దేవుడికి జ్వరం వచ్చింది, 15 రోజులు దర్శనాలు లేవు!

పూరీ జగన్నాథ యాత్ర

ఫొటో సోర్స్, Twitter/PuriOfficial

ఫొటో క్యాప్షన్, పూరీ జగన్నాథ యాత్ర
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పూరీలో ఉన్న జగన్నాథుడుకీ ఆయన అన్న బలరాముడికీ, చెల్లెలు సుభద్రకీ జ్వరం వచ్చింది. అందుకే ఆ గుడిలో 15 రోజులు దర్శనాలు నిలిపేశారు.

నిజమే.. ప్రతీ ఏటా పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. జ్వరం తగ్గాకే అన్నీ..

జ్యేష్ఠ పౌర్ణమి (2023 జూన్ 4) రోజు జగన్నాథుడి పుట్టిన రోజు అని భక్తుల నమ్మకం. జగన్నాథ రథోత్సవం జూన్ 20 నుంచి మొదలవుతుంది.

జగన్నాథుడి పుట్టిన రోజును పూరీలో స్నాన యాత్ర లేదా స్నాన పౌర్ణమి అని కూడా అంటారు.

ఆ రోజు పూరీ మూల విరాట్‌కి 108 కుండలతో అభిషేకం చేస్తారు. అభిషేకం తరువాత ఏనుగు తొండం తరహాలో గజ వేషంలో దేవుణ్ణి అలంకరిస్తారు.

అయితే ఇలా 108 కుండల నీళ్లలో తడిసిపోవడంలో భగవంతుడికి జ్వరం వచ్చిందని దేవాలయ పూజారులు ప్రకటిస్తారు.

‘‘పూరీ గుడి ప్రాంగణంలో బంగారు బావి (సోనా కువా) అని ఒకటి ఉంటుంది. శీతలా దేవి ఆ బావిని కాపాడుతుంది. ఆ బావి ఏడాదికి ఒకసారి తెరచి అందులో నీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. ఆ రోజు గర్భాలయం నుంచి మూల మూర్తులను తెచ్చి స్నానవేది అనే చోట భక్తులందరికీ కనిపించేలా విగ్రహాలను ఉంచి ఈ బావి నీటితో 108 బిందెలతో అభిషేకం చేస్తారు.

అన్ని నీళ్లలో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా.. అలానే స్వామి వారికి కూడా అనారోగ్యం కలిగినట్టుగా చేస్తారు. అలంకరణలు తీసేసి, మఫ్లర్లు చుట్టి అచ్చం జ్వర బాధితుడిలానే ఉంచుతారు. గర్భాలయంలో రత్నవేదికి (మూల విగ్రహాలు పెట్టే వేదిక) ఎడమ పక్కన ఒక ఖాళీ స్థలంలో మూర్తులను పడుకోబెడతారు.’’ అంటూ అక్కడ జరిగే ప్రక్రియను బీబీసీకి వివరించారు ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్.

పూరీ జగన్నాథ యాత్ర

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పూరీ జగన్నాథ యాత్ర

ఈ పదిహేను రోజులనూ అనాసారగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తుల కోసం గర్భ గుడిలో జగన్నాథుడి పాత చిత్రాలు (పెయింటింగ్) ప్రదర్శిస్తారు.

సాధారణంగా పూరీ అంటేనే ప్రసాదాలకు ఫేమస్. అక్కడ దేవుడికి అనేక రకాల నైవేద్యాలు పెడతారు. చప్పన్ భోగ్గా పిలిచే 56 రకాల నైవేద్యాలు ఏడాది పొడవునా పెడతారు.

‘‘కానీ ఈ 15 రోజులు ఆ నైవేద్యాలు కూడా పెట్టరు. నైవేద్యం బదులు మందులే ఇస్తారు’’ అన్నారు శ్రీనివాస్. దేవుడికి ఆయుర్వేద మందులు ఇస్తారు.

15 రోజుల తరువాత దేవుడికి నయం అయిపోయిందని రాజవైద్యుడు ప్రకటిస్తాడు. అభిషేకం వల్ల విగ్రహాలకు రంగు వెలుస్తుంది కాబట్టి కొత్త రంగులు వేస్తారు.

జ్వరం తరువాత రథయాత్రకు ఒకరోజు ముందు దేవుడు దర్శనం ఇస్తాడు. దాన్ని నవయవ్వన దర్శనం అంటారు. అప్పుడు రథ యాత్ర ప్రారంభిస్తారు.

‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జ్వరం ఏంటని అనుకోవచ్చు. చిన్న పిల్లాడు బొమ్మ తుపాకి పట్టుకుని తండ్రికి చూపించి పేల్చగానే తండ్రి కింద పడిపోయినట్టు చేస్తాడు. అది నిజం కాకపోయినా పిల్లాణ్ణి సంతోషపరచడానికి. ఇదీ అలాంటిదే. సాక్షాత్తూ దేవదేవుడే అయినప్పటికీ, శరీరంతో ఆయన అక్కడ ఉన్నాడని భావించి, మనిషికి చేసినట్టే సపర్యలు చేస్తారు భక్తులు.’’ అని పూరీలో సంప్రదాయల గురించి వివరించారు నండూరి శ్రీనివాస్.

పూరీ జగన్నాథుడు

ఫొటో సోర్స్, Twitter/PuriOfficial

‘‘అక్కడ ఉన్నది విగ్రహం అని ఎవరూ అనుకోరు. ఆయన విగ్రహాలు శరీరంగానూ, అందులోని రహస్య పదార్థం ఆత్మలానే చూస్తారు. అందుకే అక్కడ దేవుడికి ప్రతిరోజూ ఉదయం పళ్లుతోముతారు (దంతధావనం). బుధవారం సాయంత్రం పూట గెడ్డం గీస్తారు (క్షుర కర్మ).’’ అని వివరించారు నండూరి శ్రీనివాస్.

రథయాత్రకు విగ్రహాలను తీసుకెళ్లే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆదివాసీ తెగలకు చెందిన విశ్వావసువు అనే వ్యక్తి వారసులే ఈ విగ్రహాలను రథయాత్రకు తీసుకువస్తారు. వారు నృత్యం చేస్తూ విగ్రహాలను తెస్తారు.

చరిత్రలో ముస్లింలు ఈ ఆలయంపై చాలా సార్లు దాడి చేశారు. బౌద్ధులు కూడా దాడులు చేశారు. దాంతో ఇక్కడి విగ్రహాలను రహస్యంగా దాచి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

‘‘గతంలో ఒకసారి బౌద్ధులు ఈ ఆలయంపై దాడి చేసి అక్కడ బౌద్ధ ధర్మాన్ని స్థాపించే ప్రయత్నం చేశారు. దీంతో దైత్య పాండాలు ఆ విగ్రహాలను గుండీచా ఆలయంలో దాచారు. అన్నీ సద్దుమణిగాక ఆ విగ్రహాలను తిరిగి తెచ్చి అక్కడ ప్రతిష్టించారు. ఆ ఘటనలకు గుర్తుగా ‘పాండు విజయం’ పేరుతో నృత్యం చేస్తూ దేవుణ్ణి రథం దగ్గరకు తీసుకు వస్తారు.

రథయాత్ర ప్రారంభించే ముందు స్థానిక గజపతి రాజ వంశానికి చెందిన వారు రథం ముందు కస్తూరి కళ్లాపిజల్లి, బంగారు చీపురుతో ఊడ్చుతారు. తరువాత రథయాత్ర ప్రారంభం అవుతుంది" అని చెప్పారు నండూరి శ్రీనివాస్.

పూరీ జగన్నాథుడు

ఫొటో సోర్స్, Twitte/PuriOfficial

పూరీలో ఎన్నో ప్రత్యేకతలు:

  • పూరీ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా హిందూ దేవుళ్ల గుళ్లల్లో దేవుడు, తమ దేవేరీతో కొలువై ఉంటారు. కానీ తన అన్న, చెల్లెళ్లతో కలసి దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడు. ఇక్కడ కృష్ణుడు (జగన్నాథుడు), బలరాముడు, సుభద్రలు ఒకే గర్భాలయంలో కొలువై ఉంటారు.
  • ఇంద్రద్యుమ్న అనే రాజు ఈ గుడిని మొదటిసారి నిర్మించారనేది పురాణం. చరిత్ర ప్రకారం పదవ శతాబ్దంలో అంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మితమైన గుడి ఇది.
  • గంగ వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ అనే రాజు ప్రస్తుత గుడి నిర్మాణం ప్రారంభించారని పలు పురాతన ఆధారాలు చెబుతున్నాయి.
  • సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఒకసారి ప్రతిష్టించిన విగ్రహాన్ని కదపరు. పూరీలో అలా కాదు. ఇక్కడ గర్భాలయంలో మూల విరాట్‌లను చెక్క(దారు)తో చేస్తారు. నియమిత కాలానికి అంటే 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాలు తొలగించి కొత్త విగ్రహాలు పెడతారు. పూరీ మూల విరాట్ విగ్రహాలకు చేతులు, కాళ్లు ఉండవు.
  • విగ్రహాలు మార్చేప్పుడు పాత విగ్రహంలోని ఒక వస్తువు/పదార్థాన్ని రహస్యంగా పూజారులు సైతం కళ్లకు గంతలు కట్టుకుని కొత్త విగ్రహాల్లో పెడతారు. అది ఏమిటి అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ దానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి సాక్షాత్తూ శ్రీకృష్ణుని గుండె అనీ, శ్రీకృష్ణుని అస్థికలు అనే ప్రచారం కూడా ఉంది.
పూరీ జగన్నాథ యాత్ర

ఫొటో సోర్స్, Twitter/PuriOfficial

  • 6. 4 లక్షల చదరపు అడుగుల (37 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో) చుట్టూ 20 అడుగుల ఎత్తైన గోడతో ఉండే పెద్ద దేవాలయం ఇది.
  • ఈ గుడి విమానం (గర్భాలయం మీద ఉండే గోపురాన్ని విమానం అంటారు) మీద ఉండే చక్రాన్ని నీల చక్రం అంటారు. ఈ చక్రం 8 లోహాలతో (అష్టధాతు) చేశారు. దీని ఎత్తే 3.5 మీటర్లు లేదా 11 అడుగుల 8 అంగుళాలు, చుట్టుకొలత 36 అడుగులు ఉంటుంది. 2010లో పురావస్తు శాఖ ఈ చక్రానికి కొన్ని మరమ్మత్తులు చేసింది. ఈ చక్రం దగ్గరే అతి పెద్ద జెండా ఎగురుతూ ఉంటుంది. ఈ జెండాను ప్రతిరోజూ మారుస్తారు.
  • పూరీ రథయాత్రను చూసే ఇంగ్లిష్‌లో జగ్గర్నాట్ (Juggernaut) అనే పదం పుట్టింది. ఎదురుగా ఉన్నదాంతో సంబంధం లేకుండా ఎక్కడా ఆగకుండా అవసరమైతే తొక్కుకుంటూ వెళ్లిపోయేంత వేగంగా, బలంగా వస్తోన్న శక్తి అని వర్ణించడానికి ఇంగ్లిష్‌లో ఈ పదం వాడతారు.
  • తెలుగులో శ్రీశ్రీ కవిత్వంలోని ‘‘వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ అన్న ప్రయోగం కూడా ఈ రథయాత్ర నుంచి పుట్టిందే.
  • హిందూ ఆలయాల్లో ఒకే రథాన్ని దశాబ్దాల పాటూ వాడతారు. కానీ పూరీలో ప్రతీ ఏటా కొత్త రథాలు తయారు చేస్తారు. అలాగని అవి చిన్నవి కాదు. అలాగే మిగతా హిందూ ఆలయాల్లో మూల విరాట్‌ను బయటకు తీసుకురారు. ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. పూరీలో మాత్రం మూల విగ్రహాలనే రథయాత్రలో ఊరేగిస్తారు.
పూరీ జగన్నాథ యాత్ర

ఫొటో సోర్స్, Twitter/PuriOfficial

ఫొటో క్యాప్షన్, పూరీ జగన్నాథ యాత్ర
  • జగన్నాథ రథం నందిఘోష 44 అడుగుల 2 అంగుళాలు ఎత్తుతో, ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది
  • బలభద్రుని రథం తాళధ్వజ 43 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, ఎరుపు, నీలం-పచ్చ రంగుల్లో ఉంటుంది
  • సుభద్ర రథం పద్మధ్వజ 42 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటుంది
  • రథ యాత్ర ఇంద్రద్యుమ్నుడి భార్య అయిన గుండీచా దేవి గుడి వరకూ వెళ్తుంది.
  • ఈ దేవాలయం చుట్టూ బౌద్ధ, జైన, సిక్కులకు సంబంధించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఆదివాసీ సంప్రదాయాల్లో కూడా జగన్నాథుడు పూజలందుకున్నాడు. జగన్నాథుని నీలమాధవుడు పేరుతో గిరిజనులు ఆరాధించేవారనీ, తరువాత రాజు గుడి కట్టించాడని స్థల పురాణ గాథలు చెబుతున్నాయి.
  • చరిత్రలో అనేకసార్లు ఈ దేవాలయంపై దాడులు జరిగాయి. విగ్రహాలను రహస్యంగా దాచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పూరీ జగన్నాథ యాత్ర

ఫొటో సోర్స్, Twitter/PuriOfficial

  • పూరీ దేవాలయంలో వంటశాల చాలా ప్రత్యేకం. ఇక్కడ వంటలను లక్ష్మీ దేవీ పర్యవేక్షిస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ గుడిలో నైవేద్యం కట్టెలపొయ్యి మీద చేస్తారు. దేశంలోని అతి పెద్ద సంప్రదాయ వంటశాలల్లో ఇది ఒకటి. పూరీ ప్రసాదాలు చాలా ప్రత్యేకం.
  • ఉత్తర భారతంలో చార్ ధామ్ యాత్ర చాలా ప్రత్యేకం. హిందువులు తప్పక సందర్శించాల్సిన క్షేత్రాలుగా చెప్పే చార్ ధామ్ (అంటే నాలుగు క్షేత్రాలు)లో పూరీ ఒకటి. మిగతావి బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం.
  • శంకరాచార్యులు స్థాపించిన తూర్పు పీఠం (పూర్వామ్నాయ గోవర్దన పీఠం) ఇక్కడే ఉంది. మిగతా మూడూ శృంగేరీ, ద్వారక, బద్రీనాథ్‌లలో ఉంటాయి.
  • భారతదేశంలోని దాదాపు అన్ని రకాల వైష్ణవ శాఖలూ పూరీకి ప్రాధాన్యతనిచ్చాయి. రామానుజ, మధ్వ, నింబకాచార్య, వల్లభాచార్య, రామానంద వంటి ప్రాచీన వైష్ణవ శాఖలతో పాటూ ఇస్కాన్ వంటి ఆధునిక భక్తి ఉద్యమాలు కూడా పూరీ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి.
వీడియో క్యాప్షన్, పూరీ: ఏటా దేవుడికి జ్వరం వస్తుంది, నయం అయ్యే వరకూ దర్శనాలుండవు, ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)