భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి.
అయినప్పటికీ, ఈ రెండు దేశాల మధ్య చర్చలో ప్రస్తావనకు రాని అంశం ఒకటి ఉంది.
రెండు దేశాలూ దీనిపై చర్చకు దూరంగానే ఉంటుంటాయి.
అది.. రెండు దేశాలు సంయుక్తంగా అణు జలాంతర్గాములను నిర్మించడం.
భారత్, అమెరికాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కీలక పరిణామాలు జరిగాయి. భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నిజరిగినా, అణు జలాంతర్గాముల విషయంలో మాత్రం ఈ రెండు దేశాలు మాట కలపడానికి సిద్ధపడకపోవచ్చు.
దీనికి కారణాలేంటో తెలుసుకునేముందు అసలు అణు జలాంతర్గామి అంటే ఏంటో తెలుసుకుందాం.
అణు జలాంతర్గామి అంటే ఏంటి?
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అణుశక్తితో నడిచే జలాంతర్గామి. దీన్లో అణు రియాక్టర్ ఉంటుంది. ఈ రియాక్టర్ జలాంతర్గామికి ఇంధనాన్ని అందిస్తుంది.
ఈ జలాంతర్గామి నీటి అడుగున ఎంతకాలమైనా తన జాడ తెలియనివ్వకుండా జాగ్రత్తపడగలదు. రాడార్ కళ్లుగప్పి తప్పించుకోగలదు.
ఇలాంటి సామర్థ్యం మరే సాధనానికీ లేదు. అందుకే అణు జలాంతర్గామికి అంత ప్రాముఖ్యం ఉంది.
వీటిలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో ఉండే ఆయుధాలు, అవి పోషించే పాత్ర బట్టి వీటిని పలు వర్గాలుగా విభజిస్తారు.
అమెరికా నౌకాదళం వెబ్‌సైట్‌లో ఆ దేశం ఉపయోగించే వివిధ రకాల అణు జలాంతర్గాముల జాబితా ఉంది.
కానీ, భారత్‌లో వీటికి సంబంధించి తగినంత సమాచారం అందుబాటులో లేదు.
2017లో ఆరు అణు జలాంతర్గాములను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత నేవీ చీఫ్ వెల్లడించారు.
2018లో భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిహంత్' అణ్వాయుధాలతో నీటి అడుగున తొలిసారిగా గస్తీ తిరిగింది.
అణు జలాంతర్గాముల నిర్మాణంపై దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ, భారత్ వద్ద చాలా కొద్ది సంఖ్యలో ఈ వాహనాలు ఉండడం ఆందోళన కలిగించే విషయమని నేవీ అధికారులు చెబుతున్నారు.
అమెరికా నౌకాదళం వద్ద సుమారు 90 అణు జలాంతర్గాములు, చైనా వద్ద 12 వరకు అణు జలాంతర్గాములు ఉండవచ్చని అంచనా.
"మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు, అణు జలాంతర్గాముల నిర్మాణంలో ఆ దేశ సహకారం కోరడమనేది ఆయన అజెండాలో అగ్రస్థానంలో ఉండాలి" అని అడ్మిరల్ రాజా మేనన్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, INDIAN NAVY
భారత్, అమెరికాలు ఇంతకుముందు దీనిపై చర్చించాయా?
భారత్ అడిగింది కానీ, అమెరికా పెదవి విప్పలేదని అడ్మిరల్ మేనన్ తెలిపారు.
అమెరికా సహకారం కోరడం ఎందుకంత ముఖ్యం? రష్యా లేదా ఫ్రాన్స్‌తో ఎందుకు చేతులు కలపకూడదు? లేదా మనమే ఎందుకు స్వయంగా తయారుచేసూకోకూడదు?
అవన్నీ చేయవచ్చు కానీ, అమెరికా దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఉందని అడ్మిరల్ మేనన్ చెప్పారు.
భారత్, అమెరికాల మధ్య అణు జలాంతర్గాముల నిర్మాణంపై చర్చల్లో స్తబ్దత నెలకొందని మరొక భారత దౌత్యవేత్త కూడా బీబీసీతో అన్నారు.
"ఇరు దేశాల మధ్య దీనిపై నిశ్శబ్దం ఉంది. అమెరికా తనకు అత్యంత సన్నిహితమైన దేశాలతో కూడా ఈ టెక్నాలజీని పంచుకోలేదు" అని ఆయన చెప్పారు. తన పేరును వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తులో ఈ అంశం చర్చకు రావచ్చా?
అణు జలాంతర్గాముల్లో చాలా రకాలు ఉన్నాయి.
మొదటి రకం, అణ్వాయుధాలు ఉన్న అణు జలాంతర్గామి. ఉదాహరణకు భారత్ వద్ద ఉన్న ఐఎన్‌ఎస్ అరిహంత్.
రెండవది, అణ్వాయుధాలు కాకుండా ఇతర రకాల ఆయుధాలను కలిగి ఉన్న అణు జలాంతర్గామి. వీటిని కూడా ఇతర జలాంతర్గాములను, నౌకలను టార్గెట్ చేయడానికి వాడతారు. భారత్ ఇలాంటివి ఇంకా తయారుచేసుకోలేదు.
ఈ రెండవ రకం అణు జలాంతర్గామి కోసమే భారత్, అమెరికాలు చేతులు కలపాలని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.
అయితే, భారత్ అమెరికా మీద ఈ విషయంలో నమ్మకం పెట్టుకోలేదని యోగేష్ జోషి అన్నారు. ఆయన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో రీసెర్చ్ ఫెలోగాఉన్నారు.
"బ్రిటన్, ఆస్ట్రేలియాలా భారత్ అమెరికాకు మిత్రదేశం కాదు. ఈ ఏడాది మార్చిలో ఆకుస్ చొరవ కింద అమెరికా అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుందని ప్రకటించింది" అని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి కీలకమైన సాంకేతిక షేర్ చేసుకోవాలంటే, ఆ స్నేహం ఉండాలని ఆయన అన్నారు.
అయినప్పటికీ, అమెరికా అధునాతన డ్రోన్‌లతో పాటు అత్యాధునిక యాంటీ సబ్‌మెరైన్ టెక్నాలజీని భారత్‌తో షేర్ చేసుకుందని ఆయన వివరించారు.
గతంలో రష్యా భారత్‌కు అణు జలాంతర్గాములను లీజుకు ఇవ్వకుండా అమెరికా అడ్డుకుంది. కానీ, ఇప్పుడు అలా చేయట్లేదు. భారత్, అమెరికాల మధ్య ఎలాంటి సహకారం సాధ్యమో అదే నిర్మించాలని యోగేష్ జోషి అభిప్రాయపడ్డారు.
అణు జలాంతర్గాముల విషయంలో భారత్ ఎలాంటి మార్గాన్నయినా ఎంచుకోవచ్చని, అలాంటి స్వయంప్రతిపత్తిని సాధించడమే భారత్ కన్న కల అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
- టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















