ఆర్‌బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొండి బకాయిల రికవరీ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.
ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డీఫాల్ట్స్), మోసపూరిత ఖాతాలు (ఫ్రాడ్ అకౌంట్స్)లతో రాజీ పరిష్కార ఒప్పందాన్ని (కాంప్రమైజ్ సెటిల్‌మెంట్) కుదుర్చుకునేందుకు ఇటీవలే బ్యాంకులను ఆర్‌బీఐ అనుమతించింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
జూన్ 8వ తేదీన "ఫ్రేమ్‌వర్క్ ఫర్ కాంప్రమైజ్ సెటిల్‌మెంట్స్ అండ్ టెక్నికల్ రైట్-ఆఫ్స్" పేరిట ఆర్‌బీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది.
దీని ఉద్దేశం ఏంటంటే.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మోసపూరిత ఖాతాలతో బ్యాంకులు సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు లేదా రైటాఫ్ చేసుకోవచ్చు.
ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మోసానికి పాల్పడిన కంపెనీలు ఇప్పుడు బ్యాంకులతో రాజీ చేసుకోవచ్చు. ఈ రాజీ కుదిరిన 12 నెలల తర్వాత మళ్లీ బ్యాంకుల నుంచి వారు కొత్తగా రుణాలను పొందవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో రాజీ పడొద్దంటూ గతంలో ఆర్‌బీఐ చెప్పింది. అయితే, జూన్ 8 నాటి ప్రకటనలో ఈ రాజీ ప్రక్రియలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులను కూడా చేర్చడంతో ఇప్పుడు ఆర్‌బీఐ విధానాలపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మోసపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు పాల్పడే వారితో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని 2019 జూన్ 7న ఆర్‌బీఐ ప్రకటించింది.
2022 మార్చి చివరి నాటికి, 50 మంది అతిపెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు బకాయిపడ్డ మొత్తం రుణం రూ.92,570 కోట్లు అని పార్లమెంటులో సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ జాబితాలో మెహుల్ చోక్సీ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. చోక్సీ కంపెనీ అత్యధికంగా రూ.7,848 కోట్లు బ్యాంకులకు బకాయి పడింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారత్‌లో డిసెంబర్ 2022 నాటికి ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల ఖాతాలు 15,778 ఉన్నాయి. ఈ ఖాతాలన్నీ కలిసి ఎగ్గొట్టిన మొత్తం రూ. 3,40,570 కోట్లు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 85 శాతం ఎగవేతలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ విమర్శలు
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు .
'ఉద్దేశపూర్వక ఎగవేతదారులు', ‘మోసగాళ్ల'పై ఆర్‌బీఐ తన నిబంధనలను ఎందుకు మార్చుకుందో వివరించాలి’’ అని ఆయన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.
‘‘ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగంపై ప్రజల నమ్మకాన్ని, డిపాజిటర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందనీ, నిబంధనలను ఉల్లంఘించే వాతావరణాన్ని సృష్టిస్తుందనీ.. ఈ పర్యవసనాలను బ్యాంకులు, బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ చెబుతోంది’’ అని జైరాంరమేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈఎంఐల భారాన్ని ఎదుర్కొంటున్న రైతులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు, మధ్య తరగతి వర్గాలకు చెందిన నిజాయతీ గల రుణ గ్రహీతలకు ఎప్పుడూ ప్రభుత్వం వారి భారాన్ని దించుకునే అవకాశం ఇవ్వలేదని అన్నారు.
"కానీ, ప్రభుత్వం ఇప్పుడు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మోసగాళ్లకు పూర్వపు స్థితిని అందించడానికి బాటలు వేసింది. బీజేపీకి చెందిన ధనిక పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. నిజాయతీగల భారతీయులు రుణాలను చెల్లించడానికి పోరాడుతున్నారు.
తాజా మార్గదర్శకాలు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు అత్యవసరంగా భావించిందో ఆర్‌బీఐ చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఆదేశాలు జారీ చేసేందుకు మోదీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా అనే విషయాన్ని ఆర్‌బీఐ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంక్ యూనియన్ల అసంతృప్తి
అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య, అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం దేశంలోని ఆరు లక్షలకు పైగా బ్యాంక్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
రాజీ పరిష్కార మార్గం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మోసపూరిత ఖాతాల రుణాలను సెటిల్ చేయడానికి బ్యాంకులను అనుమతిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రెండు సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.
ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను ప్రభావితం చేస్తుందని అన్నాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు బ్యాంకులు చేసే ప్రయత్నాలను బలహీనపరుస్తుందని ఈ సంఘాలు పేర్కొన్నాయి.
‘‘మోసగాళ్లు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించిన వ్యక్తులు, సంస్థల ఖాతాలను రాజీకి అనుమతించడం అంటే న్యాయం, జవాబుదారీ సూత్రాలను అవమానించినట్లే’’ అని ఆ సంఘాలు వ్యాఖ్యనించాయి.
"సెటిల్‌మెంట్ కింద ఎగవేతదారులను క్షమించడం ద్వారా వారు చేసిన తప్పుల భారాన్ని సాధారణ పౌరులు, కష్టపడి పనిచేసే బ్యాంకు ఉద్యోగులపై ఆర్‌బీఐ మోపుతోంది’’ అని ఈ సంఘాలు విమర్శించాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఎంపిక చేసిన కొంతమందికి ప్రయోజనం చేకూర్చేందుకే..’’
ఆర్‌బీఐ తాజా చర్య మంచిది కాదని ఆర్థిక అంశాల నిపుణుడు, జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ అన్నారు.
"మన దేశంలో చాలా ఎగవేతలు జరుగుతాయి. రైతులు కూడా డిఫాల్ట్ అవుతారు. కానీ, రైతుల కోసం ఇలాంటి ఏర్పాట్లేం చేయలేదు. కానీ, పెద్ద పెద్ద డిఫాల్టర్లు ముఖ్యంగా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కోసం ఇలాంటి ఏర్పాట్లు తీసుకురావడం మంచిది కాదు.
గతంలో ఎప్పటికప్పుడు రుణాన్ని సక్రమంగా చెల్లిస్తూ, ఆర్థికవ్యవస్థలో మాంద్యం కారణంగా రుణాన్ని చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ఏదైనా ఒక కంపెనీతో రాజీ ఒప్పందం కుదుర్చుకోవడం సమంజసంగా ఉంటుంది. కానీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారుతో ఇలాంటి రాజీ ఒప్పందాలు ఉండకూడదు. ఇలాంటి ఎగవేతదారులపై కేసులు పెట్టి విచారించాలి’’ అని అన్నారు.
భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం చాలా ఉందని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
"రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నవారే తరచుగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా మారుతుంటారు. తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకోవచ్చని వారు భావిస్తారు. కానీ, ఇది మంచిది కాదు.
ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల సదరు వ్యక్తి ఎగవేతదారుగా మారారా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా అనే అంశాన్ని ఆర్‌బీఐ గుర్తించాలి.
క్రోనిజం కారణంగానే మన బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్థక ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్స్- ఎన్‌పీఏ) బాగా పెరిగాయి. ఎన్‌పీఏలు పెరగడం వల్ల రుణాల లభ్యత తగ్గిపోయింది’’ అని ఆయన వివరించారు.
ఎంపిక చేసిన కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలకు ప్రయోజనం ఉండదు’’
డాక్టర్ సువ్రోక్మల్ దత్తా ప్రముఖ రైట్‌వింగ్ రాజకీయవేత్త, ఆర్థిక నిపుణులు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా తరహాలో డబ్బును దుర్వినియోగం చేసి డిపాల్టర్లుగా మారిన వారికి తప్పించుకునే మార్గం లేదని ఆయన అన్నారు.
‘‘కోవిడ్ సమయంలో చాలా చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు చాలా సమస్యలను ఎదుర్కొన్నాయి. మహమ్మారి కారణంగా వాటి పనితీరు తీవ్రంగా ప్రభావితమైంది. అంటువ్యాధి లాంటి అసహజ ఘటన వల్ల ఈ కంపెనీలు నష్టపోయాయి. ఆ సంక్షోభం నుంచి బయటపడటం వారి చేతుల్లో లేదు.
చట్టాన్ని గౌరవించే, గతంలో ఎప్పుడు రుణాన్ని ఎగ్గొట్టని చిన్నపాటి డిఫాల్టర్లను వారి చేతుల్లో లేని దానిదాన్ని కారణంగా చూపుతూ శిక్షించకూడదు.
ఇలాంటి వారికి ఆర్‌బీఐ నుంచి మినహాయింపులు దక్కాలి. ఈ చిన్న తరహా కంపెనీలే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. వాటికి ఎలాంటి మినహాయింపులు దక్కకపోతే అవి కూలిపోతాయి.
పరిస్థితులు తమ చేతుల్లో ఉంటే రుణాన్ని ఎగ్గొట్టి ఉండకపోయేవాళ్లమని చట్టబద్ధంగా నిరూపించుకునే కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ విధానాన్ని ఆర్‌బీఐ తీసుకువచ్చింది.
ప్రస్తుతం దీనిపై విమర్శలు చేస్తున్నవారంతా ప్రభుత్వాన్ని ఏదోలా విమర్శించాలని అనుకునేవారే. ఈ విమర్శల్లో ఎక్కువ భాగం రాజకీయమే. రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దాదాపు రూ.70 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారితో కూడా బ్యాంకులు రాజీ పరిష్కారానికి రావాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
డాక్టర్ దత్తా మాట్లాడుతూ, "ఒక వ్యక్తి లేదా కంపెనీ ఎన్నిసార్లు అప్పును ఎగ్గొట్టిందో చూడాలి. తమ నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగా ఒక సంస్థ మొదటిసారి డీఫాల్టర్‌గా మారినట్లు చట్టబద్ధంగా తేలితే భవిష్యత్‌లో ఇలాంటిది పునరావృతం కాకుండా హెచ్చరించి వారికి మినహాయింపు ఇవ్వొచ్చు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి నేరస్తులు డబ్బును కొల్లగొట్టాలనే ఉద్దేశంతో బ్యాంకులను మోసం చేశారు. ఈ వర్గం వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారిపై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. వారిని పట్టుకోవడం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారి ఆస్తులను జప్తు కూడా చేసింది’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














