జో బైడెన్‌పై ఆంక్షలు.. తమ దేశంలో అడుగుపెట్టనివ్వమన్న రష్యా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆంక్షలు విధించినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివాన్, సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌లపైన కూడా ఈ ఆంక్షలు అమలవుతాయి.

లైవ్ కవరేజీ

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, వరికూటి రామకృష్ణ

  1. ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’

    వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’
  2. బ్రేకింగ్ న్యూస్, మరీనా ఓవ్‌స్యన్నికోవా: రష్యా టీవీ లైవ్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన జర్నలిస్ట్

    మరీనా ఓవ్‌స్యన్నికోవా

    ఫొటో సోర్స్, Perviy Kanal

    టీవీ లైవ్ కార్యక్రమంలో యుక్రెయిన్‌‌పై రష్యా యుద్ధం చెయ్యడానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రష్యా జర్నలిస్టు మరీనా ఓవ్‌స్యన్నికోవా మంగళవారం మాస్కోలోని ఒక న్యాయస్థానంలో కనిపించారు.

    న్యాయస్థానం ఆమెకు 30 వేల రూబెల్స్ (సుమారు రూ.21 వేలు) జరిమానా విధించింది. అయితే, ఆమె చానెల్‌లో తెలిపిన నిరసనకు ఈ జరిమానా విధించలేదని, ఆమె రికార్డు చేసి, విడుదల చేసిన వీడియోకు సంబంధించే న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని స్వతంత్ర వెబ్‌సైట్ మెదుజా పేర్కొంది.

  3. బ్రేకింగ్ న్యూస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఆంక్షలు విధించిన రష్యా

    జో బైడెన్

    ఫొటో సోర్స్, EPA

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆంక్షలు విధించినట్లు రష్యా ప్రకటించింది.

    అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివాన్, సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌లపైన కూడా ఈ ఆంక్షలు అమలవుతాయి.

    ఇతరులపైనా ఆంక్షల ప్రభావం ఉంటుందని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

    జో బైడెన్‌ను తమ దేశంలో అడుగుపెట్టకుండా నిషేధించామని రష్యా తెలిపింది.

    అమెరికా ప్రభుత్వం రష్యాకు వ్యతిరేకంగా తీవ్రమైన విధానాలను అవలంభిస్తున్న నేపథ్యంలో, రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే తాము ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

  4. పాకిస్తాన్‌లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ సోమవారం జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలిన్ బెయిర్‌బాక్‌ కు ఫోన్ చేసి, భారత క్షిపణి తమ దేశంలో కూలిన ఘటన గురించి తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

    భారత ప్రభుత్వం పొరపాటున ఈ ఘటన జరిగినట్లు తెలిపిందని, కానీ, అంత పెద్ద విషయాన్ని చిన్న మాటతో సరిపుచ్చడం సరికాదని జర్మనీ మంత్రికి చెప్పినట్లు ఆ ప్రకటన వెల్లడించింది.

  5. మీ వంటింట్లో దాక్కున్న ప్రమాదాలు ఎన్నో తెలుసా..

    కిచెన్

    ఫొటో సోర్స్, Getty Images

    వంట చేయడం చాలా మందికి ఇష్టమైన పని కావచ్చు. కానీ, అదే ఇష్టం ఒక్కొక్కసారి ఆస్పత్రి వరకు వెళ్లేందుకు కూడా దారి తీయవచ్చు.

    వంటింట్లో వాడే కత్తులు, వేడి నీరు, కూరలు వేపేందుకు వాడే కళాయిల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది.

    యూకేలో ప్రతి ఏటా వంటింట్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారిలో 67,000 మంది పిల్లలే ఉన్నారని రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ తెలిపింది. ఇది కేవలం ప్రమాదాల్లో గాయపడిన పిల్లల సంఖ్య.

    భారతదేశంలో 2019లో చోటు చేసుకున్న 11,037 అగ్ని ప్రమాదాల్లో 6,364 ప్రమాదాలు నివాస గృహాల్లోనే చోటు చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా నివేదిక చెబుతోంది. అయితే, ఇందులో వంటింట్లో చేసుకున్న ప్రమాదాల గురించి వర్గీకరణ లేదు.

    వంటింట్లో పొంచి ఉన్న ప్రమాదాలు మీరు ఊహిస్తున్న దాని కంటే ప్రమాదకరంగా ఉండొచ్చు. మీరు ప్రతి రోజూ ఇంట్లో గడిపే స్థలం నుంచే కాలుష్యం జనిస్తూ ఉంటుంది. దీనిని మీరెప్పుడూ ఊహించి కూడా ఉండరు.

  6. వైఎస్ జగన్: ‘ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గర కూర్చుంటే ప్రజలు వచ్చి కలవడం అన్నదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి’

    వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, ysrcp

    ‘‘సర్వేలలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు నిరాకరిస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు.

    మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

    ఇందులో జగన్ మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లడం కంటే ప్రభావవంతైన కార్యక్రమం మరేదీ లేదని, తన స్వానుభవంతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు.

    ఎవరైనా నాయకుడు ఎమ్మెల్యేగా గెలవాలంటే.. అతను కనీసం రెండుసార్లు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని చెప్పారు. లేకపోతే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా గెలవడం ప్రశ్నార్థకమేనన్నారు.

    ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గర కూర్చోవడం, ప్రజలు వచ్చి ఎమ్మెల్యేలను కలవడం అన్నదానికి ఇకపై ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, ఇకపై ఎమ్మెల్యేలంతా గ్రామాల్లోకి వెళ్లాలని ఆదేశించారు.

    ప్రతి నెలా 20 రోజుల పాటు గ్రామాల్లోనే తిరగాలని ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశించారు.

    ‘‘ఒక్కమాట స్పష్టం చెప్తున్నాను. డోర్‌ టు డోర్‌ చేయకపోతే.. సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు నిరాకరిస్తాను. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే... జుట్టు ఉంటేనే ముడేసుకోవచ్చు.. లేకపోతే.. ఎలా?. గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ పోవాలి. ఎమ్మెల్యేలుగా ఉన్నవారి పనితీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది మీ వ్యక్తిగత తప్పిదమే అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఎవరూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదు. పనితీరు సరిగ్గా లేకపోతే.. సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆఅవకాశం ఇవ్వకూడదని కోరుతున్నా. మీకు తగిన సమయం ఇస్తున్నా.ఇప్పటివరకూ ఎలా ఉన్నా? ఇకపై ముందుకు కదలాలి. అది మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకొండి’’ అని జగన్ అన్నారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం

    ఫొటో సోర్స్, ysrcp

  7. యుక్రెయిన్ శరణార్థుల ఆకలి తీర్చి, ఆదుకుంటున్న భారతీయులు- గ్రౌండ్ రిపోర్ట్, దివ్య ఆర్య, బీబీసీ ప్రతినిధి, యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల నుంచి..

    పోలాండ్ సరిద్దులో భారతీయుల అన్నదానం

    రష్యా దాడి కారణంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ప్రజలు యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పొరుగు దేశమైన పోలాండ్‌కు అత్యధికంగా 15 లక్షల మంది శరణార్థులుగా వెళ్లారు.

    సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలాండ్ ఉద్యోగులకు వివిధ దేశాల నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లినవారు సహాయపడుతున్నారు.

    గడిచిన కొన్నిరోజుల్లో 'ఆపరేషన్ గంగ' కార్యక్రమం కింద యుక్రెయిన్‌లో చిక్కుకున్న చాలామంది భారతీయును స్వదేశానికి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారతీయుల్లో చాలామంది యుక్రెయిన్ నుంచి సరిహద్దులకు తరలివస్తోన్న శరణార్థుల కోసం స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

  8. యుక్రెయిన్, రష్యా మధ్య మొదలైన చర్చలు

    యుక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయని యుక్రెయిన్ ప్రతినిధి మిఖైలో పొదొల్యాక్ చెప్పారు.

    ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు చాలా రోజులుగా పలు దఫాలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. సోమవారం సాంకేతిక కారణంతో ఆగిపోయిన చర్చలు ముందే చెప్పినట్లుగా మంగళవారం మళ్లీ మొదలయ్యాయి.

    ‘‘సాధారణ నియంత్రణ అంశాలు, కాల్పుల విరమణ, దేశ భూభాగం నుంచి సైన్యం ఉపసంహరణ మొదలైనవాటిపై చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

  9. బ్రేకింగ్ న్యూస్, ఆ ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామా కోరిన సోనియా గాంధీ

    సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, AICC

    తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుల రాజీనామాలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు.

    ఈ విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విటర్‌లో ప్రకటించారు.

    ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

    ఈ నేపథ్యంలో పీసీసీలను పునర్‌వ్యవస్థీకరించేందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామాలను సోనియా కోరారని సూర్జేవాలా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. కీయెవ్‌కు రైలులో వెళ్తున్న పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా పీఎంలు.. జెలియెన్‌స్కీతో చర్చలు

    పోలాండ్ ప్రధాన మంత్రి కార్యాలయ అధికారి

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, పోలాండ్ ప్రధాన మంత్రి కార్యాలయ అధికారి మిఖెల్

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా ప్రధాన మంత్రులు రాజధాని కీయెవ్ నగరానికి వెళ్తున్నారు.

    రష్యా సైన్యం కీయెవ్‌పై భారీ స్థాయిలో బాంబులదాడి చేస్తోంది. దీంతో నగరంలో కర్ఫ్యూ కూడా ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రధాన మంత్రులు రైలులో కీయెవ్ పయనమయ్యారు.

    యుక్రెయిన్‌కు సంపూర్ణ మద్దతుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు యురోపియన్ యూనియన్ ప్రతినిధులుగా వీరు కీయెవ్ వెళ్తున్నారు.

    యురోపియన్ యూనియన్ యుక్రెయిన్‌కు అందజేయనున్న మద్దతు ప్యాకేజీని కూడా వెల్లడిస్తారు.

    రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్‌కు చేయగలిగినంత సహాయం అంతా యురోపియన్ యూనియన్ చేస్తుందని, అయితే.. నాటో మాత్రం నేరుగా యుద్ధంలో పాల్గొనదని పోలాండ్ ప్రధానమంత్రి కార్యాలయ అధికారి ప్రకటించారు.

  11. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో 35 గంటలు కర్ఫ్యూ

    కీయెవ్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్‌లో 35 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రోజు రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమలవుతుంది.

    నగరంపై బాంబుల దాడి తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ‘‘ప్రత్యేక అనుమతి లేకుండా నగరంలో తిరగడం నిషేధం. కేవలం బాంబు షెల్టర్లకు చేరుకోవడానికి మాత్రమే అనుమతిస్తాం’’ అని కీయెవ్ నగర మేయర్ విటాలీ క్లిట్స్‌ఖో తెలిపారు.

    ‘‘యుక్రెయిన్‌కు కీయెవ్ గుండెకాయలాంటిది. దీన్ని మేం కాపాడుకుంటాం. యూరప్ స్వాతంత్ర్యానికీ, భద్రతకు ఇప్పుడు ఈ నగరమే గుర్తు. వాటికోసం ముందుండి పోరాడుతోంది కూడా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నగరాన్ని వదులుకోం’’.

    ‘‘ఈరోజు చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన రోజు. అందుకే రెండు రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని కీయెవ్ ప్రజలను కోరుతున్నా’’ అని మేయర్ చెప్పారు.

  12. ‘నా పెళ్లాం మహిళ కాదు.. పెళ్లై 6 ఏళ్లు దాటినా ఇంకా మేం కలవలేదు’

    బెడ్ మీద ఉన్న దంపతులు

    ఫొటో సోర్స్, iStock/BBC

    మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తికి 2016లో వివాహమయింది. పెళ్లయి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ భార్య భర్తల మధ్య శారీరక కలయిక జరగలేదు. తన భార్య స్త్రీ కాదని ఆయన చెబుతున్నారు. తన భార్య తనను మోసం చేయడంతో తనకు విడాకులిప్పించమని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు తగిన వైద్య నివేదికలను కూడా ఆయన జతపరిచారు. ఆయన భార్యకు పురుష జననేంద్రియాలున్నాయని ఆయన పిటిషన్‌లో తెలిపారు.

  13. మద్రాస్ హైకోర్టు: పని వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడకండి

    తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు వాడటాన్ని మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ నిషేధించింది. ఈమేరకు రూల్స్ ఫ్రేమ్ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  14. ముఖ్యాంశాలు

    హలో ఆల్! మీరు బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేస్తూ ఉంటాం.

    ఇప్పటి వరకు ఉన్న విశేషాలు:

    • యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ మెడికల్ స్టూడెంట్లను తామే చదివిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
    • హిజాబ్ వివాదంలో నేడు కర్నాటక హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడమనేది ఇస్లాంలో తప్పనిసరి కాదు అని కోర్టు ప్రకటించింది.
    • యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని నివాస భవనాలపై రష్యా దాడుల్లో ఇద్దరు చనిపోయారు. మెట్రో రైలు స్టేషన్ కూడా దెబ్బతినింది.
    • ఇటీవల పాకిస్తాన్‌లో పడిన భారత్ మిసైల్ ప్రమాదవశాత్తు లాంచ్ అయిందని పార్లమెంటులో వివరణ ఇచ్చారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
    • యుక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయని అమెరికా రక్షణశాఖ అధికారులు ప్రకటించారు.
    • 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అమిత్ షా తమకు రెండు నెలల కిందటే రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు తెలిపారు.
    • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు కూడా జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగడంతో వారిని సస్పెండ్ చేశారు.
  15. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్: యుక్రెయిన్ నుంచి తిరిగిచొచ్చిన తెలంగాణ మెడికల్ స్టూడెంట్లను మేమే చదివిస్తాం

    యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన తెలంగాణ మెడికల్ స్టూడెంట్లను తామే చదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. యుక్రెయిన్‌లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు.

  16. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్: కేంద్ర విద్యుత్ సంస్కరణలు దారుణంగా ఉన్నాయ్

    కేసీఆర్: కేంద్ర విద్యుత్ సంస్కరణలు దారుణంగా ఉంటాయి. పునరుత్పాదక ఇంధన తప్పనిసరిగా వాడాలంటారు. అది కూడా తమ తాబేదార్లు తయారు చేసే విద్యుత్‌ను మాత్రమే కొనాలనే నిబంధనలు పెడుతున్నారు. లేదంటే రావాల్సిన నిధులు ఇవ్వమంటారు.

    భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, KCR/Facebook

  17. కేసీఆర్: మతకలహాలతో దేశాన్ని విభజిస్తున్నారు

    మతకలహాల పేరుతో దేశ ప్రజలను విభజిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ యువత ఈ విషయాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. బెంగళూరు వంటి నగరాలు ఉన్న కర్నాటకలో ఇలా మతం పేరుతో వివాదాలు అశాంతి సృష్టిస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ తీరు వల్ల లక్షల మంది యువత నష్టపోతున్నారని అన్నారు. ప్రజలు ధరించే బట్టలతో ప్రభుత్వాలకు ఏం పని అని, దాన్ని కూడా వివాదం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

  18. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్: అప్పులను అప్పులుగా చూడకూడదు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, KCR/Facebook

    కేసీఆర్: అప్పులను అప్పులుగా చూడకూడదు,వనరుల సమీకరణగా చూడాలి. అప్పుల వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నేడు భారత దేశ అప్పు రూ.152 లక్షల కోట్లు. జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పుల వాటా 58.5శాతం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయనివ్వదు.

  19. ‘యుక్రెయిన్‌ను గెలవలేక ప్రజల నివాసాలపై రష్యా దాడులు చేస్తోంది’

    యుక్రెయిన్ మీద దాడి కోసం రష్యా రచించిన ప్రణాళికలు పెద్దగా పని చేయడం లేదని బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి జేమ్స్ క్లవర్లీ అన్నారు. ఫలితంగా పౌర నివాసాలను రష్యా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. యుక్రెయిన్లు ధైర్యంగా పోరాడుతుండటం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు కోపం తెప్పిస్తోందని, ఫలితంగా ప్రజల నివాసాల మీద రష్యా దాడులు చేస్తున్నట్లు వివరించారు.

    వైమానికదాడుల వల్ల దెబ్బతిన్న యుక్రెయిన్‌లోని నివాస భవనం
  20. ఆంధ్రప్రదేశ్: ‘2024లో బీజేపీ-జనసేన అధికారంలోకి వచ్చేందుకు సన్నాహాలు’

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

    ఫొటో సోర్స్, BJP

    2024లో జనసేనతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తమకు అమిత్ షా స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధిష్టానం నుంచి ఉన్న ఆదేశాలు, దిశా నిర్దేశం ప్రకారం పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. రానున్న మరికొద్ది రోజుల్లో జనసేనతో కలిసి అధికార పార్టీమీద తీవ్ర స్థాయిలో ఉద్యమించనున్నట్లు ప్రకటించారు.