ఉమ్మడి పౌర స్మృతి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రేరణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
1967 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జన సంఘ్ తొలిసారి స్పష్టంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ గురించి ప్రస్తావించింది.
తాము అధికారంలోకి వస్తే ‘ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)’ని అమలు చేస్తామని జన సంఘ్ ఆనాడు స్పష్టంచేసింది.
అయితే, ఎన్నికల ఫలితాలు దీనికి భిన్నంగా వచ్చాయి. ఆనాడు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత 1967-1980ల మధ్య కాంగ్రెస్ చీలిపోవడం, భారత్-చైనా యుద్ధం, అత్యయిక పరిస్థితి విధించడం లాంటి వరుస ఘటనల నడుమ ‘ఉమ్మడి పౌర స్మృతి’ అంశం మరుగునపడిపోయింది.
1980ల్లో భారత జనతా పార్టీ (బీజేపీ) మొదలైనప్పటి నుంచీ మళ్లీ యూసీసీ కోసం డిమాండ్లు మొదలయ్యాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అప్పటి నుంచీ బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
అయితే, ఇప్పటివరకూ యూసీసీని అమలుచేసే దిశగా ఏ బీజేపీ ప్రభుత్వమూ (నరేంద్ర మోదీ తొలిపాలనా కాలంలోనూ) చర్యలు తీసుకోలేదు.
కానీ, ప్రస్తుతం ఎప్పటికప్పుడే బీజేపీ నాయకులు యూసీసీపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్నమొన్నటి వరకూ దీనిపై స్పందించలేదు.
తాజాగా జూన్ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి యూసీసీ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని మోదీ ఏం చెప్పారు?
భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అవసరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘ఒకే కుటుంబంలో ఇద్దరికి భిన్నమైన నిబంధనలు వర్తించకూడదు. అసలు ఒకే ఇంట్లో రెండు విధానాలు ఎలా సాధ్యం?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
‘‘సుప్రీం కోర్టు పదేపదే చెబుతోంది.. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని సూచిస్తోంది. కానీ, ఓటు బ్యాంకు రాజకీయలకు పాల్పడుతున్న కొందరు దీన్ని అడ్డుకుంటున్నారు. కానీ, బీజేపీ అందరిది. అందరి అభివృద్ధి కోసం మొదట్నుంచీ పార్టీ పాటుపడుతోంది.’’ అని ఆయన అన్నారు.
మోదీ ప్రకటన తర్వాత, కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ‘‘కావాలనే 2024 ఎన్నికల ముందుగా నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారు.’’ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే, కొన్ని విపక్షాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి కూడా.

ఫొటో సోర్స్, ANI
కొందరు మద్దతు.. మరికొందరు వ్యతిరేకం
చాలావరకు విపక్షాలు ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తున్నాయి. మైనారిటీల మతపరమైన స్వేచ్ఛను దీనితో ఉల్లంఘించినట్లు అవుతుందని, అసలు ఇప్పుడు యూసీసీ అవసరంలేదని, పర్సనల్ చట్టాలు బాగానే పనిచేస్తున్నాయనేది వీరి అభిప్రాయం.
దేశంలోని మైనారిటీలపై హిందూ మెజారిటీ విధానాలను యూసీసీతో రుద్దేయాలని బీజేపీ చూస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఏం బహిరంగంగానే యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి.
అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా యూసీసీకి మద్దతు తెలిపింది. పార్టీ నాయకుడు, ఎంపీ, సందీప్ పాఠక్ స్పందిస్తూ.. ‘‘మేం సూత్రప్రాయంగా మద్దతు తెలుపుతున్నాం. దీనికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా మద్దతు ఇస్తోంది. అయితే, ఇది అన్ని మతాలకు సంబంధించిన అంశం. కాబట్టి, అందరి ఆమోదంతోనే దీన్ని అమలుచేయాలి.’’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు శివ సేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీ కూడా ఇదే విధంగా స్పందించింది.
ఎన్‌సీపీ మాత్రం అటు మద్దతు ఇవ్వలేదు, అలానే వ్యతిరేకతా వ్యక్తంచేయలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందిస్తూ..‘‘ఇలాంటి పెద్ద నిర్ణయాన్ని ఆఘమేఘాలపై తీసుకురాకూడదు. దాదాపు తొమ్మిదిన్నరేళ్లు పూర్తయిన తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతోనే ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చారు.’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని ఎందుకు మాట్లాడుతున్నారు?
దీనికి సమాధానం ఏమిటంటే, బీజేపీ మేనిఫెస్టోలో ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే, మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు?
ఈ ప్రశ్నపై ‘‘యూసీసీ ఈజ్ మోడీ’స్ న్యూక్లియర్ బటన్’’ పేరుతో ‘ద ప్రింట్’లో ఒక కథనం రాసిన సీనియర్ జర్నలిస్టు వీర్ సంఘ్వి బీబీసీతో మాట్లాడారు. ‘‘తొమ్మిదేళ్లు అధికారంలో కొనసాగిన తర్వాత మోదీ ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు. కావాలంటే గత తొమ్మిదేళ్లలో దీనిపై చర్చను లేవనెత్తి ముస్లింలకు ఆయన భరోసా కల్పించి ఉండొచ్చు. ఈ చట్టంతో వారి మతానికి ఎలాంటి ముప్పూ ఉండదని చెప్పొచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు.’’ అని వీర్ అన్నారు.
‘‘ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. 2024 ఎన్నికల సన్నద్ధ కార్యక్రమాల్లో భాగంగానే మోదీ ప్రభుత్వం దీన్ని ప్రస్తుతం ముందుకు తీసుకొచ్చింది. తమ ఎన్నికల్లో ‘హిందూత్వ’కు మోదీ ప్రభుత్వం భారీగా చోటు కల్పించబోతోంది. ఇక యూసీసీ అనేది బీజేపీ న్యూక్లియర్ బటన్.’’ అని ఆయన చెప్పారు.
మరోవైపు సీనియర్ జర్నలిస్టు ప్రదీప్ సింగ్ కూడా ఈ వాదనతో ఏకీభవించారు. ‘‘జన్ సంఘ్ నుంచి నేటి వరకూ బీజేపీ మూడు ప్రధాన అజెండాల్లో యూసీసీ కూడా ఒకటి.’’ అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణంల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ మిగిలింది యూసీపీ మాత్రమే. దీన్ని ఎప్పుడు అమలు చేస్తారోనని కొందరు బీజేపీ మద్దతు దారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అందుకే ఇదేమీ వారికి కొత్త విషయం కాదు.’’ అని ఆయన చెప్పారు.
దీని వెనుక మరో కారణం కూడా ఉందని ప్రదీప్ అన్నారు. ‘‘జూన్ 23న విపక్షాల ఉమ్మడి సమావేశం జరిగింది. అన్ని పార్టీలు కలిసి పోటీచేయాలని దీనిలో నిర్ణయించారు. అయితే, ఈ అంశాలపై వీరు ఎలా ముందుకు వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అందుకే ప్రతిపక్షాల కంటే ముందే యూసీసీ అనే అజెండాతో మోదీ ముందుకు వచ్చారు. దీనిపై జులై 13-14 తేదీల్లో మేం చర్చించి నిర్ణయం తీసుకుంటామనే సంకేతాలను ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చింది. అంటే వీరు మోదీ మొదలుపెట్టిన చర్చకు స్పందిస్తున్నారు. అంతేకానీ, వీరు సొంతంగా అజెండాను సిద్ధం చేయడం లేదు.’’ అని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు ఐక్యతతో ముందుకు వెళ్లడం గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘కేవలం రెండు సార్వత్రిక ఎన్నికల్లోనే (1977, 1989) ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాయి. దీని వెనుక అవినీతి, అత్యయిక స్థితి లాంటి కారణాలు ఉన్నాయి.’’ అని ఆయన చెప్పారు.
‘‘అయితే, ప్రస్తుతం ప్రతిపక్షాల దగ్గర అలాంటి గట్టి అంశాలు ఒక్కటీ లేవు. దీనికి భిన్నంగా యూసీసీ అంశాన్ని లేవనెత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలను దాదాపుగా చీల్చేశారు. ఇక్కడ ఆప్, శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలు దాదాపు బీజేపీ మార్గంలోనే నడుస్తున్నాయి.’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రజలను విభజించేందుకేనా..’’
సీనియర్ జర్నలిస్టు స్మితా గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ.. ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడటం బీజేపీకి అనివార్యమైందని అన్నారు.
‘‘రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలను ఇప్పటికే ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగించుకుంది. ఇప్పుడు ప్రజలను విభజించేందుకు మరో అంశం వారికి కావాలి. కర్ణాటకలో ఎన్నికల్లో ఓటమి తర్వాత, మరోసారి రిస్క్ తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదు. మరోవైపు మూడు రాష్ట్రాలతోపాటు లోక్ సభ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. అందుకే యూసీసీతో ఎన్నికల అజెండాను బీజేపీ సిద్ధం చేసుకుంది.’’ అని ఆమె చెప్పారు.
బీజేపీ ఏం అంటోంది?
‘‘ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒకే గుర్తు’’ల గురించి తమ పార్టీ మొదట్నుంచీ ప్రస్తావిస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి అమితబ్ సిన్హా అన్నారు. భారత శిక్షా స్మృతి అందరికీ ఒకేలా ఉండేటప్పుడు, పౌర స్మృతి విషయంలో భిన్న వాదనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు సంధిస్తూ ‘‘మొదట ముస్లింలను భయపెట్టడం, ఇప్పుడేమో బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం చేస్తున్నారు. ముస్లింలలో మహిళల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వారిని పిల్లలు పుట్టించే యంత్రాలుగా మార్చేస్తున్నారు.’’అని ఆయన అన్నారు.
‘‘ముస్లింలు నాలుగు నుంచి ఐదు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒక్కో భార్య ద్వారా ఐదుగురు లేదా ఆరుగురు పిల్లల్ని కంటున్నారు. ఫలితంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. భారత్‌కు స్వాత్రంత్యం వచ్చినప్పుడు ముస్లింల జనాభా మూడు కోట్లు, కానీ, ఇప్పుడేమో వారి జనాభా ఎంత పెరిగిందో చూడండి. ముస్లిం మహిళలకు దీని నుంచి విముక్తి కల్పించాలి.’’ అని ఆయన అన్నారు.
ముస్లింల జనాభా పెరుగుతోందా?
ముస్లింల జనాభా పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే, ఇక్కడ దేశంలోని ఇతర మతస్థుల జనాభా కూడా పెరుగుతోందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ముస్లింల జనాభాను గమినిస్తే, ముఖ్యంగా 1991 తర్వాత ముస్లింల జనాభాలో పెరుగుదల రేటు కూడా తగ్గినట్లు కనిపిస్తోంది.
2019 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, మతపరంగా చూస్తే ముస్లింలలో జననాల రేటు ఎక్కువగానే ఉంది. అయితే, గత రెండు దశాబ్దాలతో పోలిస్తే, ప్రస్తుతం ఇది చాలా తగ్గింది.
1992లో సగటున ముస్లింలలో ఒక్కో మహిళ 4.4 మంది పిల్లలకు జన్మనిస్తే 2019లో ఇది 2.4కు తగ్గింది.
యూసీసీతో బీజేపీకి లాభం ఎంత?
ఈ ప్రశ్నపై జర్నలిస్టు ప్రదీప్ సింగ్ మాట్లాడుతూ.. యూసీసీ ద్వారా ప్రతిపక్షాల అజెండాను బీజేపీ మారుస్తోందని చెప్పారు.
‘‘ధర పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలకు బదులుగా యూసీసీపై చర్చ మళ్లేలా బీజేపీ చేస్తోంది. అంటే బీజేపీ సిద్ధంచేస్తున్న గ్రౌండ్‌లోకి ప్రతిపక్షాలు వచ్చి ఆడాల్సి వస్తోంది. ఇక్కడ బీజేపీ బలం చాలా ఎక్కువ. దీని వల్ల ఓట్లు చీలి బీజేపీకే మేలు జరుగుతుంది.’’ అని ఆయన అన్నారు.
ఇప్పటివరకు ఏం జరిగింది?
దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జులై 3న జరిగింది. యూసీసీపై ఎంపీల అభిప్రాయాన్ని దీనిలో సేకరించారు.
జూన్ 14న మరోవైపు మతపరమైన సంస్థల నుంచి 22వ లా కమిషన్ కూడా అభిప్రాయాలను సేకరించడం మొదలుపెట్టింది.
2018లోనూ 21వ లా కమిషన్ దీనిపై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ‘‘ప్రస్తుతం యూసీసీ తీసుకురావాల్సిన అవసరం లేదు.’’అని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలోని గోవాలో మాత్రమే యూసీసీ అమలులో ఉంది. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా యూసీసీ ముసాయిదాను తయారుచేస్తోంది.
ఏఏ దేశాల్లో యూసీసీ అమలవుతోంది?
చాలా అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో యూసీసీ అమలవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, జపాన్, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌లతోపాటు యూరప్‌లోని చాలా దేశాల్లో యూసీసీ అమలులో ఉంది.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















