హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు

హంటర్ బైడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES FOR WORLD FOOD PROGRAM USA

రెండు పన్ను ఎగవేతలతోపాటు, డ్రగ్స్ వాడుతూ అక్రమంగా ఆయుధాలతో తిరిగాడన్న అభియోగాలపై అమెరికా అధ్యక్షుడి కుమారుడు హంటర్ బైడెన్‌ను దోషిగా ప్రకటించే అవకాశం ఉంది.

ఐదు సంవత్సరాలపాటు సాగిన ఈ కేసు విచారణ అనంతరం ఆయన తన నేరాలను అంగీకరించారు. ఈ మేరకు హంటర్ బైడెన్ నేరాంగీకార పత్రాలను అమెరికా అటార్నీ డెలావేర్‌లోని ఆఫీసులో సమర్పించారు.

ఈ అగ్రిమెంట్‌లో తాను డ్రగ్ వాడుతున్నప్పటికీ గన్‌ను తన దగ్గర పెట్టుకుని తిరిగినట్లు హంటర్ బైడెన్ అంగీకరించారు.

డ్రగ్స్‌ తీసుకున్నందుకు చికిత్స చేయించుకోవడానికి, తనను పరిశీలనలో ఉంచడానికి ఆయన అంగీకరించవచ్చని తెలుస్తోంది.

ఈ అగ్రిమెంట్‌లో నిబంధనల ప్రకారం ఆయనకు జైలు శిక్ష ఉండదు.

అయితే, ప్రతిపాదిక ఈ అగ్రిమెంట్‌ను న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. హంటర్ బైడెన్ తన నేరాన్ని నమోదు చేయడానికి కోర్టుకు ఎప్పుడు హాజరవుతారన్న దానిపై స్పష్టత లేదు.

53 ఏళ్ల హంటర్ బైడెన్ గతంలో లాయర్‌గానూ, చైనా, యుక్రెయిన్‌లతో పాటు పలు దేశాలలో లాబీయిస్ట్‌గా పని చేశారు. 2014లో ఆయన కొకైన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడంతో అమెరికా నేవీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

ఆయన ఆదాయ పన్నుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయా లేదా అన్న వ్యవహారంపై గత ఐదేళ్లుగా విచారణ జరుగుతోంది. అలాగే 2018లో తాను తుపాకి కొనడానికి తప్పుడు సమాచారం అందించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

తాజాగా జరిగిన ఈ అగ్రిమెంట్‌తో ఈ కేసు ముగిసినట్లే.

2017, 2018 సంవత్సరాలలో ఆయన పన్నులు సక్రమంగా చెల్లించలేదని తేలింది. ఇప్పుడు వాటిని ఆయన చెల్లించారు.

డ్రగ్ యూజర్‌గా ఉంటూ, తుపాకీతో తిరిగాడన్న ఆరోపణ 2018లో వచ్చింది.

2021లో రాసిన ఓ పుస్తకంలో తాను ఆ సమయంలో క్రాక్ కొకైన్ విపరీతంగా వాడుతున్నట్లు అంగీకరించారు.

తాజాగా ఘటనలపై అధ్యక్షుడు జోబైడెన్ ప్రత్యర్ధులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు.

న్యాయశాఖను రాజకీయ ప్రత్యర్ధులపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

'దురదృష్టవంతుడైన కొడుకు'

''హంటర్ బైడెన్‌ను జీవితాంతం దురదృష్టం వెంటాడుతూనే ఉంది'' అని పొలిటికో మ్యాగజైన్ జర్నలిస్ట్ బెన్ ష్రెకింగర్ కొంతకాలం క్రితం చెప్పారు.

ఆయన "ది బైడెన్స్: ఇన్‌సైడ్ ది ఫస్ట్ ఫ్యామిలీస్' 50 ఇయర్స్ రైజ్ టు పవర్" అనే పుస్తకాన్ని రచించారు.

హంటర్ తండ్రి జో బైడెన్ 1972లో అమెరికా స్టేట్ డెలావేర్ నుండి సెనేటర్‌గా ఎన్నికయ్యారని బెన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు జో బైడెన్ వయసు 29 ఏళ్లు మాత్రమే. ఆ నెలలోనే బైడెన్ కుటుంబానికి ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది.

జో బైడెన్ భార్య, తన ముగ్గురు పిల్లలతో కలిసి క్రిస్మస్ ట్రీ తీసుకురావడానికి బయలుదేరారు. ''కారులో హంటర్ బైడెన్, అతని సోదరుడు బో బైడెన్, చెల్లెలు, తల్లి నీలియా ఉన్నారు. కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతని తల్లి, సోదరి మరణించారు. హంటర్, అతని సోదరుడు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది'' అని బెన్ వివరించారు.

జో బైడెన్ ఆసుపత్రి నుండే సెనేటర్‌గా ప్రమాణం చేశాడని బెన్ వివరించారు. అప్పుడు హంటర్ వయస్సు కేవలం 2 సంవత్సరాలు. అతను అప్పటి నుండి ప్రజల దృష్టిలో ఉన్నారు.

హంటర్ చదువులో చాలా తెలివైన వాడని బెన్ చెప్పారు. కానీ, తల్లి మరణం తాలూకు షాక్ ఆయనను వెంటాడుతూనే ఉంది. మొదట మద్యానికి, ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసయ్యాడు.

అతని సోదరుడు బో బైడెన్ మొదట సైన్యంలో చేరారు. తరువాత తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. డెలావేర్ అటార్నీ జనరల్ అయ్యారు.

2015లో, బో బైడెన్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. దీంతో హంటర్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

''మొదట హంటర్ భార్య అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత మరణించిన తన సోదరుడు బో బైడెన్ భార్య హేలీతో ఆయనకున్న అనుబంధం బైటికి వచ్చింది. దీని గురించి పత్రికల్లో కథనాలు వచ్చాయి.

తండ్రి జో బైడెన్ కూడా ఈ అనుబంధాన్ని అంగీకరించారు. కానీ, వారి మధ్య బంధం కూడా కొన్నాళ్లకు చెడిపోయింది. తన బిడ్డకు తండ్రి అంటూ హంటర్ బైడెన్ పై ఓ మహిళ అర్కన్సాస్‌లో కేసు కూడా వేసింది.

ఆ తర్వాత హంటర్ మెలిస్సా కోయెన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. తాను వ్యసనాల నుంచి బైటపడటానికి మెలిస్సాయే కారణమని హంటర్ చెబుతుంటారు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది'' అని బెన్ వెల్లడించారు.

తండ్రి జోబైడెన్‌తో హంటర్ బైడెన్ (ఎడమ)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి జోబైడెన్‌తో హంటర్ బైడెన్ (ఎడమ)

హంటర్ బైడెన్ తన వ్యక్తిగత జీవితంలోని గందరగోళం వల్ల మాత్రమే వార్తల్లోకి ఎక్కలేదు. ఆయన వ్యాపార వ్యవహారాలు కూడా వివాదాస్పదమయ్యాయి.

యేల్ లా స్కూల్ నుండి పట్టా పొందిన తరువాత, హంటర్ ఎంబీఎన్ఏ బ్యాంకు కోసం పని చేశారు. ఆ సమయంలో అది డెలావేర్ లో అతి పెద్ద బ్యాంక్. అందులో చేరినప్పటి నుంచి తండ్రి జో బైడెన్‌తోపాటు, హంటర్ బైడెన్ కూడా వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చారు.

''ఈ బ్యాంకు ఎజెండాను జో బైడెన్ ముందుకు తెస్తున్నారని దేశంలోని వార్తాపత్రికలు విమర్శించాయి. ఈ బ్యాంకుకు మొదట హంటర్ బైడెన్‌ ఉద్యోగిగా, తరువాత కన్సల్టెంట్‌ గా పని చేశారు. హంటర్ ఎప్పుడూ నేరుగా లాబీయింగ్ చేయలేదని జో బైడెన్ చెప్పారు. కానీ, సెనెటర్ కుమారుడు లాబీయింగ్ చేస్తున్నారని నిరంతరం విమర్శలు వినిపించేవి'' అని బెన్ వెల్లడించారు.

బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హంటర్ అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో కూడా పనిచేశారు. ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయనను రైలు ఆపరేటర్ ఆమ్‌ట్రాక్ బోర్డుకు నామినేట్ చేశారు. ఆయన ఒక లాబీయింగ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా. యుక్రెయిన్, చైనాలతో వ్యాపారం చేశారు.

2019 సంవత్సరం వరకు కూడా ఆయన డ్రగ్స్ వ్యసనం నుంచి బైటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)