అల్-హకీమ్: ఈజిప్టులో నరేంద్ర మోదీ సందర్శిస్తున్న ఈ మసీదు ప్రత్యేకత ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంశుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా నుంచి ఈజిప్టుకు వెళ్లారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన అక్కడ పర్యటిస్తారు. ఈజిప్టులోని చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదును మోదీ సందర్శిస్తారు.
అల్-హకీమ్ మసీదును మోదీ సందర్శించబోతున్నారనే విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ‘‘25న ఈజిప్టులోని అల్-హకీిమ్ మసీదును నరేంద్ర మోదీ సందర్శిస్తారు. 11వ శతాబ్దంనాటి ఈ మసీదును దావూదీ బోహ్రా వర్గం పునరుద్ధరించింది.’’ అని వినయ్ చెప్పారు.
‘హిస్టారిక్ కైరో’లో భాగమైన ఈ మసీదును 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
దీనితోపాటు ‘హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమీటరీ’ని కూడా మోదీ సందర్శించబోతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టులో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు మోదీ నివాళులు అర్పించబోతున్నారు.
ఈజిప్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. 1997 తర్వాత, ఈజిప్టులో భారత ప్రధాని తొలి అధికారిక పర్యటన కూడా ఇదే.

ఫొటో సోర్స్, ANI
అల్-హకీమ్ మసీదు చరిత్ర ఏమిటి?
ఈజిప్టు రాజధాని కైరో ఇస్లామిక్ కట్టడాలకు ప్రసిద్ధి.
ఇక్కడ భిన్న కాలాలకు చెందిన ఇస్లామిక్ కట్టడాలు చాలా ఉన్నాయి. వీటిలో అల్-హకీమ్ మసీదు కూడా ఒకటి.
అల్-హకీమ్ మసీదు గురించి ప్రొఫెసర్ డోరిస్ అబుసైఫ్ తన పుస్తకం ‘‘ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇన్ కైరో: ఏన్ ఇంట్రడక్షన్’’ పుస్తకంలో రాసుకొచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో ఈ మసీదు నిర్మాణం జరిగిందని ఆమె చెప్పారు.
క్రి.శ. 990లలో 5వ ఫాతిమిద్ పాలనా కాలంలో ఖలీఫా అల్-అజీజ్ ఈ మసీదు నిర్మాణాన్ని మొదలుపెట్టారు.
ఫాతిమిద్‌లు.. అరబ్ మూలాలున్న ఇస్మాయిలీ షియా వర్గం.
నిర్మాణం మొదలైన ఏడాది తర్వాత, మసీదులో తొలిసారి ప్రార్థనలు చేశారు. అయితే, అప్పటికీ మసీదు నిర్మాణం పూర్తికాలేదు.
అప్పటికి మసీదులో కేవలం ఒకే ఒక ప్రార్థనా గది నిర్మాణం పూర్తయిందని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా చరిత్రకారుడు జోనథన్ ఎం బ్లూమ్ పుస్తకం ‘ద మాస్క్ ఆఫ్ అల్-హకీమ్ ఇన్ కైరో’ ప్రకారం, ఇలా నిర్మాణం పూర్తికాకముందే 12 ఏళ్లపాటు ఇక్కడ ప్రార్థనలు జరిగాయి. 1002-03లో అల్-అజీజ్ కుమారుడు, ఆరో ఖలీఫా అల్-హకీమ్ ఈ మసీదులో కొన్ని మార్పులు చేశారు.
ఆరో ఖలీఫా అల్-హకీమ్ పేరునే ఈ మసీదుకు పెట్టారు.
దీనికి పదేళ్ల తర్వాత, అంటే 1013లో ఈ మసీదు నిర్మాణం పూర్తయింది.
అప్పట్లో ఈ మసీదు పొడవు 120 మీటర్లు, వెడల్పు 113 మీటర్లు.
ప్రముఖ అల్-అజహర్ మసీదు కంటే ఇది రెండు రెట్లు పెద్దది. దీని నిర్మాణం కోసం అప్పట్లోనే 45,000 దినార్లు ఖర్చయ్యాయి.
మొదట్లో ఈ మసీదు కైరో ప్రహరీ గోడకు అవతల ఉండేది. అయితే, 1087లో గోడను విస్తరించడంతో, ఇవతలి వైపుకు వచ్చింది.
ఆ విస్తరణ పనులు ఫాతిమిద్‌ల ఎనిమిదో ఖలీఫా అల్-ముస్తాన్‌సిర్ వజీర్ బద్ర్ అల్-జమాలీ పర్యవేక్షణలో కొనసాగాయి. కైరో గోడను మసీదుకు ఉత్తరం వైపుగా బద్ర్ అల్-జమాలీ విస్తరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మసీదు ఎలా దెబ్బతింది?
13వ శతాబ్దం మధ్యనాటికి ఈజిప్టులో మమ్లూక్ సుల్తానులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
1303లో ఈజిప్టును భారీ భూకంపం కుదిపేసింది. దీంతో గీజా పిరిమిడ్లతోపాటు ఇక్కడి చాలా మసీదులు దెబ్బతిన్నాయి.
అలా దెబ్బతిన్న మసీదుల్లో అల్-హాకిమ్ మసీదు కూడా ఒకటి.
దీంతో అల్-హకీమ్ మసీదుకు మమ్లూక్ సుల్తాన్ అబూ-అల్-ఫతాహ్ మరమ్మతులు నిర్వహించారు.
అప్పట్లో ఇస్లామిక్ విద్యా బోధనకు కూడా ఈ మసీదు కేంద్రంగా ఉండేది.
అయితే, శతాబ్దాలు గడవడంతో మసీదు లోపలి నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దీంతో వీటిని పునర్మించాల్సి వచ్చింది. అయితే, దీన్ని అప్పుడప్పుడు మాత్రమే మసీదుగా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు..
దీనిపై ‘ఇస్లామిక్ మాన్యుమెంట్స్ ఇన్ కైరో: ఎ ప్రాక్టికల్ గైడ్’ పేరుతో రచయిత కరోలిన్ విలియమ్స్ ఒక పుస్తకం రాశారు. దీనిలో ఆ మసీదు ప్రాంగణాన్ని భిన్న కాలాల్లో భిన్న విధాలుగా ఉపయోగించారని రాసుకొచ్చారు.
‘‘క్రైస్తవులతో యుద్ధాల సమయంలో ఈ మసీదును జైలుగా ఉపయోగించారు. అయ్యూబీల కాలంలో గుర్రపుశాలగా, నెపోలియన్ కాలంలో కోటగా, 1890లలో ఇస్లామిక్ మ్యూజియంగా, 20వ శతాబ్దంలో పాఠశాలగా ఇది పనిచేసింది.’’ అని కరోలిన్ రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, ANI
దావూదీ బోహ్రాల మద్దతుతో
1970లలో ఈ మసీదు పునర్నిర్మాణం పనులు మళ్లీ మొదలయ్యాయి.
దీని పునర్నిర్మాణ బాధ్యతలను దావూదీ బోహ్రాల 52వ నాయకుడు మొహమ్మద్ బుర్హానుద్దీన్ తీసుకున్నారు.
మొహమ్మద్ బుర్హానుద్దీన్‌కు భారత్‌తో మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసిన సామాజిక సేవకుగాను మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది.
అల్-హకీమ్ మసీదుకు మరమ్మతులు నిర్వహించేటప్పుడు దీనిలో పాలరాయిని, బంగారు తాపడాలను ఉపయోగించారు. ఈ పనులకు 27 నెలల సమయం పట్టింది.
మొత్తంగా మళ్లీ 1980 నవంబరు 24న ఈ మసీదును మళ్లీ ప్రారంభించారు.
దీన్ని ప్రారంభించే సమయంలో భారీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదాత్, మత నాయకుడు మొమహ్మద్ బుర్హానుద్దీన్, అల్-అజహర్ యునివర్సిటీలోని ఉన్నత ప్రభుత్వాధికారులు, మతపెద్దలు కూడా హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికి నాలుగు దశాబ్దాల తర్వాత, 2017లో దావూదీ బోహ్రా వర్గ ప్రతినిధులు, ఈజిప్టు పర్యటక శాఖ అధికారులు కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
దీనిలో భాగంగా గాలిలో తేమ నుంచి మసీదు లోపలి గోడలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరోవైపు లోపలా బయటా సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.
2017లో మొదలైన ఈ ప్రాజెక్టు 2023 వరకూ కొనసాగింది. ఈ ఆరేళ్లలో దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ ఈజిప్టులో నాలుగో అత్యంత పురాతనమైన, రెండో అతిపెద్ద అల్-హకీమ్ మసీదును పర్యటకుల కోసం తెరిచారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ పర్యటనపై దావూదీ బోహ్రాలు ఏమంటున్నారు?
అల్-హకీమ్ మసీదులో మోదీ పర్యటించడంపై ఏం అనుకుంటున్నారో తెలుసుకునేందుకు దావూదీ బోహ్రాలతో బీబీసీ మాట్లాడింది.
ముంబయిలోని ఓ కాలేజీలో పనిచేస్తున్న దావూదీ బోహ్రా వర్గ ప్రతినిధి డాక్టర్ తాలిబ్ యూసుఫ్ స్పందిస్తూ.. ‘‘ఇది భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రాలకు గర్వకారణం.’’ అని అన్నారు.
‘‘దావూదీ బోహ్రాలు భారత్‌లో తక్కువ సంఖ్యలో ఉండొచ్చు. అయితే, అల్-హాకిమ్ మసీదును మోదీ సందర్శించడంతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ పర్యటన ద్వారా శాంతి, ఐక్యత, సమైక్యతలపై ప్రపంచం మొత్తానికి మోదీ సందేశమిస్తున్నారు.’’ అని ఆయన చెప్పారు.
అల్-హాకిమ్ మసీదు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈజిప్టులోని ఈ మసీదు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో జీవిస్తున్న దావూదీ బోహ్రాలకు ఇది చాలా ముఖ్యమైనది. ముస్లింలలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారు.’’ అని యూసుఫ్ వివరించారు.
గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి దావూదీ బోహ్రాలకు చేరువయ్యేందుకు ఇలాంటి చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా తీసుకున్నారని మరో దావూదీ బోహ్రా ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
‘‘మోదీ విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి దావూదీ బోహ్రాలను కలుస్తుంటారు. వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మోదీ గుజరాత్‌కు చెందినవారు. అక్కడ దావూదీ బోహ్రాలు ఎక్కువగానే ఉంటారు. అందుకే మోదీ అంటే మాకు, మేమంటే మోదీకి అంత అభిమానం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మసీదు డిజైన్
కైరోలోని ఫాతిమిద్ కట్టడాలకు అల్-హకీమ్ మసీదు చక్కని ఉదాహరణ లాంటిది.
చతురస్రాకారంలోని ఈ మసీదు 13 వేల 560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మధ్యలో ఐదు వేల చదరపు మీటర్ల ప్రాంగణం ఉంటుంది. దీని చుట్టూ పెద్దపెద్ద హాల్స్ కనిపిస్తాయి.
ఈ మసీదులో ప్రత్యేకమైనవి ఏమిటంటే రెండు మినార్‌లు.. తొలినాటి మసీదుల్లో ఇలాంటివి కనిపిస్తాయి. ఆ కాలంలో నిర్మించిన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని మినార్‌ల కంటే ఇవి చాలా భిన్నమైనవి.
మినార్ల వెలుపలి నిర్మాణంలో మమ్లూక్ శైలి, లోపలి వైపు పాతిమిద్ శైలి కనిపిస్తుంది.
మసీదులోని ప్రధాన భాగం, మినార్లను రాళ్లతో నిర్మించారు. మిగతా కట్టడాల్లో ఇటుకలు ఉపయోగించారు.
ఈ మసీదుకు మొత్తంగా 13 ద్వారాలు ఉన్నాయి. మధ్య భాగంలో నీటి కొలను కూడా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, FB/NARENDRAMODI
ఎన్నిసార్లు మోదీ మసీదులకు వెళ్లారు?
విదేశీ పర్యటనలో భాగంగా మోదీ మసీదుకు వెళ్లడం ఇదేమీ తొలిసారి కాదు.
ఇదివరకు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాల్లోనూ మోదీ మసీదులను సందర్శించారు.
షేక్ జాయద్ మసీదు: ఆగస్టు 2015లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మోదీ రెండు రోజులు పర్యటించారు.
మొదటి రోజు పర్యటనలో భాగంగా చరిత్రాత్మక షేక్ జాయద్ మసీదుకు మోదీ వెళ్లారు. అప్పుడు నాటి యూఏఈ విద్యా శాఖ మంత్రి షేక్ హమదాన్ బిల్ ముబారక్ అల్ నాహయాన్ కూడా మోదీతో వెళ్లారు.
సుల్తాన్ కబూస్ మసీదు: ఫిబ్రవరి 2018లో పశ్చిమాసియాలోని జోర్డాన్, పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటించారు.
ఈ పర్యటనలో ఒమన్ రాజధాని మస్కట్‌లోని సుల్తాన్ కబూస్ మసీదును సందర్శించారు.
ఇది ఒమన్‌లోని అతిపెద్ద మసీదు. దీన్ని ఇండియన్ శాండ్‌స్టోన్‌తో నిర్మించారు.
చూలియా మసీదు: 2018 మే-జూన్‌లలో ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌లలో మోదీ పర్యటించారు.
మొదటగా సింగపూర్‌లోని మరియమ్మన్ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం చూలియా మసీదుకు వెళ్లారు.
ఈ మసీదును తమిళ మూలాలుండే చూలియా ముస్లింలు నిర్మించారు.
ఇస్తిక్‌లాల్ మసీదు: ఇది ఇండోనేసియాలోని జకార్తాలో అతిపెద్ద మసీదుల్లో ఒకటి.
మే 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో కలిసి ఈ మసీదును సందర్శించారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















