హోప్ కుక్: సిక్కిం రాజు ప్రేమలో నిండా కూరుకుపోయిన ఈ అమెరికా అమ్మాయి ప్రేమకథలోని రహస్య కోణం ఏంటి, సీఐఏ ఏజెంటని ఎందుకనేవారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1959లో మండు వేసవి. దార్జిలింగ్‌లోని విండామేయర్ హోటల్ బయట సిక్కిం యువరాజు థోండుప్ చోగ్యాల్ మెర్సిడీజ్ కారు ఆగింది. లోపలకు వెళ్తూనే తన ఫేవరెట్ డ్రింక్‌ను ఆయన ఆర్డర్ చేశారు.
ఆ రోజు సాయంత్రం హోటల్ లోపల కూర్చున్న ఒక అమ్మాయిపై ఆయన కళ్లు పడ్డాయి. ఆమె అమెరికాలో చదువుకుంటోందని, సెలవులు ఎంజాయ్ చేసేందుకు భారత్ వచ్చిందని నిమిషాల్లోనే ఆయన తెలుసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఆమె విండామేయర్ హోటల్‌లోనే ఉంటోందని కూడా ఆయనకు సమాచారం అందింది.
ఆ అమ్మాయి పేరు హోప్ కుక్. ఆమెను యువరాజు కలిశారు. తొలి చూపుల్లోనే ఒకరిపై మరొకరికి ఆకర్షణ కలిగింది.
అప్పటికి యువరాజు వయసు 36 ఏళ్లు. ఆయన మొదటి భార్య మరణించారు. ఆమె ద్వారా యువరాజుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే, హోప్ కుక్‌కు అప్పటికి 19 ఏళ్లు. దీంతో ఆమెతో రిలేషన్‌లోకి వెళ్లేందుకు మొదట్లో యువరాజు కాస్త తటపటాయించారు. వీరిద్దరి మధ్య తొలి కలయిక తర్వాత, మళ్లీ కలుసుకునేందుకు రెండేళ్లు పట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి ప్రస్తావన తెచ్చింది యువరాజే..
1961లో మళ్లీ భారత్‌కు హోప్ కుక్ వచ్చారు. మళ్లీ దార్జిలింగ్‌లోని విండామేయర్ హోటల్‌లోనే ఆమె బస చేశారు. ఈ విషయాలను తన జీవిత చరిత్ర ‘టైమ్ చేంజ్’లో ఆమె వివరంగా రాశారు.
‘‘నేను ఆ హోటల్‌లోనే ఉన్నానని యువరాజుకు ఎలా తెలిసిందో ఏమో.. నేను టీ తాగుతుండగా ఆయన లోపలకు వచ్చారు’’ అని ఆమె వెల్లడించారు.
‘‘గూర్ఖా రెజిమెంట్‌లో ఆయన ‘ఆనరరీ ఆఫీసర్’. ఒక మిలిటరీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన గంగ్‌టోక్ వచ్చారు. ఆ రోజు సాయంత్రం జింఖానా క్లబ్‌కు తనతో రావాలని ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ రోజు ఆయన మంచి మూడ్‌లో ఉన్నారు. ‘ఏదో ఒక రోజు మనం ఇలానే వియన్నాలోనూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతాం’అని నాతో చెవిలో గుసగుసలాడారు’’ అని ఆమె తన ఆత్మకథలో రాశారు.
ఆ రోజు రాత్రి క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ మధ్యలో ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని హోప్ కుక్‌ను యువరాజు అడిగారు.
అయితే, అప్పటికి హోప్‌కుక్‌కు 21 ఏళ్లు కూడా నిండలేదు. కానీ, యువరాజు ప్రేమను ఆమె అంగీకరించారు. ఆ తర్వాత ఆమెను యువరాజు గంగ్‌టోక్ తీసుకెళ్లారు.
అక్కడి రాజ భవనం మొత్తం తిప్పి ఆమెకు అన్నీ చూపించారు. దీంతో తనకు మేఘాల్లో తేలినట్లుగా అనిపించిందని తన ఆత్మకథలో హోప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘హాలీవుడ్ నటి గ్రేస్ కెల్లీలా..’
1963లో సిక్కిం యువరాజు థోండుప్ చోగ్యాల్‌ను హోప్ కుక్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు చేతిలో చేయి వేసుకొని నడుస్తున్న ఫోటోలు అమెరికా మీడియాలో ప్రచురించారు. మొనాకో రాకుమారుడు రేనియర్-3ను పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటి గ్రేస్ కెల్లీతో చాలామంది ఆమెను పోల్చారు.
‘సిక్కిం: ఎ క్వీన్ రీవిజిటెడ్’ పేరుతో టైమ్ మ్యాగజైన్ 1969లో ఒక కథనం ప్రచురించింది. ‘‘రోజూ ఉదయం 8 గంటలకు హోప్ నిద్రలేస్తారు. ఆ తర్వాత ఆమె విదేశాల నుంచి వచ్చిన పత్రికలు చదువుతారు. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రజలకు లేఖలు రాయడం, ఫుడ్ మెనూను సిద్ధం చేయడం, ప్యాలెస్‌లోని సేవకులకు పనులు అప్పగించడం లాంటి పనులు చేస్తారు. రాత్రి భోజనానికి ముందుగా ఆమె స్కాచ్, సోడా కలిపి తీసుకుంటారు. మెర్సిడీజ్‌లోనే గంగ్‌టోక్ మొత్తం ఆమె తిరుగుతుంటారు. అయితే, విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రం ఎకానమీ క్లాసు వైపే మొగ్గుచూపుతారు’’ అని ఆ కథనంలో రాశారు.
పెళ్లి తర్వాత వీరి గురించి రాజకీయ వర్గాలతోపాటు పశ్చిమ దేశాల మీడియాలో, ముఖ్యంగా అమెరికాలో, చాలా చర్చ జరిగేది. హోప్ కూడా ‘స్వతంత్ర సిక్కిం’కు రాణిలా ప్రవర్తించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ అతిథులతో సమావేశాలు..
1973 జులై 2న మారుతున్న హోప్ విధానాలపై న్యూస్‌వీక్ ఒక కథనం ప్రచురించింది. ‘‘అమెరికా మాజీ ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నడీ తరహాలో గుసగుస లాడటం హోప్ మొదలుపెట్టారు. మాట్లాడేటప్పుడు కూడా ‘నేను’ అనేందుకు బదులుగా ‘మనం’ అంటున్నారు. ప్రపంచ మహారాణుల తరహాలో ఆమెను ఆమె చూసుకుంటున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.
మరోవైపు హోప్‌ను కలిసే విదేశీ అతిథుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారత్‌కు అమెరికా రాయబారిగా పనిచేసిన కెన్నిత్ కీటింగ్, అమెరికా కాంగ్రెస్ సెనేటర్ చార్లెస్ పెర్సీ తదితరులు ఆమెను కలిసేందుకు గంగ్‌టోక్‌కు వచ్చేవారు.
ఈ విషయాన్ని భారత నిఘా సంస్థ ‘రా’ స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన జీబీఎస్ సిద్ధు తన పుస్తకం ‘సిక్కిం: డాన్ ఆఫ్ డెమొక్రసీ’ పుస్తకంలోనూ ప్రస్తావించారు. ‘‘హోప్‌తో విదేశీ ప్రతినిధుల సమావేశాలను పశ్చిమ దేశాల మీడియాలో ప్రధానంగా ప్రస్తావించేవారు. సిక్కిం స్వాతంత్ర్యాన్ని భారత్ అడ్డుకుంటోందనే కోణంలో కథనాలను రాసేవారు. అదే సమయంలో సిక్కింను స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత్‌పై చోగ్యాల్ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించేవారు. ఈ అంశంపై అంతర్జాతీయ దృష్టి పడేలా చూసేందుకు హోప్ కుక్ పనిచేసేవారు’’ అని సిద్ధు తన పుస్తకంలో వివరించారు.
భారత్‌పై విమర్శలు ఎక్కుపెట్టేందుకు చిక్కిన ఏ అవకాశాన్నీ హోప్ కుక్ వదలుకునేవారు కాదని దిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయంలో పనిచేసిన అమెరికా విదేశాంగ శాఖ అధికారి విలియమ్ బ్రౌన్ చెప్పారు.

ఫొటో సోర్స్, PENGUIN
‘దార్జిలింగ్‌పై హక్కుల కోసం..’
1966లో హోప్ కుక్ నేరుగా ‘‘సిక్కిమీస్ థియరీ ఆఫ్ ల్యాండ్‌హోల్డింగ్ అండ్ ద దార్జిలింగ్ గ్రాంట్’ పేరుతో నాంగ్యాల్ ఇన్‌స్టిట్యూట్ జర్నల్‌కు ఒక వ్యాసం రాశారు. 1835లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దార్జిలింగ్ జిల్లాను అప్పగించడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు.
దార్జిలింగ్‌ను కేవలం లీజుకు మాత్రమే ఇచ్చారని ఆ కథనంలో హోప్ కుక్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు దార్జిలింగ్‌ను సిక్కిం రాజ కుటుంబానికి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ కథనం ఒక రాజకీయ డైన్‌మైట్‌ల సంచలనం సృష్టించింది.
ఈ కథనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ప్రచురితమైన ఆ జర్నల్‌ను నడిపించే ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిఘా సంస్థ సీఐఏతో సంబంధముంది. ఈ వివాదంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కెన్ కాన్బీ తన పుస్తకం ‘‘సీఐఏ ఇన్ టిబెట్’’లో స్పందించారు.
‘‘టిబెట్ ఆపరేషన్ పాల్గొన్న సీఐఏ ఏజెంట్లు ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకునేవారు. అందుకే ఆ జర్నల్‌లో హోప్ కుక్ కథనం ప్రచురితం కావడంతో ఆమెను సీఐఏ ప్రతినిధిగా చూడటం మొదలుపెట్టారు’’ అని కెన్ రాశారు.

ఫొటో సోర్స్, PHOTO DIVISION
ఆ కథనంపై ఇందిరా గాంధీ దృష్టి..
అయితే, ఆ కథనాన్ని రాజకీయంగా చర్చ జరిగేలా చూసేందుకే రాసినట్లు తన ఆత్మకథలో హోప్ కుక్ చెప్పారు. కానీ, ఆ కథనం తర్వాత ఏం జరిగిందో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆండ్రూ డఫ్ తన పుస్తకం ‘‘సిక్కిం రెక్వియం ఫర్ ఎ హిమాలయన్ కింగ్‌డమ్’’లో రాశారు.
‘‘ఇది కేవలం రాజకీయ వర్గాల్లో చర్చ లేవనెత్తేందుకే రాసినట్లు హోప్ కుక్ చెప్పారు. కానీ, దీనికి భిన్న పరిస్థితులు ఆనాడు నెలకొన్నాయి. దార్జిలింగ్‌పై హక్కులను ఈ కథనం ద్వారా ప్రశ్నించినట్లు అయింది. కొన్ని రోజుల్లో భారత్ మీడియాలో హోప్ కుక్‌ను విమర్శిస్తూ చాలా కథనాలు వచ్చాయి. ‘సీఐఏ ఏజెంట్ రెక్కలు చాచింది, ట్రోజన్ హార్స్ నాక్స్ ఇన్ గంగ్‌టోక్’ లాంటి శీర్షికలతో వార్తలు వచ్చాయి’’ అని ఆయన వివరించారు.
ఆ తర్వాత ఈ కథనాలు ఇందిరా గాంధీ వరకూ వెళ్లాయి. ఈ విషయాన్ని సునంద దత్తా రే తన పుస్తకం ‘స్మాష్ అండ్ గ్రాబ్’లో రాశారు.
‘‘ఈ విషయంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఇందిరా గాంధీ స్పందించారు. దార్జిలింగ్‌పై హక్కుల కోసం డిమాండ్ చేస్తూ రాసిన ఆ కథనం బాధ్యతారాహిత్యంగా ఉందని ఆమె అన్నారు. హోప్ కుక్ తెలివితక్కువతనంపై సిక్కింకు స్పష్టమైన సందేశం పంపేందుకు ‘బాధ్యతారాహిత్యం’ అనే పదాన్ని ఇందిరా గాంధీ ఉపయోగించారు’’ అని దత్తా రాశారు.
‘‘మరోవైపు గంగ్‌టోక్‌లో చోగ్యాల్ కూడా ఈ వివాదానికి దూరం జరిగారు. మా ప్రభుత్వం ఇక్కడి ప్రజల హక్కులను పరిరక్షిస్తుందని, ఈ విషయంలో మాకు నాంగ్యాల్ ఇన్‌స్టిట్యూట్ లేదా ఆ సంస్థ మ్యాగజైన్ సాయం అవసరం లేదని చోగ్యాల్ చెప్పారు’’ అని దత్తా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఐఏ ఏజెంట్ ఆరోపణలపై..
వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాంతానికి రాజు ఒక అమెరికా అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగినప్పుడు ఈ అవకాశాన్ని అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ ఉపయోగించుకోకుండా ఎలా ఉంటుందని భారత్‌లోని రాజకీయ వర్గాల్లో అప్పట్లో చాలా చర్చలు జరిగేవి.
అయితే, హోప్ కుక్ సీఐఏ ఏజెంట్ అనే వార్తలను భారత్ నిఘా సంస్థల వర్గాలు తోసిపుచ్చాయి.
ఈ విషయంపై జీబీఎస్ సిద్ధు స్పందిస్తూ.. ‘‘నిజంగా సిక్కిం స్వాతంత్ర్యం కోసం హోప్ కుక్ సాయం తీసుకోవాలి అనుకుంటే ఆ అంశంపై కాస్త భిన్నంగా వారు ముందుకు వెళ్లేవారు. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ సిక్కింలపై పట్టుకోసం హోప్ కుక్ సాయాన్ని తీసుకునేవారు’’ అని ఆయన రాశారు.
నిజానికి హోప్ కుక్ టిబెటన్ రాణిలా ప్రవర్తించేవారు. టిబెటన్ తరహాలో దుస్తులు కూడా వేసుకునేవారు.
‘‘మీరు ఒక్క నిమిషం ఆమెను సీఐఏ ఏజెంట్‌గా ఊహించుకోండి.. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఆమె నడుచుకునే తీరుకు పొంతనలేక ఆమె హ్యాండ్లర్లు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. అయితే, ఇక్కడ సీఐఏతో చోగ్యాల్ అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చోగ్యాల్ నిఘా విభాగం అధిపతి కర్మా తోపడెన్ కలకత్తాలోని సీఐఏ అధికారులతో తరచూ మాట్లాడేవారు’’ అని సిద్ధు చెప్పారు.
‘‘మరోవైపు యువరాజుగా ఉన్నప్పుడే టిబెట్‌ను చోగ్యాల్ రెండుసార్లు సందర్శించారు. అయితే, ఆ రెండుసార్లూ ఆయనతోపాటు సీఐఏ అధికారులు వెళ్లారు. చోగ్యాల్ కలకత్తా వచ్చినప్పుడు కూడా అమెరికా దౌత్య కార్యాలయానికి సమీపంలో బసచేసేవారు’’ అని సిద్ధు వివరించారు.
‘‘బహుశా సీఐఏతోపాటు బ్రిటన్ నిఘా సంస్థ ఎంఐ6 ప్రతినిధులతోనూ చోగ్యాల్ తరచూ మాట్లాడేవారు కావచ్చు. అయితే, టెక్నాలజీ విషయంలో ముందంజలో ఉండే సీఏఐ కావాలని అనుకుంటే హోప్ కుక్ సాయంతో మెరుగ్గా సమాచారాన్ని సేకరించి ఉండొచ్చు’’ అని సిద్ధు చెప్పారు.

ఫొటో సోర్స్, PENGUIN
చోగ్యాల్ పతనానికి ముందే వెళ్లిపోయిన హోప్ కుక్
అయితే, చోగ్యాల్ కంటే హోప్ కుక్ చాలా తెలివైనవారు. భారత్‌తో మే 8, 1973న కుదుర్చుకున్న ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయో ఆమె ముందుగానే అంచనా వేశారు. దీనికి సరిగ్గా రెండు నెలల తర్వాత సిక్కింను ఆమె శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఫలితంగా తన భర్త పతనాన్ని చూడాల్సిన పరిస్థితి ఆమెకు రాలేదు. మొత్తానికి 1973 ఆగస్టు 14న సిక్కిం నుంచి ఆమె వెళ్లిపోయారు.
ఈ తర్వాత పరిణామాలను సిక్కిం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన బీడీ దాస్ తన జీవిత చరిత్ర ‘‘మెమరీస్ ఆఫ్ ఏన్ ఇండియన్ డిప్లొమాట్’’లో ప్రస్తావించారు.
‘‘ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్లొద్దని చోగ్యాల్ ఆమెను చాలా వేడుకున్నారు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. హెలిప్యాడ్ వరకూ ఆమెను నేనే తీసుకెళ్లాను. చివర్లో ఆమె ‘దాస్ గారు, నా భర్తను చూసుకోండి. ఇక్కడ నేను చేయాల్సిన పనులేమీ మిగల్లేదు’అని చెప్పి వెళ్లిపోయారు’’ అని దాస్ చెప్పారు.
‘‘కొంతమంది ఆమెను సీఐఏ ఏజెంట్ అనేవారు. కానీ, వాస్తవానికి ఏం జరిగిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. అయితే, భారత్‌కు వ్యతిరేకంగా నడుచుకునేలా చోగ్యాల్‌ను ఆమె ప్రేరేపించారు. సిక్కిం విద్యార్థుల పాఠ్యాంశాల్లోనూ ఆమె మార్పులు చేశారు. భారత నాయకులు, అధికారుల ముందు ఆమె రాణిలా ప్రవర్తించేవారు. అయితే, వారి వెనుక కోపంతో తిట్లు కూడా తిట్టేవారు’’ అని దాస్ వివరించారు.

ఫొటో సోర్స్, HTTP://SIKKIMARCHIVES.GOV.IN/
ఆమె ఎందుకు వదిలి వెళ్లిపోయారు?
సిక్కింను విడిచిపెట్టి వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఆమె చోగ్యాల్ నుంచి విడాకులు కోరారు. మరోవైపు అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వాలని మళ్లీ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. చోగ్యాల్‌తో సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆమె ఆయన్ను వదిలి వెళ్లిపోయారని చాలా మంది చెప్పుకునేవారు.
బెల్జియంకు చెందిన ఒక వివాహితతో చోగ్యాల్ సంబంధం వల్లే హోప్ కుక్ దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
‘‘అతడి ప్రేయసి ప్రేమ లేఖలు రాసేవారు. కొన్నిసార్లు ఆయన నన్ను హత్తుకునేటప్పుడు ఆయన జేబులో ఆ లేఖలు నాకు కనిపించేవి. కొన్నిసార్లు ఆ లేఖలు జేబులో నుంచి జారిపడేవి. అలా వాటిని నేను చదివాను’’ అని తన ఆత్మకథలో హోప్ కుక్ రాశారు.
మరోవైపు చోగ్యాల్ విపరీతంగా మద్యం సేవించేవారు. ఒకసారి బాగా తాగిన చోగ్యాల్ తన రికార్డు ప్లేయర్‌ను కిటికీలో నుంచి కిందకు విసిరేశారు. ఇలాంటి పనులే చోగ్యాల్, కుక్‌ల మధ్య దూరం పెంచాయని చెబుతారు.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
రాజ భవనాన్ని చుట్టుముట్టిన సైనికులు..
1974 జూన్ 30న ఇందిరా గాంధీతో చోగ్యాల్ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సిక్కింను తమలో కలుపుకునే చర్యలను భారత్ మొదలుపెట్టింది. 1975 ఏప్రిల్ 9న సిక్కిం ప్యాలెస్‌ను భారత సైనికులు చుట్టుముట్టారు.
‘‘ప్యాలెస్ గేట్ దగ్గర పనిచేసే బసంత్ కుమార్ ఛెత్రి భారత సైనికులపై కాల్పులు జరిపారు. అయితే, సైనికులు దీటుగా జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు’’ అని జీబీఎస్ సిద్ధు రాశారు.
‘‘అప్పుడు చోగ్యాల్ చాలా భయపడ్డారు. అక్కడ ఏం జరుగుతోందో కనుక్కునేందుకు తన సెక్యురిటీ ఆఫీసర్ గుర్బచన్ సింగ్‌కు ఆయన ఫోన్ చేశారు. కానీ, ఆ ఫోన్‌ను భారత సైన్యంలో జనరల్‌గా పనిచేసిన ఖుల్లర్ ఎత్తారు’’ అని సిద్ధు వివరించారు.
ఆ రోజు 12.45 గంటలకు సిక్కిం స్వతంత్ర హోదా కథ ముగిసింది. ఇదే విషయాన్ని రేడియో వేదికగా చోగ్యాల్ అంగీకరించారు. ఆ తర్వాత చోగ్యాల్‌కు గృహ నిర్బంధం విధించారు. ఆ తర్వాత సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా ప్రకటించే బిల్లును లోక్‌సభలో 1975 ఏప్రిల్ 23న ప్రవేశపెట్టి ఆమోదించారు. దీనికి మూడు రోజుల తర్వాత రాజ్యసభ కూడా ఆ బిల్లును ఆమోదించింది.

ఫొటో సోర్స్, Getty Images
హోప్ కుక్ తిరిగి రాలేదు..
ఆ షాక్ నుంచి చోగ్యాల్ ఎప్పటికీ కోలుకోలేదు. ఆ తర్వాత ఆయనకు క్యాన్సర్ వచ్చింది. చికిత్స కోసం ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లారు.
1982 జనవరి 29న చోగ్యాల్ మరణించారు. ఆ తర్వాత కూడా హోప్ కుక్ అమెరికాకే పరిమితం అయ్యారు.
1989లో ఓప్రా విన్‌ఫ్రే టాక్ షో ‘ఓప్రా’లో హోప్ కుక్ పాల్గొన్నారు. సిక్కింతో తనకు అప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయని ఆమె చెప్పారు.
1983లో చరిత్రకారుడు మైక్ వాలెస్‌ను హోప్ కుక్ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆయనకు కూడా ఆమె విడాకులు ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














