అమెరికా అప్పుల కుప్పగా మారనుందా? భారత సాఫ్ట్‌వేర్ రంగంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ బృందం
- హోదా, దిల్లీ
అమెరికాను ఆర్థికంగా అగ్రరాజ్యంగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దానికి పేరు ఉంది.
అమెరికాలో చేసే స్వల్ప ఆర్థిక మార్పులు కూడా, ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ 23 లక్షల కోట్ల డాలర్లు.
ఇప్పుడు మరిన్ని అప్పులు తీసుకునేందుకు అమెరికాకు పార్లమెంట్ అనుమతి లభిస్తుందా అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.
క్వాడ్ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేయడమే ఈ అంశం తీవ్రతను స్పష్టంగా తెలుపుతుంది.
చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన నాలుగు దేశాల కూటమి క్వాడ్.
అమెరికా తన అప్పులను తీర్చలేకపోతోందనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు అప్పు తీసుకోవడానికి యూఎస్ కాంగ్రెస్ అనుమతి అవసరం. కానీ, ప్రస్తుతానికి ఇది కష్టంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రుణ పరిమితి ఎంత?
ఖర్చుల నిమిత్తం అమెరికా ప్రభుత్వం తీసుకునే గరిష్ఠ రుణాన్ని డెట్ సీలింగ్ లేదా రుణ పరిమితి అంటారు. అమెరికా కాంగ్రెస్ ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
భారత్, అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాలది లోటు బడ్జెట్. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే రాబడి కంటే ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చుల కోసం ప్రభుత్వాలు అప్పు చేయాల్సి ఉంటుంది.
అమెరికాలో ఇది సాధారణ ప్రక్రియ. దేశ ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాతే యూఎస్ కాంగ్రెస్ రుణ పరిమితిని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
1960 నుంచి అమెరికా కాంగ్రెస్ 78 సార్లు రుణ పరిమితిని మార్చింది.
కానీ, ఈసారి ప్రతిపక్ష రిపబ్లికన్ చట్ట సభ్యుల నుంచి బైడెన్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రుణ పరిమితి అనేది భవిష్యత్ ఖర్చుల కోసం కాదు. తక్షణ చెల్లింపుల కోసం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు కూడా ఈ కోవలోకే వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అప్పుల కుప్పగా మారుతుందా?
అమెరికా డెట్ సీలింగ్ సంక్షోభం అనేది ఆర్థికంగా కంటే ఎక్కువ రాజకీయ సంక్షోభంగా మారిందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా అప్పుల దేశంగా మారే ప్రసక్తే లేదని బీబీసీతో మాట్లాడిన చాలా మంది నిపుణులు అన్నారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు.
ఎందుకంటే ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే, పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని తెలిపారు.
ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేరు.
జూన్ 1 తర్వాత అమెరికా ట్రెజరీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జో బైడెన్, రుణ పరిమితిని పెంచలేకపోతే తర్వాత ఏం అవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
రుణ పరిమితిని పెంచలేకపోతే?
అలా జరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం.
ఈ పరిస్థితి గురించి బీబీసీతో పన్మూర్ గోర్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సిమోన్ ఫ్రెంచ్ మాట్లాడారు. ‘‘ఒకవేళ అలాంటిది జరిగితే, 2008 నాటి ఆర్థిక సంక్షోభం కంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది’’ అన్నారు.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ అమెరికా కాంగ్రెస్ రుణ పరిమితిని పెంచకపోతే, ఇకపై అమెరికా అప్పులు తీసుకోలేదు.
ప్రభుత్వ పనులకు, ఇతరాలకు ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఉదాహరణకు, ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలకు సహాయం ఆగిపోతే, వారు రోజూవారీ అవసరాలను కూడా తీర్చుకోలేరు. దీని ప్రభావం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.
అంతేకాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై, పేద ప్రజలకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో నిపుణులు ఒక అంచనా వేశారు.
ఒకవేళ రుణ పరిమితిని పెంచకపోతే లేదా నిరవధికంగా వాయిదా వేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ 6 శాతం కుంచించుకుపోతుందని ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహా కమిటీ పేర్కొంది.
అమెరికా ఎకానమీలో కేవలం ఒక శాతం క్షీణత వచ్చినా అది భారీ నష్టాలను కలిగిస్తుంది. కోట్ల మంది ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఈ సంక్షోభం ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రపంచంపై దీని ప్రభావం గురించి మాట్లాడితే దీన్ని ‘‘నాక్ ఆన్ ఎఫెక్ట్’’ అని పిలుస్తారు.
అమెరికా సెంట్రల్ బ్యాంక్, వడ్డీ రేట్లలో చేసే చిన్న మార్పు కూడా ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది.
ఇలాంటి పక్షంలో 23 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే అది కచ్చితంగా ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
భారత్ వంటి దేశాలు కూడా దీని ప్రభావానికి గురవుతాయి. ఎందుకంటే అమెరికా నుంచి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ఎగుమతులు ప్రభావితం అవుతాయి. తద్వారా పలు దేశాల్లోని కంపెనీలు ప్రభావితం అవుతాయి.
అమెరికా నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో, భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ మందగమనంలో నడుస్తోంది.
అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే ప్రపంచం అంతటా డాలర్లతోనే వ్యాపారం జరుగుతుంది. చాలా దేశాలకు డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ.
ఒకవేళ అమెరికా అప్పు తీర్చలేకపోతే, డాలర్ కూడా నష్టపోతుంది.
భారత్ వంటి దేశాలు ఈ విషయంలో కొంత ప్రయోజనం పొందుతాయి. కానీ, డాలర్ల క్రయవిక్రయాల్లో భారీ తేడా ఉంటుంది. ఇది ఏ ఆర్థిక వ్యవస్థకూ మంచిది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యవహారం ఎందుకు ఇంతగా ముదిరింది?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలసీలను, నిర్ణయాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం కొత్త విషయమేమీ కాదు.
రుణపరిమితిపై ఏకాభిప్రాయం లేకపోవడానికి కారణం ఏంటంటే, నిరంతరం అంత ఖర్చును ప్రభుత్వం భరించలేదని ప్రతిపక్ష రిపబ్లికన్ చట్టసభ సభ్యులు భావించడం. దీన్నే ‘‘అస్థిరత’’ అని పిలుస్తున్నారు.
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. సంక్షేమ పథకాలకు కోత విధించి ప్రజల్లో ఆదరణను కోల్పోవడం బైడెన్‌కు ఇష్టం లేదు.
మరోవైపు, బడ్జెట్‌ను తగ్గిస్తామని బైడెన్ హామీ ఇచ్చారని రిపబ్లికన్ పార్టీ నేతలు అంటున్నారు.
ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
బడ్జెట్‌ను, రుణ పరిమితిని ఒకదానితో ఒకటి జోడించి మాట్లాడకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














