మహారాష్ట్ర: రూ.3 లక్షల కోట్ల విలువైన భారీ ఆయిల్ కంపెనీని ఇక్కడి ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?

- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశానికి పశ్చిమాన మహరాష్ట్రలోని కొంకణ్ బెల్ట్‌లో విశాలమైన ఎర్రమట్టి పీఠభూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీ నిర్మాణానికి బాటలు పడుతున్నాయి.
చుట్టూ బెస్తవాళ్ల గ్రామాలు, మామిడి తోటలు, పురాతన శిలలతో ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనది.
భారత ప్రభుత్వ అధీనంలోని పెద్ద కంపెనీలు, గ్లోబల్ దిగ్గజాలైన సౌదీ అరాంకో, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎనోసీ)లు సంయుక్తంగా ఈ రిఫైనరీని నిర్మించనున్నాయి.
ఆయిల్ రిఫైనరీకి ప్రస్తుతం ఎంచుకున్న స్థలం రత్నగిరి జిల్లాల్లో బర్సు గ్రామంలో ఉంది.
ఏప్రిల్‌లో ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అధికారులు మట్టిని పరీక్షించడానికి వెళ్లినప్పుడు, స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి.
సైట్ చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా వేలకొద్దీ రోడ్లపైకి తరలివచ్చారు. మహిళల నాయకత్వంలో నిరసనలు చేపట్టారు. మండుటెండల్లో రోడ్లపై పడుకుని అధికారులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఇంకొంతమంది గుండు గీయించుకుని నిరాహారదీక్షకు కూర్చున్నారు. అక్కడ రిఫైనరీ కట్టకూడదంటూ ఉద్యమం చేపట్టారు.
గ్రామస్థులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. దాంతో, పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించారు.
మహిళా నిరసనకారులను, రిఫైనరీని వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కొద్దిరోజులుగా నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు నిరసనలు కాస్త నెమ్మదించాయి.
దాదాపు దశాబ్దం పాటు ఈ భారీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఉద్యమించినా, అధికారులు "ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, బలవంతంగా నిరసనలను అణగదొక్కారని" అక్కడి గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

పెరుగుతున్న భయాందోళనలు
"మాకు ఈ కెమికల్ రిఫైనరీ వద్దు. అరబ్ దేశం నుంచి వచ్చే మురికి చమురు ఇక్కడున్న సహజ వాతావరణాన్ని నాశనం చేయడానికి మేం అనుమతించం" అని నిరసనకారుల్లో ఒకరైన మానసి బోలే బీబీసీతో అన్నారు.
అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో రిఫైనరీపై తీవ్ర ఆందోళన కనిపించింది.
"ఆ స్థలాన్ని బంజరు భూమి అంటున్నారు కానీ, మా ఏర్లు, చెరువుల్లోకి నీళ్లు అక్కడి నుంచే వన్తున్నాయి. దానితోనే పళ్లు, కూరగాయలు పండించుకుంటున్నాం" అని బోలే చెప్పారు.
రిఫైనరీ వస్తే తన జీవనోపాధి పోతుందని మత్స్యకారుడు ఇంతియాజ్ భట్కర్ ఆందోళనపడుతున్నారు.
"10 కి.మీ. పరిధిలో మేం చేపలు పట్టడానికి వెళ్లలేం. సముద్రంలో ముడి చమురు ట్యాంకర్లు లంగరు వేస్తారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 30 వేలు నుంచి 40 వేల మంది చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నారు. వాళ్లంతా ఏం చేస్తారు?" అంటూ ఆయన వాపోయారు.
ఈ ప్రాంతంలో మామిడి పండ్లు పండించే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా అల్ఫోన్సో మామిడి పండిస్తారు. వాతావరణంలో ఏమాత్రం గాలి కాలుష్యం చేరినా పండ్ల దిగుబడి బాగా తగ్గిపోతుందని, అటవీ నిర్మూలన కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని దిగులుపడుతున్నారు. గాల్లో, వాతావరణంలో మార్పులకు అల్ఫోన్సో వెరైటీ త్వరగా ప్రభావితమవుతుందని చెబుతున్నారు.

రిఫైనరీ చుట్టూ రాజకీయాలు
మహారాష్ట్రలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు శుద్ధి కర్మాగారానికి మద్దతిచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాలు చేశాయి.
మొదట ఈ ప్రాజెక్ట్‌పై 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,27,653 కోట్లు) పెట్టుబడి పెట్టాలని, సంవత్సరానికి 60 మిలియన్ టన్నులు ఉత్పత్తిచేయాలని ప్లాన్ చేశారు. కానీ, ప్రారంభం ఆలస్యం కావడంతో దీన్ని మూడవ వంతుకు తగ్గించారు.
2015లో నానార్ గ్రామంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తొలిసారిగా ప్రకటించారు. ఇది ప్రస్తుతం ఎంచుకున్న స్థలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.
నానార్ వాసులు, గ్రామ పంచాయితీ, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రద్దుచేశారు.
కిందటి ఏడాది, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆయిల్ రిఫైనరీని బర్సు గ్రామంలో నిర్మించవచ్చని ప్రతిపాదించారు. పదవి నుంచి దిగిపోయిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే వైఖరి మారింది. ఇప్పుడు స్థానికులకు మద్దతిస్తూ రిఫైనరీని వ్యతిరేకిస్తున్నారు.
రిఫైనరీపై వస్తున్న నిరసనలు రాజకీయ రంగు పులుముకున్నాయని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), బీజేపీ కూటమి ఆరోపిస్తోంది.
"ఇది కాలుష్య కారకం కాని గ్రీన్ రిఫైనరీ. పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రజల అపోహలు తొలగించడం నా బాధ్యత. బయటి నుంచి తప్పుదోవ పట్టించే ప్రచారాలు జరుగుతున్నాయి" అని రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ బీబీసీతో అన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న శిలలు యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భాగం. వీటిపై పురాతన కాలం నాటి బొమ్మలు చెక్కి ఉన్నాయి.
అయితే, చాలామంది అనుకుంటున్నట్టు ఈ రిఫైనరీ వలన ఈ శిలలకు ఎలాంటి నష్టం వాటిల్లదని మంత్రి ఉదయ్ సామంత్ చెబుతున్నారు.
శుద్ధి కర్మాగారం నిర్మించనున్న 5,000 ఎకరాల్లో 3,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సామంత్ తెలిపారు.
అయితే, ఆయన చెబుతున్న విషయాలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నట్టు బీబీసీ గమనించింది.
ఉదాహరణకు, ప్రాజెక్ట్ కోసం మట్టిని పరిశీలించిన స్థలం అక్కడ కొన్ని శిలలకు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది. ఆ పీఠభూమిపై మొత్తం 170 శిలలు ఉన్నాయి.
కనీసం ఆరు స్థానిక గ్రామ పంచాయితీల నుంచి అభ్యంతరాలతో ప్రభుత్వానికి లేఖలు అందాయి. కానీ, వాటిని పట్టించుకోలేదు. రిఫైనరీ కట్టే స్థలం ఈ గ్రామాలకు చెందినది కాదని అధికారులు చెబుతున్నారు.
అయితే, పెట్టుబడిదారులకు చౌక ధరలకు భూమిని అమ్మేలా తమను మభ్యపెడుతున్నారని, ఆ భూమిని రిఫైనరీకి ఇస్తామని ముందే చెప్పకుండా తమ వద్ద కొనుక్కుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడిదారుల్లో రాజకీయ నాయకులు, అధికారులు, సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారు.
"ఈ ప్రాంతానికి చెందిన స్థానికులు కాకుండా, 200 మంది పెట్టుబడిదారులు ఇక్కడి భూమిపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది" అని సామాజిక కార్యకర్త సత్యజిత్ చావన్ అన్నారు. రిఫైనరీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో సత్యజిత్‌ను ఆరు రోజులు జైల్లో పెట్టారు.

పర్యావరణమా, ఆర్థికవ్యవస్థా, ఏది ముఖ్యం?
రిఫైనరీకి వస్తున్న మద్దతు లేదా వ్యతిరేకతకు వివిధ రకాల కారణాలు కనిపిస్తున్నాయి. భౌగోళిక స్థితి, పర్యావరణం, ఆదాయ తరగతి, సైద్ధాంతిక భావజాలం మొదలైన అంశాల అధారంగా మద్దతుదారులు, వ్యతిరేకులు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.
రాజ్‌పూర్ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్న చిరు వ్యాపారి సూరజ్ పెడ్నేకర్ రిఫైనరీకి మద్దతిస్తున్నారు. దీనివల్ల రత్నగిరి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన భావిస్తున్నారు.
ఈ రిఫైనరీ వస్తే మహరాష్ట్ర జీడీపీ 8.5 శాతం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
"యువత చాలామంది ముంబై లేదా పుణె వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలు లేక గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. ఈ రిఫైనరీ వస్తే ఇక్కడే 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రామాల్లో జనాభా పెరుగుతుంది. స్థానికంగా వాణిజ్య, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మరెందుకు దీన్ని వ్యతిరేకించాలి?" అని ప్రశ్నిస్తున్నారు సూరజ్ పెడ్నేకర్.
పెద్ద పట్టణాల్లో నివసిస్తున్న చాలామంది, రిఫైనరీ వల్ల జీవనోపాధికి నేరుగా నష్టం కలగని స్థితిలో ఉన్నవారు సూరజ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు.
అయితే, వీరి వాదనలను గ్రామాల్లో ఉన్నవాళ్లు తప్పుబడుతున్నారు.
"ఈ ఉద్యోగాలన్నీ చదువుకున్నవాళ్లకు వస్తాయి. స్థానికంగా చేపలు పట్టేవాళ్లకు కాదు. మాకు అలాంటి ఉద్యోగాలు వద్దు" అంటున్నారు ఇంతియాజ్ భట్కర్.
స్థానికులకు పని కల్పించినా స్వీపర్లు లేదా వాచ్‌మెన్ లాంటి దిగువ స్థాయి ఉద్యోగాలే ఇస్తారని మానసి బోలే అన్నారు.
మరోపక్క, గ్రామాల్లో ప్రజల వాదనలకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
పుణెలో ఈమధ్యే రచయితలు, కవులు, సామాజిక కార్యకర్తలు సమావేశమై రత్నగిరి గ్రామస్థులకు మద్దతు తెలుపాలని నిర్ణయించుకున్నారు.
"రిఫైనరీకి మద్దితిచ్చే రాజకీయ నాయకులకు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తాం" అని సత్యజిత్ చావన్ బీబీసీతో చెప్పారు.
1990లలో ఎన్రాన్ నుంచి 2000లలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించాలన్న ఫ్రెంచ్ కంపెనీ ప్రయత్నాల వరకు, రిలయన్స్ గ్రూపు, టాటా గ్రూపు లాంటి పారిశ్రామిక సంస్థలు తీసుకొచ్చిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కొంకణ్ బెల్ట్‌లో స్థానికులు ఉద్యమాలు చేపట్టారు. ఆ ప్రతిపాదనలను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు.
ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఈ చమురు శుద్ధికర్మాగారం కార్యరూపం దాల్చుతుందో లేదో తెలీదు. కానీ, ఊపిరి ఉన్నంతవరకు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజాజీవనం, ఆర్థికాభివృద్ధి మధ్య మరోసారి ఈ ప్రాంతంలో పోటీ నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














