ఆస్ట్రేలియాలో చైనాను దాటేసిన ఇండియన్లు, ఎందుకిలా పెరుగుతున్నారంటే...

ఫొటో సోర్స్, AVANI WINES
- రచయిత, చెరిలన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రోహిత్ సింగ్ ఆస్ట్రేలియాలోని మార్నింగ్టన్ పెనిన్సులాలో నివసిస్తున్న రెండవ తరం భారతీయుడు. ఇది మెల్‌బోర్న్ నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే ఈ నగరం వస్తుంది.
రోహిత్ తల్లిదండ్రులు 1990లలో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలసవెళ్లారు. అక్కడ 'అవని' అనే చిన్న వైన్ కంపెనీ పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా రోహిత్ ఈ కంపెనీ వ్యవహారాల్లో వాళ్లకు సాయం చేస్తున్నారు.
గడచిన దశాబ్దంలో మెల్‌బోర్న్‌లో దక్షిణాసియా వాసుల జనాభా బాగా పెరిగిందని, అందుకే అవని వైన్స్.. వైన్‌తో పాటు భారతీయ వంటకాలను అందించే మరో చిన్న కంపెనీని కూడా ప్రారంభించిందని రోహిత్ చెప్పారు.
పినోట్ గ్రిస్ వైన్‌తో చేపల ఇగురు, పినోట్ నోయిర్ వైన్‌తో దాల్ మఖని లాంటి కాంబినేషన్లు అందిస్తున్నారు. ఆ దేశంలో వంటవాళ్ళు, రెస్టారెంట్ యజమానులు ఇలాంటి కొత్త కొత్త మేళవింపులు కనిపెడుతున్నారు.
ఆస్ట్రేలియాలో ఏడు లక్షల కంటే ఎక్కువమంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ వలసలకు గమ్యంగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి.
గత కొన్నేళ్ళుగా ఆ దేశానికి వెళ్ళి, సెటిల్ అయే భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఆస్ట్రేలియాలో గత జనాభా లెక్కల ప్రకారం, ఆ దేశంలో ఇంగ్లిష్ మాట్లాడే మాట్లాడే వాళ్ల తర్వాత రెండో అతి పెద్ద గ్రూప్ అయిన చైనాను దాటి భారతీయులు సంఖ్య పెరిగింది.
ఈ మధ్యకాలంలో వలసలకు టెక్నాలజీ రంగం వేదికగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో సాంకేతిక నైపుణం ఉన్నవారికి అధిక డిమాండ్ ఉంది.
జర్నలిస్ట్ ఆర్తి బెటిగెరి ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల అనుభవాల సంకలనాన్ని తీసుకొస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు 1960లలో ఆ దేశానికి తరలివెళ్లారు.
అప్పట్లో చాలాకొద్ది మంది భారతీయులు అక్కడ ఉండేవారని, రోడ్లపై, వీధుల్లో అరుదుగా కనిపించేవారని ఆర్తి చెప్పారు.
"కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. చాలా రంగాల్లో భారతీయులు ఉన్నారు. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తున్నారు" అన్నారామె.
ఇటీవల ఎన్నికైన న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వంలో నలుగురు భారతీయ సంతతికి చెందిన రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో డానియల్ ముఖేయ్ ఒకరు. ఈ మార్చిలో న్యూ సౌత్ వేల్స్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందినవారిలో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి ఆయన.
అయితే, ఇది ఆరంభం మాత్రమే. అక్కడి రాజకీయాల్లో యూరోపియన్లు కానివారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. ముఖ్యంగా, జాతీయ స్థాయిలో.

ఫొటో సోర్స్, Getty Images
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, ఆస్ట్రేలియాలను ఏకం చేయడంలో 'సాఫ్ట్ పవర్ ఇచ్చిపుచ్చుకోవడం' అనేది శక్తివంతమైన పాత్ర పోషించిందని ఆర్తి అన్నారు. సాఫ్ట్ పవర్ అంటే సంస్కృతి, సైద్ధాంతిక భావజాలం, రాజకీయ, విదేశాంగ విలువల ద్వారా పరోక్షంగా ప్రభావితం చేయగలగడం.
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సిడ్నీలో ప్రసంగిస్తూ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా లాంటి టీవీ షోలు, క్రికెట్, సినిమాలు ఈ రెండు దేశాల ప్రజలను దగ్గర చేశాయని అన్నారు. సిడ్నీలో పీఎం సభకు వేలాదిమంది భారతీయులు హాజరయ్యారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంలో కీలకపాత్ర పోషించిందని నిపుణులు భావిస్తున్నారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా వెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం అదే తొలిసారి.
ఈమధ్య మే నెలలో మోదీ సిడ్నీ వెళ్లినప్పుడు, ఇరుదేశాలు సంయుక్తంగా వలస ఒప్పందాన్ని ప్రకటించాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు ముఖ్యంగా విద్యార్థులకు, విద్యావేత్తలు, నిపుణులకు సులభతం చేసేందుకు ఈ ఒప్పందాన్ని ముందుకు తీనుకొచ్చారు.
అలాగే, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇద్దరు ప్రధానులూ తెలిపారు.
మార్చిలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తొలిసారి అధికారికంగా భారత్‌లో పర్యటించారు. మోదీ, అల్బనీస్ కలిసి రక్షణ, భద్రత, ఆర్థిక సహకారం, విద్య, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై చర్చించారు.
"ఇద్దరు ప్రధానుల మధ్య, మంత్రుల మధ్య తరచూ జరుగుతున్న సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలను ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచాయి" అని గ్లోబల్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ గ్రూప్ అయిన 'సీయూటీఎస్ ఇంటర్నేషనల్'లో పనిచేస్తున్న ప్రదీప్ ఎస్. మెహతా చెప్పారు.
ఈ రకమైన భాగస్వామ్యం ఇరుదేశాలకూ లాభదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు దేశాలు క్వాడ్ గ్రూపులో కూడా భాగం పంచుకుంటున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం తగ్గిచడం కోసం క్వాడ్ గ్రూప్ ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
వలసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
భారత్, ఆస్ట్రేలియాల మధ్య చాలా పురాతనమైన సంబంధం ఉంది. ఒకప్పుడు ఈ రెండు దేశాలు గోండ్వానా అనే మహాఖండంలో భాగంగా ఉండేవి.
భారతీయులు ఆస్ట్రేలియాకు వలసపట్టడం 1800లలో ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిషర్లకు సేవకులుగా, శ్రామికులుగా ఈ దేశం నుంచి ఆ దేశానికి తరలివెళ్లేవారు.
1990లలో భారతీయుల వలసలు పెరిగాయి. 1973లో 'వైట్ ఆస్ట్రేలియా పాలసీ'ని రద్దుచేసిన తరువాత వలసలు మరింత పెరిగాయి. శ్వేతజాతీయులు కానివారి వలసలను పరిమితం చేసే జాత్యహంకార చట్టం అది.
"అప్పటికీ, వలసలను ఆహ్వానించే విషయంలో ఆస్ట్రేలియా పరిమితంగానే వ్యవహరించేది. నైపుణ్యాలు కలవారిని, అంటే టెక్ రంగంలో పనిచేసేవారు, డాక్టర్లు, నర్సులు, విద్యావేత్తలను ఆహ్వానించేవారు. అది కూడా తక్కువ సంఖ్యలో" అని రిసెర్చర్ జయంత్ బాపట్ చెప్పారు. 'ది ఇండియన్ డయాస్పోరా: హిందూస్ అండ్ సిఖ్స్ ఇన్ ఆస్ట్రేలియా' పుస్తకానికి సహ రచయిత ఆయన.
అయితే, 2006లో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆస్ట్రేలియాలో జాన్ హోవర్డ్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తలుపులు తెరిచింది. అలాగే, వారు శాశ్వత నివాసం పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు పాలసీలను ప్రవేశపెట్టింది.
"తాత్కాలిక వలసదారుల్లో అధిక భాగం భారతీయ విద్యార్థులే ఉంటారు. వాళ్లు డిగ్రీలు పూర్తిచేసిన తరువాత ఆస్ట్రేలియాలో సెటిలవ్వడానికి అనుమతి పొందుతారు" అని బాపట్ చెప్పారు.
అయితే, కొన్ని రకాల ఉద్రిక్తతలు లేకపోలేదు. 2000ల చివర్లో సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో భారతీయ విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడులు వార్తల్లోకెక్కాయి.
ఆస్ట్రేలియాలో భారతీయులు నిరసన ప్రదర్శనలతో వీధుల్లొకొచ్చారు. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం ఘాటూగా స్పందించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. అయినాసరే, ఇప్పటికీ చెదురుమదురు ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, MEDIALAB
కొత్త తరం ఇండియన్-ఆస్ట్రేలియన్లు ఏమంటున్నారు?
ఆసియా, దక్షిణాసియా వాసులు ఆస్ట్రేలియన్ సమాజానికి చాలా అవసరమైన బహుళ సాంస్కృతికతను తీసుకువచ్చారని, దానివల్ల ఆ దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందిందని కొందరు మద్దతుదారులు అంటారు.
అయితే, కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఆస్ట్రేలియా వలస విధానాలను విమర్శిస్తున్నారు. తక్కువ వేతనానికి వచ్చే వలసదారులు స్థానికుల నుంచి ఉపాధి కొల్లగొడతారని, వనరుల వినియోగాన్ని పెంచుతారని వాదిస్తున్నారు.
కాగా, ఆస్ట్రేలియా సమాజానికి తమ సంస్కృతి, వారసత్వం గురించి చెబుతూ ఆ దేశం మరింత సమ్మిళితంగా మారడానికి దోహదం చేస్తున్నామని అక్కడ ఉన్న భారతీయులు కొందరు చెబుతున్నారు.
కథక్, భరతనాట్యం లాంటి భారతీయ నృత్యాలను ఆస్ట్రేలియాలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని సిడ్నీలో నివసిస్తున్న దివ్య సక్సేనా (24) భావిస్తున్నారు.
సిడ్నీలో తనలాంటి ఇండియన్-ఆస్ట్రేలియన్లు చాలామంది ఉన్నారని, మూసపద్ధతికి భిన్నంగా, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆమె చెప్పారు.
"మా తల్లిదండ్రులు ఇక్కడికొచ్చి బాగా సంపాదించి స్థిరపడేందుకు శాయశక్తులా కృషి చేశారు. పిల్లలకు మంచి జీవితం అందించాలని తపనపడ్డారు. వారి జీవితాలు అందుకే వెచ్చించారు. కానీ, మా తరంపై అంత ఒత్తిడి లేదు. అందుకే క్రియేటివ్ రంగాల్లో ప్రయోగాలు చేయగలుగుతున్నాం. మా అభిరుచులను కొనసాగిస్తూ, రాబోయే తరాలకు ఆస్ట్రేలియాను మరింత సానుకూలంగా మలచడానికి ప్రయత్నిస్తున్నాం" అన్నారు దివ్య.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














