డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ యువతుల ఆవేదన

లెస్బియన్ జంట
    • రచయిత, ఎస్ మహేష్
    • హోదా, బీబీసీ తమిళ్ కోసం

‘‘ఆమె, నేను చాలా బాగా అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్యన మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. జెండర్ ఆధారంగా మేం భాగస్వామిని ఎంపిక చేసుకోలేదు.’’ అని కేరళకు చెందిన లెస్బియన్ జంట అఫిఫా, సుమాయా చెప్పారు.

21 ఏళ్ల సుమాయా షెరీన్, అఫిఫాలు కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన కొందోటి ప్రాంతానికి చెందిన వారు.

తమ తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కోర్టు ప్రమేయంతో వీరిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు.

తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈ ఇద్దరు బీబీసీకి చెప్పారు.

12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ ఇద్దరూ ఒకటే పాఠశాలలో చదివారు.

అప్పటి నుంచి వారు మంచి స్నేహితులు. కరోనా లాక్‌డౌన్ సమయంలో లెస్బియన్ జంటల మాదిరి వారు కూడా లివిఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించారు.

‘‘నేను చెప్పకముందే ఆమె అర్థం చేసుకుంటుంది. నేనూ అలానే. మా ఇద్దరి మధ్యనున్న ఈ అర్థం చేసుకునే మనస్తత్వమే మమ్మల్ని ప్రేమలో పడేసింది.

కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మేమిద్దరం జెండర్‌ను చూడలేదు. ఎందుకంటే, మా ఇద్దరిదీ ఒకే రకమైన మనస్తత్వం’’ అని అఫిఫా అన్నారు.

వీరి సంబంధం గురించి తొలుత అఫిఫా ఇంట్లో తెలిసింది.

ఆ తర్వాత 2023 జనవరి 27న వీరు ఇళ్లు విడిచి వెళ్లిపోయారని మలప్పురం కొందోటి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

జనవరి 29న మలప్పురం జిల్లా కోర్టు ముందు ఈ జంట హాజరయ్యారు. కలిసి ఉండాలనుకుంటోన్న తమ కోరికను వారు కోర్టుకు చెప్పారు.

దీనికి కోర్టు అంగీకరించింది. వారు కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చింది.

విడిపోయిన జంట

ఎర్నాకుళంలో ఒక కంపెనీలో పనిచేస్తోన్న ఈ ఇద్దరూ అక్కడే కలిసి జీవించడం ప్రారంభించారు. కానీ, మే 30న వారు పనిచేసే ప్రాంతానికి వచ్చిన అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు, ఆమెను బలవంతంగా సుమాయాకు దూరంగా తీసుకెళ్లారు.

సుమాయా ఈ విషయాన్ని ఎర్నాకుళంలోని కొందోటి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కానీ, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఆ తర్వాత జూన్ 5న సుమాయా కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 9న అఫిఫాను తమ ముందు హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.

కానీ, కోర్టు ఆదేశాలు పాటించలేదు. తమకు సమయం కావాలని కోరారు. ఆ తర్వాత జూన్ 19న అఫిఫాను ఆమె తల్లిదండ్రులు కోర్టుకు తీసుకొచ్చారు.

ఆ సమయంలో అఫిఫా తాను సుమాయాతో కలిసి జీవించాలనుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. తాను తన తల్లిదండ్రులతో వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు.

KERALA HIGH COURT

ఫొటో సోర్స్, KERALA HIGH COURT

ఫొటో క్యాప్షన్, కేరళ హైకోర్టు

బలవంతంగా శస్త్రచికిత్స

ఆ తర్వాత కొన్ని రోజులకు సుమాయాకు ఫోన్ చేసిన అఫిఫా, తానేదీ కూడా కోర్టు ముందు కావాలని మాట్లాడలేదని, తనకు వైద్య చికిత్స చేయించారని తెలిపారు.

సేమ్ సెక్స్ ఎట్రాక్షన్‌కు గురి కాకుండా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఈ థెరపీని చేయించారని చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న తర్వాత సుమాయా, వనజా కలెక్టివ్ అనే సంస్థ ద్వారా పోలీసుల సాయంతో అఫిఫాను తన ఇంటి నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు.

అఫిఫా తల్లిదండ్రులు, ఆమె గ్రామానికి చెందిన ప్రజలు లెస్బియన్ సంబంధాలను వ్యతిరేకిస్తున్నారు.

ఎన్నో ఇబ్బందుల తర్వాత పోలీసుల సాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు.

కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు.

సుమాయా నుంచి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు, వైద్య చికిత్స చేయించారు.

కోర్టుకు తీసుకొచ్చేంత వరకు కూడా ఆమెుక సేమ్ సెక్స్ ఆకర్షణకు లోనుకాకుండా వైద్య చికిత్స చేయించారు.

‘‘వారు నన్ను బలవంతంగా కోళికోడ్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే నాకు అనస్థీషియా ఇచ్చి, రక్త పరీక్షలు చేశారు.

రెండు రోజుల పాటు నేను స్పృహలో లేను. ఆ తర్వాత నేను డాక్టర్‌కి మా సంబంధం గురించి చెప్పాను. నేను సుమాయా దగ్గరికి వెళ్లాలనుకుంటున్నానని అన్నాను’’ అని అఫిఫా తెలిపారు.

కానీ, ‘‘నాకు చికిత్స చేసిన డాక్టర్, కౌన్సిలర్ ఏం చెప్పారంటే నేను హోమోసెక్సువాలిటీ డిజార్డర్ బారిన పడినట్లు చెప్పారు. ఇద్దరు మహిళల మధ్య సంబంధం అసహజం అని తెలిపారు. కానీ, దీన్ని తేలిగ్గానే నయం చేయొచ్చని అన్నారు’’ అని అఫిఫా తెలిపారు.

కోర్టు ముందు హాజరు కావడానికి వెళ్లే ముందు కూడా తనకి సుమాయా దగ్గరికి వెళ్లాలని ఉందని అఫిఫా తెలిపారు.

కానీ, కోపగించుకున్న డాక్టర్ తనకు అనస్థీషియా అదనపు డోసును ఇచ్చారు.

సేమ్ సెక్స్ మ్యారేజ్

ఫొటో సోర్స్, Getty Images

‘అప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నా’

‘‘దాని వల్ల నేను కోర్టులో హాజరైనప్పుడు, అపస్మారక స్థితిలో ఉన్నాను. శరీరం కూడా సహకరించ లేదు. నడిస్తే పడిపోతానేమో అన్నట్లు అనిపించింది. నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను. మాట్లాడలేకపోయాను’’ అని అఫిఫా తెలిపారు.

తన తల్లిదండ్రులు కూడా అప్పటికే బెదిరించినట్లు చెప్పారు.

‘‘చచ్చినా మేం సుమాయా దగ్గరికి వెళ్లనీయం. సుమాయాను మేం చంపేస్తాం’’ అని అన్నట్టు అఫిఫా తెలిపారు.

ఒకవేళ తాను మాట్లాడితే సుమాయాకు ఏదైనా జరుగుతుందేమోనని కూడా భయపడినట్లు ఆమె చెప్పారు. అందుకే కోర్టులో అలా మాట్లాడాల్సి వచ్చిందని అఫిఫా వివరించారు.

కేవలం శారీరక సంబంధం కోసమే తాము కలిసి ఉండాలనుకుంటున్నామని మాటలు అనేవారని, కనీసం సమాజం తమ ప్రేమను అంగీకరించలేదని సుమాయా-అఫిఫా జంట చెప్పారు.

‘‘ఇద్దరు మహిళలు కలిసి ఉండటం లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం మాత్రమే చేపట్టే లైంగిక సంభోగంగా చూస్తున్నారు. ఇలా అనుకునే వారితో మాట్లాడటం అనవసరం, అర్థరహితం. అర్థం చేసుకునేలా వారిని మార్చలేం’’ అని తెలిపారు.

‘‘డాక్టర్లే మా సంబంధం గురించి అర్థం చేసుకోలేనప్పుడు, తల్లిదండ్రులు, సమాజం ఎలా అర్థం చేసుకోగలదు. వారి నుంచి మేం దాన్ని ఆశించగలం’’ అని సుమాయా బాధతో అన్నారు.

సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల నుంచి ఎంతో మంది మమ్మల్ని విమర్శిస్తున్నారని వారు చెప్పారు.

‘‘మా సంబంధానికి కారణం కామం అంటున్నారు. కానీ, వారికి సొంత అకౌంట్ల నుంచి మమ్మల్ని విమర్శించే ధైర్యం లేదు’’ అని ఈ ఇద్దరూ అన్నారు.

సేమ్ సెక్స్ మ్యారేజ్

ఫొటో సోర్స్, Empics

పోలీసు రక్షణ కోరిన జంట

భారత్‌లో సేమ్ సెక్స్ వారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వ్యవస్థ లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సేమ్ సెక్స్ పీపుల్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే విషయంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.

‘‘సుప్రీంకోర్టు వారి సెంటిమెంట్లను అర్థం చేసుకోవాలి. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌ను గుర్తించాలి. మాలాంటి వారు చట్టబద్ధంగా కలిసి ఉండేలా అనుమతించాలి’’ అని అఫిఫా-సుమాయా జంట కోరారు.

అఫిఫా తల్లిదండ్రుల నుంచి తమకు ముప్పు ఉందని, బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ మరోసారి అఫిఫా-సుమాయా జంట కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

వారు తమల్ని అంతకుముందు బలవంతంగా విడదీయాలని ప్రయత్నించారని చెప్పారు.

జూలై 5న వీరి కేసుపై వాదనలను విన్న కేరళ హైకోర్టు, ఆ రాష్ట్ర పోలీసు డీజీపీ, ఎర్నాకుళం పోలీసు కమిషనర్‌కు వారిద్దరికీ అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. జూలై 21న ఈ కేసు తదుపరి వాదనలను విననున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)