలను ప్రమోషన్ల కోసం యాజమాన్యాలు సోషల్ మీడియాలో పెడుతుంటాయి.
ఆయా స్కూళ్ల యాజమాన్యాలు పోస్ట్ చేసిన ఫొటోలలో నుంచి తల్లితండ్రులు, పిల్లలు, టీచర్లు, స్టాఫ్ ఫొటోలను ఫాతిమా డౌన్ లోడ్ చేసేవారు.
డౌన్ లోడ్ చేసిన ఫొటోల్లో తల్లితండ్రులు, టీచర్స్, స్టాఫ్ ఫోటోలను అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్ చేసి, తిరిగి అదే స్కూల్ పేజీలో పోస్ట్ చేసేవారు.
తరువాత తానే ఆ స్కూల్‌కి మెసేజ్ పంపి తాను సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిననీ, మీ ఫేస్ బుక్ పేజీ సెక్యూరిటీ సరిగా లేదనీ, అందుకే మార్ఫింగ్ ఫొటోలు వస్తున్నాయనీ, తాను దాన్ని సరిచేయగలననీ, అందుకు డబ్బులు చెల్లించాలనీ చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సైబర్ క్రైంలో ఫిర్యాదు
అలా ఆమె ఒక స్కూలు యాజమాన్యానికి ఒక మెసేజ్ పంపించారు. ఈ స్కూలు విషయంలో పెద్దలే కాదు, చిన్నారుల ఫొటోలు కూడా ఉపయోగించారు. అయితే, విద్యార్థిని ఫోటో మార్ఫింగ్ చేయకుండా కేవలం సేల్స్ గాళ్ అని ఒక ట్యాగ్ పెట్టి వదిలేశారు.
ఇదంతా చూసిన ఆ పాఠశాల యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం క్రితం ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఐపీ అడ్రస్ ఆధారంగా ఫాతిమాను బుధవారం అరెస్టు చేసిన పోలీసులు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
‘200 స్కూళ్ల యాజమాన్యాల నంబర్లతో వాట్సాప్ లిస్ట్’
నాలుగైదు స్కూళ్లకు సంబంధించిన మార్పింగ్ చేసిన ఫొటోలు ఫాతిమా దగ్గర దొరికినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అదనపు డీసీపీ కెసిఎస్ రఘువీర్ తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ ఒక స్కూలు యాజమాన్యం ధైర్యంగా ముందుకు రావడం వల్ల ముందుగానే గుర్తుపట్టగలిగాం. ఆమె సుమారు 200కి పైగా స్కూళ్ల యాజమాన్యాల నంబర్లు సేకరించి ఒక వాట్సాప్ లిస్ట్ తయారు చేసింది. ఆమె ఈ పని మొదలు పెట్టి 15 నుంచి 20 రోజులే అయింది. దీంతో మొదట్లోనే ఆమెను అరెస్టు చేయగలిగాం.
అనామక కాల్స్ ఎలా చేయాలి వంటి యాప్స్ ఆమె ఫోన్లో ఉన్నాయి. బహుశా స్కూళ్ల యాజమాన్యాలను బెదిరించి సైబర్ నిపుణురాలిగా పరిచయం చేసుకుని డబ్బు వసూలు చేయడం ఆమె ఉద్దేశం కావచ్చు. టెక్నికల్ ఎవిడెన్స్ మీద అరెస్టు చేశాం. ఐటీ చట్టం 67, 67ఏ సెక్షన్ల కింqద కేసు పెట్టాం. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి
- హైదరాబాద్ శివార్లలోని అద్రాస్పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది?
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








