ఆ బీచ్‌లో వేలమంది నగ్నంగా కనిపించారు, ఎందుకంటే....

సిడ్నీ బీచ్‌లో సామూహిక నగ్న దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర సముద్రతీరంలో 2,500 మంది వలంటీర్లు నగ్నంగా ఫోజులిచ్చిన దృశ్యాలివి. బొండి బీచ్‌లో శనివారం ఉదయపు సూర్యకాంతిలో ఈ దృశ్యం కనిపించింది.

చర్మ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించటం కోసం అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ చేపట్టిన ఆర్ట్‌వర్క్‌లో భాగంగా బీచ్‌లో ఈ సామూహిక నగ్న కార్యక్రమం నిర్వహించారు.

సిడ్నీ బీచ్‌లో సామూహిక నగ్న దృశ్యాలు

ఫొటో సోర్స్, EPA

ఆస్ట్రేలియన్లు క్రమం తప్పకుండా చర్మ ఆరోగ్యాన్ని తనిఖీ చేయించుకునేలా ప్రోత్సహించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఆస్ట్రేలియా బీచ్‌లో జనం బహిరంగంగా నగ్నంగా ఉండటం, ఫొటోలకు ఫోజు ఇవ్వటం ఇదే తొలిసారి. ఇందుకోసం చట్టాన్ని కూడా సవరించారు.

ప్రపంచంలో చర్మ క్యాన్సర్ ప్రభావం అత్యధికంగా ఉన్న దేశం ఆస్ట్రేలియా అని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ చెప్తోంది.

సిడ్నీ బీచ్‌లో సామూహిక నగ్న దృశ్యాలు

ఫొటో సోర్స్, EPA

ఈ నేపథ్యంలో చర్మ క్యాన్సర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా.. స్కిన్ చెక్ చాంపియన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగ్న కళాఖండం కార్యక్రమం నిర్వహించారు.

ఈ ప్రాజెక్టు కోసం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడున్నర నుంచే వలంటీర్లు బీచ్‌కు చేరుకున్నారు.

‘‘చర్మ పరీక్షల గురించి అవగాహన పెంపొందించేందుకు మాకు అవకాశం లభించింది. ఇక్కడికి రావటం, నా కళను సృజించటం, శరీరాన్ని, దాని పరిరక్షణను సెలబ్రేట్ చేసుకోవటం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు ట్యూనిక్ పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

సిడ్నీ బీచ్‌లో సామూహిక నగ్న దృశ్యాలు

ఫొటో సోర్స్, Reuters

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రూస్ ఫిషర్ (77) ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో సగభాగం నేను సూర్యుడి వెలుగులోనే గడిపాను. నా వీపు మీద రెండు ప్రాణాంతక క్యాన్సర్లను తొలగించాల్సి వచ్చింది’’ అని తెలిపారు.

‘‘ఈ కార్యక్రమం మంచిదని నాకు అనిపించింది. బొండి బీచ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా ఉండటం కూడా బాగుంది’’ అని చెప్పారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)