టైటాన్ సబ్ మెర్సిబుల్: టాయిలెట్‌కు తలుపులు కూడా లేని ఈ నౌకలోకి ఐదుగురిని పంపి 17 బోల్ట్‌లు బిగించి నీళ్లలోకి దింపారు....ఎందుకు?

ఫొటో సోర్స్, OCEANGATE
- రచయిత, మ్యాట్ మర్ఫీ
- హోదా, బీబీసీ న్యూస్
అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళుతూ మూడు రోజుల కిందట గల్లంతైన టైటాన్ సబ్ మెర్సిబుల్‌ను కనుగొనేందుకు రెస్క్యూ టీమ్‌లు కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నాయి.
టైటాన్ సబ్ మెర్సిబుల్ కోసం వెతికే క్రమంలో ఆ వాహనం శబ్ధాలను సోనార్ బయోస్ గుర్తించిందన్న వార్త, అందులోని అయిదుగురు యాత్రికులు ప్రాణాలతోనే ఉన్నారనే ఆశలను పెంచింది.
సముద్ర అంతర్భాగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని యూఎస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించినప్పటికీ, వాహనం ఎక్కడుందో ఇంకా కనుక్కోలేకపోయారు.
భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం గం. 4.30 గం.ల వరకు అందులో ఉన్న ఆక్సీజన్ యాత్రికులకు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిగంటలు చాలా కీలకంగా మారతాయి.
మంగళవారం ప్రతి అరగంటకు ఒకసారి చొప్పున నాలుగు గంటలపాటు సోనార్ బయోస్‌కు శబ్దాలు చేరాయని యూఎస్ అధికారులు వెల్లడించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి.
అయితే, పూర్తి డేటా చూడకుండా ఈ శబ్ధాలు దేనికి సంబంధించినవో చెప్పడం కష్టమని డీప్ సీ నిపుణులు బీబీసీతో అన్నారు.
సబ్‌మెర్సిబుల్ లోపలి భాగాన్ని ఏదైనా వస్తువుతో కొట్టడం వల్ల ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ధాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
తనకు అందిన డేటా ప్రకారం ఈ శబ్ధాలు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందినవే అని ఆస్ట్రేలియా సబ్ మెరైన ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్రాంక్ ఓవెన్ చెప్పారు. ఈ శబ్ధాలు సబ్ మెర్సిబుల్ లోపలి నుంచే వస్తున్నాయన్నారు.
‘‘ప్రతి అరగంటకు ఒకసారి వస్తున్నాయంటే అవి తప్పకుండా మనుషులు చేసే శబ్ధాలే’’ అన్నారాయన.
యాత్రికులను లోపల ఉంచి బోల్ట్‌లు బిగించారు.
సబ్ మెర్సిబుల్ సముద్రంలోకి దిగడానికి ముందుగా వాహనంలోకి యాత్రికులు వెళ్లిన తర్వాత సహాయక సిబ్బంది బయట నుంచి సబ్ మెర్సిబుల్‌ను లాక్ చేయాల్సి వచ్చింది. వారు దాన్ని బోల్ట్‌లతో సీల్ చేశారు.
టైటాన్ సబ్ మెర్సిబుల్ బరువు 10,342 కేజీలు ఉంటుందని కంపెనీ చెప్పింది. ఇందులో అయిదు అంగుళాల మందపాటి కార్బన్ ఫైబర్ హల్ ఉంటుందని తెలిపింది.
సముద్ర మట్టానికి దిగువన 4,000 మీటర్లు (13,123 అడుగుల) లోతు వరకు ఈ సబ్ మెర్సిబుల్ చేరుకోగలదు.
టైటానిక్ శిథిలాలు సముద్రంలో 3,800 మీటర్ల లోతులో ఉన్నాయి.
సబ్‌మెరైన్‌ల తరహాలో కాకుండా సబ్ మెర్సిబుల్స్‌కు పరిమిత శక్తి నిల్వలు ఉంటాయని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ సబ్ మెర్సిబుల్‌ను ప్రయోగించడానికి, పునరుద్ధరణ పనులు చేయడానికి మరో ప్రత్యేక సహాయక నౌక అవసరమని చెప్పింది.
ఈ కథనంలో Facebook అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Facebook కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Facebook ముగిసింది
సబ్ మెర్సిబుల్ లోపల ఎలా ఉంటుంది?
సబ్ మెర్సిబుల్ లోపలి భాగం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో కేవలం అయిదుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.
ఇలాంటి యాత్రలకు తీసుకెళ్లే మిగతా వాటికంటే ఇది పరిమాణంలో పెద్దది అయినప్పటికీ, ఇందులో ప్రయాణికులు కింద కూర్చొనే వెళ్లాల్సి ఉంటుంది. అందులో స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగడం కూడా కష్టమే.
సబ్ మెర్సిబుల్ ముందు భాగాన ఒక పెద్ద గోపురం లాంటి పోర్ట్‌హోల్ (కిటికి వంటి నిర్మాణం)ఉంటుంది. దీనిద్వారా ప్రయాణికులు సముద్ర అంతర్భాగాన్ని చూడొచ్చు. సముద్రం లోతుల్లోకి మానవుల్ని తీసుకెళ్లే సబ్ మెర్సిబుల్ అన్నింటిలోకెల్లా ఇదే అతిపెద్ద వ్యూ పాయింట్ అని కంపెనీ చెబుతోంది.
సముద్రం లోతుల్లో విపరీతమైన చలి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సబ్ మెర్సిబుల్ గోడలు వెచ్చగా ఉండేలా నిర్మాణం చేశారు. వెలుతురు కోసం లోపల లైట్లను ఏర్పాటు చేశారు. మ్యూజిక్ వ్యవస్థ కూడా ఉంది.
సబ్ మెర్సిబుల్ ముందు భాగంలో ఒక టాయ్‌లెట్ కూడా ఉంటుంది. దానికి తలుపు కాకుండా కేవలం కర్టెన్ మాత్రమే ఉంటుంది.
ప్రయాణానికి ముందు, ప్రయాణించేటప్పుడు ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రించుకోవాలని కంపెనీ వెబ్‌సైట్ సూచనల్లో పేర్కొన్నారు.
సబ్ మెర్సిబుల్ బయట శక్తిమంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. టైటానిక్ శిథిలాలు స్పష్టంగా కనిపించడం కోసం ఈ ఏర్పాటును చేశారు.
అంతేకాకుండా, దీని బయటవైపు అనేక 4కె కెమెరాలను అమర్చారు. నౌక ఎక్కడుందో తెలుసుకోవడం కోసం లేజర్ స్కానర్, సోనార్లను బయటివైపు బిగించారు.
లోపలి సిబ్బంది భారీ డిజిటల్ తెర మీద టైటానిక్ శిథిలాలను చూడొచ్చు.
టైటాన్‌లో 96 గంటలకు సరిపడా ఆక్సీజన్ నిల్వలు ఉంటాయి. కానీ, సిబ్బంది శ్వాసరేటును బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి.
ఇంటీరియర్‌లో ఎక్కువ భాగం ‘‘ఆఫ్ ద షెల్ఫ్ టెక్నాలజీ’’ని ఉపయోగించినట్లు కంపెనీ చెప్పింది.

ఫొటో సోర్స్, AMERICAN PHOTO ARCHIVE/ALAMY
టైటాన్‌ను ఎలా నియంత్రిస్తారు?
టైటాన్ తరహాలో చాలా లోతుల్లోకి వెళ్లే సబ్ మెర్సిబుల్స్‌లో జీపీఎస్ పనికి రాదు.
జీపీఎస్‌కు బదులుగా ఒక ప్రత్యేకమైన టెక్స్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఇందులో వాడారు. ఇది ఉపరితలం నుంచి సహాయక సిబ్బంది పంపే సూచనలు సబ్ మెర్సిబుల్‌లోని ప్రయాణీకులకు చేరేలా చేస్తుంది.
సబ్‌మెర్సిబుల్‌లోని పైలట్ తనకు అందిన సూచనల ఆధారంగా ఒక వీడియో గేమ్ కంట్రోలర్‌తో వాహనాన్ని నడుపుతారు.
సబ్ మెర్సిబుల్‌ను నడపడానికి చాలా నైపుణ్యం అక్కర్లేదని గతేడాది సీబీఎస్ న్యూస్‌తో రష్ అన్నారు.
టైటానిక్ శిథిలాలను పూర్తిగా చూడటానికి 8 గంటలు సమయం పడుతుందని అంచనా వేశారు.
సీబీఎస్ ప్రతినిధి డేవిడ్ పోగ్ 2018లో టైటాన్‌లో పర్యటించినప్పుడు కమ్యూనికేషన్ దెబ్బతినడంతో సబ్ మెర్సిబుల్ సముద్రంలో తప్పిపోయింది. రెండు గంటల తర్వాత కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించారు.

ఫొటో సోర్స్, DIRTY DOZEN PRODUCTIONS
ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి?
సముద్రపు లోతుల్లో కలిగే అధిక పీడనాన్ని టైటాన్ తట్టుకోగలగాలి.
సబ్ మెర్సిబుల్ ఉపరితల పీడనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ అందులో ఉందని ఓషన్ గేట్ వెబ్‌సైట్ తెలుపుతుంది.
సముద్రంలోకి దిగిన తర్వాత నౌక పీడనంలో వచ్చే మార్పుల ప్రభావాన్ని విశ్లేషించే సెన్సర్లు ఉన్నాయి.
ప్రయాణీకులతో కూడిన సబ్ మెర్సిబుల్‌ను సముద్రంలోకి దించే ముందు సహాయక బృందం బయట నుంచి దాన్ని లాక్ చేస్తుంది. మొత్తం 17 బోల్ట్‌లతో దాన్ని పూర్తిగా మూసివేస్తుంది.
ఇది ఒక ప్రయోగాత్మక నౌక అని ఓషన్ గేట్ చెప్పింది.
సీబీఎస్ ప్రతినిధి ఇందులో ప్రయాణించినప్పుడు కూడా ‘‘ఈ సబ్ మెర్సిబుల్‌ను ఏ నియంత్రణ సంస్థ ఆమోదించలేదు. ఇందులో ప్రయాణం వల్ల గాయాలు, వైకల్యంతో పాటు మానసిక హింసకు గురికావొచ్చు. మరణం కూడా సంభవించవచ్చు’’ అనే ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి వెళ్లాల్సి వచ్చింది.
‘‘సబ్ మెర్సిబుల్‌లో ప్రయాణించడం అంటే డిస్నీ వరల్డ్‌లో తిరిగినట్లు ఉండదు. ఇందులో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఒక ప్రచార వీడియోలో ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణుడు ఆరోన్ న్యూమన్ చెప్పారు.

సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు?
టైటాన్‌లో సముద్రం అంతర్భాగంలోకి వెళ్లాలని కోరుకునే ప్రయాణీకులకు గతంలో డైవింగ్ చేసిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదని ఓషన్‌గేట్ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ప్రయాణానికి ముందు ప్రయాణీకులకు కావాల్సిన శిక్షణను ఆన్‌లైన్‌లో అందిస్తామని తెలిపింది.
18 ఏళ్లు పైబడిన వారు ప్రయాణానికి అర్హులని, ఎక్కువ సమయం పాటు పరిమిత స్థలంలో కూర్చునే సామర్థ్యంతో పాటు, నిచ్చెన ఎక్కగలిగే సామర్థ్యం ఉండాలని పేర్కొంది.
ఓషన్‌గేట్ చెప్పిన దాని ప్రకారం, ప్రయాణీకులందరికీ తగిన భద్రతా సూచనలు, నౌకలో ప్రయాణించడానికి కావాల్సిన శిక్షణను అందించారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
- టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















