‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్‌కాప్నియాతో స్పృహ కోల్పోతారు’

- రచయిత, ఎలోయిస్ అలనా, నాడిన్ యూసిఫ్, అలెక్స్ థెరియెన్, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అట్లాంటిక్ మహా సముద్రం అడుగున టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన జలాంతర్గామి నాలుగు రోజుల కిందట గల్లంతైంది.
ఈ జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తిగా అయిపోయే స్థితికి వచ్చింది.
మరో ఏడెనిమిది గంటల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్ ఉండదని చెబుతున్నారు.
కానీ, ఈలోగా జలాంతర్గామి ఎక్కడ ఉందో, అందులో ఉన్న అయిదుగురి పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు.
ఈరోజు దాటితే అందులో ఉన్నవారు పీల్చుకోడానికి గాలి కూడా ఉండదు. ఈ పరిస్థితి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఆక్సిజన్ పూర్తిగా అయిపోయే లోపలే జలాంతర్గామి జాడ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
22 అడుగుల పొడవైన టైటాన్ సబ్‌మెర్జిబుల్ సముద్రంలో వేల అడుగుల లోతులో చిక్కుకుపోయుంటుందని అంచనా.
కాలం గడిపోతోంది కానీ జలాంతర్గామి గురించి ఎలాంటి ఆచూకీ దొరకడంలేదు.
ఆక్సిజన్ తరిగిపోవడం ఒక్కటే కాక, లోపల ఉన్నవారికి మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని హైపర్‌బారిక్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కెన్ లెడెజ్ అంటున్నారు.
కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారాయన.

ఇంకేం జరగవచ్చు?
జలాంతర్గామిలో విద్యుత్ ఆగిపోయి ఉండవచ్చు. లోపల ఉండే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్‌లపై దీని ప్రభావం ఉంటుంది.
ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటే, లోపల ఉన్నవారు వదిలే కార్బన్ డయాక్సైడ్‌తో గది నిండిపోవచ్చు. ఇది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.
"కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగేకొద్దీ మత్తు కలుగుతుంది. గాల్లో మత్తుమందు కలిపినట్టు ఉంటుంది. నిద్ర వస్తుంది" అని డాక్టర్ కెన్ లెడెజ్ చెప్పారు.
మనిషి రక్తంలోకి అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ చేరడం ప్రమాదకరం.
ఇలాంటి స్థితిని హైపర్‌కాప్నియా అంటారు. దీనికి వెంటనే చికిత్స అందింకపోతే ప్రాణాలు పోతాయి.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే వ్యవస్థ లేదని రాయల్ నేవీ సబ్‌మెరీన్ మాజీ కెప్టెన్ ర్యాన్ రామ్‌సే చెప్పారు.
"టైటాన్ సబ్‌మెర్సిబుల్ లోపలి భాగాల వీడియోలు చూశాను. అందులో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే స్క్రబ్బర్ వ్యవస్థ కనిపించలేదు. ఇది చాలా పెద్ద సమస్య" అన్నారాయన.
అలాగే, లోపల ఉన్నవారు అల్పోష్ణస్థితి (హైపోథెర్మియా)కి లోనుకావచ్చు. అంటే శరీరం బాగా చల్లబడిపోవడం.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ సముద్రగర్భంలో భూమి అడుగుకి చేరిపోతే, నీటి ఉష్ణోగ్రత అక్కడ దాదాపు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని కెప్టెన్ రామ్‌సే చెప్పారు.
ఆ పరిస్థితుల్లో విద్యుత్ కూడా కోల్పోతే, శక్తి ఉత్పత్తి సాధ్యం కాదు. వేడి పుట్టదు.

'స్పృహ కోల్పోతే కష్టం'
హైపోథెర్మియా, ఆక్సిజన్ నిండుకోవడం, కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోవడం.. వీటన్నిటివల్ల లోపల ఉన్న వ్యక్తులు రెస్క్యూ సిబ్బందికి తమ జాడ తెలిపే శక్తిని కోల్పోతారు. అంటే, గోడలపై బలంగా కొట్టడం, చప్పుడు చేయడం వంటి సంకేతాలు అందించలేకపోవచ్చు.
"వాళ్ళు స్పృహ కోల్పోతే, చేయగలిగిందేం లేదు" అంటున్నారు డాక్టర్ లెడెజ్.
ఆక్సిజన్ కొంచమే మిగిలి ఉందని కోస్ట్ గార్డు హెచ్చరించింది కాబట్టి, జలాంతర్గామి లోపల ఉన్నవారు తమ వద్ద ఉన్న వస్తువులను కొంత జాగ్రత్తగా వాడుకుంటారని భావిస్తున్నారు.
మెల్లగా ఊపిరి పీల్చుకోవడం కొంత సహకరిస్తుంది కానీ, వాళ్లకు ఉన్న ఒత్తిడిలో ఇది సాధ్యం కాకపోవచ్చని కెప్టెన్ రామ్‌సే అన్నారు.
కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే రేణువులను గదిలో జల్లవచ్చు. లేదా విద్యుత్ ఎక్కువ వాడకుండా జాగ్రత్తపడవచ్చని డాక్టర్ లెడెజ్ చెబుతున్నారు.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, రెస్క్యూ ఆపరేషన్ విరమించుకోకూడదని, తక్కువ ఆక్సిజిన్ ఉన్నా, వారు బతికి ఉండే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.
"వాళ్ళకు ఏదో రకంగా విద్యుత్ దొరికి, వెలుతురు పడితే బతికే అవకాశాలు ఉన్నాయి" అన్నారు డాక్టర్ లెడెజ్.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














