ఉమ్మడి పౌర స్మృతిని బీజేపీ మిత్రపక్షాలు ఏ రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నాయి?

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ కోసం
ఉమ్మడి పౌర స్మృతితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈశాన్య భారతంలోని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కూడా ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తున్నాయి.
మేఘాలయలో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ దీన్ని భారత ఆలోచనలకు పూర్తిగా విరుద్ధమైనదని అభివర్ణించింది.
అలాగే, మణిపూర్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన నాగా పీపుల్స్ ఫ్రంట్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తే ప్రతికూల ప్రభావాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించింది.
భోపాల్‌లో జూన్ 27న జరిగిన ఓ కార్యక్రమంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అవసరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.
‘‘ఒకే కుటుంబంలో ఇద్దరికి భిన్నమైన నిబంధనలు వర్తించకూడదు. అసలు ఒకే ఇంట్లో రెండు విధానాలు ఎలా సాధ్యం?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఒకవేళ ఒకే ఇంట్లోని కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకు రెండు రకాల చట్టాలుంటే, ఆ ఇల్లు నడవదు’’ అని అన్నారు.
చట్టం కూడా సమానత్వం గురించే మాట్లాడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోదీ అన్నారు.
మోదీ ప్రకటన తర్వాత, కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.
‘‘కావాలనే 2024 ఎన్నికల ముందుగా నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారు.’’ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ANI
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దీనిపై ఏం అంటున్నారు?
కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) అధ్యక్షుడు.
2016లో అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ పేరుతో ఒక రాజకీయ కూటమి ఏర్పాటైంది.
దీనిలో ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రధాన ప్రాంతీయ పార్టీలన్ని భాగం.
ఇక్కడున్న ప్రావిన్స్‌లలోని ప్రభుత్వాల్లో ఈ ప్రాంతీయ పార్టీలన్ని భాగమయ్యాయి.
మేఘాలయను ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) పాలిస్తోంది. అధికారంలో బీజేపీ కూడా భాగస్వామి.
ఈశాన్య రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సమాజం ఉందని, అది అలాగే ఉండాలని ఎన్‌పీపీ చీఫ్ సంగ్మా కోరుకున్నారు.
‘‘మాది మాతృస్వామ్య సమాజం. ఇదే మా బలం. ఇదే మా సంస్కృతి. ఇది ఇప్పుడు మార్చలేం’’ అని సంగ్మా తమ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పారు.
యూసీసీ డ్రాఫ్ట్ చూడకుండా తాము దీనిపై మరిన్ని వివరాలు చెప్పడం కష్టమన్నారు. దీనిపై తాను బీజేపీకి అనుకూలంగా ఉండలేనని అన్నారు.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
మణిపూర్-నాగాలాండ్‌లో యూసీసీని వ్యతిరేకిస్తోన్న మిత్రపక్షాలు
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీలలో ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతిని కనుక విధించాలని ప్రయత్నిస్తే, అది పనికిరాని నిర్ణయంగా మారి, ప్రతికూల ప్రభావాలను చూపనుందని బీజేపీ మిత్రపక్షమైన ఎన్‌పీఎఫ్(నాగా పీపుల్స్ ఫ్రంట్) హెచ్చరించింది.
మణిపూర్‌లో పూర్తి మెజార్టీతో రెండోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ, తన పాత ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాల కోసం వారిని ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకుంది.
యూసీసీ విషయంలో తమ పార్టీ ధోరణిని తెలియజేస్తూ ఎన్‌పీఎఫ్ నేత కుజోలుజో నీను ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘యూసీసీని అమలు చేయడమంటే మా సంస్కృతిని అనాగరిక, అమానవీయదిగా కొట్టివేయడమేనని అర్థం. ’’ అని అన్నారు.
యూసీసీని అమలు చేయాలని ప్రయత్నిస్తే అది మైనార్టీల్లో ముఖ్యంగా ఆదివాసీ కమ్యూనిటీల్లో ఆశను, నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుందని అన్నారు.
వాస్తవానికి ఆర్టికల్ 371(ఏ), ఆరవ షెడ్యూల్ వంటి రాజ్యాంగపరమైన ప్రొవిజన్లు తమ ఆచారాలను, విలువను, విధానాలను ప్రమోట్ చేసుకుని, కాపాడుకునే స్వేచ్ఛను కల్పిస్తున్నాయి.
యూసీసీని అమలు చేయడం ద్వారా భారత మైనార్టీ కమ్యూనిటీలు, ఆదివాసీ ప్రజల స్వేచ్ఛ, హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని నాగాలాండ్‌లోని మరో బీజేపీ మిత్రపక్షం నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) తెలిపింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఏ ద్వారా నాగా ప్రజల సంప్రదాయాలకు, విధానాలకు సంరక్షణ కల్పించారని నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియోకి చెందిన పార్టీ ఎన్‌డీపీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
మిజోరాంలో యూసీసీకి వ్యతిరేకంగా తీర్మానం
యూసీసీ అమలుకు సంబంధించిన ఏ అంశాన్నైనా వ్యతిరేకించేలా మిజోరాం అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
మిజోరాం అధికారిక పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీతో పాటు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంది.
పార్లమెంట్ ద్వారా యూసీసీ చట్టాన్ని చేయొచ్చని మిజోరాం హోమ్ మంత్రి లాల్‌చమ్లియానా రిపోర్టర్లతో అన్నారు.
కానీ తమ రాష్ట్ర చట్ట సభ ఈ తీర్మానంపై నిర్ణయం తీసుకోనంత వరకు మిజోరాంలో ఈ చట్టాన్ని అమలు చేయలేరని అన్నారు.
ఈశాన్య భారతంలోని ఒక రాష్ట్రమైన మిజోరాంలో ఆదివాసీల జనాభా అత్యధికం.
యూసీసీని ఇక్కడ అమలు చేయడం ఏ ప్రభుత్వానికైనా అది అతిపెద్ద సవాలునే.

ఫొటో సోర్స్, BBC BENGALI
అసోం-త్రిపురలో బీజేపీ మిత్రపక్షాలు ఏం ఆలోచిస్తున్నాయి?
అసోంలోని బీజేపీ మిత్రపక్షం అసోం గనా పరిషత్, త్రిపురలోని బీజేపీ భాగస్వామి ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) ఇప్పటి వరకు యూసీసీపై తమ వైఖరి ఏంటన్నది తెలియజేయలేదు.
‘‘యూసీసీపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదు. అందుకే, మా పార్టీ వైఖరిపై ఇప్పటి వరకు మేం మాట్లాడలేదు’’ అని త్రిపుర ప్రభుత్వంలోని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, ఐపీఎఫ్‌టీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ రియాంగ్ బీబీసీకి చెప్పారు.
త్రిపురలో ఉన్న 19 గిరిజన జాతులు ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, తమకు సొంతంగా రాజకీయ అధికారం కూడా లేదని రియాంగ్ అన్నారు.
రాజ్యాంగాన్ని నమ్ముకుని, తమ గిరిజన జాతి గుర్తింపుకు, హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు.
దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి భారత పౌరులందరికీ ఒకే చట్టం అంటే యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
కానీ, యూసీసీ అమలు వల్ల 220 గిరిజన సంఘాల హక్కులు, స్వేచ్ఛ ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
‘ఎవరిపైనైనా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయలేరు’
భారత దేశంలోని గిరిజన జనాభాలో 12 శాతం ఈశాన్య భారతంలోనే ఉంది.
2011 గణన ప్రకారం, మిజోరాంలో 94.4 శాతం, నాగాలాండ్‌లో 86.5 శాతం, మేఘాలయలో 86.1 శాతం గిరిజన జనాభా ఉంది.
‘‘భారత్‌లో భిన్న కులాల వారు నివసిస్తున్నారు. టిబెటో-బర్మన్ ప్రజలు ఇక్కడున్నారు. ఆస్ట్రో ఏషియాటిక్ జాతులు వారున్నారు. ఎవరిపైనైనా మీరు యూసీసీని అమలు చేయలేరు’’ అని షిల్లాంగ్ టైమ్స్ ఎడిటర్ ప్యాట్రిసియా ముఖిమ్ ఈశాన్య భారత్‌లోని గిరిజన ప్రాంతాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు.

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA
‘‘దీంతో పాటు, ఆరవ షెడ్యూల్ కింద ఈశాన్య రాష్ట్రాల్లో డిస్ట్రిక్ ఆటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి ఆదివాసీ ప్రజల ఆచారాలను, సంప్రదాయాలను సంరక్షిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యూసీసీని తీసుకొస్తే, ఆరవ షెడ్యూల్‌కు పూర్తిగా ముగింపు చెప్పాల్సి ఉంటుంది. ’’ అని ఆమె అన్నారు.
’’యూసీసీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడంతో, గిరిజన ప్రజలు దీనిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకే మతం, ఒకే భాష, మిగతాదంతా ఒకటే అన్న బీజేపీ లక్ష్యం నెరవేరదు‘‘ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వాజ్‌పేయి: హిందూ జాతీయవాద రాజకీయాలను ఆమోద యోగ్యంగా మార్చిన నేత
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














